వైకుంఠపాళి-14

1
3

[dropcap]ఫం[/dropcap]క్షన్ గురించి మాట్లాడితే, “ఈ టైమ్‍లో జడ్జీల్లో ఒకడినైన నాకు సన్మనాలు, సభలూ నీకు అంత మంచిది కాదు!” అన్నాడు.

“సరే… మీరేం చెప్పినా నా మంచికే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది కూడా ఒద్దా…” ఆమె అతనికి దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులేస్తూ అడిగింది.

వాసుదేవరావు అలవాటయిన ఆ స్పర్శకి ఒక్క నిమిషం తనని తాను మరిచిపోయాడు. ఆమెని ప్రతిఘటించకుండా అచేతనంగా అలాగే చూస్తుండిపోయాడు.

ఆమె తన పనిలో చాలా వరకు విజయం సాధించినట్లే భావిస్తూ అతనిలో పూర్తిగా ఒదిగిపోతుండగా,

“ఇంతకీ ఏ నవలని రికమెండ్ చెయ్యాలనుకుంటున్నావు మాళవికా?” అని అడిగాడు.

ఆమె మత్తుగా “అంతిమ విజయం” అంది.

“దానికి దారి ఇదే అని నువ్వు భావిస్తున్నావా?” అన్నాడు.

ఆమె మాట్లాడలేదు. అతనిని మాట్లాడనివ్వకుండా పెదవులు అందుకుంది.

ఆమె ముద్దు పెట్టుకున్న తర్వాత వాసుదేవరావు ఆమెని కొద్దిగా దూరం జరుపుతూ “ఆ పనికి నువ్విలా నిన్ను నాకు సమర్పించుకోనఖ్కరలేదు. నువ్వు పైకి రావడం నాకూ చాలా సంతోషాన్నిస్తుంది. ఒకప్పటి నీ స్థితి, త్వరత్వరగా మారిని నీ స్థితిగతులు నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలుస్తాయి?” అన్నాడు.

తనని అతను తిరస్కరిస్తున్నాడన్న విషయం ఆమె ఇంకా జీర్ణించుకోలేనట్లు చూస్తుండిపోయింది.

“ఇది వరకు ఆ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు పొందిన రచయితలు ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని రికమెండ్ చేస్తారు. ఆ పుస్తకాలలో వచ్చిన మంచిదానిని ఐదుగురుం కలిసి ఎన్నుకుని ఆ రచయితకి ఆ అవార్డునిస్తాం. నేను నీ పుస్తకాన్ని సూచించినా మిగతా నలుగురికి నచ్చాలి. లేకపోతే రాదు!” అన్నాడు.

మాళవిక నవ్వి “మీ సూచనని అంత తేలిగ్గా వాళ్ళు తీసి పారేయ్యరని నా నమ్మకం!” అంది.

“మిగతా వాళ్ళని కూడా కలిసే వుంటావని నా నమ్మకం!” అన్నాడు.

ఆమె తల వంచుకుంది.

“చూద్దాం లే… వెళ్ళిరా… లక్ష్మి వచ్చే టైమ్ అయింది. భయం అని కాదు గానీ ఆమెని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు” అన్నాడు.

మాళవిక లేచి చేతులు జోడించింది.

అతను కూడా నమస్కరించి “వెళ్ళండి మాళవిక గారూ!” అన్నాడు.

ఆమె వెళ్ళిపోయింది.

పడక కుర్చీలో పడుకుని వాసుదేవరావు ఆమె టేబుల్ మీద వుంచిన ‘అంతిమ విజయం’ పుస్తకాన్ని చదవసాగాడు.

“లైట్ వేసుకోలేదేం?” అంటూ లక్ష్మి వచ్చింది. ఆమె వస్తూనే లైట్ వేసింది.

***

ఆమెకి సడెన్‌గా రోజులు మందకోడిగా సాగుతున్నట్లు అనిపించాయి.

“మన సినిమా ప్రారంభం చెయ్యరేం? నేను అందరికీ చెప్పేసుకున్నాను కూడా!” అలకగా అంది మాళవిక.

“చేస్తాను. ఇంతకు ముందు డిసైడ్ చేసిన సబ్జెక్ట్స్ వున్నాయి కదా” సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు రాజశేఖరం.

ఇంతలో “మే ఐ కమిన్” అన్న సన్నని గొంతూ, దానితో బాటు తలుపు తోసుకుని ఓ అమ్మాయీ లోనికి వచ్చేసారు.

“హాయ్ శీతల్!” విలాసంగా విష్ చేసాడు రాజశేఖరం.

శీతల్ వచ్చి మాళవిక పక్క కుర్చీలో కూర్చుంది.

మాళవిక ఆమెను గమనించి చూసింది. మెరుపుతీగకి హొయలు నేర్పేటట్లుంది. పాలు కారుతున్నట్లు పలుచని చెంపలూ, నవ్వినప్పుడు మూసుకుపోయినట్లునా తెరిస్తే విశాలంగా వున్న కళ్ళూ, గుప్పెటలో ఇమిడే నడుమూ, పొడువాటి కాళ్ళూ, వాటిని నగ్నంగా వదిలేసిన మిడ్డీ, ఆ పైన ఎత్తులని యథేచ్ఛగా బహిర్గతం చేసే స్కిన్ టైట్ టీ షర్టూ.

ఆమె రాజశేఖరంతో చాలా చనువుగా మాట్లాడ్తోంది. “లుక్ మిస్టర్ రాజూ… డూ యూ హేవ్ ఎనీ ఎంగేజ్‍మెంట్స్?” అని మాళవిక వైపు చూసింది.

“నో… నో… ఐ యామ్ ఎట్ యువర్ సర్వీస్” రాజశేఖరం స్టైలుగా నవ్వి, మాళవిక వైపు తిరిగి, “మాలా, రేఫు కలుద్దాం. నాకు కాస్త పనుంది” అన్నాడు.

“ఏం పని?” అని అడగాల్సిన అవసరం మాళవికకి కనబడలేదు. “ఓ.కే.” అని లేచింది. మర్యాదకి కూడా ఆ అమ్మాయికి తనని పరిచయం చేయనందుకు ఆమెకు బాధేసింది.

కారు వైపు నడిచి డోర్ తెరవబోయింది.

“సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్… ఈ కారు సార్ నిన్ననే అమ్మేశారు. దయచేసి కీస్ ఇస్తారా?” అంటూ ప్రత్యక్షమయ్యాడు సతీష్ చంద్ర మేనేజర్.

మాళవిక ఏమీ చెయ్యలేనట్లుగా కీస్ తీసి అందించింది. ఆ కారు తనది కాదు. ఆ మాట కొస్తే… ఏదీ తనది కాదు. వాసుదేవరావు కొంచెం తెలివిగా బిహేవ్ చేసుంటే ఆ ఫ్లాట్ తన పేరు మీద రిజిస్టర్ అయ్యేది కాదు. ఆమెకి మొదటిసారిగా అతని మీద ప్రేమ కలిగింది. తను అతన్ని వాడుకుని వదిలేసింది. ఇప్పుడు రాజశేఖరం తనని…. ఆ పై ఊహించలేకపోయింది. ఒకవేళ రాజశేఖరం రేపటి నుండీ తనతో మాట్లాడకపోయినా తను ఏమీ చెయ్యలేదు. అతనికి అందమైన ఆడపిలల్లని కలిసే స్కోప్ ఎక్కువ! వాళ్ళ అందాల ముందు తను అస్సలు నిలవలేదు. ఆ సత్యం తనకి తెలుసు. ‘ఇలా ఎందుకు చేసావు’ అని నిలదీయాలంటే తన గురించీ, తన పాత పరిచయాల గురించి అతనికి మొత్తం తెలుసు!

ఆమె ఆటో పిలిచి ఇల్లు చేరింది.

చీకటిగా వున్న ఇంట్లో లైట్ వెయ్యాలనిపించలేదు. అలాగే సోఫాలో పడుకుంది.

ఆ నిశ్శబ్దంలో ఫోన్ మ్రోగింది.

ఆమె రాజశేఖరమే అనుకుంది. ఆశగా ఫోన్ లిఫ్ట్ చేసింది.

“నేను వాసుదేవరావుని” అన్నాడు.

ఆమెకి ఆ నిమిషంలో అతని స్వరం వినగానే ఎందుకో మనసుకి సెవ్వనగా అనిపించింది. గుండె గొంతులో కొచ్చేసిన ఫీలింగ్. కళ్ళల్లో నీళ్ళు వుబికాయి.

“చెప్పండి…” అంది.

“అవార్డు గురించి చెప్దామని…” అన్నాదు.

ఆమెకి ఒక్కసారిగా పోయిన ప్రాణాలన్నీ తిరిగొచ్చేసినట్టయింది.

“ఆ… రిజల్ట్స్ వచ్చాయీ? అవార్డు నాకేనా… ఆ శుభవార్త చెప్పడానికే చేసారా?” ఎక్సైట్ అయిపోతూ అరించింది.

“మాళవికా… నా చేతిలో వున్నదంతా నేను చేసాను… అని చెప్పలేను. ఎందుకంటే సాహిత్యంతో వున్న పరిచయం వల్లా, సరస్వతీదేవంటే వున్న భయభక్తుల వల్లా నేను నీ నవలని రికమెండ్ చెయ్యలేకపోయాను. మిగిలిన వాళ్ళు కూడా… అందరూ ఏకగ్రీవంగా ‘తీర్పు’ అనే నవలని సెలెక్ట్ చేసారు. ఆ రచయిత్రికి ఇదే మొదటి నవలట… ఆమె పేరు…”

అతను చెప్పే లోగానే ఆమె ఫోన్ డిస్‌కనెక్ట్ చేసింది. ఈడ్చి చెంప మీద కొట్టినట్లుగా అనిపించాయి అతని మాటలు. ఆమెకి అతని మీద కంటే కృష్ణమూర్తీ, రామనాథంల మీద కసిగా అనిపించింది. ముసలి నక్కలు ఎంతగా వాడుకున్నారూ? తన శరీరాన్ని చూసుకుంటే అసహ్యమేసింది!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here