[అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా శ్రీ మల్లాప్రగడ రామారావు గారి ‘నన్ను మాట్లాడినివ్వండి’ పుస్తకం నుంచి ఈ కవితని ప్రత్యేక కవితగా అందిస్తున్నాము.]
[dropcap]తి[/dropcap]లకధారణ
రామభజన
జండా వందనం
యోగాభ్యాసం
వీటికే కాదు పరిమితం
మన సంస్కృతి, సంప్రదాయం
పితృవాక్య పరిపాలన కోసమని
పట్టాభిషేకాన్ని కాదని
నార వస్త్రాలు ధరించి కానలకేగడం
అరణ్యవాసాన్నీ ఆస్వాదించడం
ఇదీ మన సంస్కృతి, సంప్రదాయం
ఆడి తప్పరాదని
రాజ్యాన్ని ధారపోసి
ఋణశేషం ఉండరాదని
ఆలినీ బిడ్డనీ అమ్మేసి
తాను కాటికాపరిగా కొలువుతీరడం
ఇదీ మన సంస్కృతి, సంప్రదాయం
తాను సాగించిన మారణ హెూమమే
తన కనులు తెరిపించగా
చక్రవర్తే భిక్షువుగా పరివర్తనమవడం
అహింసా దండం ధరించడం
ఇదీ మన సంస్కృతి, సంప్రదాయం
మానవ మనుగడకైనా
దేశపాలనకైనా
నీతి, న్యాయం రెండూ ఆవశ్యకం
సరిపోదు రాజ్యాంగానికీ చట్టాలకూ లోబడడం
నీతి లక్ష్మణరేఖను దాటకపోవడమే రాజధర్మం