Site icon Sanchika

యువభారతి వారి ‘వాగ్భూషణం భూషణం’ – పరిచయం

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]

వాగ్భూషణం భూషణం

[dropcap]సీ[/dropcap]తను వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కింధా ప్రాంతంలో తిరుగుతున్నపుడు సుగ్రీవుని మంత్రి హనుమంతుడు ఆగంతకులైన వాళ్ళను గురించి తెలుసుకోవడానికి వెళ్లి, వాళ్ళను దర్శిస్తాడు. ఆ ప్రతిభామూర్తులను అద్భుతంగా వర్ణిస్తాడు. వారితో సంభాషించడానికి ఉద్యుక్తుడౌతాడు. అప్పుడు రాముడు హనుమంతుని వచోవిఖరిని గురించి లక్ష్మణునితో అన్న మాటలను మనం బాగా అర్థం చేసుకోవాల్సిఉంది.

ఎందుకంటే, వక్తృత్వ లక్షణాలను గురించి ఆదికవి వాల్మీకి చెప్పిన మాటలు గమనింపదగినవి, విశ్లేషించదగినవి. ఈ వక్తృత్వ కళారాధనం అక్షరాస్యులకు లక్ష్యం కావాలని, సంస్కృతీ పరిరక్షణకు పునాది కావాలన్న ఆశయంతో, ఆ కళను అలవరచుకోవాలన్న వారికి శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తిగారు తమ ‘వాగ్భూషణం భూషణం’ అనే చిన్నిపుస్తకంలో – మనందరికీ అర్థమయ్యే భాషలో చక్కగా వివరించారు.

“లక్ష్మణా! ఋగ్వేదం చదవనివాడు, యజుర్వేద పరిజ్ఞానం లేనివాడు, సామవేదం అభ్యసించనివాడు ఇంత సుందరంగా మాటలాడలేడు. పలుమార్లు యితడు వ్యాకరణ శాస్త్రాన్ని అవలోడనం చేసి ఉంటాడు. ఇది నిశ్చయం. ఎందుకంటే, ఇంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా దొరలలేదు. మాటలాడుతున్నప్పుడు కన్నులు, నుదురు, కనుబొమలు ఇంకా ఇతర అంగాలలో ఏ దోషం కూడా కనిపించలేదు. హావభావ ప్రకటనకు అనుగుణంగా అంగ సంచలనం చేస్తూ యితడు ప్రసంగించినాడు. కొద్ది మాటల్లోనే తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించినాడు..” ఇలా హనుమంతుడు మాట్లాడినప్పుడు తాను గమనించిన ఎన్నో లక్షణాలను రాముడు చెప్పాడు.

మనలో ఎవరైనా మంచి వక్తగా పేరు తెచ్చుకోవాలని అనుకున్నప్పుడు – ఈ క్రింది అంశాలపై దృష్టి పెట్టి సాధన చేయాలి.

  1. భయాన్ని, అనుమానాన్నీ వదులుకోవాలి;
  2. చక్కని పదజాలంతో పరిచయం ఉండాలి;
  3. సమానార్థకాలు, పర్యాయ వాచకాలు అంటే ఏమిటో తెలుసుకోవాలి;
  4. ముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్న అంశం గురించి విషయ సేకరణ చేయాలి;
  5. జ్ఞాపక శక్తి పెంపొందించుకోవాలి;
  6. మాట్లాడదలచిన అంశాలను ఒక చిన్న కాగితంపై రాసుకోవాలి;
  7. స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోవాలి;
  8. అద్దం ముందు నిలబడి ఆ అంశాలపై ప్రసంగించడం నేర్చుకోవాలి;
  9. సమయపాలనం పై దృష్టి పెట్టాలి;
  10. చక్కని ముగింపు ఉండాలి.

ఇలా సమగ్రమైన జ్ఞానం, పరిశుద్ధమైన భాష, సముచితమైన భావప్రకటనా రీతి, సంక్షిప్తత, స్పష్టత, ధారాశుద్ధి, స్ఫుటమైన ఉచ్చారణ, సముదాట్టమైన ఇతివృత్తం, సుమధురమూ, స్పష్తమూ ఐన స్వరసంపత్తి హనుమంతుని భాషణంలో ఉన్నాయంటాడు వాల్మీకి.

చక్కని వచోరీతి వ్యక్తిత్వానికి సమగ్రతను ప్రసాదిస్తుంది. నిద్రాణమైన మనశ్శక్తి జాగృతం కావాలంటే వక్తృత్వ కళను ఉపాసించడం ఒక సాధనం. చక్కగా, మనోజ్ఞంగా ఇతరుల మనసులకు హాయి కలిగేటట్లు, చీకటిలో దివ్వె వెలిగినట్లు, సంభాషించడం నిజంగా ఒక వరం. వక్తృత్వ కళను అలవరచుకోవాలన్న వారికి ఈ పుస్తకం చక్కని మార్గదర్శనం చేస్తుంది.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/vagbhushanam-bhushanam-iriventi-krishnamurty-1999-020-p-yuvabharati-publication-no-xxx/page/n3/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోవచ్చు.

Exit mobile version