వడ్రంగి పిట్ట – కొబ్బరి చెట్టు

0
2

[dropcap]సి[/dropcap]రిపురంలో ఉండే నందయ్యకు సోము, వేణు కొడుకులు. పెద్దవాడైన సోము మహా బద్ధకస్తుడు. ఎప్పుడూ తిని, పడుకుని పగటి కలలు కనడం వాడి అలవాటు. వేణు మటుకు కష్టపడే రకం. పొలం పనులు చూసుకోవడమే కాకుండా కుక్కల్ని, పక్షుల్ని, కోతుల్ని ఆప్యాయంగా చూస్తూ వాటికి తిండి నీళ్ళు పెట్టేవాడు. పొలం పని అయ్యాక పక్కనున్న చిట్టడివికి వెళ్ళి అక్కడ ఉన్న చిన్న జంతువులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఎండిపోతున్న చెట్లకు నీళ్ళు పోస్తూ ఎంతో ఆనందం పొందేవాడు!

ఇలా ఉండగా సిరిపురం రాజావారి అంతఃపురంలో కిటికీకి అడ్డంగా ఓ పెద్ద చెట్టు పెరిగిపోయి గాలి వెలుతురు రాకుండా చేస్తోంది! రాజు గారి సేవకులు కిటికీకి అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మల్ని కొట్టారు. అదేం చిత్రమో కానీ కొట్టేసిన కొమ్మలు రెండింతలు పెద్ద కొమ్మలుగా రెండో రోజుకే పెరిగి పోయి కిటికీకి ఇంకా అడ్డంగా రాసాగాయి! అలా ఎన్ని సార్లు కొట్టినా ఎదిగి పోతూనే ఉన్నాయి!

ఇక లాభం లేదని, ఆ చెట్టు కొమ్మలు ఎదగకుండా కొట్టిన వాడికి వంద బంగారు నాణేలు ఇస్తానని ప్రకటించాడు రాజు.. అంతే అనేక మంది చెట్టు కొమ్మలు కొట్టడానికి ప్రయత్నించినా అవి రెండో రోజుకే ఎదిగి పోతున్నాయి! ఈ విషయం నందయ్యకు తెలిసి, “మీరిద్దరూ ఆ చెట్టు కొమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించండి” అని కొడుకులిద్దరికీ చెప్పాడు.

సోమూకి బద్దకం కదా, వాడు వేణుని పిలిచి “నీవు అడవులు, తోటలు తిరుగుతుంటావు కదా, ఆ చెట్టు కొమ్మలు ఎదగకుండా కొట్టాలంటే, ఏం చెయ్యాలో ఎవరినైనా తెలివిగలవాడిని అడిగిరా” అని బద్ధకంగా పడుకుని వేణుకి సలహా ఇచ్చాడు.

సోమూ మాటలు వేణుని ఆలోచింప చేశాయి. వాడు వెళ్ళి ఆ చెట్టును పరిశీలించి వచ్చాడు. దాని కొమ్మలు చిక్కగా కిటికీ దగ్గరగా అల్లుకుని ఉన్నాయి!

చెట్టు ఎక్కి ఆ కొమ్మల్ని కొట్టాడు. అయినా అవి పెరిగి పోతున్నట్లు వింత అనుభూతిని పొందాడు. ఇక ఆ ప్రయత్నం విరమించి కిందికి దిగి వచ్చి నేరుగా అడవికి వెళ్ళి ఒక రాయి మీద దిగులుగా కూర్చున్నాడు వేణు. ‘ఎప్పుడూ ఆనందంగా ఉండే వేణు ఇలా దిగులుగా కూర్చున్నాడు ఏమిటబ్బా’ అనుకుంటూ ఓ అడవి చిలుక వేణు దగ్గరికి వచ్చి “ఏమిటి అలా దిగులుగా ఉన్నావు? సమస్య ఏమిటి?” అని అడిగింది.

“మరేం లేదు, రాజుగారి కిటికీ దగ్గర ఉన్న చెట్టు కొమ్మలు ఎంత కొట్టినా వెంటనే పెరిగి పోతున్నాయి. ఆ కొమ్మలు ఎదగకుండా కొట్టాలంటే ఏం చెయ్యాలో తోచడం లేదు” చెప్పాడు వేణు.

“ఓహో, దానికే ఇంత ఆలోచనా? నీకు అడవిలో అందరం పరిచయమే కదా! కొంచెం సేపటిలో ఇక్కడకు వడ్రంగి పిట్ట వస్తుంది. అది కొమ్మలు, బెరడు తొలచడంలో నైపుణ్యం కలది, దానిని అడుగు మంచి సలహా ఇస్తుంది” చెప్పింది అడవి చిలుక.

అనుకున్నట్టే వడ్రంగి పిట్ట వచ్చి కొమ్మ మీద వాలింది. వేణు దానికి రాజు గారి అంతఃపురంలోని చెట్టును గురించి చెప్పాడు.

వేణు తెచ్చే గింజలు, ఎండాకాలంలో ఇచ్చిన నీళ్ళను గుర్తు తెచ్చుకుని, వేణు మంచితనానికి సహాయం చేసే సమయం వచ్చిందని అది ఆలోచించింది.

“అది మహత్తరమయిన చెట్టు అయి ఉంటుంది! నేను వెళ్ళి చెట్టుతో మాట్లాడి నా వాడి ముక్కుతో ఆ కమ్మలను తొలగిస్తాను, కానీ నేను కొమ్మలు తొలచేటప్పుడు ఎవరూ చూడకూడదు, నీవు మటుకు చూడవచ్చు” చెప్పింది వడ్రంగి పిట్ట.

“అలాగే” చెప్పాడు వేణు.

రెండవరోజు వేణు రాజుగారి వద్దకు వెళ్ళి తాను కొమ్మలను కొడతానని చెప్పి, కానీ తాను కొడుతున్నప్పుడు ఎవరూ చూడకూడదని చెప్పాడు.

రాజుగారు ఒప్పుకుని తన సేవకులకు వేణు కొమ్మలు కొడుతున్నప్పుడు ఎవరూ ఉండొద్దని సూచించాడు. వడ్రంగి పిట్ట చాకచక్యంగా కిటికీకి అడ్డొచ్చిన కొమ్మల్ని కొట్టివేసింది! కొమ్మలు విరిగి నేల మీద పడిపొయ్యాయి! ఆ కొమ్మల్ని వేణు ఇంటికి తీసుకువెళ్ళి పెరడులో పాతాడు. అవి మళ్ళీ చిగురించాయి!

రాజుగారి కిటికీ వద్ద కొమ్మలు మరలా పెరగలేదు.రాజుగారు,ఆయన సేవకులు ఆశ్చర్యపోయారు.

రాజుగారు వేణు చాకచక్యాన్ని మెచ్చుకుని అదనంగా మరో వంద బంగారు నాణేలు ఇచ్చాడు.

“ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు తెలియకుండానే మనకు సహాయం చేస్తుంది, అది తెలుసుకో. బద్ధకం వదలి నీవు కూడా కష్టపడు” నందయ్య సోముతో చెప్పాడు.

రాజుగారి తోటలోని బావిలో నీళ్ళు అడుగంటి పొయ్యాయి! తోటకి చాలా దూరంలో ఉన్న బావుల్లో మటుకు పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి! తోటలో ఇతర చోట్లలో బావులు త్రవ్వించినా ఒక్క చుక్క నీళ్ళు పడలేదు!

“ఎవరైతే తోటలో తగిన చోట బావి త్రవ్వి నీళ్ళు పడేటట్టు చేస్తే, వారికి పదెకరాల భూమి ఇస్తాను” అని చాటింపు వేయినచాడు రాజు.

“నీవు ప్రయత్నించు,నీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం” అని సోముతో అన్నాడు నందయ్య.

సోము వెళ్ళి రాజుగారి ఎండిపోయిన బావిని చూసి “ఇక ఇక్కడ నీళ్ళు పడవు” అని నిరాశగా తిరిగి వచ్చాడు.

చాలామంది తోటలో అనేకచోట్ల బావి త్రవ్వడానికి ప్రయత్నిస్తే రాతి నేల కనబడింది కానీ నీటి ఊట కనబడలేదు! అందరూ నిరాశగా వెనుతిరిగారు.

“నాన్నా, నేను ప్రయత్నిస్తాను” నందయ్యతో వేణు అన్నాడు.

“ప్రయత్నించు,నీవు చేసే మంచి పనికి ప్రకృతి శక్తి తోడవుతుంది” అని దీవించి పంపాడు.

వేణు రాజుగారి తోటకి వెళ్ళి ఎండిన బావిని, ఇతరులు త్రవ్విన బావుల్ని చూసి ఎందుకైనా మంచిదని అడవికి వెళ్ళి మరలా రాతిమీద కూర్చుని ఆలోచించసాగాడు. వేణు ఆలోచిస్తున్న తీరును చూసి మరలా అడవి చిలుక వచ్చి “ఏమిటి ఆలోచిస్తున్నావు?”అడిగింది.

రాజు గారి తోట లోని బావిని గురించి చెప్పి, “ఆ బావిలో నీళ్ళు పడేట్టు చెయ్యాలంటే ఏంచెయ్యాలో అర్థం కావడం లేదు”చెప్పాడు.

“దీనికే ఇంత ఆలోచిస్తే ఎలా? ఎదురుకుండా ఉన్న కొబ్బరి చెట్టును అడుగు, ఏం చెయ్యాలో చెబుతుంది” చెప్పింది అడవి చిలుక.

దానికి కృతజ్ఞతలు చెప్పి పరుగున కొబ్బరి చెట్టు వద్దకు వెళ్ళి రాజుగారి బావి సమస్యను వివరించాడు.

వేణు ఆ కొబ్బరి చెట్టుకు అప్పుడప్పుడూ నీళ్ళు పోయడం,పాదు పెట్టడం ఎరువు వెయ్యడం కొబ్బరి చెట్టు గుర్తు పెట్టుకుంది. అతను చేసిన మేలుకు తను సహాయం చేయాలనుకుంది.

“చూడు వేణు, నావి రెండు కొబ్బరి బోండాలు కోసుకువెళ్ళి బావి లోపలికి దిగి వాటిని పగలగొట్టి బావిలో వెయ్యి. బావిలో పుష్కలంగా నీళ్ళు ఊరుతాయి. రాజుగారి తోటకు నీటి కరువు తీరి పోతుంది. కానీ నీవు చేసే పనిని ఎవరూ చూడకుండా చెయ్యి” చెప్పింది కొబ్బరి చెట్టు.

కొబ్బరి చెట్టుకి ధన్యవాదాలు తెలిపి, రెండు కొబ్బరి బోండాలు తీసుకుని రాజుగారి వద్దకు వెళ్ళి బావిలో నీళ్ళు రప్పిస్తానని, తను బావి లోకి దిగిన తరువాత ఎవరూ బావిలోకి తొంగి చూడకూడదని చెప్పాడు.

వేణు మాట ప్రకారం అందరూ బావికి దూరంగా వెళ్ళి పోయారు. వేణు బావిలోకి దిగి బోండాలను పగుల గొట్టాడు, అలా నీళ్ళు బోండాలలోనుండి పడుతూనే ఉన్నాయి. వేణు గబగబా పైకి వచ్చాడు.

బావిలో పుష్కలంగా నీళ్ళు వచ్చాయి. అవి కొబ్బరి బోండాలలో నుండి వచ్చినా స్వచ్ఛమైన తాగే మామూలు నీళ్ళ లాగే ఉన్నాయి!

రాజుగారి తోట,అంతఃపురం చుట్టు పక్కల ప్రజలకు నీటి కరవు తీరి పోయింది! రాజు గారు వేణు ప్రతిభను మెచ్చుకుని అదనంగా మరో పదెకరాల భూమి ఇచ్చాడు.

రాజు గారి కూతురు నందిని వేణు ప్రకృతి ప్రేమను, మంచితనాన్ని, శ్రమ పడే విధానాన్ని తెలుసుకుంది. అతను అన్నిటా సమర్థుడు అనే అవగాహనకు వచ్చింది.

“నాన్నా, నేను వేణుని పెళ్ళాడుతాను. అతను ప్రకృతి ప్రేమికుడు, అందుకే బావిలో నీళ్ళు వచ్చేట్టు, అనవసరపు చెట్టు కొమ్మలు పెరగకుండా చెయ్యగలిగాడు. ఎవ్వరూ చెయ్యలేని పనులు చేశాడు” అని తన మనసులోని మాట చెప్పింది.

రాజుగారు సంతోషంతో నందినిని వేణుకి ఇచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించి నందయ్యకు ఈ శుభవార్త తన మంత్రి చేత చెప్పించాడు.

నందినితో వేణు పెళ్ళి ఘనంగా జరిగింది. వేణు రాజ కుటుంబంలో ఒకడై పోయాడు.

వేణు అభివృద్ధిని చూసిన సోము కూడా బద్ధకం వదలి కష్ట పడితేనే మంచి జీవితం అని తెలుసుకుని నిద్ర వదలి పొలం పనికి బయలు దేరాడు.

(Kate Douglas Wiggin ఆంగ్ల కథకు అనుసృజన)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here