వదిలెయ్!

12
2

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రచించిన ‘Kicking A Habit’ అనే ఆంగ్ల కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]“మ[/dropcap]నం ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం? ఇంకా నేనెంత కాలం ఆగాలి?”

ఊహూ, ఇది ఓ యువతి యువకుడిని అడుగుతున్న ప్రశ్న కాదు, యువకుడు యువతిని అడుగుతున్నాడు. జవాబు లేదు.

“మన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్లయిపోయాయి..” అన్నాడతను. ‘అయితే ఏంటట?’ అన్న భావం ఆమె వదనంలో.

“రవికి, సితారకి పాప కూడా పుట్టింది. వాళ్ళెప్పుడో ముగ్గురయ్యారు. నేను మాత్రం మన పెళ్ళి కోసం నిన్ను ఇంకా అడుగుతూనే ఉన్నాను. ఇంకా ఆలస్యం చేస్తే రవి కూతురు బుజ్జికి కూడా పెళ్ళీడు వచ్చేసి, తనకి నచ్చినవాడిని ఎంచుకుంటుంది. మరి మన పెళ్ళెప్పుడు? అయినా నిన్ను అడిగే కన్నా ఏ జ్యోతిష్యుడినో అడగడం ఉత్తమం.”

“మంచిది. నీకు తెలిసిన జ్యోతిష్యులెవరైనా ఉన్నారా? లేకా మాకు తెలిసిన జ్యోతిష్యుడి అడ్రస్ ఇవ్వానా?”

ఆమెకేసి చూశాడు. మామూలుగా అయితే అలాంటి వ్యాఖ్యల వెనుక కొంటె నవ్వు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆమె ముఖం ఆమె మనసులోని ఆలోచనలను ప్రతిబింబిస్తోంది. ఆమె ఎందుకో మథనపడుతున్నట్టు అనిపిస్తోంది

“ఏమైంది? ప్రతి రోజూ నేను అడగడం, నువ్వు కాదనడం – ఇదొక ఆట అయిపోయింది. దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. మనం ఒకరినొకరం ఇష్టపడి పెళ్ళి చేసుకుందామని అనుకుని ఇప్పటికి అయిదేళ్ళు అవుతున్నాయి.. కానీ.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. నాకు ఓపిక నశిస్తోంది.”

“సరే, కానీ, నువ్వు మరో అమ్మాయిని చూసుకో.”

పరిస్థితి చేయి దాటిపోతోందని అతనికి అర్థమయింది. నెహ్రూ పార్క్‌లో ఓ బెంచీ మీద ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. కాలేజీ స్టూడెంట్స్‌గా ప్రేమలో పడినప్పటి నుంచీ వాళ్ళు కలుసుకునే చోటు అదే.

అతడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, చెడు ప్రవర్తనని దిద్దుకునే పిల్లాడిలా, అడిగాడు – “ఎందుకంత విచారంగా ఉన్నావు?”

“నేను ఇక మీదట సితార వాళ్ళింటికి వెళ్ళను. పాపం దాన్ని చూస్తే బాధేస్తోంది.. రవి ఎంత మూర్ఖుడు!”

ఏం జరిగి ఉంటుందో అతనికి అర్థం కాలేదు. రవి మంచివాడు, భార్య చెప్పిన మాటలు వినేవాడు.

పైగా రవి, సితార వీళ్ళ బ్యాచ్‍మేట్స్, మంచి స్నేహితులు కూడా. రవి నుంచి ఎటువంటి అసభ్య ప్రవర్తనని ఊహించలేకపోయాడతను.

“ప్రేమించిన అమ్మాయి కోసం కోట్లాది రూపాయల ఆస్తిని వదిలేసి వచ్చి, సున్నా నుంచి జీవితం ప్రారంభించిన రవి – మూర్ఖుడే మరి!”

అతని కేసి కోపంగా చూసింది. అతను మాట్లాడలేదు.

“సితార కూడా రవి కోసం తన కుటుంబాన్ని వదిలేసి వచ్చింది, ఆ విషయం గుర్తుంచుకో! నిన్న రాత్రి రవి, సితార నన్ను డిన్నర్‍కి పిలిచారు, తెలుసు కదా? రవి సిగ్గుమాలిన పని చేశాడు. నా ముందే తాగాడు. నాకు చిరాకేసింది. లేచి వచ్చేద్దామనుకున్నాను. ఇంక తాగడు అని సితార మాట ఇస్తే, ఆగాను.”

అతడి కళ్ళు మెరిసాయి. “నీ ముందు తాగాడా? వావ్! రవికి ధైర్యం ఎక్కువే! ఇన్నాళ్ళ మన స్నేహంలో నేను చేయలేని పనిని వాడు చేశాడు..”

“నోర్మూసుకో! అది మాత్రమే కాదు. బుజ్జిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తాగుడు కొనసాగించాడు. ఆ పసిపిల్ల గ్లాసులో వేలు ముంచినా రవిలో ఎటువంటి చలనమూ లేదు. పైగా తన రక్తం పాపలో ప్రవహిస్తోందంటూ మురిసిపోయాడు.. గొప్ప తండ్రి!”

“ఎందుకు చిరాకు పడతావ్? అది వాళ్ళ సమస్య” అంటూ ఆమెని సంబాళించే ప్రయత్నం చేశాడు.

“మీరిద్దరూ ‘బూజింగ్ పార్ట్‌నర్స్’ కదూ! అతని ‘డచ్ కరేజ్’ (మద్యపానం చేస్తే కలిగే ధైర్యం) నీకూ సోకినట్టుంది. నువ్వెంత చెడ్డ తండ్రివి అవుతావో ఊహించగలను. నీ ఇష్టం వచ్చింది చేసుకో.. నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను. నేను సితారని కాను. నువ్వా పాడు అలవాటుని ఎప్పుడు వదులుకుంటావో, తోటివాళ్ళ ఒత్తిడికి లొంగకుండా ఉంటావో చెప్పు. నిన్ను ప్రేమించినందుకు బాధపడే స్థితికి తీసుకురావద్దు..”

ఆ చివరి వాక్యం అతనికి కాస్త సాంత్వననిచ్చింది. ఆమె అరచేతిని నెమ్మదిగా నిమిరాడు. కాసేపయ్యాకా, ఆ ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్ళారు.

***

“అవునూ నీకు అమిత్ గుర్తున్నాడా?”

“ఎందుకు గుర్తులేడు, మన క్లాస్‍మేట్ల నుంచి ప్రఖ్యాత బిజినెస్ స్కూల్‍కి ఎంపికైన ఒకే ఒక్కడు కదా!”

“అనుకోకుండా ఓ రెస్టారెంట్‌లో కలిశాం. వాడేదో ఆఫీస్ పని మీద వచ్చాడు.”

“అవునా? మరి నీతో ఇక్కడికి తీసుకురావల్సింది.”

“ఏదీ? లంచ్ అవగానే వెళ్ళిపోయాడు.” అని ఓ క్షణం ఆగాడు. మళ్ళీ తనే మాట్లాడుతూ.. “ఓ తమాషా విషయం చెప్పాడు తెలుసా.. నన్ను తాగడం మానెయ్యమంటున్నావు కదా. అది అలవాటు.. అంటే Habit. ‘h’ తీసేసావనుకో, ‘a bit’ మిగులుతుంది. తర్వాత ‘a’, తీసేస్తే ‘bit’ మిగులుతుం. ‘b’ ని తొలగిస్తే, ‘it’ ఉంటుంది. ‘i’ ని తీసేస్తే,’t’ ఉంటుంది! హహ్హాహ్హా! ఏ అలవాటునీ వదిలేయలేమట.. అందుకని నన్ను నీ పతిదేవుడిగా స్వీకరించమని..”

“బిజినెస్ స్కూల్లో చెప్పే మానేజ్‍మెంట్ పాఠాలు ఇవేనా?”

“కొన్ని ప్రముఖ సంస్థల్లో చదవాలంటే ఇవి అదనపు అర్హతలేమో!” జోక్ చేయబోయాడు.

“సరే, ఇంతకీ ఈ ‘Habit’ పద విన్యాసం – సందర్భం చెప్పాడా? ఖచ్చితంగా చెప్పి ఉండడు. లేదా నీకు పనికిరాదని నువ్వు పట్టించుకుని ఉండవు.. మనం స్కూల్లో ఉన్నప్పుడు మోరల్ క్లాసెస్‍లో ఏం చెప్పేవారో గుర్తు లేదా? అలవాట్లను జాగ్రత్తగా ఏర్పర్చుకోవాలనీ, ఎందుకంటే తర్వాతర్వాత వాటిని వదుల్చుకోడం కష్టమవుతుందనీ చెప్పేవారు కదా! అతనేదో మాటల గారడీ చేస్తే, నువ్వా మాయలో పడిపోయావ్.. నువ్వీ అలవాటుని వదులుకోగలవని అనిపించటం లేదు.”

***

“ఎలా ఉంది మీ సొంతూరు?”

“బానే ఉంది.”

“ఏంటలా ఉన్నావు? ఉత్సాహంగా లేవు. ఈసారి మీ పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదించినట్టు లేదు” అంటూ ఆమె కళ్ళల్లోకి చూసి, “అబ్బో కళ్ళు ఎర్రగా ఉన్నాయి.. కొంపదీసి నాటు సారా పుచ్చుకున్నావేంటి?” అన్నాడు సరదాగా.

ఆమె నెమ్మదిగా నడవసాగింది. ‘అవును. అలవాట్లనేవి అంత తొందరగా పోవు. మారతాడేమో అని చూస్తున్నాను, మారితే హాయిగా పెళ్ళి చేసుకుందామని అనుకుంటాను, కానీ ఏ మార్పు లేదు’ అనుకుంటూ నిట్టూర్చింది.

ఆమెని దాటి వెళ్ళి, ఆమెను ఆపాడతను. చేతులు జోడించి నిలబడ్డాడు. “నన్ను క్షమించి, ఏం జరిగిందో చెప్పు” అన్నాడు.

“నీ సోదరుల వల్లనే నాకీ వేదన.”

“నా సోదరులా? ఎవరు?”

“మీ తాగుబోతు సోదరులు. తిరుగుప్రయాణంలో నా బోగీలో నా ‘బే’లో నేను తప్ప మిగతా వాళ్ళంతా మగవాళ్ళే. మంచివాళ్ళే అనుకున్నాను. కానీ తాగుబోతులు! వాళ్ళ మాటల్లో తెలిసింది వాళ్ళల్లో ఎవరికి ఒకరంటే ఒకరు పరిచయం లేదని. అందరూ ఇప్పుడే కలిసారు.. ఎవరిది ఏ బ్రాండో మాట్లాడుకున్నారు.. కాసేపటికే అక్కడే ఓ బార్ తెరిచేశారు. చుట్టూ చీకటి.. ఏ స్టేషన్ లోనూ హెల్ప్ లైన్ నంబర్ కనబడలేదు, లేకపోతే, వాళ్ళని దింపించేసి ఉండేదాన్ని. నేను బెర్త్ మీద పడుకోలేకపోయాను, రాత్రంతా అలా ముడుచుకుని కూర్చునే ఉన్నాను, తెలుసా?”

పరిస్థితిని కాస్త తేలిక పరచాలనుకున్నాడు. “థాంక్ గాడ్! నీకేం కాలేదు. అయినా తాగేవాళ్ళంతా పోకిరోళ్లు కాదు.” అన్నాడు.

“నువ్వో పిరికివాడివి.. నీకు పెళ్ళి చేసుకునే అర్హతలేదు, నన్ను మరిచిపో. ఓ తాగుబోతు నుంచి నువ్వు నీ భార్యకు రక్షణ ఎలా కల్పిస్తావు?నువ్వూ వాడితో కలిసి తాగుతూ కూర్చుంటావు. పైగా నీ జీవితం కాదు కాబట్టి, తాగుడుకి, లైంగిక నేరాలకి సంబంధం ఉన్న వార్తలన్నీ కన్వీనియెంట్‍గా మర్చిపోతావు!”

“సారీ! నా ఉద్దేశం అది కాదు. ఆడవాళ్ళ పట్ల నేను అనుచితంగా ప్రవర్తిస్తానని నువ్వు భావిస్తున్నావా?” అన్నాడు.

ఆమె తలెత్తి అతడికేసి చూసింది. అతని కళ్ళల్లో నిజాయితీ, గంభీరత కనబడ్డాయి. ఆమె కాస్త మెత్తబడింది. “కన్నా, నువ్వలా ప్రవర్తించవు. నాకు తెలుసు. నీ నియంత్రాణా భావం నాకు తెలుసు. మనం చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం, నువ్వు నీ ప్రేమని వ్యక్తం చేసే పద్ధతి, మృదువుగా నా చేతిని నిమరడమే! ప్రేమని వ్యక్తం చేయడానికి భౌతిక పద్ధతే అక్కర్లేదు, ఇన్నేళ్ళుగా నువ్వు నిరూపించినది అదే. అందుకే నువ్వంటే నాకు మరీ ప్రేమ! నువ్వెంతో మంచివాడివి, కానీ అలాంటి చెడు అలవాటుని కలిగి ఉండడం నీకు భావ్యం కాదు. నువ్వు తాగి మత్తులో ఉన్నావనుకో, ఏ స్త్రీనయినా ఎలా రక్షించగలవు? ఊహించు” అంది.

వాళ్ళిద్దరూ ఒకరి చేతులనొకరు పట్టుకుని నెహ్రూ పార్క్‌లోని బెంచీ మీద మౌనంగా కూర్చున్నారు. కాసేపయ్యాకా, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు.

***

“విన్నావా? రవికి లివర్ కాన్సర్ అట! థర్డ్ స్టేజ్. పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. నువ్వు నీ ట్రిప్‍ని కుదించుకుని, వెంటనే వచ్చేస్తే మంచిది. వాళ్ళిద్దరికి వాళ్ళ కుటుంబాల నుంచి సాయం అందదు, కాబట్టి రవికి, సితారకి – స్నేహితులం మనమే అండగా ఉండాలి.” అంది.

మిత్రులు ఒకరి తరువాత ఒకరుగా సాయం చేశారు. రవి కోలుకుంటున్నాడు. కానీ మూడు నెలలు గడిచాకా, జబ్బు తిరగతోడింది. మన నాయికానాయకులు తమ స్నేహితుడి గురించే ఆలోచిస్తూ, తమ పెళ్ళి గురించి చర్చలు మానేశారు. మరో ఆరు నెలలకి రవి మరణించాడు. అతను అనుభవించిన అన్ని బాధల నుండి విముక్తి పొందాడు.

***

“రవి పోయి ఆర్నెల్లు దాటింది. సితార ఒంటరిగానే ఉంటూ, బుజ్జిని పెంచి పెద్ద చేయాలనుకుంటోంది. రెండో పెళ్ళి మాట ఎత్తవద్దంటోంది.”

“మరి నువ్వు ఆమెకి స్నేహితురాలిగా ఉండి ఏం ఉపయోగం? అమెని ఒప్పించు.”

“తను చాలా స్పష్టంగా ఉంది. ఎవరి మాట వినదు. నీ అలవాటు విషయంలో నేనెందుకు అంత పట్టు పడుతున్నానో తెలుసా? చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ‘అయ్యో, అలా చేయకుండా ఉంటే.. బ్రతికేవాడేమో’ అన్న బాధ ఉండకూడదు. రవి ఎదిగిన మనిషి, తన బాగోగులు తాను స్వయంగా చూసుకోగలడు అనుకుంది సితార. ఇప్పుడు చూడు ఏం జరిగిందో, ఎవరు ఒంటరిగా మిగిలిపోయారో? పైగా ఎంతటి వేదన! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని భావిస్తూ, నేను జీవితాంతం ఉండగలను. మనం పెళ్ళి చేసుకున్నాకా నీ అలవాటు వల్ల నిన్ను పోగొట్టుకునేకంటే, పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవడమే మంచిదనిపిస్తోంది.. నిన్ను బ్రతిమాలుకుంటున్నాను, వెళ్ళిపో నాకు దూరంగా.. నా కళ్ళ ముందే నువ్వు చనిపోవడం నేను చూడలేను.. నన్నన్నా వదిలెయ్.. లేదా ఆ అలవాటునైనా వదిలెయ్.. ఈ విషయంలో నేను నిస్సహాయురాలిని..” అంటూ ఏడవసాగింది. ఆమె చెప్తున్న మాటలలోని అర్థాన్ని ఇప్పటికి అర్థం చేసుకున్నాడతను. ఆమె ఇప్పటి దాకా పెళ్ళికి ఎందుకు అంగీకరించలేదో గ్రహించాడు. తనని తాను మార్చుకోవాలనుకున్నాడు.

అయితే, ప్రేమలో ఉన్నవాళ్ళకి తమ భావాలు చెప్పేందుకు మాటలే అక్కర్లేదు కదా, అవసరమా? ఆమె చేతిని మృదువుగా పట్టుకున్నాడు. నెహ్రూ పార్క్‌లో వాళ్ళ ఫేవరెట్ బెంచీ మీద మౌనంగా కూర్చున్నారు.

~

ఆంగ్ల మూలం: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

స్వేచ్ఛానువాదం: కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here