కాజాల్లాంటి బాజాలు-138: వదినలా ఆలోచిస్తే!

1
2

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]మీ[/dropcap] కందరికీ మా అభయాంబక్కయ్య గుర్తుంది కదా! ఆవిడేనండీ.. చిన్నప్పుడు మేముండే ఇంటి కింద వాటాలో ఉంటూ, అస్తమానం నామీదా, మా చెల్లెళ్ళ మీదా మా అమ్మగారికి మడీ తడీ లేనివాళ్లమంటూ పితూరీలు చెప్పేదీ.. ఆ అభయాంబక్కయ్య.. గుర్తొచ్చింది కదా, ఆమె వల్ల ఇవాళ నేను పడ్డ బాధ ఏమని చెప్పను!

ఈ అభయాంబక్కయ్య కన్నా మా వదినే నయం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఎందుకంటే వదిన వచ్చేముందు కనీసం ఫోనైనా చేస్తుంది.. కానీ ఈ అభయాంబక్కయ్య కాకితో కూడా కబురు పెట్టకుండా, ఉరమని పిడుగులాగా పొద్దున్నే ఇంటిముందు ఆటో దిగింది.

“ఇంకా నీ పని తెమల్లేదా!” అంటూ వస్తూనే ఓ కామెంట్ పడేసింది.

కూర పోపు, పులుసుపోపులతో బిజీగా ఉన్న నేను అక్కయ్యని ఆప్యాయంగా అహ్వానించలేకపోయేను. కానీ ఆవిడ అదేమీ పట్టించుకోలేదు.

“ఊ.. త్వరగా కానీ. మనం పది నిమిషాల్లో బయల్దేరాలి.” అంటూ పోపేస్తున్ననా చేతిలో ఉన్న గరిటెని అందుకుని పోపులో ఆవాలు ఇంకా చిటపట్లాడకుండానే దాన్ని పట్టుకెళ్ళి పులుసులో కలిపేసింది.

“ఎక్కడికీ.. ఎందుకూ..!” అని నా ప్రశ్నలింకా నోట్లో ఉండగానే పక్కనున్న గిన్నెమీద మూత తీసి చూసింది. అందులో ఇడ్లీపిండి కోసం నానబెట్టిన మినపగుళ్ళు ఉన్నాయి.

“ఇడ్లీపిండికా!…” అని నన్నడుగుతూనే చొరవగా ఆ గిన్నెని ఓ మూలకి పెట్టేసి, పక్కనున్న పాలగిన్నె పట్టికెళ్ళి ఫ్రిజ్‌లో పెట్టేసింది.

“ఎక్కడికమ్మా తల్లీ..” అంటూ ఆవిడ చెయ్యి ఇంకో గిన్నెమీదా పడకుండా గట్టిగా పట్టుకుని అడిగేను.

“నీకింకా తెలీదా! వాట్సప్‌లో అన్ని గ్రూప్స్ లోనూ ఈ మెసేజ్ వచ్చిందే..” అంది.

“ఏవిటది” ఈసారి కాస్త గట్టిగా అడిగేను.

“దారిలో చెప్తాను కానీ, నీకు వెంకటలక్ష్మి తెల్సు కదా! ఓసారి ఆవిడ దగ్గరికి తీసికెళ్ళు.”

“ఎందుకూ! అయినా ఆవిడ ఆఫీసుకెళ్ళే హడావిడిలో ఉంటుంది ఇంత పొద్దున్నే.”

“అందుకే ఇంత పొద్దున్నే వచ్చేను. ఆవిడ ఆఫీసుకి ఇంకా వెళ్ళకుండానే వెళ్ళి ఆవిడ చేత గాజులు వేయించుకోవాలి. ఇవిగో.. ఆవిడ దగ్గర ఉంటాయో ఉండవోనని గాజులు కూడా తెచ్చుకుని వచ్చేను.”

అభయాంబక్కయ్య మాటలు నాకస్సలు అర్థం కాలేదు. తెల్లబోయి చూస్తున్న నన్ను చూసి అక్కయ్య

“నువ్వు వాట్సప్ గ్రూప్‌లో చూడలేదా!” అని ఎదురు అడిగింది.

మనలని అడక్కుండా చాలామంది వాళ్ల వాట్సప్ గ్రూపుల్లో మనల్ని చేర్చేస్తుంటారు. అలా నన్ను కూడా చాలామంది చేర్చారు. అలాంటివి చూసినప్పుడల్లా నేను ఆ గ్రూపుల్లోంచి బైటకి వచ్చేస్తుంటాను. మరి ఈ అభయాంబక్కయ్య చెప్పిన సంగతి ఏ గ్రూప్‌లో ఎప్పుడు వచ్చిందో నాకెలా తెలుస్తుందీ! తెలిసినా నేను అలాంటివేమీ నమ్మను కూడా.

కోపంగా ఉన్న నా మొహం చూసి అక్కయ్య కాస్త తగ్గింది.

“ఒక్కడే కొడుకున్న అమ్మలు.. ఇద్దరు కొడుకులున్న అమ్మల దగ్గరకెళ్ళి వాళ్ల చేత గాజులు వేయించుకోవాలని పండితులు చెప్పేరు. అలా చెయ్యకపోతే చెడు జరుగుతుందిట. గ్రూపులన్నీ గోలెట్టేస్తుంటే నువ్విలా నిమ్మకి నీరెత్తినట్టు తీరుబడిగా వంటలు చేసుకుంటున్నావేంటీ!” అంది.

సంగతి అర్థమైన నేను,

“అలా బోల్డు చెప్తుంటారు అక్కయ్యా. అదిగో పులంటే ఇదిగో తోకంటారు. అన్నీ నమ్మకూడదు”

అక్కయ్యకి నెమ్మదిగానే నచ్చచెప్దామనుకున్నాను.

“అబ్బెబ్బే.. అలా కొట్టిపడెయ్యకు. ఏ పుట్టలో ఏ పాముందో.. నాకూ ఒకడే కదా పిల్లాడూ.. మొన్నామధ్య మీ పక్కవాటాలో ఉండే వెంకటలక్ష్మిగారు అమీర్‌పేటకి మారిపోయేరు కదా.. ఆవిడకి ఇద్దరు కొడుకులు కదా.. నువ్వు నన్ను గాజులు వేయించుకుందుకు ఆవిడ దగ్గరకి తీసికెడతావని వచ్చేను. మళ్ళీ ఆవిడ ఆఫీస్‌కి వెళ్ళిపోతుందని ఇంత పొద్దున్నేవచ్చేను. ఇంకాలస్యం చెయ్యకుండా బయల్దేరు, ప్లీజ్.” అంటూ హడావిడి పెట్టేసింది.

అభయాంబక్కయ్య మూర్ఖత్వానికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు.

నాకు ఇలాంటి నమ్మకాలేం లేవు. అది తెలిసి కూడా ఈవిడ నన్ను సాయం రమ్మంటోందంటే ఏం చెప్పాలీ!

“నేను రాను. నువ్వు కూడా ఇలాంటివి నమ్మకుండా ఉంటే బాగుంటుంది.” నెమ్మదిగానే అన్నాను.

అభయాంబక్కయ్య గొంతు హెచ్చింది.

“నాకు తెల్సు నీ సంగతి. నీమీద ఏదో ఇంత ప్రేముండి వచ్చేననుకోకు. మీ అమ్మగారంటే నాకు చాలా గౌరవం. కొత్తగా నేను కాపరం పెట్టినప్పుడు ఆవిడే నాకు ఇలాంటి మంచీచెడ్డా అన్నీ చెప్పేవారు. నీతో నేను వాదించలేను కానీ, నన్ను తీసికెళ్ళు తల్లీ.” అంటూ హడావిడి పెట్టేసింది.

నేను నడుంలో దోపిన కొంగుని బైటకి తీసి, ‘నీ లెఖ్ఖ నా కేమిటన్నట్టు’ పమిటని దులుపుకుంటూ వంటింట్లోంచి బైట కొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాను.

నన్ను ఇంక ఎలా ఒప్పించాలో అర్థం కాలేదేమో పాపం.. “చూడు స్వర్ణా. ఇది చేస్తే లాభం ఉన్నా లేకపోయినా నష్టమేమీ లేదు కదా! ఒకసారి వెళ్ళి గాజులు వేయించుకు వచ్చేస్తాను. కాస్త సాయం రా..” అంది బతిమాలుతూ.

నాకు అక్కయ్యని చూస్తే జాలేసింది.

“వీటిని మూఢనమ్మకాలంటారు అక్కయ్యా. వీక్ మైండెడ్ వాళ్ళు ఇలాంటివన్నీ పట్టించుకుంటారు. వీటికి రీజనింగ్ ఉండదు” అక్కయ్యకి నచ్చచెప్పడానికి ప్రయత్నించేను.

“ఎందుకుండదూ! మొన్నటికి మొన్న ఏమైందో తెల్సా!”

సీరియస్‌గా చెప్పడం మొదలు పెట్టింది.

“మా ఎదురు ఫ్లాట్ సులోచన లేదూ.. అదీ వాళ్ళాయనా బాగా దెబ్బలాడేసుకున్నారు. మరో కురుక్షేత్రమే అనుకో. మొత్తం కాంప్లెక్స్ అంతా హోరెత్తి పోయిందనుకో వాళ్ళ అరుపులతో. ఎప్పుడూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, చిల్లోబొల్లో మనుకుంటూ ఉండే వాళ్ళిద్దరూ అలా దెబ్బలాడుకోవడం చూసి మాకు చాలా ఆశ్చర్యమేసింది. అప్పుడు టూ నాట్ ఫైవ్‌లో ఉండే సరోజ నన్నూ, సులోచననీ శాస్త్రాలని విడమర్చి చెప్పే ఒకావిడ దగ్గరికి తీసికెళ్ళింది. ఆవిడ చెప్పింది అసలు కారణం. ఇంతకీ ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ మొగుడూ పెళ్ళాలు అంతలా పోట్లాడుకోడానికి కారణం ఏంటో తెల్సా!” ఊరిస్తున్నట్టు నా వైపు చూసింది అక్కయ్య.

కుతూహలంగా ముందుకి వంగాను నేను.

“ఆ సులోచన మెళ్ళో మంగళసూత్రాలు ముడేసుకున్న గొలుసు పొట్టిగా ఉండి ఆమె గుండెల దాకానే వస్తోందిట. అందుకే ఆమె కాపరం గుండెలమీద భారంలా అయిపోయి మొగుడూ పెళ్ళాలు పోట్లాడుకుంటున్నారుట. అదే కనక ఆ గొలుసు బాగా పొడుగ్గా పొట్ట మీదకి వచ్చేలా వేసుకుంటే కడుపు చల్లగా ఉండి ఇంక ఏ గొడవలూ రావుట. ఆవిడ అలా చెప్పగానే సులోచన బంగారం కొట్టుకి వెళ్ళి పొడుగు గొలుసు కొనుక్కుంది. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా ఉన్నారనుకో” తన్మయత్వంగా చెపుతూ, ఊపిరి పీల్చుకుందుకు ఆగింది అక్కయ్య.

“అక్కయ్యా, బంగారం గొలుసులోనే వేయించుకోవాలా.. ఇమిటేషనూ, వెండీ, రాగీ గొలుసుల్లో కూడా వేయించుకోవచ్చా!” ఎగతాళిగా అడిగేను అక్కయ్యని.

“నీ మొహం. మంగళసూత్రాల గొలుసు బంగారంతోనే చేయించుకుంటారు. ఆ మాత్రం తెలీదూ!” అంది అక్కయ్య నా అజ్ఞానానికి జాలిపడుతూ.

ఆహా.. ఏ బంగారం కొట్టువాడికి వచ్చిందో ఈ ఆలోచన..

మనుషుల సెంటిమెంట్ మీద ఇంతలా వ్యాపారం చేస్తున్న వాళ్ళ ఆలోచనకి మెచ్చుకోకుండా ఉండలేకపోయేను.

“అవునూ..ఇంతకీ.. నీ గొలుసెంత పొడుగుందీ!” నా మెడ వైపు అనుమానంగా చూసింది అక్కయ్య.

వార్నాయనో.. ఇంతగా మండిపోతున్న ఈ బంగారం ధరలతో కొత్త గొలుసు చేయించుకోమని అక్కయ్య ఎక్కడ గొడవ పెడుతుందోనని ఖంగారు పడి, కొంగు మెడ చుట్టూ కప్పుకుంటూ,

“అక్కయ్యా, నేనైతే రాను. నిన్ను కూడా వెళ్ళొద్దనే చెపుతాను. ఆ పైన నీ ఇష్టం.” అని ఖచ్చితంగా చెప్పేసి అక్కణ్ణించి లేచిపోయేను.

నా మొండితనం తెలిసిన అభయాంబక్కయ్య “నిన్నడగడాని కొచ్చేను చూడూ.. అందుకు నన్ననాలి.. నేనే పోతానమ్మా, నువ్వేం రావఖ్ఖర్లా.. కనీసం అడ్రసైనా సరిగ్గా చెప్పు.. మళ్ళీ ఆ వెంకట లక్ష్మి ఆఫీసు కెళ్ళిపోతుందేమో ” అంటూ నా దగ్గర అడ్రసు తీసుకుని రుసరుస లాడుతూ వెళ్ళిపోయింది.

అక్కయ్య వెళ్ళాక ఈ విషయం వదినకి చెపితే ఎలా రియాక్ట్ అవుతుందోననే ఆలోచన వచ్చింది నాకు.

వెంటనే వదిన అనబోయే డైలాగ్ నాకు నేనే చెప్పేసుకున్నాను.

“అయ్యో స్వర్ణా, ఎంత మంచి ఛాన్స్ వదిలేసుకున్నావ్. అదే నేనయితే ఏం చేస్తానో తెల్సా!

వెంటనే ఇద్దరు కొడుకులున్న అమ్మలను పట్టుకుంటాను. వాళ్లకి కొంత కమీషన్ ఇచ్చి ఒక్క కొడుకున్న ఇలాంటి అమ్మల్ని వాళ్ల దగ్గరికి తీసికెడతాను. గాజులు కూడా నేనే హోల్‌సేల్‌లో కొనేసి, వీళ్లకి రీటైల్‌లో అమ్మితే ఇంతకింత లాభం వచ్చేస్తుంది. అంతే కాకుండా ఇప్పటికిప్పుడు ఇంతంత ధరల్లో మంగళసూత్రాలు కట్టుకుందుకు అందరూ పొడుగ్గా ఉన్న బంగారం గొలుసు కొనుక్కోలేరు కనక ఇమిటేషన్ గొలుసులు చార్మినార్ దగ్గర కొనేస్తాను. చాలా చవగ్గా వస్తాయి. అవి వీళ్ళకి ఒక్కొక్కరికీ అమ్మితే బోలెడు లాభం. చూసేవా.. నీలా ముద్దపప్పులా కాకుండా నాలా ఆలోచిస్తే మనకి తెలిసినవాళ్లతోనే బిజినెస్ చేసి డబ్బులు సంపాదించేసుకోవచ్చు. ఈసారి పండక్కి ఈ లాభాలతోనే పట్టుచీర కొనేసుకోవచ్చు.. ఏమంటావ్..!”

నిజమే కదా! వదిన ఎంతకైనా సమర్థురాలే.. ఆలోచిస్తున్నకొద్దీ నాకు ఒకటే నవ్వొచ్చేస్తోంది. నవ్వుకుంటూ పనిలో పడిపోయేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here