Site icon Sanchika

వజ్రాల మూట

[box type=’note’ fontsize=’16’] వజ్రాల మూటకి ఆశపడిన ఓ గజదొంగని రాజభటులకి పటించి, అసలైన వజ్రాల మూటంటే ఏమిటో తెలిపిన దంపతుల కథని సరళమైన శైలిలో అందిస్తున్నారు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి [/box]

[dropcap]సీ[/dropcap]తాపురంలో ‘స్వామి’ అనే గజదొంగ ఉండేవాడు. వాడు చాలా నేర్పరి. ఎన్ని దొంగతనాలు చేసినా ఎవరికీ చిక్కేవాడు కాదు.

ఎందుకంటే వాడు దొంగతనం చేయబోయే ముందు బాటసారిలా, బిచ్చగాడిలా ఇళ్ళ అరుగులపై పడుకుని, ఆ ఇంటి ఆనుపానులు బాగా తెలుసుకున్నాకనే దొంగతనం చేసేవాడు.

ఒకసారి ఒక ఇంటి అరుగుపై పడుకున్నప్పుడు ఆ ఇంటి యజమాని నిద్రపోయే ముందు “వజ్రాల మూట సంగతేంటి?” అని మెల్లిగా అడగడం వినిపించింది. భార్య అంతకంటే మెల్లిగా “క్షేమం” అంది.

దొంగ తన పంట పండిందనుకున్నాడు. ఎక్కువ ఇళ్ళు కాపలా పడుకోనక్కరలేదు, అనుకొని కొన్ని రోజులు వరుసగా ఆ ఇంటి అరుగుపైనే పడుకోసాగాడు.

రోజూ భర్తో, భార్యో ‘వజ్రాల మూట’ గురించి వాకబు చేయటం, మిగతావాళ్ళు బాగుందనో, జాగ్రత్తగానే ఉందనో అంటుండం వినబడేది.

ఒకనాడు భర్త, భార్యతో తను ఊరికి వెళ్తున్నాని, ‘వజ్రాల మూట’ జాగ్రత్త అని చెప్పటం విన్నాడు స్వామి.

తన పంట పండిదనుకున్నాడు స్వామి. రోజూ పడుకుంటుండం వల్ల, వాళ్ళ మాటల వల్ల ధనవంతులని అర్థం చేసుకున్నాడు స్వామి.

భర్త వెళ్ళేవరకూ చాటుగా ఉండి, తరువత మెల్లిగా దొడ్డి తలుపు తెరుచుకుని ఇంటిలోకి ప్రవేశించాడు.

పడగ్గదిలోంచి మాటలు వినిపిస్తూండటం గమనించి పిల్లిలా అటు వెళ్ళాడు.

భార్య పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకు చెంచాతో పాలు పట్టడానికి ప్రయత్నిస్తోంది. వాడు మారాం చేస్తున్నాడు. ఆమె మెల్లిగా “నా వజ్రాల మూట కదమ్మా. త్రాగాలి. లేకపోతే బలం ఎలా వస్తుంది? తాగమ్మా, లేకుంటే నాన్న కోప్పడతారు. పైగా నీ పని అయ్యాక నువ్వు క్షేమమని చెబితే కాని నాన్న నిద్రపోరు తెలుసా” అంటూ త్రాగిస్తోంది.

స్వామికి మండిపోయింది. దీనికోసమా తను ఇన్ని రోజులు ఈ ఇంటికి కాపలా కాసింది?

“ఇదేనా మీ వజ్రాల మూట?” అన్నాడు కఠినంగా స్వామి, కత్తి తీస్తూ.

భార్య తలెత్తి చూసింది. “ఎవరు నువ్వు?” అంది నిర్లక్ష్యంగా. ఆమె భయపడకపోవటం ఆశ్చర్యం వేసింది స్వామికి.

“నేను గజదొంగ స్వామిని. రోజూ మీ మాటలు విని మీ ఇంట్లో నిజంగా వజ్రాల మూట ఉందనుకున్నాను. ఈ కుఱ్ఱకుంక అనుకోలేదు” అన్నాడు కోపంగా.

“ప్రతి తల్లి తండ్రులకి వాళ్ళ పిల్లలు వజ్ర వైఢూర్యాలూ, బంగారాలే. కాకున్నా ఇప్పుడు వీడు మా పాలిట నిజంగా ‘వజ్రాల మూట’ అవుతాడు” అంది.

“ఎలా?” అన్నాడు భృకుటి ముడుస్తూ స్వామి.

“నిన్ను పట్టిస్తే వజ్రాలు బహుమతిగా ఇస్తామన్న రాజుగారి చాటింపు వినలేదా? నిజానికి కొన్ని రోజులుగా నువ్వు మా ఇంటి అరుగుపై పడుకోవటం చూసి నీవే ఆ దొంగవయ్యుంటావని అనుకున్నాను. నిజంగా బిచ్చగానివయితే బిచ్చమడిగేవాడివి. బాటసారి వయితే ఆశ్రయం కోరేవాడివి. నువ్వు రెండూ చేయటం లేదు. అందుకే ఊరు వెళ్తున్నట్టు నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు స్వామివని. పద రాజుగారి వద్దకు” అన్నాడు వెనుక నుంచి వచ్చిన భర్త విశ్వనాథం, స్వామిని బంధిస్తూ.

“జలజా, ఈ రోజు నుంచి  ఈ వజ్రాల మూటతో పాటు, మనం ఆ వజ్రాల మూటనీ జాగ్రత్త పరచాల్సి వస్తుంది ఇలాంటి దొంగల నుంచి” అన్నాడు విశ్వనాథం నవ్వుతూ.

“నిజమే. కానీ మీలాంటి సునిశిత బుద్ధి కల భర్త ఉండగా నాకేం భయం?” అంది జలజ తనూ నవ్వుతూ.

– ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి

Exit mobile version