వైకుంఠపాళి-6

0
2

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి అభిమాన రచయిత్రి ‘బలభద్రపాత్రుని రమణి’ రచించిన ‘వైకుంఠపాళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]మా[/dropcap]ళవిక తల తిప్పి చూసింది. ఆమెకి చెల్లెలి కళ్ళల్లో వుబికిన తడి కనిపించలేదు… ఆమె పక్కన నిలబడి భుజం మీద చెయ్యి వేసి, అందంగా, హుందాగా నిలబడ్డ శశిధర్ కనిపించాడు. ఆమెలో ఎక్కడో అణగారి వున్న ఓటమి బుస్సున పైకి లేచింది. దాన్ని బుట్టలోకి తోసి, పెదవుల మీద చిరునవ్వులు పూసుకుని… “నందీ… ఎలా వున్నావే?” అంటూ స్టేజ్ దిగి వెళ్ళి కౌగిలించుకుంది.

శశిధర్‍తో కూడా ఆప్యాయంగా మాట్లాడింది.

మాళవిక వద్దన్నా వినకుండా వాళ్ళు ఆ పూట బలవంతం చేసి ఆమెని తమ ఇంటికి తీసుకెళ్ళారు.

***

మాళవికకి నందినిని చూస్తున్నకొద్దీ తనేం పోగొట్టుకుందో తెలిసింది.

“నందినీ… నందినీ డార్లింగ్!” అంటూ శశిధర్ ఆమెని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా వెంట తిరుగుతున్నాడు.

ఇద్దరూ కళ్ళతో చిలిపి సైగలూ, నవ్వులూ… ప్రపంచంలోని ఆనందం అంతా వాళ్ళే స్వంతం చేసేసుకున్నట్లుగా కనిపించారు.

ఓ రెండు గంటలు వాళ్ళతో కలిసి గడపడం మాళవికకి కష్టం అయిపోయింది.

“నే వెళ్తానే!” అంది.

“ఆగు… ఈ రాత్రికి ఉండిపో” అని నందిని బలవంతం చేసింది.

మాళవిక శశిధర్ వైపు చూసింది.

తెల్లని లాల్చీ పైజామాలో దృఢంగా అందంగా వున్న అతన్ని చూడగానే అతని ద్వారా తను పొందిన అవమానం గుర్తొచ్చింది.

“మీ చెల్లెలు చాలా మర్యాదా, సాంప్రదాయం ఉన్న పిల్ల!” అని తన మొహం మీదే చెప్పిన ఆ రోజుని మాళవిక మర్చిపోలేకపోయింది.

“నందినీ… నువ్వు ఎంత అందంగా వున్నావే!” అంటూ చెల్లెలి అందాన్ని పొగిడింది.

నందిని నవ్వింది.

“నందీ ఈ అందం అంతా ఇలా వేస్ట్ అయిపోవలసిందేనా? వంటింటికీ, పడకటింటికీ అంకితం చేస్తావా?” అంది.

నందిని ఆశ్చర్యంగా, “అదేవిటక్కా? పెళ్ళయ్యాకా స్త్రీకి భర్తకి అందంగా కనిపించడం కన్నా పరమార్థం ఏవుందీ?” అని అడిగింది.

మాళవిక చెల్లెల్ని అద్దం దగ్గరకి తీసుకెళ్ళి, “చూడు! ఆ ఒంపు తిరిగిన పై పెదవీ, దాని మీద పుట్టుమచ్చా, పెద్ద పెద్ద కళ్ళూ, పసిమి రంగు శరీర ఛాయా… ఇవేమీ నాకు లేవు! నీకున్నాయి… ఇంత అద్భుతమైన అందాన్ని నువ్వు నీ బెడ్ రూమ్ అద్దానికే పరిమితం చేస్తే ఎలా?” అంది.

“అంటే?”

“డయానా హేడెన్‌లూ, సుస్మితా సేన్‌లూ నీకన్నా అందగత్తెలేం కారు! ఆ పోషణా, పరిరక్షణా వల్ల వాళ్ళు శరీరం అలా మలచుకొని ప్రపంచ సుందరీమణులయిపోయారంతే. నువ్వు ‘వూ’ అన్నావంటే నిన్ను ఈ దేశం మొత్తం గుర్తించేలా చేస్తా!” అంది మాళవిక.

“ఒద్దులే అక్కా!” నవ్వేసింది నందిని.

“పాపులారిటీ ఎంత బావుంటుందో తెలుసా? నువ్వూ ఓ పార్టీకి వెళ్ళావనుకో… డెఫినెట్‌గా నీ అందాన్ని గుర్తిస్తారు. ఓ సారి చూసి తల తిప్పేసుకుంటారు. అదే నీతో బాటుగా అదే పార్టీకి ఓ సినిమా నటి కూడా వచ్చిందనుకో… ఆమె నీ కన్నా తక్కువ అందంగా వున్నా సరే… అందరూ ఆమెనే గౌరవిస్తూ, ఆమె చూపుల్లో పడాలని తహతహలాడ్తూ అడుగులకి మడుగులొత్తుతారు! అదే గ్లామర్ అంటే. అప్పుడెంత తీయగా వుంటుందో తెలుసా?” అంది మాళవిక.

నందిని తేలిగ్గా కొట్టి పారేస్తూ “ఈ జీవితానికి ఇలా చాల్లే…” అంది.

“నీ ఇష్టం… నా చెల్లెలి అందం తక్కువదేం కాదని నాకు తెలుసు. దాన్ని లోకంలో మెరిసిపోయేట్లు చేసి అందరి కళ్ళూ కుట్టిద్దామనుకున్నాను. ఒద్దంటున్నావు… నీ ఖర్మ! నే వెళ్ళొస్తా” అని వెళ్లిపోయింది.

***

మాళవిక ఆ తర్వాత వీలు చేసుకుని నందిని ఇంటికి తరచుగా వెళ్ళడం ప్రారంభించింది.

“నందినీ, చందనాలో కొత్త రకం చీరలొచ్చాయట, వెళ్దామా?” అనేది.

“ఈ నెలఖరులోనా?” అని నందిని అనగానే,

“చూసావా, ఆర్థిక స్వాతంత్రం లేక నువ్వు ఎలా సంశయిస్తున్నావో… అందుకే స్త్రీకి ఆర్థికంగా సపోర్ట్ వుండాలి” అనేది.

సతీష్ చంద్ర కొనిచ్చిన కొత్త రకం నగలు పెట్టుకెళ్ళి, “నందీ… ఈ నెక్లెస్ నా మెడలో కంటే నీ మెడలోనే బాగుంటుంది. పెట్టుకో… అయినా మీ ఆయన నీ మెడలోకి ఒక్క నెక్లెసైనా చేయించలేదేమే” అనేది.

నందినిని తీసుకుని పెద్ద పెద్ద హోటల్స్‌కి వెళ్ళేది.

మొదట్లో అంతగా ఇంట్రెస్టు చూపించకపోయినా నందిని, క్రమక్రమంగా అక్కడికొచ్చే వాళ్ళ ఆహార్యం, హంగూ, ఆర్భాటం ఇంతలేసి కళ్ళతో చూడడం మాళవిక గమనించింది.

ఒకరోజు మాళవిక వెళ్ళేసరికీ నందిని గొంతు పెద్దగా వినిపిస్తోంది. శశిధర్ కూడా ఏదో అంటున్నాడు.

“అనండి… అనండి… అస్తమానం పనిమనిషిలా మీకు వూడిగం చేస్తుంటే మీకు అలుసైపోయాను. అదే నేనూ వుద్యోగం చేస్తుంటే మీరిలా అనేవారు కాదు…” అని ఏడుపు గొంతుతో నందిని అనడం వినిపించింది.

మాళవిక వూపిరి బిగపట్టి వింటూ నిలబడింది.

ముందుగదిలోకి వచ్చిన శశిధర్ మాళవికని చూసి తడబడ్డాడు.

“నందీ… చూడు ఎవరొచ్చారో… మీరు మాట్లాడ్తూ వుండండి” అని హడావిడిగా బైటికి వెళ్ళిపోయాడు.

మాళవిక చనువుగా నందిని బెడ్‌రూం లోకి వెళ్ళింది.

నందిని కళ్ళు తుడుచుకుని… “రా అక్కా… రా” అంది.

“ఏవైందే? అలా వున్నావు?” చెల్లెలి భుజం మీద చెయ్యేసి అడిగింది.

“ఏదో చిన్న గొడవ. అనవసరంగా నా మీద చిరాకు పడ్డారు. ఇదంతా సంసారాల్లో మామూలేగా!” నందిని నవ్వడానికి ప్రయత్నించింది.

“ఏవిటే ఆ సమస్య? నాకు చెప్పకూడదా? పరాయిదాన్లా కనిపిస్తున్నానా? నేనేమైనా చెయ్యగలనేమో చూద్దాం చెప్పు…” అంది మాళవిక.

“ఏం లేదు, ఇన్‌స్టాల్‌మెంట్స్ మీదే కదా అని ఐదు వేలు పెట్టి ఓ పట్టుచీర కొన్నాను. ఇప్పుడేం అవసరం అంటున్నారు” అంది.

“ఐదువేల భాగ్యానికి ఇంత గొడవ చేస్తాడా? పదివేలిస్తాను, నాతో మా ఇంటికి రా” అంది మాళవిక.

“వద్దక్కా. కోపం మీద ఏదో అన్నారు గానీ… ఆయనే ఇస్తారు. నేనూ తొందరపడ్డాను. అడిగి కొనాల్సింది” అంది నందిని.

మాళవికకి ఈ మాటలు రుచించలేదు.

“నందీ నాతో నువ్వో చోటికి రావాలి” అని బలవంతంగా బయల్దేరదీసింది.

నందినిని బ్యూటీ పార్లర్‍కి తీసుకెళ్ళి మేనిక్యూర్, పెడిక్యూర్, వాక్సింగ్ అన్నీ దగ్గరుండి చేయించింది. ఆమె హెయిర్ స్టెయిల్‍తో సహా అన్నీ మార్చేసింది. నందిని మొహమాటపడినా, అద్దంలో తనని తాను చూసుకుని తనే ఆశ్చర్యపోయింది. సాయంత్రం భర్త వచ్చాకా, ఏమంటాడో వూహించుకుంది.

మాళవిక ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టడం నందిని ఆశ్చర్యంగా గమనించి “ఇంత డబ్బు రచనల మీదే వస్తోందా అక్కా?” అని అడిగింది.

“ఒకటి అందం… రెండు తెలివీ… వీటితో లోకంలో సాధించలేనివి లేవు! మొదటిది లేకపోయినా నాకు రెండోది పుష్కలంగా వుంది. నీకులా మొదటిది కూడా వుండి వుంటే నేను ఇంతకన్నా లగ్జూరియస్‍గా బ్రతుకుతుండేదాన్ని” అంది మాళవిక.

నందిని కాస్త ఆలోచనల్లో పడింది.

“హాయ్…” అన్న పలకరింపుతో ఒక యువకుడు వాళ్ళ ముందుకి దూసుకు రావడంతో నందిని వులిక్కిపడి తలెత్తింది.

మాళవిక నవ్వుతూ “హాయ్ శ్యామ్… బాంబే నుంచి ఎప్పుడొచ్చారూ?” అంది.

ఆ యువకుడు గెడ్డం పెంచి, చెవికి రింగు పెట్టుకుని, మెడలో పెద్ద పెద్ద పూసలున్న దండ వేసుకుని, జీన్స్ ప్యాంట్, టీ షర్టుతో భలే గమ్మత్తుగా వున్నాడు.

అతను మాళవికతో మాట్లాడ్తూనే నందినిని పరిశీలనగా చూసాడు.

“ఓ పరిచయం చెయ్యనే లేదు కదూ… షీ ఈజ్ మై సిస్టర్ నందిని. నందినీ… ఈయన శ్యామ్ అని డైరక్టర్. ఏడ్ ఫిల్మ్స్ తీస్తారు.” అని పరిచయం చేసింది.

శ్యామ్ బలవంతం మీద ముగ్గురూ హోటల్‌కి వెళ్ళారు.

నందిని శ్యామ్ చూపులకి తెగ ఇబ్బంది పడింది.

మాళవిక ఆ సంగతి గమనించి “ఏమిటీ మా నందినిని అలా చూస్తున్నారూ?” అంది.

“ఆవిడ ఫేస్ అన్ని ఏంగిల్స్ నించీ గమనిస్తున్నాను. బహుశా కెమెరాకి అద్భుతంగా సూట్ అవ్వచ్చు. అదే చూస్తున్నాను” అన్నాడు.

పరాయి మగాడు మెచ్చుకునేసరికి నందిని కంగారు పడింది.

“కొంపదీసి మా నందినితో ఏడ్ ఫిల్మ్ తీస్తాననరు కదా!” అంది మాళవిక.

“ఆవిడ ఒప్పుకుంటే అంత కన్నానా?” అన్నాడు.

నందిని కంగారుగా “ఊహూ!” అనేసింది

“ఇష్టం లేకపోతే బలవంతం లేదు కానీ ఈ ఫిజిక్, ఫేస్‌లో ఛార్మ్… గాడ్స్ గిఫ్ట్స్. అందరికీ వుండవు!” అన్నాడు శ్యామ్.

మాళవిక ఆనందంగా “నందీ… శ్యామ్ మెచ్చుకున్నారంటే మాటలు కావు. అతని దృష్టిలో పడడానికి ఆడపిల్లలు క్యూలు కడ్తారు తెలుసా? నువ్వు చాలా లక్కీ” అంది.

“ఓ… మాలా… మీరు చాలా ఎక్కువగా చెప్పేస్తున్నారు” భుజాలు కదుపుతూ నవ్వాడు శ్యామ్.

“అక్కా… లేట్ అవుతోంది… ఆయనొచ్చేస్తారు” ఇబ్బందిగా అంది నందిని.

“ఎన్ని గంటలకి వస్తాడూ?” అడిగింది మాళవిక.

“ఐదింటికల్లా ఠంచన్‍గా ఇంటికొచ్చేస్తారు” అంది.

మాళవిక వాచ్ చూసుకుని, “ఇంకా అరగంట టైముందే…” అంది.

ఆ తర్వాత శ్యామ్‌తో బాతాఖానీ మొదలెట్టింది.

అతనన్నీ లక్షలూ, కోట్లలోనే మాట్లాడాడు

నందినిని అసహనంగా అనిపించి మాటిమాటికీ టైమ్ చూసుకుంది.

“అక్కా… పద” అని చెవిలో అంటూనే వుంది.

ఐదుంపావుకి మాళవిక లేచి “శ్యామ్ నేను కారు తేలేదు. మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యగలరా?” అంది.

“ఓ… ష్యూర్… ఇట్స్ ఏ ప్లెజర్ ఫర్ మీ” అన్నాడు.

“ఆటోలో వెళ్ళిపోదాం” గొణిగింది నందిని.

మాళవిక ఆ పాటికే అతనితో బాటు నడిచి కార్లో ముందు సీట్లో కూర్చుంది.

నందిని కూడా విధి లేక కారెక్కింది. ఆమె మనసంతా శశిధర్ మీదే వుంది. ‘అసలే ప్రొద్దుట గొడవ పడి టిఫిన్ కూడా పెట్టకుండా పంపించేసాను’ అని మథనపడసాగింది.

నందిని ఇంటికి వెళ్ళే దార్లో మెయిన్ రోడ్ మీద “వో గాడ్… శ్యామ్ ఇక్కడ ఆపండి.. నేను ఇక్కడ ఓ పెద్దమనిషిని అర్జెంటుగా కలవాలి” అంది మాళవిక.

శ్యామ్ కారు ఆపేసాడు.

“నందీ, ముందుకి రా… నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తారు శ్యామ్” అంది దిగుతూ.

“ఒద్దు… నేనూ దిగి నడిచి వెళ్ళిపోతాను. ఇక్కడికి మా ఇల్లు దగ్గరేగా…” అంది కంగారుగా నందిని.

“అబ్బా… నస పెట్టక ముందుకి రావే… అంతలోనే ఏమీ అయిపోదులే!” అంది చిరాగ్గా మాళవిక.

“ప్లీజ్ మిసెస్ నందినీ!” అన్నాడు శ్యామ్.

నందిని విధి లేనట్లుగా ముందుకెళ్ళి అతని పక్కన కూర్చుంది.

శ్యామ్ కారు స్టార్ చేసాడు.

“మేడమ్… మరోలా అనుకోకండి. మరోసారి ఆలోచించుకుని చెప్పండి… మీరు నేను తీసే ఏడ్ ఫిల్మ్‌లో ఏక్ట్ చేస్తే నేషనల్ లెవెల్‍లో ఫేమ్ వస్తుంది. అదీ సాధారణ గృహిణి పాత్రలోనే… ఏమంటారు?” అన్నాడు.

నందిని వెంటనే “వద్దండీ… నాకు అలాంటివి ఇంట్రెస్టు లేదు” అనేసింది.

“ఇలాంటివి ఇంత క్విక్‍గా డిసైడ్ చేసుకోలేరు లెండి. కొద్దిగా టైం తీసుకోండి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. మీ నెంబర్ చెప్పండి” అన్నాడు.

నందినికి తన ఫోన్ నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఇవ్వవలసి వచ్చింది.

కారు నందిని ఇంటిని సమీపిస్తుండగా “మీ పరిచయ భాగ్యం కలగడం నా అదృష్టం” అన్నాడు శ్యామ్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here