వైద్య నారాయణీయం

    0
    1

    [box type=’note’ fontsize=’16’]నవ్య భావాలతో పవిత్ర వైద్య వృత్తికి పవిత్రత ఆపాదించాలని ప్రయత్నిస్తున్న వైద్య నారాయణులిద్దరి కథ “వైద్య నారాయణీయం”.[/box]

    ప్రముఖ టి.వి. ఛానెల్ ప్రైమ్ టైమ్‌లో “ముందడుగు” కార్యక్రమం మొదలైంది.

    “పవిత్ర వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చి డబ్బు కోసం శవాలకి సైతం… వైద్యులు కార్పోరేట్ వ్యాపారులుగా మారుతున్న ఈ రోజులలో “సేవే” లక్ష్యంగా వైద్యాన్ని సామాన్యుడికి కనీస ఖర్చుతో అందుబాటులోకి తెస్తున్నారు ఇద్దరు వైద్యనారాయణులు. వైద్యం పట్ల ప్రజల్లో నానాటికి పెరిగిపోతున్న భయాల్ని తొలగిస్తూ, అవగాహన కల్పిస్తూ ‘రోగి వద్దకే వైద్యం’ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ యువ డాక్టర్లిద్దరూ మన ముందడుగు కార్యక్రమాని కొచ్చారు” అని చెప్పి, “నమస్కారం” అంది టి.వి. యాంకర్.

    “నమస్కారం” అన్నారిద్దరూ.

    “మీరిద్దరూ క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్ కదా! మీ వృత్తిలో సారూప్యం లాగే మీ పేర్లూ… సారూప్యంగా వున్నాయి. యాదృచ్ఛికమా? లేక కావాలనే…”

    “జస్ట్ కోయిన్సిడెన్స్… నా పేరు రామ్ నారాయణ… ఫిజీషియన్‌ని.”

    “నా పేరు లక్ష్మీ నారాయణ… సర్జన్‍ని.”

    “మనిషికి అత్యంత ముఖ్యమైన విద్య, వైద్యాల్ని కార్పోరేట్ వ్యాపారంగా మార్చుకుని కోట్లు దండుకుంటున్న ఈ రోజుల్లో మీరిద్దరూ నిస్వార్థంగా, సేవే లక్ష్యంగా వృత్తి ధర్మాన్ని పాటించడానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు?” అంది యాంకర్.

    “లక్ష్యం ఉన్నవాళ్ళకి లక్షలతో పనిలేదు. ఇలాంటి వాళ్ళు విలువలతో ఇలాగే బ్రతకాలనుకుంటారు. కానీ ఎలాగైనా బ్రతికేయచ్చు. ఎవరేమనుకుంటే నాకేంటి? అనుకునే వాళ్ళకి లక్షల పైనే లక్ష్యం… కోట్లపైనే గురి… ఇలాంటి వాళ్ళతోనే సమాజం నిండిపోతోంది. ఇలాగే బ్రతకాలి అనుకునే వాళ్ళు సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు. దీనికి ఇన్‌స్పిరేషన్, రోల్ మోడల్‌లతో పన్లేదు. ఎవరికి వాళ్ళు పొందే స్ఫూర్తే… శాశ్వతంగా ఉంటుంది. ఇన్‌స్పిరేషన్ అంటే మరొకర్ని ఇమిటేట్ చెయ్యటమే కదా!” అన్నాడు రామ్ నారాయణ.

    “మీరేమంటారు లక్ష్మీ నారాయణ గారూ! ఇన్‌స్పిరేషన్ అంటే ఇమిటేషన్ అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా?”

    “ఖచ్చితంగా… ఏకీభవిస్తాను. చూడండి. వివేకానందుడిలా నేతాజీ లేడు. అబ్దుల్ కలాంని, మదర్ థెరెస్సాతో పోల్చలేం. ఎం.ఎస్. సుబ్బలక్ష్మిని ఎ.ఆర్.రెహ్మాన్‌తో కంపేర్ చెయ్యలేం. ఎవరి రంగంలో వాళ్ళు నిష్ణాతులే. ఇలాంటి వారిని ఒకరితో ఒకర్ని పోల్చలేం. వీళ్ళందరిదీ సెల్ఫ్-మోటివేషన్” అన్నాడు లక్ష్మీ నారాయణ.

    “మీ బాల్యం, చదువుల గురించి వివరిస్తారా?”

    “ష్యూర్” అన్నారిద్దరూ.

    “మానవత్వానికి నవ్యత్వాన్ని జోడించి, వినూత్నంగా ఆలోచించి సామాన్యుడికి అందుబాటులో ఉంటూ వైద్యాన్నందిస్తున్న ఈ వైద్యనారాయణుల బాల్యవిశేషాల గురించి తెల్సుకునే ముందు… చిన్న బ్రేక్” అంది యాంకర్.

    ***

    “వెల్‌కం బ్యాక్… ప్రజల వద్దకే వైద్యం అంటూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన ఈ యువ డాక్టర్లు తమ బాల్య విశేషాలన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా…”

    “రామ్ నారాయణ గారూ! మీ బాల్యం, కుటుంబ నేపథ్యం, ఎడ్యుకేషన్ గురించి వివరిస్తారా?” అంది యాంకర్.

    “మాది విజయనగరం సమీపంలో భోగాపురం. మా నాన్న శివయ్య రోజు కూలి. మా అమ్మ సరోజ. నేను ఎనిమిదో తరగతి వరకూ అక్కడే చదువుకున్నాను. మా ఊళ్ళో మా నాన్నకి కూలిపన్లు సరిగా దొరక్కపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే హైదరాబాదొచ్చి ఉంటున్న మా బంధువుల సలహాతో హైదరాబాదొచ్చాం.

    మా నాన్నకి ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్ ఉద్యోగం దొరికింది. నెలకి రెండు వేల జీతం, ఉండడానికి గది ఇచ్చారు. పగలు మా నాన్న కూలిపన్ల కెళ్ళేవాడు. అమ్మ అపార్ట్‌మెంట్ పన్లు చూస్తూ, నాలుగు ఫ్లాట్‌లలో అంట్లు తోమేది. నేను గవర్నమెంటు స్కూల్లో తొమ్మిదో తరగతిలో చేరాను. ఉదయాన్నే లేచి సైకిల్ మీద ఇంటింటికి న్యూస్‌పేపర్స్ వేసి, నా పుస్తకాలకి కొంత డబ్బు సంపాదించేవాడిని.

    అపార్ట్‌మెంట్‌లో తొమ్మిదో తరగతి చదివే నా వయసు పిల్లలిద్దరున్నారు. వాళ్ళు సిటీలో మంచి కాన్సెప్ట్ స్కూల్లో చదివేవాళ్ళు. ఎప్పుడూ ఇంగ్లీష్‍లోనే మాట్లాడేవాళ్ళు. నాకు కొంత అర్థమయినా, బదులు మాట్లాడడం తెల్సేది కాదు. వాళ్ళు రాజేష్, సెకండ్ ఫ్లోర్‍లో ఉంటున్న డాక్టర్ మృదుల గారబ్బాయి. సురేష్ థర్డ్ ఫ్లోర్‌లో ఉండే బ్యాంక్ ఆఫీసర్ రామ్మోహన్ గారబ్బాయి. నేను చదివే స్కూల్లో అందరూ తెలుగే మాట్లాడే వాళ్ళు. నాకెలాగైనా ఇంగ్లీష్‌లో మాట్లాడాలనుండేది. మాకు సైన్సు చెప్పే శంకర్ సారు నాతో చనువుగా ఉండేవారు. ఆయనే నా డౌట్లన్నీ క్లియర్ చేసే ఆయన. నా స్పోకెన్ ఇంగ్లీష్ కోరిక గురించి సార్‌కి చెప్పాను.

    “చూడరా! నువ్వు తెలుగు మీడియంలో చదువుతున్నందుకు ఫీలవ్వక్కర్లా! ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళంతా మహా మేధావులేం కాదు. మాతృభాషలో చదువుకుని అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వాళ్ళెంతో మందున్నారు. ప్రపంచ దేశాలు గుర్తించిన సైంటిస్టుగా ఎదిగి, దేశానికి రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం మారుమూల పల్లెటూళ్ళో మాతృభాషలో చదువుకున్న వ్యక్తే. నీలో టాలెంటుంది. హైదరాబాద్ వచ్చిన ఆరు నెలల్లో హిందీలో మాట్లాడడం నేర్చుకున్న నీకు, ఇంగ్లీష్‌లో మాట్లాడడం కష్టంగాదు. మనసు పెట్టాలంతే” అని నన్ను ఎంకరేజ్ చేసి, సార్ నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ, తప్పొప్పులు సరిదిద్దేవారు. రోజూ నాతో ఇంగ్లీష్ న్యూస్‌పేపర్ చదివించేవారు. పదో తరగతికి వచ్చేసరికి నాకు తెలియకుండానే నాలో ‘ఇంగ్లీష్‌లో మాట్లాడగలను’ అనే కాన్ఫిడెన్స్ వృద్ధయింది.

    రాజేష్, సురేష్ ఇద్దరూ ట్యూషన్ల కెళ్ళే వాళ్ళు.

    ఓ రోజు సెల్లార్‌లో కూచుని చదువుకుంటున్న నన్ను చూసి నా దగ్గర కొచ్చి, “మ్యాథ్స్ బాగా చేస్తావా?” అనడిగారు.

    “చేస్తాను”

    “రేపు మాకు స్కూల్లో ఎగ్జాముంది. మ్యాట్రిక్స్‌లో రెండో చాప్టరు సరిగా అర్థం కావడం లేదు… చెప్తావా?” అన్నారిద్దరూ.

    వాళ్ళిద్దరికీ మ్యాట్రిక్స్ చెబుతున్న సమయంలో రాజేష్ వాళ్ళమ్మ డాక్టర్ మృదుల ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చింది. సెల్లార్‌లో మా ముగ్గురినీ చూసి, “ఏం చేస్తున్నారిక్కడ?” అంది.

    “ఏం లేదు మమ్మీ! వీడు మ్యాథ్స్‌లో డౌట్సు అడిగితే చెప్తున్నాం” అన్నాడు రాజేష్.

    నేను వెంటనే “డోన్ట్ టెల్ లైస్… నో మేడం. హి గాట్ డౌట్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ రిక్వెస్టెడ్ మి టు క్లియర్… సో… ఐ యామ్…” అని నేను ముగించే లోపలే… డాక్టరమ్మ కోపంగా వచ్చి రాజేష్‌తో…

    “నువ్వు చదివే స్కూలేంట్రా! వీడు చదివే స్కూలేంట్రా! నీకు డౌట్స్ రాకూడదనే వేలకి వేలు పోసి ట్యూషన్లు చెప్పిస్తుంటే… పోయి వీణ్ణి డాట్స్ అడుగుతున్నావా? ముందివతలికి రా!” అని రాజేష్‌ని తిట్టి లాక్కెళ్ళింది.

    ఎందుకో అప్పట్నించీ ఆమె నన్ను చూసినా, నేను చదువుకుంటూ ఆమె కంటబడ్డా చిరాకు పడుతూ, ఏదో ఒక పని చెప్పడం లేదా కారు తుడవమనడం, షాపుకెళ్ళమనడం లాంటి పన్లు చెప్పడం మొదలుపెట్టేది. ఆమె కావాలనే తన కొడుకుని నాతో పోల్చుకుంటూ, నన్ను డిస్టర్బ్ చేస్తోందని అర్థమయింది. అయినా ఆమె చెప్పే పన్లన్నీ చేసేవాణ్ణి.

    ఆ రోజు అర్ధరాత్రి…”

    “ఏం జరిగిందో… చిన్న బ్రేక్ తరువాత తెల్సుకుందాం” అంది యాంకర్.

    ***

    “ఇప్పుడు చెప్పండి రామ్ నారాయణ గారూ!… ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగింది?

    “రాత్రి పన్నెండయ్యింది. నేను సెల్లార్‍లో కూచుని చదువుకుంటున్నాను. మా అమ్మ గుండె నొప్పి అని మూల్గుతూ, బాధతో మెలికలు తిరుగుతోంది. మా నాన్న కంగారుగా నన్ను పిలిచి, “పైన డాక్టరమ్మ దగ్గరకెళ్ళి… మాత్రియ్యమని తీసుకురా!” అని పంపాడు.

    నేను వేగంగా సెకండ్ ఫ్లోరుకి పరుగెత్తి, డాక్టరమ్మ గారింటి కాలింగ్ బెల్ నొక్కాను. డాక్టరమ్మ భర్తొచ్చి తలుపు తీశాడు. విషయం చెప్పాను. ఆయన లోపలికెళ్ళి, ఆమెతో చెప్పిన పదిహేన్నిమిషాలకి, విసుగ్గా క్రిందకొచ్చి మా అమ్మని చూసి… ‘దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్ళండని’ ఉచిత సలహా ఇచ్చి వెళ్ళింది.

    ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే కిషోర్ గారు అమ్మని కార్లో ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ‘గ్యాస్ట్రిక్ పెయిన్’ అని మాత్రిచ్చి పంపారు.

    మరుసటి రోజు మా అమ్మని చూసి ‘ఎలా ఉన్నావని’ కూడా డాక్టరమ్మ అడగలేదు. మా నాన్నే వెళ్ళి ఆమెకి చెప్పాడు.

    ఆ సంవత్సరం పదో తరగతిలో నాకొచ్చిన మార్కులు (600కి 578) అపార్టుమెంట్ వాళ్ళ దృష్టే కాదు… కార్పోరేట్ కాలేజీల దృష్టి కూడా నా వైపు చూసేలా చేశాయి. న్యూస్ పేపర్లలో నా గురించి రాశారు, టి.వి.లో నన్ను చూపించారు.

    నారాయణగూడలో ఉన్న ఓ ప్రైవేటు కార్పోరేట్ కాలేజీవాళ్ళు ఇంటర్మీడియట్ రెండేళ్ళు ఉచితంగా చదివిస్తామని ముందుకొచ్చారు. నాకు ఇష్టమైన బై.పి.సి. గ్రూపు తీసుకున్నాను. డాక్టర్నవుతానన్న కల నెరవేరుతుందో లేదో కానీ అందుకు కావల్సిన తొలి అడుగు మాత్రం వేశాను. అపార్ట్‌మెంట్లో ఉండే కిషోర్ గారు కాలేజీ వాళ్ళతో మాట్లాడి, నాకు హాస్టల్ ఏర్పాటు చేశారు.

    టాపర్స్ బ్యాచ్‌లో ఉన్న నన్ను ఆ రోజు ప్రిన్సిపల్ తన గదికి రమ్మంటే వెళ్ళాను.

    సరిగ్గా ఆ సమయంలో ప్రిన్సిపల్ గదిలో రాజేష్, వాళ్ళమ్మ మృదుల ఉన్నారు. వాళ్ళ మాటలు వినిపించి నేను బయటే నిలబడ్డాను.

    “మేడం మీ అబ్బాయికి మాథ్స్‌లో 86%, సైన్సులో 70% మార్కులున్నాయి. ఎం.పి.సి. గ్రూపులో చేరుస్తారా?” అడిగారు ప్రిన్సిపాల్.

    “లేదండీ! బై.పి.సి.లోనే చేర్చాలనుకుంటున్నాం”.

    “సైన్సు కంటే మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులొచ్చాయి గదా!”

    “కావచ్చు. కానీ మావాడు బై.పి.సి.లోనే చేరతాడు.”

    “మెడిసిన్ చదివిస్తారా?”

    “అవును”

    “రాజేష్! మెడిసిన్ ఇంట్రస్టా?” ప్రిన్సిపాల్ రాజేష్‌ని అడిగారు.

    “లేదు సార్! నేను ఎం.పి.సి.లోనే చేరతా!”

    “నోర్ముయ్! చెప్పినదంతా విని మళ్ళీ మొదటి కొస్తావేంటి?” అందామె కొడుకుని కోపంగా చూసి.

    “అతన్ని చెప్పనివ్వండి మేడమ్.”

    “వాడు చెప్పేదేం లేదండీ! వీణ్ణి మెడిసిన్ చేయించాలని మేం నిర్ణయించుకున్నాం.”

    “కరక్టే! అతనికి ఇంట్రస్టుండాలిగా!”

    “క్రియేట్ చేస్తారనే మీ దగ్గరికి తీసుకొచ్చింది. పోయిన సంవత్సరం మీ కాలేజీకి మెడిసిన్‌లో ఎక్కువ ర్యాంకులొచ్చాయి. అందుకే వచ్చాం.”

    “ఓకె. కాదనడంలేదు. ఎందుకైనా మంచిది… ఒకసారి ఆలోచించండి.”

    “ఆలోచించడానికేం లేదండీ! మా రాజేష్‌కి మెడిసిన్‌లో సీటొచ్చేలా చదివించాల్సిన బాధ్యత మీదే… ఎంత ఖర్చయినా పర్లేదు. స్పెషల్ క్లాసులే పెడతారో, స్పెషల్ కోచింగే ఇస్తారో మీ ఇష్టం.” అందామె ధనదర్పంతో.

    “అలా కాదండీ! పిల్లల అభిరుచికీ అవకాశం ఇవ్వాలిగా!”

    “ఏమిటండీ! వాడి అభిరుచి. ఎం.పి.సి. తీసుకుని ఇంజనీరింగ్ చదువుతాడు. రోజుకో ఇంజనీరింగ్ కాలేజీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చదివేవాళ్ళు తక్కువై, సీట్లు ఎక్కువై ఖాళీగా పడుంటున్నాయి. రేపు వీడు ఇంజనీరయ్యే సరికి వీధికో ఇంజనీరింగ్ కాలేజీ వస్తుంది. ఒకవేళ మీకు వీలు కాదంటే చెప్పండి, మరో కాలేజీలో చేరుస్తాను” అందామె.

    ఆ పై ప్రిన్సిపాల్ మాట్లాడకుండా రాజేష్‌కి అడ్మిషన్ ఇచ్చాడు. రాజేష్‌ని హాస్టల్లో చేర్చారు. రాజేష్ మా బ్యాచ్ కాదు. కాలేజీలో ఎప్పుడైనా కల్సినా మాట్లాడేవాడు కాదు.

    హాలిడే రోజు ఇంటికొచ్చినప్పుడు… రాజేష్ వాళ్ళమ్మగారు నన్ను ఇంట్లోకి పిలిచి… “నువ్వు టాపర్స్ బ్యాచ్‌లో ఉన్నావట గదా! మీకు స్పెషల్ కోచింగ్ ఇస్తారట గదా! మా రాజేష్‌కి కూడా మీకు చెప్పే క్వశ్చన్ బ్యాంక్ ప్రశ్నలు చెప్పు…” అంటూ వెంబడించేది. నేను చెప్పినా అవి రాజేష్‌కి అర్థమయ్యేవి కావు. రాజేష్‌ని చూసి… ఆమెకి కోపం వచ్చేది. నా ముందే వాడితో… “చూడరా! వాచ్‌మన్ కొడుకు, తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్లో చదివి, టాపర్స్ బ్యాచ్‌లో ఉన్నాడు. నీకు ఏం తక్కువ చేశాన్రా!” అంటూ వాణ్ణి తిట్టేది.

    దసరా సెలవలకి అపార్ట్‌మెంట్లో అమ్మానాన్నల దగ్గర కొచ్చాను. ఆ రోజు రాత్రి కుండపోతగా వర్షం కురుస్తోంది.  నేను సెల్లార్‌లో కూర్చుని మోడల్ పేపర్లు ఆన్సర్ చేస్తున్నా. రాత్రి పదకొండు అయ్యింది. ఉన్నట్టుంది మా అమ్మకి మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. వొళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అపార్ట్‌మెంట్లో కిషోర్ గారు ఊరెళ్ళారు. మళ్ళీ డాక్టరమ్మని డిస్టర్బ్ చెయ్యాల్సొచ్చింది. నన్ను చూడగానే ఆమెకి నా చదువు గుర్తొచ్చింది గాబోలు… అసహనాన్నంతా మొహంలోనే చూపిస్తూ… “మీకిదే పనైపోయింది… రాత్రిళ్ళు దెయ్యాల్లా వెంబడిస్తున్నారు. వస్తా పద!” అంటూ పావుగంట తర్వాతొచ్చి, అమ్మని చూసి, గ్యాస్ట్రిక్ నొప్పే అని చెప్పి అంతకుముందిచ్చిన టాబ్లెట్ వేసుకోమని చెప్పెళ్ళింది. అయినా నొప్పి తగ్గలేదు. ఈసారి నాన్న డాక్టరమ్మ ఇంటి కెళ్ళాడు. డాక్టరమ్మ తలుపు తీసి “రాత్రిళ్ళు డిస్టర్బ్ చెయ్యద్దు… తగ్గకపోతే ఆస్పత్రికి తీసుకెళ్ళండి” అని మొహం మీదే తలుపేసింది. వర్షం పడుతోంది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే రవీంద్రగార్ని రిక్వెస్ట్ చేసి ఆయనొచ్చి ఆ వర్షంలో అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్ళేసరికి వాళ్ళు చూసి, “బ్రాట్ డెడ్” అని డిక్లేర్ చేశారు.

    మర్నాడు ఉదయం డాక్టరమ్మ కిందకొచ్చి సంతాపం తెలుపుతుంటే… ‘దేవుళ్ళు – దెయ్యాలు’ గుర్తొచ్చారు నాకు.

    అంతే! నాన్న వాచ్‌మన్ ఉద్యోగం మానేసి, మా ఊరెళ్ళిపోయాడు. నేను హాస్టల్‌ కెళ్ళిపోయాను.”

    “ఆ తర్వాత రామ్ నారాయణగారి జీవితం ఎలా మలుపు తిరిగిందో చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం”… యాంకర్ బ్రేక్ ఇచ్చింది.

    ***

    “ఎలాగైనా డాక్టర్నవ్వాలన్న పట్టుదల రోజు రోజుకీ పెరగసాగింది. నా పట్టుదల, కృషికి మా అమ్మ పై నుండి ఆశీస్సులు పంపింది కాబోలు… ఎంసెట్లో 209 ర్యాంకు వచ్చింది. గాంధీ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది.

    నా చదువుకి పునాది వేసిన అపార్టుమెంటుకెళ్ళి అందర్నీ కలిశాను. అందరూ అభినందిస్తుంటే… ‘కంగ్రాట్స్’ అని డాక్టరమ్మ నా మొహం మీదే తలుపేసింది. ఎందుకంటే రాజేష్ ఇంటర్ రెండో సంవత్సరం ఎగ్జామ్స్ క్లియరవలేదు. డాక్టరమ్మని చూడగానే నాకు మరోసారి ‘దేవుడు – దెయ్యం’ గుర్తొచ్చారు.

    నాలుగేళ్ళు తపస్సులా చదివి ఎం.బి.బి.ఎస్ మెరిట్లో పాసై, ప్రమాణం చేసి డిగ్రీ తీసుకుంటుంటే మనసంతా మా అమ్మే నిండిపోయింది.

    నా వల్ల మరొకరి ప్రాణానికి హాని కలగకూడదని… ఆ విషయం నాకు ఎల్లప్పుడూ గుర్తుండేలా నాకు నేనే ఓ మంత్రం రాసుకున్నాను.”

    భగవంతుడా! ఇతరుల అనారోగ్య పరిస్థితిపై నా వృత్తి, భుక్తి ఆధారపడి ఉండటం విచారకరం. అయితే వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బృహత్తరమైన అవకాశాన్ని నాకు ప్రసాదించావు. ఇది నాపై నువ్వు ఉంచిన బాధ్యతగా స్వీకరించాను. దీనిని నేను ‘బరువు’లా ఎప్పుడు, ఎట్టి పరిస్థితిలోనూ భావించే ఆలోచన రానీయకు.  ఈ  బాధ్యత పరిపూర్ణంగా నిర్వర్తించగల మనోశక్తిని, మానవత్వాన్ని నాకు ప్రసాదించు.“అని రాసుకున్నాను.

    “నాలోని ప్రలోభాలు నాలోని మానవత్వాన్ని చంపేయకుండా కుడి చేతి బొటనవేలికీ, చూపుడు వేలికి మధ్య నుండే పై భాగంలో నాకు కన్పించేలా, నేను స్టెత్ పట్టుకున్నప్పుడల్లా ఈ మంత్రాన్ని నాకు గుర్తు చేసేలా… చిన్న పచ్చబొట్టు పొడిపించుకునాను. అదే ఇది” అంటూ చూపించాడు రామ్ నారాయణ.

    క్లోజప్ షాట్‌లో పచ్చబొట్టుని… వీక్షకులకు చూపించాక… యాంకర్…

    “మీరిద్దరూ మెడిసిన్‌లో ఫ్రెండ్సా?” అంది.

    “అవునండీ! ఇతనూ, నేను మెడికోలుగా ఉన్నప్పట్నుంచే ఫ్రెండ్సయ్యాం. అతను ఆర్థికంగా నాకంటే ఎత్తులో ఉన్నా అత్యున్నత భావాలున్న వ్యక్తి. ఇద్దరి  అభిప్రాయాలూ, ఆశయాలూ ఒకేలా ఉండడంతో సన్నిహితమయ్యాం. మెడిసిన్‌లో మెరిట్ మార్కులున్న నాకు ఎం.డి.లోనూ సీటు సులభంగానే దొరికింది. లక్ష్మీ నారాయణకి సర్జరీలో ఇంట్రస్టు. సర్జరీలో పి.జి. చేశాడు.

    పి.జి. అయ్యాక, ఏదైనా కార్పోరేట్ ఆసుపత్రిలో చేరాలని ఆలోచిస్తున్న సమయంలో…

    “రామ్! నేను ప్రాక్టీస్ చేసి కోట్లు సంపాదించవలసిన అవసరం లేదు. ఇంకో రెండు తరాలకి సరిపడా మా తాత ముత్తాతలే సంపాదించి వెళ్ళారు. నాకు కార్పోరేట్ ఆస్పత్రుల్లో పని చెయ్యాలనీ, లక్షలు గడించాలనీ లేదు. మనం ఇద్దరం కలసి… నువ్వు పదేళ్ళ తర్వాత ప్రారంభించాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్టు ఇప్పుడే మొదలుపెడదాం” అన్నాడు.

    “అప్పటి మా ఆలోచన రెండేళ్ళలో కార్యరూపం దాల్చింది. లక్ష్మీ నారాయణ వాళ్ళకి మారేడ్‌పల్లి సమీపంలో రెండెకరాల స్థలం ఉంది. దానిని అందమైన ఆస్పత్రిలా మార్చాం. అందులో కనీస వసతులతో సామాన్యుడికి అందుబాటులో ఉండేలా… పది పడకలతో ఆస్పత్రి ప్రారంభించాం.”

    “విన్నారుగా! ఇప్పటి వరకూ రామ్ నారాయణ గారి బాల్యం, చదువు విశేషాలు. చిన్న బ్రేక్ తర్వాత లక్ష్మీ నారాయణ ఏం చెబుతారో విందాం…” అంది యాంకర్.

    ***

    “లక్ష్మీ నారాయణ గారూ! మీ బాల్యం, ఎడ్యుకేషన్ల గురించి చెప్పండి”

    “మాది హైదరాబాదే. ఆర్థికంగా ఉన్నవాళ్ళమే కాబట్టి మెడిసిన్ చదవడానికి కష్టాలేం పడలేదు. ఫస్టియర్‌లో మొదలైన మా స్నేహం… కొనసాగుతూనే వుంది. ఇద్దరి ఆలోచనలూ, ఆశయాలూ ఒకటే కాబట్టి  మేం ముందడుగు వేయగలిగాం. మాతో మా బ్యాచ్‌మేట్స్, మా జూనియర్స్ కొందరు, వివిధ విభాగాలలో స్పెషలైజ్ చేసినవాళ్ళు… మేం ఎప్పుడు కాల్ చేసినా వచ్చి ఉచితంగా వైద్యం చేసెళ్తారు” చెప్పాడు లక్ష్మీ నారాయణ.

    “అంటే పేషంట్ల వద్ద నుండి డబ్బు తీసుకోరా?”

    “తీసుకుంటాం. చాలా మినిమమ్‌గా తీసుకుంటాం, అదీ హాస్పిటల్ మెయిన్‌టెనన్స్ కోసం నామమాత్రంగా తీసుకుంటాం. మేం తీసుకునే ప్రతీ రూపాయికీ… ఎందుకు తీసుకున్నామో రోగికి వివరాలతో బిల్లు అందిస్తాం. మేం మొబైల్ సర్జికల్ వ్యాన్ ఏర్పాటు చేశాం. ప్రతీ చిన్న యాక్సిడెంట్‌కీ అవసరం ఉన్నా లేకపోయినా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే పని లేకుండా… మాకు కాల్ చేస్తే… అతి తక్కువ ఖర్చుతో వాళ్ళ ఇళ్ళ వద్దకే వెళ్ళి, మా వ్యాన్‍లో సర్జరీ అవసరపడితే చేసి, తీసుకోవాల్సిన జాగ్రతలు, పరిశుభ్రత గురించి చెబుతాం. ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్టే వాతవరణాన్నికల్పిస్తాం. అవసరమైతే… మా ఫ్రెండ్స్ పని చేస్తున్న ఆస్పత్రులకి రిఫర్ చేసి తక్కువ ఖర్చులో అయ్యేలా చూస్తాం. అలాగే వ్యాధులు, జ్వరాలు పట్ల ప్రజలలో అవేర్‌నెస్ ప్రోగ్రామ్‍లు కండక్ట్ చేస్తున్నాం…”

    “అవేర్‌నెస్ ప్రోగ్రామ్‍ల గురించి వివరిస్తారా?” అంది యాంకర్.

    “ఉదాహరణకి డెంగీ జ్వరం. ఇది దోమ కాటు వలన వచ్చే జ్వరం. ఇంటి చుట్టూ పారిశుద్ధ్యం లోపించడం వలన దోమలు చేరి, అవి మనిషిని కాటేయడం వల్ల వస్తుంది. దాని గురించి అవగాహన కల్పిస్తాం. డెంగీ జ్వరం వచ్చిన రోగుల మీద చిన్న చిన్న క్లినిక్‌లు మొదలు పెద్ద పెద్ద కార్పోరేట్ ఆస్పత్రుల వరకు వ్యాపార దృక్పథంతోనే… లక్షలు వసూలు చేస్తున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్స్ తక్కువ ఉన్నయనో, ప్రాణాంతక వ్యాధఓ ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి.  పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి వైద్యం అందనంత ఎత్తులో ఎక్కి కూచుటోంది. మా దగ్గరికి వచ్చే రోగులకి ముందు మేం అవగాహన కల్పిస్తాం. చిన్న చిన్న జ్వరాలకి లక్షల్లో ఎలా కోల్పోతున్నారో వివరంగా చెబుతాం. డెంగీ జ్వరం పట్ల రోగికి అవగాహన, ఆలోచనా ఉంటే… అతి తక్కువ ఖర్చుతో తగ్గించగల జ్వరం. ఒక్కసారి రోగికి ఈ అవగాహన కల్పిస్తే, తన కుటుంబానికి, తన తోటివారికి, తర్వాత తన ఊరికి ఉపయోగపడేలా… మార్పు కోసం… ప్రయత్నం చేస్తున్నాం.”

    “ప్రాక్టికల్‌గా ఇదంతా సాధ్యమేనా?” యాంకర్ అడిగింది.

    “అసాధ్యం అయితే కాదు. నేడు విద్య, వైద్యం, కార్పోరేట్ వ్యాపారాలుగా మారిపోయాయి.  ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యాపార కోరలలో చిక్కుకుని బలవుతున్న మధ్యతరగతి, పేద ప్రజలకి వ్యాధుల పట్ల, నివారణ పట్ల, ముందు జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించి… ప్రతి చిన్న అస్వస్థతలకి ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా, తక్కువ ఖర్చుతో ప్రకృతి ప్రసాదించిన వనరులతో ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చో తెలియజేస్తున్నాం…”

    “అయితే మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలొ ఎలాంటి అప్రమత్తత కలగజేస్తున్నారు?” యాంకర్ ప్రశ్న.

    “చూడండి. అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి గాని అందని తాయిలాలుగా మారకూడదు. ఒకప్పుడు సెల్ ఫోన్ రేటు వేలల్లో ఉండేది. ఇవ్వాళ టెక్నాలజీ పెరిగి వందల్లోకి దిగి సామాన్యుడి చేతిలోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకోవటం ప్రజల్లో రావలసిన మార్పు.”

    “ఈ మార్పు అందరికీ వర్తిస్తుందంటారా?”

    “ఖచ్చితంగా అని చెప్పలేము. మా టార్గెట్ వైద్యం పేరుతో మోసపోతున్న సామాన్యుల గురించే.”

    “మీకు కార్పో’రేట్ల’ నుండి ఒత్తిడి, బెదిరింపులు వస్తుంటాయా?”

    “ఆఁహా… మమ్మల్ని కొనాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ మా లక్ష్యాలకి అడ్డుగోడలుగా భావించడం లేదు. ఈ చైత్యన్యం మాతోనే ఆగిపోకుండా… రాబోయే వైద్యులకి స్ఫూర్తి కావాలి. వైద్యుడికి రోగికి మధ్య ‘ధనం’ ఇంధనంలా మారకూడదని… శవాల్ని పీడించి, జీవించేలా వైద్యుడు దిగజారకూడదని; ప్రాణం కాపాడి బ్రతికించే… ‘దేవుడి’లా ప్రజల మనసుల్లో నిలిచిపోవాలని, అప్పుడే… వైద్యులకి, వైద్య వృత్తికి పవిత్రత ఉంటుందని… మా భావన. విజ్జానాన్నిచ్చే చదువుని, ప్రాణాల్ని కాపాడే వైద్యాన్ని సామాన్యుడి అందుబాటులోకి తీసుకెళ్ళడమే మా ధ్యేయం” అని ముగించాడు రామ్ నారాయణ.

    “చూశారుగా! నవ్య భావాలతో పవిత్ర వైద్య వృత్తికి పవిత్రత ఆపాదించాలని ఈ వైద్యనారాయణులిద్దరూ ‘ముందడుగు’ వేశారు. మరి మనమూ వీళ్ళ వెనుక అడుగులు కలుపుదాం” అని యాంకర్ వాళ్ళిద్దరి వైపు తిరిగి… “థ్యాంక్యూ! మీ విలువైన సమయాన్ని మా ముందడుగు కార్యక్రమానికి కేటాయించి… ప్రజలకి వైద్యం, వైద్య వృత్తిని కొత్త కోణంలో ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు” అంది యాంకర్.

    – ఎం. వెంకటేశ్వరరావు

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here