Site icon Sanchika

వడిచర్ల మణిపూసలు – పుస్తక సమీక్ష

శ్రీపదమణిపూసల సృష్టికర్త వడిచెర్ల సత్యం

[dropcap]సా[/dropcap]హిత్యం అనేది రచనలు చేసే ఒక కళ. సాహిత్యం అనే పదానికి అర్థం అక్షరాలతో సాన్నిహిత్యం ఇందులో రెండు విభాగాలుంటాయి 1. వ్యాకరణ బద్ధమైనది 2. వాక్యనిర్మాణం ఆధారంగా ఏర్పడ్డవి. ఒక్కోసారి అసహజమైన వాక్య నిర్మాణాలను మినహాయించి వ్యాకరణ బద్ధమైన శాస్త్రీయ సృజన చేయబడిన ప్రక్రియలు రచనలను మాత్రమే సాహిత్యం అనే పదానికి నిర్వచనంగా వాడుతున్నారు. అలా సాహిత్యంలో కవిత్వం మరియు పద్య ప్రక్రియలు మనకు చిరపరిచితమే. ప్రధానంగా కవిత్వం పద్యం రూపాన్ని కలిగి ఉంటుంది. అమూల్యమైన పదాల ఎంపిక మరియు రూపకాలపై ఆధారపడి ఉంటుంది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు, వైజ్ఞానిక రచనలు, గణిత రచనలు,  సాహిత్యపరమైన రచనలు మొదలుకొని అనేక అనేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి.

ఆయా ప్రక్రియల్లో అనేకమంది సాహితీవేత్తలు కృషి చేశారు. అలాగే తెలుగు సాహిత్యంలో అక్షర సాగుచేస్తూ తెలుగు పదాలతో నిత్యం ప్రయోగాలు చేస్తూ తన ప్రయోగాల ద్వారా ఏర్పడిన ప్రక్రియను “మణిపూసలు” పేరుతో అనతికాలంలోనే తెలుగు రాష్ట్రాల లోని గొప్ప గొప్ప కవులు, వర్తమాన కవులు, విద్యార్థులు కూడా అనుసరించడం తెలుగు సాహిత్యంలో వడిచర్ల సత్యం సాధించిన విజయం అనే చెప్పుకోవాలి.

26-4-2018న వాట్సాప్ వేదికగా ప్రయోగాత్మకంగా “మణిపూసలు”నూతన కవితా ప్రక్రియ సృష్టికర్త వడిచర్ల సత్యం అని ఒక మెసేజ్‌లో చదివాను. “మణిపూసలు” నియమాలు నన్ను బాగా ఆకర్షించాయి. అప్పటినుండి అనుసరించడం మొదలుపెట్టాను. ఛందస్సు తెలిసిన పండితులే కాకుండా విద్యార్థులు కూడా అనుసరించే విధంగా మణిపూసలు ఆకట్టుకున్నాయి.

మణిపూసలు నియమాలు:

1:మణిపూసలు లో నాలుగు పాదాలు ఉంటాయి.

2: 1, 2 ,4, పాదాలకు అంత్యానుప్రాస మరియు.

10 ,11 ,12 మాత్రలలో నుండి ఏదైనా ఓకే సంఖ్య ఉపయోగించాలి.

అనగా 1, 2 ,4 పాదాలలో మాత్రల సంఖ్య సమానంగా ఉండాలి.

3: 3వ పాదానికి అంత్యానుప్రాస ఉండరాదు 10 నుండి 12 మాత్రలు ఉండాలి

4: 3 ,4 పాదాలలో కవితా మెరుపు ఉండాలి.

లఘువు 1 ఒక మాత్ర గాను గురువు యు ను రెండు మాత్రలు గాను లెక్కిస్తారు.

ఉదా:-భూమిపైన మిన్నగా/ 2 1 2 1 2 1 2 (11 మాత్రలు)/

యేది లేదు యెన్న గా / 2 1 2 1 2 1 2 /

కనిపించేవన్ని గూడ /1 1 2 2 2 1 2 1(12మాత్రలు)(10-12)/

అమ్మ ముందు చిన్నగా /2 1 2 1 2 1 2 1 2( 11 మాత్రలు)

ఈ భూమిపైన ఎన్నో అద్భుతాలున్నా అవన్నీ అమ్మ ముందు చిన్నవేనని భావం. ఇంత సులభశైలిలో చిన్న పదాలలో చక్కని భావం చెప్పడం మణిపూసల లక్షణం. వడిచర్ల సత్యం రాసిన మరికొన్ని మణిపూసలు చూద్దాం.

శ్రీ పద మణిపూసలు /జనహిత మగు రాతలు /వడిచర్ల సృష్టించిన నవ కవితల మెరుపులు/ అంటూ మణిపూసల గొప్పతనాన్ని పై మణిపూస ద్వారా చెప్పాడు.ఇందులో శ్రీ పద వడిచర్ల కలం పేరు తన కలం నుండి వెలువడిన నవ కవితల మెరుపులే ఈ మణిపూసలు అని భావం.

గురువును పూజించాలి/ తరువును పూజించాలి/ కరువు దూరంజేసెడి/చెరువును పూజించాలి.ఇందులో 1, 2 ,4 పాదాలలో అంత్యానుప్రాస ను పాటించడం జరిగింది. మూడవ పాదంలో మెరుపు ఉంది.

శాంతమునకు మారుపేరు/ సహనము కు మారు పేరు/ కనిపెంచిన తల్లి దండ్రి /దైవమునకు మారుపేరు( కన్నతల్లి) పేరుతో రాసిన మణిపూసల లో ఇది ఒకటి. శాంతము సహనానికి మారుపేరు కని పెంచిన తల్లి దండ్రి వారు దైవానికి మారుపేరు అని బావం.

దివ్య భూమి మన దేశం/ త్యాగ భూమి మన దేశం/ విలువల విజ్ఞానమున్న /పుణ్యభూమి మన దేశం మన దేశం(మనదేశం)

వేదాలు వెలసెనిచట/ నాదాలు పుట్టెనిచట/ దేవతలే నడయాడిన/పాదాలు దొరికెనిచట( మన దేశం)

దివ్యమైన త్యాగ భూమి అయిన మన దేశం విలువైన విజ్ఞానం ఉన్న పుణ్యభూమి అని వర్ణించాడు వేదాలు నాదాలు ఇక్కడే పుట్టాయి దేవతలు తిరిగినట్లు పాదాల ఆనవాళ్లు దొరికాయని భావం .

నీళ్లుంటేనే లోకము/ నీళ్లుంటేనే శోకము/ఏ జీవులకైన గాని/ నీళ్లుంటేనే నాకము( జలం -జలం )

ఓ యువతా మేలుకో/ విజయాలను తెలుసుకో/ స్వశక్తిని నమ్ముకుని /నీ లక్ష్యము చేరుకో!(విజేతలు) నేటి యువతకు మంచి సందేశం ఈ మణిపూస.

అతి యన్నిట పనికిరాదు/ కఠినపు మాట్లాడరాదు/ తల్లిదండ్రి వద్దన్నవి /పనులెప్పుడు చేయరాదు!  (విజేతలు)

ఇందులో 1, 2, 4 పాదాలలో రాదు అనే అంత్యప్రాస మూడవ పాదంలో మెరుపు కనిపిస్తుంది.

కవుల కలం గొప్పది/ శిల్పుల ఉలిగొప్పది /ప్రకృతిని నడిపించెడి శక్తి యింక గొప్పది!(యాదాద్రి వైభవం)

మంచితనం పంచుదాం/మలిన గుణం తుంచుదాం /మనిషి కొక్క చెట్టు నాటి /మరువకుండ పెంచుదాం.

చెట్లే ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని పై మణిపూస చెప్తుంది.

జ్ఞాన నిధి పుస్తకము/బుధుల మది పుస్తకం /విశ్వమంత ప్రవహించెడి/ కాంతి నది పుస్తకము!(పిల్లలం)

రైతులకు దన్నుగా/ పేదలకు వెన్ను గా/ నిలబడిన ప్రభుత్వమే /దేశమునకు కన్నుగా.అంటూ రైతులను, పేదలను కళ్ళను కాపాడినట్లు కాపాడే ప్రభుత్వమే గొప్పది అంటున్నాడు కవి. పేదల సంక్షేమము/రైతుల సంక్షేము/చేసినోళ్ళెదేవుళ్ళు/ పిల్లల సంక్షేమం.

పై రెండు మణిపూసలు ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వమే గొప్పది అలాంటి పాలనలోనే ప్రజలు సురక్షితంగా ఉంటారు.

పొయ్యి మీద నున్న పెనం/ కాలుతున్న తాను ఘనం/అయిన గాని వదులుకోదు/ సాయపడెటి గొప్ప గుణం(ఉగాది) కొవ్వొత్తి తాను కరుగుతూ ప్రపంచానికి వెలుగునిస్తుంది అంటారు అలా పై మణిపూసను చదువుతూ ఉంటే కవి చెప్పిన పోలిక గొప్పగా అనిపించింది.  మెరుపు ఉన్న మణిపూసగా కనిపించింది. మానవతా విలువలు/ సజ్జనులకు వలువలు/ సంఘంలో పాటించని/ వాళ్ళె పెద్ద తులువలు. గొప్పవారుగా చలామణీ అవుతూ మానవతా విలువలు పాటించని వాళ్ళు ఎలా గొప్పవాళ్లు అవుతారు అలాంటి వారు పనికిరాని వాళ్లే అని భావన.

పారె నీటి కున్నగుణం/ వీచే గాలి కున్న గుణం/ ఆత్మీయుల మాటకుంది/ఆయుష్షును పెంచే గుణం.

బాధల్లో ఉన్నప్పుడు ఆత్మీయుల పలకరింపులు మనసుకు ఊరట కలిగింది ఆయుష్షును పెంచుతాయి. మాటలె కలిగించు భయం /మాటలెతొలగించు భయం/ మానవులకు మహి లోపల/ మాటలే మిగిలించు జయం. మాటల వల్ల కలిగే మంచి చెడులను పై మణిపూస చక్కగా చెప్తుంది. ఇలాంటి మాటలు అనుసరించే నేటితరం సరైన మార్గంలో పయనించి లక్ష్యాన్ని చేరుతుంది. ఏదైనను గాయము/ ఐనప్పుడు సాయం/ అందించిన వారి బుద్ధి/ మనకనుసరణీయం(99) పై మణిపూస శారీరకంగా గాని మానసికంగా గాని గాయాలైనప్పుడు ఎవరైతే సాయమందిస్తారో వారే మన మనసెరిగిన వారు అని భావం. దుర్గుణాల మచ్చలు/ పెరిగిపోతె పుచ్చులు /బాగుజేసుకోని వారె/ఈ జగతిన మృచ్చులు (102) చెడు గుణాలను మార్చుకొని మంచి ప్రవర్తనతో మసలుకో లేని వారు జీవించేందుకు అర్హత లేనివారని భావం. ఆకలి కన్నముఖ్యమాయె/ గాలి కన్నముఖ్యమాయే /దరిద్రపు ముఖాలకు / లంచం అది ముఖ్యమాయె.( 127) కొందరికి ప్రాణం కన్నా ఎదుటివారిని పీడించి లంచం తీసుకోవడం చాలా ముఖ్యం అలాంటివారికి పై మణిపూస వ్యంగ్యాస్త్రం విసిరాడు కవి.

జయశంకర్ సారుకూ/ ఉద్యమాల తేరుకూ/వందనాలు వందనాలు/తెలంగాణ పెరుకూ/అంటూ మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ను పై మణిపూస లో వర్ణించాడు.

కలము నెత్తి కదిలించెను/ గళమునెత్తి గర్జించెను/కవి సింహం దాశరథి/ అగ్నిధార గురిపించెను. కవి దాశరథిని మెప్పించిన మణిపూస ఇది.

తల్లిదండ్రి ఒడిలోన /పిల్లలున్న బడిలోన /విజ్ఞానం మొలకెత్తును /రైతులున్న మదిలోన.

తెలుగు వెలుగు సినారె /తెలుగు తేనె సినారె/పంచెకట్టులో మెరిసిన/తెలుగు ఱేడు సినారె!(సినారె)

సినారే ను నాలుగు వరుసల్లో మణిపూస లో ఎంతో గొప్పగా కీర్తించాడు కవి.

చీకటంత వెళ్ళిపోయె/ కల్లోలము ఆగిపోయే/ అరవయేళ్ళ/కలనేడు కను ముందు పాలిపోయె.(జయహో మణిపూసలు)

మన యాస, మన భాష/ కాళోజి కవిఘొష/ ప్రజా క్షేమము కొరకు /పోరాడెను హమేష. (కాళోజీ మణిపూసలు)

అమ్మను కీర్తించ లేని /నాన్నని కీర్తించ లేని/ కవిత్వాన్ని వృథాయే/ గురువును కీర్తించలేని.(అన్నీ వృథా కవితలే)

కవి కేసరి కపిలవాయి /తెలంగాణ కవితురాయి/ పాలమూరు ముద్దుబిడ్డ/మాతృభాష మైలురాయి. (కపిలవాయి) అంబేద్కరు రాసినట్టి/రాజ్యాంగము కాదు మట్టి /దేశమాత ధరించిన /బంగారు పువ్వుల పట్టి.

కలుషితాల జాలము/ నిండిన భూగోళము/ కవనసుథ లతో కరిగితె/అవును మళ్ళి శీలము. (భూగోళం)కలుషితమై పోయిన భూగోళాన్ని కవితాసుధ లతో కడిగి ప్రక్షాళన చేస్తాను అంటున్నాడు కవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మణిపూసల మెరుపులు చదివిన కొద్దీ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. తాను రచించినవే కాక ఎందరో కవులు వాటిని అనుసరించి కవులుగా వారి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

వడిచెర్ల సృష్టించిన ఈ మణిపూసలను ఎందరో కవులు అనుసరిస్తున్నారు అలా మొదటి నుండి సుధాకర్ గౌడ్, ఆశీర్వాదం కవులు అనుసరించి పుస్తకాలు కూడా వెలువరించి తమదైన ముద్రను వేసుకున్నారు.అలా సుధాకర్ గౌడ్ రాసిన మణిపూస మచ్చుకు ఒకటి. అమ్మ ఇచ్చు జన్మ వరం/జన్మనిచ్చుఅమ్మ వరం / అటువంటి అమృతమయిని/పూజించుము నిరంతరం.

అలాగే మరో కవి వెన్నెల సత్యం “వెన్నెల మణిపూసలు” పేరుతో శతకాన్ని వెలువరించారు.నీటి బొట్టు నొడిసిపట్టు /పుడమి ఒడిలో దాచి పెట్టు/ మానవ మనుగడ కదే/ అసలు మూలమోయి ఒట్టు.

మరో కవి గణపురం పరమేశ్వర్ “శ్రీ ఘణ మణిపూసలు” పేరుతో వెలువరించిన శతకంలో నా మనసుకు నచ్చిన మణిపూస “నాన్నంటే మధుర ఫలం/ తానుంటె గుండె బలం /భగవంతుని దీవెనతో బతుకాలి చిరకాలం( నాన్న) అలాగే 2019 జనవరిలో కొత్తగా మొదలు పెట్టి మూడు నెలల్లోనే పుస్తకం వేసేటన్ని మణిపూసలు రాసి “వీరమణీయం” అనే శతకాన్ని రచించింది కవయిత్రి గాండ్ల వీరమణి “వీరమణీయం” లోని మచ్చుకు. మాయమాటలెక్కువయె/ మానవతయెకరువాయె/ఆలకించు ఓ మనసా/ అనుబంధమె ఆవిరాయె. నేటి సమాజంలోని బంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయి అనే పరిస్థితికి పై మణిపూస అద్దం పడుతుంది.

కలి కాలపు ఆటజూడు/ కన్నవారి గోస చూడు/ కనిపెంచిన వారికి/కష్టకాలమొచ్చెనేడు. నవమాసాలు మోసి కనిపించి పెద్ద చేసిన

తల్లిదండ్రులను ఎదిగిన తర్వాత వారిని పట్టించుకోకుండా నరకాన్ని చూపించి కష్టాల పాలు చేసే ప్రతి వారు అర్థం చేసుకోవాలి.

ముగింపు:- మణిపూసలు ప్రక్రియను వాట్సాప్ మాధ్యమంలో మొదలుపెట్టిన 50రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల లోని 50 మంది అనుసరించి 5000 కుపైగా మణిపూసలు రాసి మణిపూసలను సృష్టించిన వడిచర్ల మరియు అనుసరిస్తున్న కవులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకుని వారి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

అలాగే రవీంద్ర భారతిలో ఒకే వేదికపై 25 మంది కవులు రచించిన మణిపూసలు సంపుటిలను ఆవిష్కరించుకోవడం వల్లప్రపంచం దృష్టి మణిపూసలవైపు మళ్ళింది. ఇప్పుడు తెలుగు భాషలోనే కాక వివిధ భాషల్లో మణిపూసలను రాస్తే ఎలా ఉంటుందో ప్రయోగాత్మకంగా కొంతమంది కవులు ప్రయత్నిస్తున్నారు. సులభశైలి ఉండడంవల్ల విద్యార్థులు కూడా అనుసరించి రాస్తున్నారు. చిన్నతరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు కథలను, పాటలను, ఇతిహాసాలను మణిపూసల్లోకి మార్చి రాసి నేర్పించి సులభపద్దతిలో బోధన చేస్తూ పలువురి ప్రశంసలు అందుకున్న కవులు కూడా మణిపూసలు అనుసరించే వారిలో ఉన్నారు. అలా తాను సృష్టించిన మణిపూసలను అనుసరించి ముందుకెళుతున్న కవులను ప్రోత్సాహిస్తూ సాహితీ సృజనతో ముందుకెళుతున్న వడిచెర్ల సత్యం గారికి శుభాకాంక్షలు.

***

వడిచర్ల మణిపూసలు
రచన: వడిచర్ల సత్యం
ప్రచురణ: కాగ్నా కళాసమితి, తాండూర్.
పుటలు: (xxv+) 128
వెల: 75/-
ప్రతులకు: వడిచర్ల సత్యం,
ఇం. నెం 2-2-87/29,
సాయినగర్, సాయిపూర్,
తాండూర్, వికారాబాద్ జిల్లా 501141
ఫోన్: 9441350137

Exit mobile version