కాజాల్లాంటి బాజాలు-134: వదినా – వంటింటి ప్రవేశ నిరాకరణ

2
2

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]న[/dropcap]వరాత్రు లొచ్చాయంటే ఎంత సందడో! ఆ వెంటనే దీపావళి. ఆ పైన కార్తీకమాసం. మనసంతా అధ్యాత్మికతతో నిండిపోతుంది కదా!.

అంతే కాదు దానితోపాటు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పిండివంటలు, పండగ పేరు చెప్పుకుని కొనుక్కునే పట్టుచీరలూ, లలితా పారాయణాలూ, భోజనాలూ, బొమ్మల కొలువులూ, పేరంటాలూ, తాంబూలాలూ లాంటి లౌకిక విషయాలు కూడా మనం అంతగానూ ఆస్వాదిస్తాం.

ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ పండగ పేరు చెప్పుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే వ్యాపారస్థులు రకరకాల స్కీములతో మనల్ని భలే ప్రలోభ పెట్టేస్తుంటారు.

సూది దగ్గర్నించీ కారు వరకూ ప్రతిదానికీ ఏదో పేరు చెప్పి, పండగకి బంపర్ ఆఫర్ అంటూ మనల్ని ఊదరగొట్టేస్తుంటారు.

అవసరమైనవి అలాంటి ఆఫర్లు లేకపోయినా కొనుక్కోక తప్పదు. కానీ, ఇలాంటి ఆఫర్లొచ్చాయంటే ఒక్కొక్కసారి మనకి అవసరం లేనివి కూడా కొనేస్తుంటాం.

అలాగే అయింది నా పనిప్పుడు. ఇంట్లో సైజులవారీగా ఉన్న నాలుగు ప్రెషర్ కుక్కర్లతో పాటు ఒక ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్ కూడా ఉంది. కానీ ఇప్పుడు మార్కెట్ లోకి ఇన్స్టాపాట్ అని రోబో కుక్ కొత్తగా వచ్చింది. కొత్తదేమిటి లెండి.. అమెరికాలో మనవాళ్ళు ఎప్పట్నించో వాడుతున్నారు. ఇండియాలో ఇప్పుడు దీని వాడకం ఎక్కువయింది. కొన్ని కొన్ని సామాన్లు మనకి అఖ్ఖర్లేకపోయినా స్టేటస్ కోసం కొనుక్కున్నట్టు కొంతమంది దీనిని కొని అలంకారంగా పెట్టుకుంటున్నారు. ఈ పండగ టైమ్‌లో ఈ కుక్కర్‌కి వ్యాపారస్థులిచ్చే ఆఫర్‌కి ఆకర్షితురాలినయి, ఆ ఇన్స్టాపాట్ కొనుక్కోవడమా.. వద్దా అనే డైలమాలో పడిపోయేను.

ఇప్పటికే ఇంట్లో ఉన్న నాలుగు కుక్కర్లన్నీ చోటు సరిపోక అటూ ఇటూ సద్దుతూనే ఉంటాను. ఇంతోటి నా వంటకీ అవి చాలు కదా! మరింక ఈ ఇన్స్టాపాట్ ఎందుకూ అనుకుందామంటే మొన్నటికి మొన్న మా ఎదురింటి సరళమ్మ అది కొనేసి, నిన్న దానితో వెజ్ పులావ్ చేసేసి, రుచి చూడమంటూ ఓ ఉగ్గిన్నెడు మా డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది.

అక్కడికి ఆ ఇన్స్టాపాట్ లేకపోతే వెజ్ పులావ్ చెయ్యలేమన్నట్టు పెద్ద పోజొకటీ..

నిజం చెప్పొద్దూ! నాకు మహా అవమానమై పోయినట్టనిపించింది. వెంఠనే వెళ్ళి ఆ ఇన్స్టాపాట్ సంగతేదో చూసెయ్యాలనిపించింది. అదిగో.. సరిగ్గా ఆ టైమ్ లోనే ఈ పండగ బంపర్ ఆఫర్లు నా కళ్ళబడ్డాయి. అంతే ఇంక ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసేను, ఏమైనా సరే ఆ ఇన్స్టాపాట్ కొనేసి, వెజ్ పులావ్ చేసేసి, ఓ పెద్దగిన్నెడు పట్టికెళ్ళి ఎదురింటి సరళమ్మ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టి రావాలని.

అనుకున్నాక ఇంక ఆగుతానా! వెంటనే వదినకి ఫోన్ చేసేను, ఇలా మార్కెట్‌కి వెళ్ళి ఇన్స్టాపాట్ కొందామనుకుంటున్నానూ, తోడు రమ్మని అడిగేను. ఇంక అక్కణ్ణించి నాకూ వదినకీ మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది.

“స్వర్ణా, ఇన్నేళ్ళనించి కాపరం చేస్తున్నావు. ఇప్పటికి కూడా నీకేం కావాలో నీకు తెలీదా!” అంది వదిన.

దానికి నేను “అదేంటి వదినా! ఇన్స్టాపాట్ నా కోసమే కదా! దాని వల్ల పని సులువౌతుందంటున్నారనీ..” అన్నాను.

అప్పుడు వదిన “అయ్యో.. ఇంకెప్పటికి నీకు తెలుస్తుంది స్వర్ణా. ఇన్నేళ్ళు ఆ ఇంటికి చాకిరీ చేసేవు. నీకేమొచ్చింది! ఇంకా ఏదో చేసెయ్యాలని ఎందుకంత తాపత్రయం! నువ్వేకాదు.. చాలామంది ఇల్లాళ్ళంతే. అలా వండుకుంటూనే ఉంటారు. వండుకున్నది చూసి మురిసిపోతారు. ఆ వండిన వంట ఇంట్లోవాళ్ళు బాగుందని లొట్టలేస్తూ తింటే సంబరపడిపోతారు. అదే వంటకి ఎక్కడలేని వంకలూ పెడితే కుంగిపోతారు. దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, ఇంట్లోవాళ్ళు బాగుందనేదాకా వీళ్ళ మనసు శాంతించదు. ఎందుకు స్వర్ణా, మనలో చాలామంది ఇల్లాళ్ళు ఇలాగే ఉంటారు!” అని వాపోయింది.

వదిన అంటున్న మాటలు నాకు అస్సలు అర్థం కాలేదు. నేనేదో కుక్కర్ కొంటానంటుంటే అదేదో పేద్ద సమస్య లాగా ప్రపంచంలోని ఇల్లాళ్లందరికీ పెట్టేసిందే అనుకుంటూ,

“నేనంత తప్పు పని ఏం చేస్తున్నాను వదినా! ఏదో కొత్తరకం కుక్కర్ అన్నారని చూస్తానన్నాను. అంతే కదా!” అన్నాను.

దానికి వదిన “తప్పు కాపోతే మరేంటీ! అసలు ఆ ఆలోచనే తప్పు. నలభైయేళ్ళనించి మూడుపూటలూ వండుతూనే ఉన్నావు. మగవాళ్లకి ముఫ్ఫైయేళ్ళు సర్వీస్ చేసేక రిటైర్మెంట్ అంటూ ఉంటుంది. ఎంచక్క ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ ఇస్తారు. కానీ, మనకీ.. వాళ్ళు రిటైర్ అయి ఇంట్లో ఉంటే మరింత పని ఎక్కువౌతుంది. మనకంటూ ఉండే కాస్త ప్రైవసీ పోతుంది. ప్రతి చిన్న విషయానికీ కల్పించేసుకుంటూ, అదెందుకు కొన్నావ్.. ఇదెందుకు చేసావ్.. అలా ఎందుకన్నావ్.. అంటూ మనకి మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఏదో పిల్లలు సెటిలయ్యేరు, మనకంటూ కొన్ని వ్యాపకాలు చేసుకుందా మనుకునేసరికి ఈ రిటైరయిన మొగుళ్ళకి సమాధానం చెప్పుకునే పరిస్థితిలో పడిపోతాం. హూ.. దీన్ని మనం ఖండించి తీరాలి స్వర్ణా.”

వదిన పడే ఆవేశం ఫోనులో కూడా నాకు స్పష్టంగా కనిపింఛింది.

ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతోంది వదిన అనుకున్న నేను వదిన దృష్టి మారుద్దామని మహా తెలివిగా,

“ఏంటొదినా పక్కా ఫెమినిస్ట్‌లా మాట్లాడుతున్నావ్..” అంటూ సరదాగా టాపిక్ మార్చెయ్యబోయేను.

“ఫెమినిజమ్ కాదు. మనలాంటి ఇల్లాళ్ళ గోల. అందరూ నీలాగే ఎన్నేళ్ళొచ్చినా ఇలా ఇంట్లోకి సామాన్లు కొనుక్కుని పని పెంచేసుకుంటున్నారు. దానిని ఆపాలనే ఉద్యమం మనం తీసుకురావాలి.” నన్ను కూడా ఆ ఉద్యమంలో అప్పుడే కలిపేసింది వదిన.

“ఇంట్లోకి కావల్సిన సామాన్లు మన పని తగ్గించడానికి కానీ పెంచుకోడానికి కాదు కదా!” అర్థంకాక అడిగేను.

“అదే.. అదే మన దౌర్భాగ్యం. ఇదివరకు వాషింగ్ మెషిన్లు ఉండేవి కాదు. చక్కగా సాయానికి మనం పెట్టుకున్న మనిషి బట్టలుతికేసి, ఆరేసి, ఆరేక మడిచేసి అలమార్లో పెట్టేసేది. మరి ఆ మెషిన్ కొన్నాక చూడూ.. ఆ పనికి వేరెవర్నీ పెట్టుకోకుండా అందులో బట్టలు మనమే వేసి, తీసి, ఆరేసి మడతలు పెట్టుకోవాల్సొస్తోంది. అలాగే డిష్ వాషర్ కూడానూ. ఇదివరకు వంట చేసుకుని గిన్నెలు బైట పడేసుకునేవాళ్లం. మరి ఇప్పుడో, ఆ నూనె పట్టిన మూకుళ్ళన్నీ ముందు జిడ్డు వదిలించి ఆ మెషిన్‌లో వేస్తే కానీ పనవదు. అలాగే రోబో కూడానూ.. ఏదో ఇల్లు తుడిచేస్తుందని, మనకి పనుండదని దాన్ని కొంటే దాన్ని ఆన్ చేసేముందు మనం మంచం కిందకి తోసేసినవన్నీ బైట పెట్టుకునేటప్పటికి తాతలు కనపడుతున్నారు. చూసేవా! ఒక్కొక్క మెషిన్ కొన్నప్పట్నించీ మనకి పెరిగిన పనీ.. ఇన్ని మిషన్లూ కొనుక్కుని మళ్ళీ పనికి మనుషులని పెట్టుకోలేం కదా! అంతా మన మీదే పడుతుంది.”

ఊపిరి తిరక్కుండా వదిన చెపుతున్న మాటలు వింటుంటే నాకు నిజమే కదా అనిపించింది. అయినా సరే వదిన దగ్గర ‘తగ్గేదేలే’ అనుకుంటూ,

“కానీ ఈ ఇన్స్టాపాట్ అలాంటిది కాదు కదా వదినా. మనం రోజూ చేసే వంటకి చాలా సులువుగా ఉంటుందిట.” అన్నాను.

“అదుగో మళ్ళీ! అలాంటి ఆలోచనలే వద్దంటున్నాను. మనలాంటి వయసున్న వాళ్లందరి గురించీ ఆలోచించి, నేనీ నిర్ణయానికి వచ్చేను. వాళ్లందర్నీ కూర్చోబెట్టి ఈ ఆలోచన చెప్పి ఒప్పించాలని నా ప్రయత్నం.”

నాకు భలే ఆనందం వేసింది. వదిన ఏది ఆలోచించినా గొప్పగా ఆలోచిస్తుంది. అందుకే “ఏంటి వదినా నీ ఆలోచన!” అనడిగాను ఆత్రంగా.

“చెప్తున్నాను. అడ్డుపుల్లలు వెయ్యకుండా జాగ్రత్తగా విను. మనం చేసినన్నాళ్ళు చేసేం. ఇకనుంచి వంట జోలికి వెళ్ళకూడదనే నిర్ణయానికి అందర్నీ తీసుకురావాలని నా ప్రయత్నం.”

“అంటే వంటమనిషిని పెట్టుకోమనా నీ సలహా!”

“ఊహు కాదు. వంటమనిషిని పెట్టుకున్నా మళ్ళీ మనమే కూరలు తెప్పించుకోవడం, సరుకులు సర్దుకోవడం లాంటివన్నీ చూసుకోవాలి. అందుకని బైట నించి భోజనం తెప్పించేసుకోవాలంతే. హాయిగా లేచి, స్నానం, పూజా కానిచ్చుకుని మగవాళ్లతో సమానంగా హాల్లో కూర్చుని, టీవీ చూస్తూ ఆర్డర్ ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్, భోజనం ఆస్వాదించాలి. అలాంటి సన్నివేశం ప్రతి ఇంట్లోనూ రావడానికి మనమంతా సంఘటితమై ఒక్క మాట మీద నిలబడాలి. అందరం కలిసికట్టుగా ఉంటే ఈ పని మనం ఈజీగా సాధింఛవచ్చు..”

“కానీ బైట భోజనం ఇంట్లో భోజనంలా ఉండదు కదా!”

నసుగుతున్న నన్ను మధ్యలో ఆపేసింది వదిన.

“ఏం.. ఇంత కష్టపడి వాళ్ళకి కావల్సినవన్నీ నేర్చుకుని ఏ పూట కా పూట వేడివేడిగా వండి పెడుతుంటే ఒక్క పూటైనా వంకలు పెట్టకుండా తినే మగమహారాజులున్నారా మనిళ్ళలో!”

వదిన అడిగినదానికి నా దగ్గర సమాధానం లేక మౌనాన్ని ఆశ్రయించేను.

“అందుకే మనమందరం ఒక్క మాట మీదే నిలబడదాం. ఇంక మనం వంటింటి జోలికి పోమనీ, బైటనుంచే తెప్పిస్తామనీ చెపుదాం. ‘వంటింటి ప్రవేశ నిరాకరణోద్యమం’ చేద్దాం. అందరం ఒక్కటైతే ఎవరు మటుకు ఏం చేయగలరు! ఒక్కపూట కూడా ఈ మగవాళ్ళు ఆకలికి ఆగలేరు. ఇంక మనం మాట వినమని తెలిస్తే తప్పకుండా మన డిమేండ్‌కి ఒప్పుకుంటారు.”

నమ్మకంగా చెప్తున్న వదిన మాటలు వింటుంటే నాకప్పుడే గాల్లో తేలిపోతున్నంత ఆనందం కలిగింది. వదిన మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది.

“నువ్వు నీకు తెలిసున్నవాళ్లందరికీ చెప్పు. నేను కూడా బోల్డుమందిని చేరుస్తాను. అందరం కలిసి ఒకరోజు జూమ్ మీటింగ్ పెట్టుకుని, ఏది, ఎప్పుడు ఎలా చెయ్యాలో కార్యక్రమం రూపొందిద్దాం. మన ‘వంటింటి ప్రవేశ నిరాకరణోద్యమా’నికి దెబ్బకి మగాళ్లందరూ దిగొచ్చేలా చేద్దాం.”

వదిన ఆవేశంగా ఇంకా ఏదో చెప్పుకుపోతూనే ఉంది. నాకు మటుకు ఆ ‘వంటింటి ప్రవేశ నిరాకరణ’ అనే మాటే ఇంకా చెవుల్లో అమృతం పోసినట్టు ప్రతిధ్వనిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here