Site icon Sanchika

వైకుంఠపాళి-4

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి అభిమాన రచయిత్రి ‘బలభద్రపాత్రుని రమణి’ రచించిన ‘వైకుంఠపాళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]ఆ[/dropcap]మె కథలు కూడా అచ్చయ్యాయి.

మాళవిక తండ్రి రిటైరయిపోయాడు. వచ్చిన డబ్బులతో కూతురి పెళ్ళి చేయాలానుకున్నాడు. సంబంధాల వేటకి బయల్దేరాడు.

మాళవిక అప్పటికే ఎస్టీమ్ కార్లలో తిరిగే హీరోలని సృష్టించడంలో బిజీగా వుంది!

ఆ సమయంలో ఆమెకి ఓ చిట్‌ఫండ్ కంపెనీలో పనిచేసే టైపిస్ట్ సంబంధాన్ని పట్టుకొచ్చాడు తండ్రి.

మాళవిక తండ్రి అజ్ఞానానికి జాలిపడింది.

“అతనికి రెండు వేల రూపాయల జీతం వస్తుంది. అతన్ని భర్తగా నేనెలా భరిస్తాను నాన్నా?” అంది.

తండ్రి ఈ మాటలో చండప్రచండుడయ్యాడు. “ఏవే? నీ కోసం టాటా, బిర్లాల కొడుకులు వస్తారనుకొన్నావా? అసలేవిటి నీ వుద్దేశం? టెన్త్ తప్పి పనికి రాని రాతలు రాసే నిన్ను చేసుకోవడానికి అతను ఒప్పుకుంటే గొప్పే! అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా?” అని అరిచాడు.

ఆ చివరి మాటతో మాళవికకి తండ్రంటే ఏమాత్రం అయినా ‘ఫరవా’ వుంటే అదీ పోయింది!

పెళ్ళి చూపులు చూస్కోవడానికి వాళ్ళొస్తారని నందిని వంటింట్లో తెగ హైరానపడి మైసూర్‍పాక్, బోండాలూ చేసింది.

మాళవిక మంచం మీద పడుకుని అణచిపెట్టబడ్తున్న స్త్రీ మీద ఓ కథ వ్రాసింది. కథలో తండ్రి – కూతురు తనకి యిష్టమైన వాడిని చేసుకుంటానంటే, వాడికి కులం తక్కువ కాబట్టి తన పరువు పోతుంది, వద్దంటాడు. ఆ అమ్మాయిని ఓ మూర్ఛ రోగికిచ్చి కట్టబెట్టాలని ప్రయత్నాలు చేస్తాడు. ఈ విషయం తెలిసి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోతుంది. ఆ తర్వాత రకరకాల చేతులు మారి సినీ నటి అయిపోతుంది. అప్పుడు తండ్రి వెళ్ళి చెల్లెలి పెళ్ళికి ఆర్థిక సాయం చెయ్యమని ఆమెని ప్రాధేయపడ్తాడు. “ఆ రోజు నన్ను సపోర్ట్ చేసి నాకిష్టమైన వాడితో పెళ్ళి జరిపించి వుంటే నా జీవితం ఇలా అయ్యేది కాదుగా నాన్నా! నేనూ హాయిగా భర్తతో సంసారం చేసుకుంటుండేదాన్ని” అని తండ్రిని బ్లేమ్ చేస్తుంది. “నీకేం తక్కువ తల్లీ… హాయిగా కార్లో తిరుగుతూ, భోగభాగ్యాలతో వున్నావు!!” అని తండ్రి అనగానే తెల్లబోతుంది. ఆ తర్వాత “ఛీ!” అని ఛీత్కారం చెయ్యడంతో కథ ముగుస్తుంది.

“అక్కా, వాళ్ళు ఆరున్నరకి వస్తామన్నారట. ఇప్పుడు ఆరయింది. లేచి ముఖం కడుక్కుని చీర మార్చుకు తయ్యారవ్వు” అంది నందిని.

లేని పెద్దరికం మీద వేసుకునే నందిని అంటే మాళవికకి ఒళ్ళు మంట.

ఆరుంపావుకి మాళవిక లేచి చీర మార్చుకుని, జడేసుకుని తయ్యారయింది. ఆరున్నర కల్లా చెప్పులేసుకుని ఇంట్లోంచి పెరటిదారి గుండా బైటపడింది.

ఆమె సరాసరి సంపెంగ పత్రికాఫీసుకు వెళ్ళింది. వాసుదేవరావు కులాసాగా భోం చేస్తున్నాడు. మాళవిక వెళ్ళి తనని తాను పరిచయం చేసుకుంది. ఆఫీసులో స్టాప్ ఎవరూ లేరు. అంతా ఇళ్లకి వెళ్ళిపోయారు.

అతను మాళవికని క్రిందనుండి మీద దాకా పరీక్షగా చూసాడు.

అందంగా లేకపోయినా, వయసు తెచ్చిన ఆకర్షణలో దాన్ని పెంచడానికి చేసిన అలంకరణలో బాగానే కనిపించింది.

“భోం చేస్తారా?” మర్యాదకి అడిగాడు.

“మీ మిసెస్ మీకు మట్టుకే పంపించి వుంటారుగా!” అంది.

“మా మిసెస్ పుట్టింటికెళ్ళింది. హోటల్ కూడే ఇది!” అన్నాడు.

“ఓ…” కళ్ళు తిప్పింది.

వాసుదేవరావుతో మాటలు కలిపింది. ఆయన లాంటి ఎడిటర్‍ని తాను చూడలేదంది. ఆయన టేస్ట్‌కి జోహార్లంది. ఇంకా ఏమేమో అంది.

వాసుదేవరావు ఆమె కథ చదివాడు. బాగా నచ్చింది. కథ కాదు, మాళవిక!

***

మాళవిక ఇల్లు చేరేటప్పటికీ చాలా పొద్దుపోయింది. మంచం లోంచి అరిచే బామ్మనీ, తనని కొట్టడానికి కూడా వెనుకాడని తండ్రినీ, సాధించే చెల్లెల్నీ ఎదుర్కోవడానికి ఆమె ప్రిపేరయ్యే వుంది.

కానీ విచిత్రంగా, ఎవరూ ఆమెని ఏమీ అనలేదు. అంతా నిశ్శబ్దంగా వుంది.

తండ్రి పక్కన కూర్చుని మధ్యవర్తిగా వచ్చిన పెద్దమనిషి మాట్లాడుతున్నాడు.

“నువ్వు డబ్బు ఏర్పాట్లు చూసుకో! మిగతా పనులన్నీ చిటికెలో చేసుకోవచ్చు. వెధవది… తలంబ్రాల బియ్యం నుండి బాజాల వరకూ ఈ రోజుల్లో రెడీమేడేగా!” అంటున్నాడు.

మాళవిక అదిరిపడింది! కొంపదీసి తన ఫోటో చూపించేసి ఖాయం చేసేయ్యలేదు కదా… అనుకుంది.

మాళవికని చూసి “ఎవరి అదృష్టం ఎలా వుంటుందో? ఎవరం చెప్పగలం…” అన్నాడు మళ్ళీ.

మాళవిక తండ్రి మాళవికని చూసి తల తిప్పేసుకున్నాడు.

“థాంక్స్ రామ్మూర్తి గారు… మంచి సంబంధం తెచ్చారు. అబ్బాయి నాకు అన్ని విధాల నచ్చాడు” అంటూ మధ్యవర్తి చేతులు పట్టేసుకున్నాడు.

ఆయన నవ్వి “సరే… నే వెళ్ళొస్తా… మీరు పెళ్ళి పనులు మొదలుపెట్టుకోండి… శుభం!” అని వెళ్ళిపోయాడు.

“అక్కా… అన్నం పెట్టాను… రా!” అని పిలిచింది నందిని.

మాళవిక చెల్లెలి దగ్గరకు వెళ్ళి “పెళ్ళి అంటున్నారు ఎవరికీ? నేను లేనిదే ఎలా ఖాయం చేసారూ?” అని అడిగింది.

“పెళ్ళి నందినికి! పెళ్ళి వారి ముందు నా పరువు పోకుండా నా చిట్టితల్లి కాపాడింది. దాన్ని చూడగానే వాళ్ళు కానీ కట్నం లేకుండా ఒప్పేసుకున్నారు. నా బంగారు తల్లి రూపం అలాంటింది! కొందరికి బుద్ధి బూరెలు తిన్నా రాత గాడిదలు కాయమంటుంది… ఏం చేద్దాం?… పొద్దు పోయింది తల్లీ పడుకో” అని నందినిని ప్రేమగా అని, తండ్రి వెళ్ళిపోయాడు.

మాళవిక ఒక్కతే కూర్చుని అన్నం వడ్డించుకుని తింది. ఆమెకి ఈ పెళ్ళి చెల్లెలికి కుదరడం ఎంతో రిలీఫ్‍గా అనిపించింది. ‘నేనో మామూలు టైపిస్ట్‌కి భార్యగా మారే కష్టం నుండి తప్పించుకున్నాను. అంతే చాలు!’ అనుకుంది.

***

వాసుదేవరావుతో మాళవిక స్నేహం గట్టిపడింది.

ఆమె సీరియల్ కూడా ప్రచురింపబడటానికి నిర్ణయం అయిపోయింది.

మాళవిక బ్యాగ్ లోంచి కార్డు తీసి “మీరు తప్పక రావాలి సార్” అని అందిస్తూ వుంటే, అతను చేదు తిన్నట్లు చూసాడు.

“వెడ్డింగ్ కార్డా?” అన్నాడు.

“అవున్సార్!” నవ్వింది మాళవిక.

“నీ పెళ్ళా?” అతని కంఠంలో చిరాకు దోబూచులాడింది.

“నాది కాదు… నా చెల్లెలిది” అంది.

అతని ముఖంలో రిలీఫ్ కనిపించింది. “అదేమిటీ పెద్దదానివి నిన్ను వదిలేసి చిన్నదైన నీ చెల్లెలికి పెళ్ళి చేస్తున్నారూ?” అన్నాడు.

“నేను పెళ్ళి చేసుకోను! ఈ వివాహ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు” అంది మాళవిక.

“కరెక్ట్‌గా చెప్పావు… నాకూ అంతే!” అన్నాడు.

“మరి మీరెందుకు చేసుకున్నారు?” వెంటనే అడిగింది.

“పెద్దవాళ్ళు బలవంతం చేసారు కాబట్టి చేసుకున్నాను. ఆమెని పెళ్ళి చేసుకున్నాను కానీ ఒక్క నాడూ ప్రేమించలేకపోయాను. ఏమీ తెలీదు. పల్లెటూరి మెద్దు!” అన్నాడు.

మాళవిక మనసులో నవ్వుకుంది. పైకి జాలి పడింది.

“మాళవికా… ఎంతో కాలంగా అడగాలనుకుంటున్నాను… ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నీకెలాగూ పెళ్ళి మీద ఇంట్రెస్టు లేదు. నువ్వు… నువ్వు… నాతో స్నేహంగా ఎందుకు వుండకూడదూ?” అన్నాడు.

“ఎలాంటి స్నేహం?” అడిగింది.

అతను చెప్పలేదు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నలుపుతూ ఆమె కళ్ళలోకి చూసాడు.

అక్కడ అతనికి ప్రతిఘటన బదులు అంగీకారం దొరికింది.

“మీ ఆవిడ పుట్టింటి నుంచి వచ్చిందా?” అని అడిగింది.

“ఇప్పుడప్పుడే రాదు!” అన్నాడు.

“అయితే మీ ఇల్లు చూపిస్తారా?” అడిగింది.

అతను ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు.

ఆ సాయంత్రం అతను ఆమెని తన ఇంటికి తీసుకెళ్ళాడు.

ఆమె ఒడిలో పడుకుని తనకి స్వచ్ఛమైన స్నేహం… నిర్మలమైన హృదయం చాలా ఆలస్యంగా దొరికిందన్నాడు. ఈ వరాన్ని శాశ్వతం చేయమని కోరాడు.

మాళవిక అతనికి వరాలిచ్చే దేవతలా తలూపింది.

***

“చూడూ! నీకు నా మాటంటే లెక్కలేకపోయినా, నాకు బాధ్యత వుంది కాబట్టి చెప్తున్నాను… రామ్మూర్తి ఇంకో సంబంధం తీసుకొచ్చాడు. ఓ సారి చూడు. వాళ్ళకి నువ్వు నచ్చితే ఇద్దరి పెళ్ళిళ్ళూ ఒకేసారి చేసేసి చేతులు దులుపుకుంటాను. చెల్లెలి పెళ్ళయ్యాకా నీకు పెళ్ళి కావడం కష్టం మరి! ఆలోచించుకో…” అన్నాడు తండ్రి.

“పెళ్ళికొడుకు ఏం చేస్తాడూ?” అడిగింది మాళవిక.

“రైల్వేలో వుద్యోగం. ఇరవై వేల జీతం” అన్నాడు తండ్రి.

“ఆఫీసరా?” అడిగింది.

“తెలీదు” అన్నాడు.

“ఇరవై వేలు జీతం అంటున్నావుగా చూస్తాను” అంది.

“పూర్తిగా చెప్పనీ… ముగ్గురు పిల్లలున్నారు. భార్య నిరుడే హార్ట్ ఎటాక్‌తో పోయిందిట” అన్నాడు.

మాళవిక తండ్రికేసి మింగేసేలా చూసింది.

“కొన్నాళ్ళు పోయాక రెండో సంబంధం వాళ్ళు కూడా రారు. కలకాలం ఇలాగే వుండిపోతావా?” అడిగాడాయన.

“రెండో సంబంధం అని కాదు… ఇరవై వేలలో ఇంతమంది బ్రతకగలరని నువ్వు అనుకుంటున్నందుకు నాకు కోపంగా వుంది!” అంది మాళవిక.

“అదేం మాట? నాకు చేతికొచ్చే పదిహేను వేలల్లో మీ అమ్మ ఇల్లు నడపలేదూ…”

“అంత దరిద్రంగా బ్రతకాల్సిన అవసరం నాకు లేదు” అని అక్కడ్నించి వెళ్ళిపోయింది మాళవిక.

నందినికి తండ్రి గాజులూ, నానుతాడూ, వుంగరం, దుద్దులూ చేయించాడు. రకరకాల చీరలు కూడా కొన్నాడు. మాళవికకీ ఓ చీర కొన్నాడు. ఇవన్నీ తన మీద కక్ష కొద్దీ చేస్తున్నట్లుగా అనిపించాయి మాళవికకి.

ఆదివారం నాడు మాళవిక ఆలస్యంగా నిద్రలేచింది. ఆమె పడుకునే “నందినీ… ఒసే నందీ… కాఫీ…” అంటూ అరిచింది.

తండ్రి వచ్చి, “పిచ్చి వేషాలెయ్యకు… వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా. నందినికి కాబోయే అబ్బాయి వచ్చాడు” అన్నాడు.

మాళవిక విసుక్కుంటూ లేచి మొహం కడుక్కుంది. ముందు గదిలోంచి నందిని నవ్వులు వినపడ్డాయి. ఆమె గోడ దగ్గరకు వెళ్ళి ఆసక్తిగా చెవులు రిక్కించి వింది.

“నందినీ… నీ అందం చూస్తుంటే నిన్ను ఇప్పుడే ఇలా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తోంది. నువ్వు దొరకటం నా అదృష్టం. అలా చూసి వెళ్ళగానే ఇలా బ్యాంక్ ఆఫీసర్‍గా ఉద్యోగం వచ్చినట్లు ఆర్డర్స్ వచ్చాయి. నువ్వు నా భాగ్యదేవతవి”.

“అదృష్టం మీది కాదు…నాది!”

“నలభై వేలు జీతం… మనం హాయిగా ఉండచ్చు తెలుసా? ఇంటద్దె, ఫోనూ అన్ని ఇస్తారు” అన్నాడు.

మాళవిక చెయ్యి అప్రయత్నంగా ఆమె గుండెల మీద కెళ్ళింది. ‘అమ్మో… ఇలాంటి పెళ్ళికొడుకునా నేను మిస్ అయిందీ!’ అనిపించింది. వెంటనే అతన్ని చూడాలని ఆరాటంగా ముందు గదిలోకి నడిచింది.

అప్పుడే శశిధర్ చెయ్యి నందిని బుగ్గని తాకుతోంది. మాళవికని చూడగానే అదిరిపడి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.

మాళవిక రెప్ప ఆర్పకుండా అతన్ని చూసింది. అతను చాలా అందంగా వున్నాడు. మంచి పర్సనాలిటీ! మాళవికకి తన మీద తనకే చాలా కోపమొచ్చింది.

నందిని లేచి “మా అక్క!… మాట్లాడుతూ వుండండి… నేను కాఫీ తెస్తాను” అని లోపలికి వెళ్ళింది.

మాళవిక అతని ఎదురుగా కూర్చుని అతన్ని పరీక్షగా చూడసాగింది.

అతను కాస్త ఇబ్బందిగా కదిలి “మీరేం చేస్తున్నారూ?” అని అడిగాడు.

“మిమ్మల్నే చూస్తున్నాను” అదోలాంటి మత్తుగా అంది.

“అది కాదు… ఉద్యోగం ఏవైనా చేస్తున్నారా?” అడిగాడు.

“ఊహూ! నేను రచనలు చేస్తాను. మాళవిక పేరుతో వచ్చే కథలూ, కవితలూ ఎప్పుడూ చదవలేదా?” అడిగింది.

అతను తప్పు చేసినట్లుగా “లేదండీ” అని తల వంచుకున్నాడు.

“ఆ నేత్ర సోయగం… భాష కందని భావాల భాష్యం!

ఒక మలయ పవనం, మాలతీ సుమం

జమిలిగా నను తాకిన వైనం!” అంది.

అతను కంగారుగా చూసాడు.

“మిమ్మల్ని చూడగానే నాలో కవిత్వం అలా పొంగుకొచ్చేసింది అంతే!” అని నవ్వింది.

అతను మర్యాదకి నవ్వాడు.

మాళవిక కొద్దిగా ముందుకు ఒంగి, గొంతు తగ్గించి “మీరు అసలు నన్ను చూసుకోవడానికొచ్చారు తెలుసా?” అంది.

అతను ఆశ్చర్యంగా చూసాడు.

“ఔను! నేను ఇంటికి ఆలస్యంగా రావడం వల్ల మా చెల్లెల్ని చూసుకున్నారు. అందుకు ఇప్పుడు నాకు చాలా బాధగా వుంది! ఐ మిస్డ్ యూ!” గుసగుసగా అంది.

అతని ముఖం ఎందుకో ఎర్రబడింది.

“మీరు చాలా హేండ్సమ్‍గా వున్నారు. మా నందిని అదృష్టవంతురాలు. కానీ మీరే దానితో ఎలా వేగుతారో ఏమో… వట్టి మూర్ఖురాలు.” అంది.

“అంటే?” అడిగాడు శశిధర్.

“ఎదురింటి ఆయన ముద్దు పెట్టుకున్నా, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా కూడా పాపం ముద్దుకేగా! అనుకొంటుంది” అంది.

(ఇంకా ఉంది)

Exit mobile version