Site icon Sanchika

వగ్గట్టు

[dropcap]”అ[/dropcap]నా… మన మోడి సారు పోయిన ఆయితారము మాపుసారి
9 గంటల 9 నిమిషాల వరకు దేశ జనాలందరూ ఇండ్లలా దీపాలు
వెలిగీయాలని చెప్పిందానికి దేశమంతా అట్లే చేసిరి. ఏల ఇట్ల చేసిరని
నాకి ఇంగా తెల్యే (అర్థము గాలే). ఇదేమో రవంత చెప్పనా” అంటా
సాకన్నని అడిగితిని.

“దీపాలు వెలిగిచ్చేకన్నా ముంద్ర కొంపల్లా లైట్లు ఆర్పమని
చెప్పే కదా?” ఎక్కాసముగ అంటా ఆడికి వచ్చె బజ్జన్న.

“నీ అట్లా లత్తనాకొడుకులు వుండేదానింకానే దేశమిట్ల అయిండేది.
దీంట్లా కూడా తప్పులు ఎదికేదేనా?” అంటా రేగే సాకన్న.

“ఓహో. నీవేరా దేశము ఉధార్కము చేసేది” అదో మాద్రిగా
అనె బజ్జన్న.

“అది ఏ గడియలా పుట్టిస్తివిరా నువ్వు” సాకన్న అన్నింది
తడువు “అదో ఆపొద్దు నువ్వు గుడిలా కూకొని గంట అల్లాడిస్తా
వుంటివి సూడి ఆ గడియలారా” అనె.

“నీ తావ మాట్లాడతాను సూడి నాది బుద్ది తక్కువ” అంటా
ఆడనింక లేసి పోయేకి సురువాయ సాకన్న.

“నాకి తెలింది తెలుసుకొందామని నేను అడిగితే
మీరిద్దరూ అర్థము, పర్థము లేకుండా పీకలాడతా వుండారు కదనా”
అంటా సాకన్నకి అడ్డం పడి “నీకి మొక్కుతానునా నువ్వు
రవంత సేపు మాట్లాడకుండా వుండునా” అంటా బేళాడితిని (బ్రతిమలాడితిని).
నేనట్ల అంటానే ఇద్రూ కలకుండా కూకొనిరి.

అందాతలికే గుడి తావ నింకా
“అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోమా అమృతంగమయ….” అనే మంత్రాలు
యినబిచ్చే. ఇది ఇంటానే నాలా ఇంగో సందేహము దూరె.
అదేమంటే యీ మంత్రాలకి అర్థము ఏమని. ఇదే మాట
సాకన్నని తిరగా అడిగితిని.

“నీ రెండు సందేహాలకి ఒగేకిత అర్థము చెప్పతానురా”
అంటా సురువు చేసే సాకన్న.

“అసత్యము నింకా సత్యానికి
మబ్బు నింకా వెలుగుకి
సావు నింకా సావేలేని తాకి (అమృతత్వం) నన్ని నడుపు
దేవుడా, అనిరా ఆ మంత్రాలకి అర్థము. ఇంగ మోడి సారు
ఇంట్లో దీపాలు పెట్టండా అన్నింది మబ్బులా నింకా వెలుగుకి
దేశ జనాలు రావాలా అనే అర్థములారా” అనె.

“ఓహో… ఇది అసలు సమాచారము” అని నేను తల
గుంకాయిస్తిని.

“మబ్బులా నింకా వెలుగులాకి రావలనా? మబ్బు
లేకుండా ఎబుడూ వెలుగే వుంటే మనిషి బతికేది ఎట్ల?
జీవిత మన్నెంకా మబ్బు, వెలుగు వుంటేనే కదా?” అంటా
బజ్జన్న తగులుకొనె.

“నిజమే కదా!” అంటా నేను సాకన్న పక్క సూస్తిని.
“నీ బజ్జమకానికి గెరిగ బజ్జర ఏసి కొట్టా, నీ ఇద్దిలు
(బుద్ధులు) నాతావ కాదు. ఇంగెవరితావైనా సూపీయి. మనిషే
కాదు బూమి మీద జీవి జీవితాలు వెలగాలంటే మబ్బు,
వెలుగూ వుండాల, రాత్రి పగలు రావాలా, బూమీ తిరగాల
ఇది ప్రకృతి దర్మము. ఈ దర్మాలనీ మనిషి అర్థము
చేసుకొని నడవాలా, అయినా ఇబుడు కావల్సింది యీ
మాటలు కాదు. ఈ నడమ బూలోక జనాలనంతా కంటికి
కనిపీయని కరోనా వైరస్ చంపి పారేస్తా వుంది కదా ఆ దిగులుని
(భయం) దీపం వెలుగులా కాల్చాలా/చంపాల అని చాటి చెప్పేకి”
ఇలావరిగా చెప్పే అన్న.

“దీపం వెలుగుకి కరోనా వైరస్ కాలిపోతుందా? సచ్చిపోతుందా?”
తిరగా అనె బజ్జన్న.

“సచ్చెల్దురా బజ్జగా, కరోనా వైరస్ అనే దిగులు
మనిషిలా నింకా సచ్చిపోతుంది. భారతీయులంతా ఒకటే
అనే వగ్గట్టు ఆ వెలుగులా కనిపిస్తుంది” అంటా ఇంటి
తావ పట్టే సాకన్న.

నేను బజ్జన్న కూడా దోవ సాగి పోతిమి.


వగ్గట్టు = ఐకమత్యం

Exit mobile version