వద్దులే

0
1

[స్వాతీ శ్రీపాద గారు రచించిన ‘వద్దులే’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]వ[/dropcap]ద్దులే ఇంతకన్నా ఎక్కువ
ఎందుకు చెప్పు
నీ గురించి నాకూ నా గురించి నీకూ
నీకూ నాకూ మధ్యన ఎన్ని నదీనదాలు
ఎన్నెన్ని సముద్రాలు
కాస్సేపు నిద్రా ముద్రలో నిశ్చలంగా
మరి కాస్సేపు
కల్లోలిత వరదముంపులా
వేలాది జలచరాల కేరింతల పుక్కిలింతలు
నీవీ నావీ కాని ఆ కేరింతలే కదా
మనిద్దరి మధ్యనా
పునాదులు లేని వంతెన

ఉభయ సంధ్యల్లోనూ
కునికిపాట్లు పడుతున్న సమయాన
ఉన్నట్టుండి నీలాకాశం నీళ్ళలోకి దూకుతుంది.
కాస్త కాస్త కరిగి రంగద్దినట్టుగా మెరుస్తున్న
నీలాల మధ్య ఏటవాలుగా దిగిన తెల్లమేఘం
భుజాన్నెక్కి పసికూనల్లా అల్లరిచేసే తొలి కిరణాలు
వెలుగును వదిలేసి సన్యసించిన సాయం కెంజాయలూ
మునుగుతూ తేలుతూ
మురిపాలు పంచుతాయి
నీవీ నావీ కాని ఆ మురిపాలు
మనిద్దరి మధ్యనా మూగ రాయబారాలే కదా.

అద్దం ముక్కలా మెరుస్తున్న నిండు జాబిలి నీడలో
నీ మొహం నువ్వూ
నా మొహం నేనూ చూసుకోవలనుకున్నా
నాక్కనిపిస్తున్నది నీ పెదవులపై వెలిగే నా చిరునవ్వులు
నీకు మాత్రం, నా రెల్లుపూల ఆలోచనల
సుతారంగా తాకి పలకరించలేదా.

నదీ తీరాన మనను మనం కోల్పోయిన
గంటలూ, రోజులూ యుగాలూ
ఎన్ని స్వప్నాలను అక్కడ నాటి వచ్చాయో కాని
ఏ తీరాన చూసినా విరబూస్తున్న పలకరింపులే
ఏదో చెప్పాలని పెదవి విప్పలనుకునే లోగా
శృతి చేసిన గాలి నీ పలుకులను వినిపిస్తుంది
చెప్పని మాటలు రెక్కలు కట్టుకు ఎగిరినా
నావీ నీవీ కాని ఆ మాటలు
మన అంతరంగాల ప్రతిబింబాలే కదా.

వద్దులే ఇంతకన్నా ఎక్కువ ఎందుకు చెప్పు
అనంతానంత జగాన చేతులు పట్టుకు నడుస్తున్న
మనను మనం ఏ తీరాన్నుండైనా చూసేప్పుడు
నీకూ నాకూ మధ్యన
ఎందుకీ ఉలిపిరి ప్రపంచం.
వద్దులే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here