కాజాల్లాంటి బాజాలు-23: వదినా – ప్రత్యామ్నాయాలూ…

2
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]పొ[/dropcap]ద్దున్నే ఎనిమిది గంటలకి “చిలుకూరు వెడదాం వస్తావా..” అంటూ వదిన ఫోను.

“అంత అర్జంటేమిటి వదినా… నెమ్మదిగా వెళ్ళొచ్చుగా…” అన్నాను. ముందు ప్లాన్ చేసుకోకుండా అలా అప్పటికప్పుడు బయల్దేరి వెళ్లలేను నేను.

“ఊహు. చాలా అర్జంటు. ఇవాళే వెళ్ళాలి. ఓ గంటలో కాబ్ తీసుకుని వస్తాను, రెడీగా ఉండు” అంది వదిన.

ఏమైనా పనులు కావాలనుకున్నప్పుడు చిలుకూరు వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి మొక్కుకోవడం, ఆ పని సానుకూలమవగానే మళ్ళీ వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యడం నాకూ, వదినకీ అలవాటే. ఎంత ట్రాఫిక్ తక్కువున్నా హైద్రాబాదునుంచి చిలుకూరు వెళ్ళడానికి గంటన్నర, రెండుగంటలు తీసుకుంటుంది. ఇప్పుడప్పుడే ఎనిమిది దాటింది. మేం బయల్దేరేటప్పటికి ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది. వెళ్ళడానికి టైమ్ కూడా ఎక్కువే పడుతుంది. అందుకే మళ్ళీ వదినకి ఫోన్ చేసి రానని చెపుదామనుకున్నదాన్ని ఆగిపోయేను. ఎందుకంటే గుడికి రమ్మంటే రాననబుధ్ధికాదు కదా! అందుకు.

చెప్పినట్టుగానే వదిన ఓ గంటలో కాబ్ తీసుకుని వచ్చేసింది. ఇద్దరం బయల్దేరేం. ఆతృత ఆపుకోలేక వెంటనే అడిగేసేను వదిన్ని “ఇంత అర్జంటేముంది వదినా…” అంటూ.

“మా మేనల్లుడు రవి అమెరికాలో ఇల్లు కొందామనుకుంటున్నాడు. దానికి ఏవో కొంచెం అడ్దంకులు వచ్చేయిట. చిలుకూరు వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అంతా క్లియరైపోతుందని రాజమండ్రీ నుంచి మా వదిన ఫోన్ చేసి చెప్పింది. ఈ వీకెండ్‌లోగా డబ్బు కట్టెయ్యాలిట. అందుకే ఇంత అర్జెంట్‌గా వెళ్లడం.” అంది వదిన.

నాకు కాసేపటిదాకా వదినన్న మాట అర్థం కాలేదు. ఎక్కడో అమెరికాలో వదిన మేనల్లుడు కొనే ఇంటికి అడ్దంకులు రావడమేమిటి! అవి తొలగిపోవడం కోసం రాజమండ్రీనుంచి వాళ్ల వదిన ఫోన్ చేసి వదిన్ని చిలుకూరు వెళ్ళి ప్రదక్షిణలు చెయ్యమనడం ఏమిటీ! దానికోసం వదినకి సాయంగా నేనూ బయల్దేరడమేవిటీ! ఏవిటో… బోడిగుండుకీ మోకాలికీ ముడెట్టినట్టనిపించింది.

“నువ్వు ప్రదక్షిణలు చేస్తే రవి పని ఎల్లా అవుతుంది వదినా!” అన్నాను సందేహం ఆపుకోలేక.

“ఎందుకవదూ! వాడి తరఫున నేను మొక్కుకుని పదకొండు ప్రదక్షిణలు చేస్తే పనయ్యాక వాడు ఇండియా వచ్చినప్పుడు నూట ఎనిమిది ప్రదక్షిణాలూ చేసి మొక్కు తీర్చుకుంటాడన్న మాట… లేకపోతే మొక్కుకుందుకు ఒకసారీ, పనయ్యాక ఆ మొక్కు తీర్చుకుందుకు మరోసారీ అంతంత దూరాల్నించి రావడమంటే మాట్లేంటీ!” అంది వదిన.

వదిన మాటలు నాకు భలే తమాషాగా అనిపించాయి. “అంటే అన్నయ్య ఉపవాసముంటాడని నువ్వు మొక్కుకున్నట్టా…” అన్నాను నవ్వుతూ. వదిన మంచిది. నేను ఎంత వేళాకోళం చేసినా నవ్వేస్తుంది తప్పితే కోపం తెచ్చుకోదు. అలాగే నవ్వేస్తూ,

“ఏం చేస్తాం స్వర్ణా. ప్రతిదానికీ ప్రత్యామ్నాయాలున్నట్టే దేవుడి దగ్గర కూడా ఉంటాయి. పాపం దేవుడు మంచివాడు. అర్థం చేసుకుంటాడు. మనకి దేవుడి మీద భక్తి ఉంటే చాలు, ఇలా ఎన్ని రకాలుగా మొక్కులు తీర్చుకున్నా ఏమనుకోడు. అసలు నీకింకో విషయం చెప్పనా!” అంది.

చెప్పమన్నట్టు చూసేను వదిన వంక.

“మా మేనత్తగారమ్మాయి రంజని తణుకులో ఉంటుంది. తను బోల్డు నోములూ, వ్రతాలూ చేస్తుంది. వాళ్ళ కోడలు చేత కూడా అవన్నీ చేయించాలని తన కోరిక. కానీ కొడుకూ కోడలూ అమెరికాలో ఉంటారు మరి. ఎప్పుడైనా వచ్చినా అత్తారింట్లో ఓ వారం కన్న ఉండడానికి ఆ అమ్మాయికి కుదరదు పాపం. అందుకని మా రంజని ఏం చెస్తుందో తెల్సా!”

నేను కుతూహలంగా ముందుకి వంగేను.

“నోము రోజు ఇక్కడ తణుకులో రంజని మొత్తం నోమంతా శాస్త్రప్రకారం చేయించేసి ఇక్కడి ముత్తైదులకే వాయినం ఇచ్చేస్తుంది. ఎటొచ్చీ మొదట్లో సంకల్పం చెప్పుకునేటప్పుడు మటుకు స్కైప్‌లో కోడలిని పిలిచి తన చేత సంకల్పం చెప్పించి, ఆఖర్న మమ అనిపిస్తుంది. అదేంటని ఎవరైనా అడిగితే భగవంతుడు సర్వాంతర్యామి. అక్కడా ఉంటాడు, ఇక్కడా ఉంటాడు అంటుంది. నిజమే కదా!” అంది. వార్నాయనో… మా వదినని మించినదన్నమాట ఆవిడ వదినగారు అనుకున్నాను.

నేనింకా వదిన చెప్పిన మాటల్లోంచి ఇంకా తేరుకోనేలేదు, వదిన హడావిడిగా ఫోన్ తీసుకుని “మా పెదనాన్న కొడుకుతో మాట్లాడాలి. మర్చేపోయాను.” అంటూ మాట్లాడ్దం మొదలెట్టింది.

“ఒరేయ్ శీనూ, నేన్రా… ఏవిటీ, మొన్న మీ అమ్మాయిది కుదురుతుందనుకున్న సంబంధం ఏదో తప్పిపోయిందన్నావుగా. ఇప్పుడు నేను చిలుకూరు వెడుతున్నాను. నీ తరఫున మొక్కేసుకోనా! ఏవిటీ.. ఏం చెయ్యాలంటావా! అనుకున్న పని అయితే నువ్విక్కడికొచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి. చేస్తావా! సరే అయితే… అలాగేలే…” అంటూ నావైపు చూసి, “పాపం, రెండేళ్ళనించీ పిల్ల పెళ్ళికోసం తిరుగుతున్నాడు. ఎలాగూ వెడుతున్నాం కదా! వాడి తరఫున కూడా మొక్కేసుకుంటే ఓ పనైపోతుందనీ…” అంది.

“ఇంకా ఎవరైనా ఉన్నారేమో గుర్తు తెచ్చుకో.” అన్నాను వదిన విశాలహృదయానికి కరిగి నీరైపోతూ…

వదిన ఓ రెండు నిమిషాలు తీవ్రంగా ఆలోచించీ, “అవును సుమీ.. మా చిన్నతాతగారి మనవరాలు పి.హెచ్.డి చేస్తోంది. ఏ యేటికాయేడు అయిపోతోందంటోందే కానీ అవటమే లేదు. దానికి ఫోన్ చేసి కనుక్కుంటాను” అంటూ ఆ అమ్మాయికి ఫోన్ చేసింది.

మరా అమ్మాయి ఏం చెప్పిందో ఏమో పాపం వదిన మొహం పాలిపోయింది. “ఏమైంది వదినా!” అడిగేను ఆత్రంగా.

“హూ.. ఈ కాలం పిల్లలు ఏవంటారూ. నీకెందుకు పెద్దమ్మా శ్రమా. ఇక్కడే కుర్చీలో ఆ బాలాజీ ఫొటో పెట్టేసుకుని, నేనే ఆ కుర్చీ చుట్టూ ప్రదక్షిణలు చేసేస్తానూ అంది.”

ఫక్కున రాబోయిన నవ్వుని వదిన ఫీలవుతుందని పళ్ళ మధ్య బిగించేసేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here