Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-131: వదిన చేసే విడ్డూరాలు..

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]శ్రా[/dropcap]వణమాసం. పెళ్ళిళ్ళ సీజన్. నేనూ, వదినా కలిసి మా బంధువుల పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఈ మధ్య చాలామంది చేసే డెస్టినేషన్ వెడ్డింగ్ అవడం వల్ల సిటీకి దూరంగా రిసార్ట్‌లో చేసారు. దారంతా పెళ్ళి ఎంతా బాగా చేసారో నేనూ, వదినా ఒక్కొక్క విషయం తల్చుకుని తల్చుకుని మరీ చెప్పుకుంటున్నాం.

“అన్నీ పధ్ధతిగా చేసేరు కదా! పసుపు కొట్టడం, పెళ్ళికూతుర్ని చెయ్యడం, ఎదురు సన్నాహం” అని వదిన చెపుతుంటే

“అవును వదినా.. పెళ్ళితంతు మొత్తం శాస్త్ర ప్రకారం చేసేరు. వేడుకలు కూడా అన్నీ చేసేరు. ఆఖరికి అల్లుడికి అలకపాన్పు కూడా వేసారు. మరదలిమాడ కూడానూ.. ఈ మధ్య నేను ఎక్కడా చూడలేదు.”

“మామూలుగా చెయ్యడం కాదు.. పసుపు కొట్టేటప్పుడు చూసేవా.. ఆ రోలూ రోకలీ.. ఎంత బాగా డెకొరేట్ చేసేరో.. ఎంచక్క ‘రోకలెత్తలేను రోలెత్తలేనూ ఓయమ్మా.. చేమంతి కడియాల చేయెత్తలేనూ..’ అని అందరం కలిసి పాడుతుంటే ఎంత బాగుందీ!.”

“ఎందుకు బాగుండదూ..! ఇంతంత జరీలున్న పట్టుచీరలు కట్టుకుని, ఒంటినిండా నగలు పెట్టుకుని, ఫొటోలకీ, వీడియోలకీ పోజులిస్తూ, వాళ్ళెవరో దంచిన పసుపుకొమ్ముల మీద సుతారంగా పోటు వేస్తూ, పక్కవాళ్ళు పాడుతుంటే మనం పెదిమలు కదుపుతూ వయ్యారాలు పోతే బాగుండకేం చేస్తుందీ!”

నా వెటకారాన్ని విన్న వదిన.. “నువ్వెప్పుడూ ఇంతే.. అస్సలు ఎంజాయ్ చెయ్యడం తెలీదు..” అంది.

“మరే.. చేతులు పడిపోతూ రోట్లో నిజంగా దంచే ఆ పాత రోజులు గుర్తొస్తే తెలుస్తుంది ఎంజాయ్‌మెంట్ అంటే ఏంటో..”

“పాత రోజులంటే గుర్తొచ్చింది.. అలకపాన్పుకి కూడా ఎక్కడినించి తెచ్చేరో మరి.. నవారు మంచం తెచ్చేరు.. అన్నీ పాత వస్తువులే.”

వదిన మాటకి నాకూ హుషారొచ్చింది.

“అవు నొదినా.. పెళ్ళికొడుకు అక్కగారు అమెరికాలో ఉంటోందిట.. ఆఖరికి అన్నంలోకి వడ్డించే కందిపొడి కూడా మిషన్‌లో తిప్పించొద్దూ… తిరగలిలో తిప్పిన కందిపొడే కావాలని గట్టిగా చెప్పిందిట.”

“అవునట.. నేనూ విన్నాను.. పచ్చళ్ళు కూడా అంతేట.. దేనికీ మిక్సీలో చేస్తే పనికిరాదూ.. చేత్తోనే చెయ్యాలందిట. రోటిపచ్చడి రుచి మిక్సీలో రాదూ అందిట.”

“నయం.. రుబ్బురోళ్ళు కరెంటుతో పని చేస్తాయి కనక వంటచేసేవాళ్ళు బతికిపోయేరు. లేకపోతే ఇన్ని వందలమందికి రోళ్ళలో చేత్తో రుబ్బడం మాటలేంటీ!.. అయినా ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆడపడుచులు ఉన్నారా వదినా! అందరూ సరదాగా వచ్చి పెళ్ళి చేసుకునేవాళ్ళేగా..!”

“ఆ.. ఉంటారులే కొందరు. అయినా పెళ్ళి కనక మనం ఆ ఆడపడుచుని ఇలా ఆడిపోసుకుంటున్నాం కానీ, నిజంగా చెప్పూ.. తిరగలిలో తిప్పిన కందిపొడి రుచి మిషన్ లో వేస్తే వస్తుందా! వట్టి మెత్తటి పిండిలా అయిపోదూ! అదే తిరగట్లో అయితే కాస్త రవ్వరవ్వగా ఉండి నోటికి రుచిగా ఉంటుంది. పచ్చడైనా అంతే.. రోట్లో చేసే కందిపచ్చడి రుచి మిక్సిలో వేస్తే రానేరాదు..”

వదిన మాటలను కాదనకుండా వింటున్నాను.

“అయినా స్వర్ణా, అసలు నీకో సంగతి తెల్సా..!”

ఆత్రంగా వినడానికి కాస్త వదిన వైపు తిరిగేను.

“ఇదివరకు ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఇలా దంచుతూ, విసురుతూ ఉండేవారు కనకనే అంత ఆరోగ్యంగా ఉండేవారు.. ఇప్పుడు మనం అన్నింటికీ స్విచ్చిలు వేసేసుకుంటున్నాం.. అందుకే మనకీ నడుంనెప్పులూ, కీళ్ళ నెప్పులూనూ.. మనం జిమ్‌కి వెళ్ళి చేసేవి ఏవిటనుకున్నావూ.. ఇలాంటి వ్యాయామాలే..”

వదిన చెప్పిన సిధ్ధాంతానికి తెల్లబోయేను.

వదినా, నేనూ ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం..

వదిన ఒక్కసారి.. “కారాపు.. కారాపు..” అని గట్టిగా అరిచింది.

డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఖంగారుగా వదిన్ని చూసేడు.

“కారు వెనక్కి తిప్పు..” అంది వదిన.

డ్రైవర్ రివర్సు చేసి కారు వెనక్కి నడిపేడు.

ఏముందా వెనక అని చూస్తున్ననాకు రోడ్డు పక్కన రోళ్ళు, రోకళ్ళు, పచ్చడిబండలు లాంటి రాతితో చేసినవి వరసగా పేర్చి అమ్ముకునేవాళ్ళు కనపడ్దారు. నేను ఆశ్చర్యంగా వదిన వైపు చూసేను.

వదిన కారు దిగి వెడుతూ “రా..” అంది నాతో.

అక్కడ వరసగా సైజులవారీగా రోళ్ళు, తిరగళ్ళు, పచ్చడిబండలు.. లాంటివన్నీ ఉన్నాయి.

వదిన వాటి ఖరీదులు అడగడం మొదలెట్టింది.

“ఇప్పుడు ఇవెందుకు వదినా!”

“అదేంటీ.. ఇప్పుడేగా మనం చెప్పుకున్నాం. వీటితో చేస్తే పచ్చడి బాగుంటుందనీ.. ఒక రోలూ, రోకలీ, పొత్రం, ఒక తిరగలీ, పచ్చడిబండా కొనుక్కుందాం. మనం మళ్ళీ వీటికోసం మార్కెట్‌కి వెళ్ళక్కర్లేకుండా దార్లోనే కనిపించేయి. నువ్వు కూడా తీసుకో.. ఇక్కడైతే చవగ్గా వస్తాయి..” అంటూ వదిన బేరం చెయ్యడం మొదలెట్టింది.

నాకు గుండాగినంత పనైంది.

“ఇప్పుడివి తీసికెళ్ళి అపార్ట్‌మెంటుల్లో ఎక్కడ పెట్టుకుంటాం వదినా.. మనం దంచుతున్నా, రుబ్బుతున్నా కింద ఫ్లాట్‌లో వాళ్ళు దెబ్బలాటకి రారూ!”

“అబ్బ.. నీకూ, మీ అన్నయ్యకీ అడ్డుపుల్లలు వెయ్యడం బాగా వచ్చు. ఫ్లాట్‌లో కాపోతే సెల్లార్‌లో పెట్టుకుంటాం. కావల్సినప్పుడు కింద కొచ్చి పని చేసుకుంటాం.. ఇంతకీ నీకు ఏ సైజుది కావాలో చెప్పు.”

“ఇప్పుడివి ఎలా తీసికెడతాం..”

“డిక్కీలో పడేద్దాం.. లేకపోతే ఏదో ఆటో చూద్దాం.. ముందు నీకేం కావాలో చెప్పు”

“ఇప్పుడు రుబ్బీ, దంచే ఓపిక నాకు లేదు. ఆ రోజులు వెళ్ళిపోయేయి.. కావాలంటే నువ్వు తీసుకో..” ఖచ్చితంగా చెప్పేసేను.

వదిన ఒక పెద్ద రోలూ, రోకలీ, పొత్రం, మీడియం సైజు తిరగలీ సెలెక్ట్ చేసి పక్కకి పెట్టించి బేరం మొదలెట్టింది.

అమ్మకందారు ఎనిమిదివేలన్నాడు. వదిన వెయ్యి రూపాయిలంది. అతను ఏడన్నాడు. వదిన వెయ్యే అంది. అతను అయిదన్నాడు. వదిన రూపాయి కూడా పెంచలేదు. అతను అయిదువేలకి దిగేడు. వదిన వెయ్యి మీదే నిలబడింది. ఆఖరిమాటగా రెండువేలన్నాడు. వదిన మాట మీరలేదు. అతను కుదరదని చెప్పేసి వదిన సెలెక్ట్ చేసినవి మళ్ళీ తన వాటిల్లో వరసగా సర్దేసుకున్నాడు.

వదిన సర్రున వెనక్కి తిరిగి వస్తూ “వాడి మాట వాడిదే.. మన కారు కదిలేక చూడు.. వెనక్కి పిలుస్తాడు..” అంది.

మేం కారెక్కేం.. కారు కదిలింది. వాడు పిలవలేదు.

వదిన “అయినా ఇవన్నీ కొంటే మీ అన్నయ్యకి నచ్చవులే.. మంచి పనైంది. బేరం కుదర్లేదు..” అంది.

నాకు నవ్వాపుకోవడం చాలా కష్టమైంది. వదిన నన్ను కనిపెట్టేసింది.

“ఎందుకు నవ్వుతున్నావ్”

“అబ్బే నవ్వటం లేదు.. పాపం నీకు ‘రోకలెత్తలేను రోలెత్తలేనూ’ అంటూ పాట పాడే అవకాశం పోయిందే అని బాధపడుతున్నాను..” అన్నాను.

“చూస్తూండు.. తొందర్లోనే ఆ రోలుని కొంటాను.. నేనే కాదు.. నాతో పాటు మీ అందరిచేతా కూడా దంపిస్తాను.. మీకు వచ్చిన దంపుళ్ళ పాటలన్నీ పాడిస్తాను..” అంది ధీమాగా..

“ఎలా!” ఆతృత ఆపుకోలేకపోయేను.

“పిచ్చి స్వర్ణా.. చూస్తూండు.. ఈ శ్రావణమాసంలోనే జరిగే కిట్టీపార్టీలో రోలూ రోకలీ పెట్టి, పసుపు దంచే పోటీ పెట్టేస్తాను. దెబ్బకి నేనే కాదు.. పోటీలో గెలవడానికి ఆడవాళ్లందరూ వచ్చేసి, దంచేసి, వాళ్లకి తెలిసిన దంపుళ్ళ పాటలన్నీ పాడేస్తారు. వదినంటే ఏవనుకుంటున్నావో..!” అంది.

“నిజవే!” ఆశ్చర్యంగా అడిగేను.

“ఆహా.. ఏవీ అనుమానం లేదు. అంతే కాదు.. కిట్టీపార్టీ అయ్యేక ఇచ్చే రిటర్న్ గిఫ్ట్‌ల కింద బుల్లి బుల్లి రోళ్ళు అందరికీ ఇచ్చేస్తాను..”

“హేవిటీ!” నోరెళ్ళబెట్టేను..

“అవును.. వంటింటి గట్టు మీద పెట్టుకుని, చటుక్కున అల్లం పచ్చిమిరపకాయలూ తొక్కేసి, కూరలో పడేసుకుందుకు బుజ్జిగా బాగుంటుంది..” వదిన ఇంకా దాని గురించి చెప్పుకుపోతూనే వుంది, నేను మటుకు ‘హమ్మ వదినా!’ అనుకోకుండా ఉండలేకపోయేను.

Exit mobile version