వైకుంఠపాళి-3

0
2

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి అభిమాన రచయిత్రి ‘బలభద్రపాత్రుని రమణి’ రచించిన ‘వైకుంఠపాళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]”ఏం[/dropcap] చేస్తున్నారూ? వంటా?” మాళవిక అతనికి దగ్గరగా వెళ్తూ అడిగింది.

“ఆ… ఆ… మీ అక్క ఏది ఎక్కడ పెట్టిందో నాకు తెలిసి చావడం లేదనుకో! వుప్పు ఎక్కడుండేది నీకేమైనా తెలుసా?” అడిగాడు సాగర్.

“తెలుసు!” మాళవిక పై గూట్లోంచి వుప్పు డబ్బా తీస్తూ, ఏదో ఐడియా వచ్చి, అమాంతం తల మీద వంపేసుకుని “అయ్యో!” అని అరిచింది.

సాగర్ కూడా “అరరే…” అంటూ దగ్గరగా వచ్చి ఆమె తలా, ఒళ్ళూ దులపసాగాడు. అతని చేతులు తగలగానే ఆమెకు ఆనాటి దృశ్యం మళ్ళీ గుర్తుకొచ్చింది. కళ్ళు మూసుకునే, “అబ్బా… మండుతున్నాయి” అంటూ అతని ఛాతి మీద చేయి వేసింది.

“ఉండమ్మా… నీళ్ళతో కడుగుతాను” అని సాగర్ మంచి నీళ్ళు బిందెలోంచి వంచి ఆమె కళ్ళ మీద జల్లాడు.

మాళవిక గబుక్కున అతనికి దగ్గరగా జరిగి, అతని బనీన్‍కి మొహం రుద్దుకుంటూ “చలేస్తోంది” అంది.

ఆమెకి తను చూసిన హిందీ సినిమాలోలా ఇద్దరూ నిప్పు దగ్గర ఒకరిలో ఒకరు ఒదిగిపోవాలనిపిస్తోంది!

“వెళ్ళి గౌను మార్చుకో పాపా!” అని దూరంగా జరిగిపోయాడు సాగర్.

మాళవికకి వుక్రోషం వచ్చింది. అతను వెనక్కి తిరగ్గానే గుప్పెడు వుప్పు తీసి స్టౌ మీదున్న పాలలో వేసి పరిగెత్తుకొచ్చేసింది.

రమామణి మర్నాడు నవ్వుతూ, “మీ బావగారికి వంటలో సాయం చెయ్యబోయి, వుప్పు తల మీద పోసేసుకున్నావట కదే! ఆయన ఒకటే జాలిపడ్డారు” అంది.

మాళవిక నవ్వలేదు. ఆమె రమామణి మెడలో మెరుస్తున్న నెక్లెసు వైపే చూస్తూ నిలబడింది.

“ఏమిటే అలా చూస్తున్నావూ? బోనస్ వస్తే మీ బావగారు కొన్నారు. రెండు తులాలయింది” రమామణి గొప్పగా చెప్పింది.

ఆ రాత్రి మాళవికకి అన్నం సహించలేదు. ముసుగు పెట్టుకుని పడుకుంటే, సాగర్ రమామణి మెడలో నెక్లెసు పెడుతున్నట్లే కనిపిస్తోంది.

ఇంగ్లీషు పాఠం గట్టిగా చదువుకుంటున్న చెల్లెలి మీద అరిచింది, “ఏం మేమెవరం నిద్ర పోనఖ్కరలేదా?”.

తండ్రి చెల్లెల్ని వెనకేసుకొస్తూ, “సిగ్గు లేకపోతే సరీ! ఎనిమిదో తరగతి కొచ్చి ఎనిమిది కాకుండా ముసుగుపెట్టడానికి. పైగా చదువుకుంటున్న పిల్ల మీద అరుస్తావూ?” అన్నాడు.

శుక్రవారం రోజు మాళవిక తల్లి పూజ చేసుకుంటూ వుండగా, “పిన్నీ… పిన్నీ” అంటూ రమామణి ఏడుస్తూ హడావిడిగా పరిగెత్తుకొచ్చింది.

ఆవిడ కంగారుగా “ఏమైందమ్మా?” అంది.

రమమాణి కన్నీళ్ళు తుడుచుకుంటూ “పిన్నీ… నా నెక్లెస్… పోయింది. స్నానం చేసే ముందర తీసి బీరువాలో పెట్టి వెళ్ళాను. ఎవరొస్తార్లే అని… బీరువాకి తాళం వెయ్యలేదు” అంది.

“అయ్యో… అలా ఎందుకు చేశావమ్మా? ఎవరొచ్చారో ఏమో?” అంది మాళవిక తల్లి.

“నేను బాత్‌రూంలో వుండగా మాళవిక వచ్చింది పిన్నీ! అక్కా అని పిలిస్తే… కాసేపుండు… తలంటు పోసుకుంటున్నాను – అన్నాను” అంది.

ఆవిడ కట్రాటలా బిగుసుకుపోయి చూసింది. రక్తం అంతా మొహంలోకి జివ్వున పొంగుకొచ్చింది.

రమామణి ఏడుస్తూ “ఆయన కష్టపడి చేయించారు పిన్నీ! పోయిందని తెలిస్తే బాధపడ్తారు… అసలు ఏవంటారో ఏమో కూడా వూహించలేకపోతున్నారు… ఒక్కసారి మాళవికని పిలవండి… తను చూసిందేమో అడుగుదాం… చిన్న పిల్ల కదా… సరదాకేమైనా…” అంటూ వుండగానే,

మాళవిక తల్లి కోపంగా, “చూడమ్మా… కూటికి బీదైనా కులానికి కాదు. గుణానికి అంత కన్నా కాదు! మీలా నగలు లేకపోవచ్చు కానీ అభిమానం వుంది. చనువుగా వస్తోంది కదా అని పసిపిల్ల మీద దొంగతనం మోపుతావా? ఛీ… ఏళ్ళొస్తే సరికాదు! బుద్ధుండాలి” అంది.

రమామణి కూడా కాస్త కోపంగా, “దొంగతనం చేసిందనటం లేదు. సరదాకి పెట్టుకుందేమో అడగమంటున్నాను. దానికే మీకింత బాధగా వుంటే, వస్తువు పోయిన నాకెంత బాధగా వుండాలీ?” అంది.

మాళవిక తల్లి విసురుగా లోపలికెళ్ళి, పడుకుని పుస్తకం చదువుకొంటున్న మాళవికని రెక్క పట్టి లేవదీసుకొని పూజా గదిలోకి లాక్కెళ్ళి “చెప్పవే… నేను నిత్యం పూజించే రాజరాజేశ్వరి దేవి మీద ఒట్టు పెట్టి చెప్పు… నువ్వు గాని ఆవిడ నెక్లెసు తీసావా? అబద్ధం చెప్పావో నీ తల్లి రక్తం కక్కుకుని చచ్చిపోతుంది” అంది.

మాళవిక తల్లి కేసీ రమామణి కేసీ చూసింది.

రమామణి ఏడవడం ఎందుకో సంతోషంగా అనిపించింది.

“ఒట్టు పెట్టి చెప్తున్నాను. నాకేమీ తెలీదు! ఒకవేళ వాళ్ళ ఆయనే ఎవరికైనా ఇవ్వడానికి రహస్యంగా తీసుకెళ్ళాడేమో! నేను వాళ్ళింట్లోకి వెళ్తూ వుంటే నాకు ఎదురొచ్చాడు. జేబు మీద చెయ్యేసి తడుముకుంటూ నన్ను చూసి కంగారు పడ్డాడు!” అంది.

రమామణి వెంటనే “నోర్ముయ్… పెద్దా చిన్నా లేకుండా మాట్లాడకు!” అంది.

మాళవిక తల్లి నోరు మూసుకోదలచుకోలేదు. “నీ యింటి బంగారం మంచిదౌనో లేదో తెలుసుకోకుండా అనవసరంగా నా పిల్ల మీద అరవకు! చిన్న పిల్లలు దైవస్వరూపాలు… అబద్ధాలాడరు” అంది.

రమామణి ఏడుస్తు ఇంటికి వెళ్తూ, వాకిట్లో ఎదురైన మాళవిక తండ్రితో “నాకు పోయింది వస్తువే! మీకు అంతకన్నా విలువైనది పోతుంది మీ అమ్మాయి వల్ల!” అని వెళ్ళిపోయింది.

ఆయన లోపలికి వచ్చి భార్య ద్వారా విషయం తెలుసుకుని మాళవికని పిలిచి జరిగిన సంగతి వివరంగా చెప్పమని అడిగాడు. ఆమె చెప్పింది. ఆయన బాధగా, “మన పరిస్థితి బాగా లేనప్పుడు ఒకరింటికి పిల్లల్ని పంపకు పార్వతీ!” అన్నాడు.

పార్వతి ఏడ్చింది, కూతుర్ని దగ్గరకు తీసుకుని!

మాళవికకి సాయంత్రం సాగర్ రాగానే వాళ్ళింట్లోంచి మొదటిసారిగా అరుపులు వినిపించాయి. ఆ తర్వాత రమామణి ఏడుపు కూడా వినిపించింది. మరునాడు నుదుటికి పట్టీ కట్టుకున్న రమామణిని రిక్షాలో ఇంటికి తీసుకువస్తూ సాగర్ కనిపించాడు. అతని కళ్ళు లోపలికి పోయి, మొహం పీక్కుపోయి దిగులుగా కనిపించాడు!

మాళవిక రెండోసారి బయట చేరింది.

మాళవిక తల్లి ఆమెని వసారాలో పడుకోబెట్టి, పుస్తకాల సంచీ తీసుకెళ్ళి అలమారలో పెడ్తుండగా కనబడిందది! మొదట ఆమె కళ్ళని ఆమే నమ్మలేకపోయింది. ఆ తర్వాత చేతిలోకి తీసుకున్నాక అది నిజం అని తెలిసి ఆవిడకి ప్రాణం పోయినంత పనయింది. ధగధగా మెరుస్తోంది రమామణి నెక్లెసు!

ఆవిడ నోట్లో కొంగు కుక్కుకుని నిశ్శబ్దంగా ఏడ్చింది. ఆ తర్వాత కూతుర్ని నిద్ర లేపి, పెరట్లోకి తీసుకెళ్ళి చింతబరికెతో వీపు వాచిపోయేటట్లు చావబాదింది.

మాళవిక ఏడుపు బయటకి రాకుండా ఆ దెబ్బల్ని మౌనంగా భరించింది.

ఆవిడ కొట్టి కొట్టి చేతులు నెప్పి పుట్టి క్రిందే కూలబడిపోయింది.

ఆ తర్వాత ఆవిడ మంచం లోనే ఎక్కువగా కాలం గడపాల్సొచ్చింది. ఆవిడ భర్త గవర్నమెంట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే కేన్సర్ అని చెప్పారు.

నెక్లెస్ రమామణికి అందజేద్దామంటే ఆవిడకి వీలవలేదు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆవిడ ఓపిక చేసుకుని అమ్మవారి గుడికి వెళ్ళి ఆ హుండీలో నెక్లెసు వేసి “తల్లీ… నా కూతురి జీవితం సరిగ్గా వుండేట్లు చూడు తల్లీ! ఆ పాపం రోగం రూపంలో నన్ను భరించనీ…” అని దణ్ణం పెట్టుకొంది.

మాళవికకి తల్లి అనారోగ్యం పెద్ద బాధగా తయ్యారయింది. ఇప్పుడామె మీద ఇంటిపనంతా పడింది. ప్రతి క్లాసులో ఫస్టు మార్కులు తెచ్చుకునే నందినికి పెద్దగా పని చెప్పేవాడు కాదు తండ్రి! ఆమెకి ఇప్పుడు తన ప్రథమ శత్రువు, చెల్లెలే అనిపించసాగింది.

ఉబ్బసంతో ఏళ్ళ తరబడీ తీసుకుంటున్న నాయనమ్మ పోలేదు కానీ ఆమె తల్లి మాత్రం దగ్గి, దగ్గి రక్తం కక్కుకొని ఓ ఏకాదశి నాడు భర్త చేతుల్లో పునిస్త్రీగా పోయింది.

‘దేవతలనీ, సెంటిమెంటుల్నీ నమ్మడం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు!’ అనుకుంది మాళవిక.

***

మాళవిక పదో తరగతి తప్పి యింట్లో వుండిపోవడంతో ఆమెకు పుస్తకాలు చదవడం నిత్యకృత్యమైపోయింది. ఆమె చదివే సాహిత్యంలో స్త్రీ హక్కులూ, స్వేచ్ఛా మొదలగు అంశాలతో బాటు విశృంఖలత ఆమెని ఎక్కువగా ఆకర్షించింది!

ఒకనాడు ఆమె ఓ ప్రముఖ రచయిత సన్మానానికి వెళ్ళింది. స్టేజ్ మీద కూర్చున్న అతనికి చాలామంది ఆటోగ్రాఫ్ పుస్తకాలు పంపారు. అతని గురించి ప్రముఖులు పొగుడుతూ మాట్లాడి ఆ తర్వాత అతనికి సన్మానం చేసారు. పదివేల రూపాయల పర్సు ప్రెజెంట్ చేసారు.

మాళవికకి మొదటిసారి తెల్సింది కీర్తితో పాటు రచనల ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు అని!

మాళవిక ఆ తర్వాత వరుసగా కొన్ని కవితలు వ్రాసి అన్ని వారపత్రికలకి పంపించింది. పంపించిన రోజు నుంచీ అవి ప్రచురింపబడి తన కొచ్చే పారితోషికం కోసం ఆశగా ఎదురుచూడసాగింది. కానీ… అవన్నీ భద్రంగా ఆమెని వెతుక్కుంటూ తిరిగొచ్చాయి.

మాళవిక నిరాశపడలేదు. అవి తీసుకుని ఓ పత్రికాఫీసు కెళ్ళింది.

అందరూ సీరియస్‍గా పని చేసుకుంటూ కనిపించారు.

ఓ ముసలాయిన రిటైర్మెంట్‍కి దగ్గర వున్నట్లు కనిపిస్తున్నాడు. తాపీగా చెవిలో అగ్గిపుల్ల పెట్టుకుని తిప్పుకుంటూ కూర్చుని వున్నాడు.

మాళవిక ఆయన దగ్గరకు వెళ్ళి “నమస్కారం” అంది.

ఆయన మాళవికని ఆపాదమస్తకం పరీక్షగా చూసాడు. “ఎవరు కావాలమ్మా?” అన్నాడు.

“ఎడిటర్ గారు” అంది.

“ఇప్పుడు రారు. మధ్యాహ్నం వస్తారు. ఏవిటి పనీ?” అడిగాడాయన.

మాళవిక తన కవితలు తీసి ఆయన ముందు పెట్టి, “ఇవి మీ పత్రికలో ప్రచురించాలి” అంది.

“ఇచ్చి వెళ్ళమ్మా, బావుంటే వేస్తాం” అన్నాడాయన.

మాళవిక నవ్వి, “మీరు వేస్తున్నవన్నీ బావున్నాయా?” అంది.

ఆయన తడబడ్డాడు.

మాళవిక కాలు ఆయన కాలుని తాకింది.

“సారీ!” ఆయన వెనక్కి తీసుకున్నాడు.

“సారీ అనడం గొప్పకాదు… ఎదుటి వాళ్ళని హేపీ చేయ్యాలి. అదే గొప్ప!” అంటూ కాలు ఇంకా ముందుకి పోనిచ్చింది.

మంచి పరువంలో వున్న పిల్ల అలా ప్రవర్తించడం ఆయనకి ఆశ్చర్యంతో బాటు, గొప్ప థ్రిల్‍ని కలిగించింది. అదే వయసులో వున్న తన చిన్నకూతురు ఆ నిమిషంలో గుర్తుకురాలేదు.

ఆమె చేతితో బాటుగా ఆ కాయితాలు పట్టుకుని “ప్రయత్నిద్దాం” అన్నాడు.

“ఇంకా ప్రయత్నిద్దాం అంటారేమిటి?” అని నవ్వింది మాళవిక.

“చేద్దాం” ఆయన హుషారుగా అన్నాడు.

“మళ్ళీ కలుస్తా! బై…!” మాళవిక వచ్చేసింది.

ఆ తర్వాతి వారం పత్రికలో ఆమె కవితలు అచ్చయ్యాయి.

మాళవిక ఆ పత్రికలు పట్టుకుని తెలిసిన వాళ్ళందరి దగ్గరికీ వెళ్ళి చూపించింది. కొంతమంది చూడగానే చదవకుండా, “అబ్బా… రచయిత్రివైపోయావు!” అని పొగిడేసారు. కొందరు చదివి అర్థం కానట్టు చూస్తుండిపోయారు. మరికొందరు ‘ఇంత చెత్తగా వున్నవి ఎలా ప్రచురించారబ్బా!’ అని మనసులో అనుకొని పైకి మాత్రం, “ఇంకా కృషి చెయ్యాలి” అన్నారు.

మాళవిక స్నేహితురాలు నీరజ మాత్రం “మాలా… కవిత్వం అంటే పైత్యం కాదు! తెల్ల కాయితాలు ఖరాబు చెయ్యడం రచన కాదు. అది గుండెలోంచి రావాలి… పెన్నుతో కెలికితే వచ్చే గీతల్లోంచి కాదు!” అంది.

మాళవిక రోషంగా చూసింది. “నీరజా… నీకు నా కవితలు పడ్డాయని కుళ్ళు! చూస్తుండు… తొందరలోనే ఈ ఆంధ్ర దేశంలో కెల్లా పెద్ద రచయిత్రినైపోతాను.” అంది.

నీరజ నవ్వింది.

మాళవిక ఆ తర్వాత నీరజతో మాట్లాడడం మానేసింది.

పొగడ్త పన్నీరులా ఝల్లుమనిస్తుంది. విమర్శ ఔషధంలా వెగటు పుట్టిస్తుంది. పొగడ్త ఆనందించి వదిలెయ్యకుండా తాగుతూ కూర్చుంటే వికారాలు బయల్దేరుతాయి! విమర్శ కొన్నాళ్ళకి గుణం చూపించి జబ్బు అరికడ్తుంది!

మాళవిక చుట్టూ అప్పటికే ఓ బృందం “భేష్… శభాష్… బావుంది” అని తలలూపడానికి తయ్యారయ్యారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here