[dropcap]గ[/dropcap]ది ఒంటరితనంతో
తోడౌతాను.
శాంతి భద్రతల పరిరక్షణే
ధ్యేయమంటూ
లాఠీరెక్కలు ఝళిపిస్తూ
దోమల్నిపారద్రోల
కవాతు చేస్తూంది fan-
Tablelamp
వెలుగు నీడల్నిpaint చేస్తూంటుంది
గొప్పచిత్రాకారుడి ఏకాగ్రతతో-
గది పైకప్పేమో చీకటిదుప్పట్లోంచి
తొంగి తొంగి చూస్తూంటుంది
మధ్యతరగతి స్థబ్థతతో-
తోడుగా
గది బంధించిన గాలి
వుండుండీ వేడినిట్టూర్పుల్ని విసుర్తూంటుంది
pessimistic గా-
ఏదో స్ఫురించి
చేతులు రాతలై
అక్షరాలుగా చెక్కబడుతున్న ప్రయత్నాన్ని చూసి
కాయితంపైకి వచ్చిన
గండుచీమ
శేబాసో అంటూ
మీసాలు దువ్వుకుంటూ
గొప్ప తాత్వికుడిలా నడిచి వెళ్తుంది
తన పాదముద్రల్ని అక్షరాల వెంబడి చిత్రిస్తూ-
దోమలేమో యుద్ధోన్మాదంతో దాడి చేస్తుంటాయి
అ డు గ డు గు నా
నా ప్రయత్నాన్ని ఆటంక పరుస్తూ-
విసుగేసి విసురుగా
చువ్వల్లేని కిటికీ తలుపుల్ని ఎగరేస్తాను
ఓ గాలికెరటం
గదిని ముంచెత్తి వెళ్తుంది
కొత్త పరిమళంతో,
ఉత్సాహం ఊపిరిని శ్వాసిస్తూ
బయటికి చూస్తాను
నవ్వుల చుక్కల్నితళుక్కుమనిపిస్తూ
ఆకాశం అద్దం ముక్కలోంచి
ఎన్నల్ని focus చేస్తాడు
దిసమొల పిల్లడల్లే చంద్రుడు
దేహం దాహంతీర
దోసిళ్ళతో తోడుకుని తాగమని.