Site icon Sanchika

వజ్రోత్సవ నవభారతం సిగ్గుపడిన వేళ!?

(రాజస్థాన్‍లో ఓ దళిత బాలుడు ఇంద్రకుమార్, మట్టికుండలో నీళ్ళు తాగుతుండగా, ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు మరణించాడు. ఈ సందర్భంగా నా హృదయ స్పందన – విడదల సాంబశివరావు)

[dropcap]ఈ[/dropcap] నడిరేయి నిశ్శబ్దంలో
నిదుర రాని నా కన్నుల ముందు
నీ దీన వదనమే తారట్లాడుతోంది!
దాహార్తితో..
పిడచకట్టుకుపోయిన
నాలుకను తడుపుకోవాలని..
గుక్కెడు నీళ్ళ కోసం
మట్టి కుండ ముందు
దోసిలి పట్టిన నీ రూపమే
నా అంతరంగంలో తిష్ట వేసి
క్షణం క్షణం..
నన్ను కలవరపెడుతోంది!
పక్షులు.. పశువులు
మూతి ముంచి నీళ్ళు తాగినా..
మందలించరు గాక.. మందలించరు!
అదేమి చిత్రమో..
పశుపక్ష్యాదులకంటే
హీనమైపోయిందిరా కన్నా.. నీ జన్మ!
ఆకాశంలో హార్మ్యాలు నిర్మించాలని
శూన్యాన్ని ఛేదిస్తూ
గ్రహాంతర యానం చేస్తోన్న
ఆధునిక మానవజాతి..
నవీన సాంకేతిక యుగంలో కూడా
అంటరానితనాన్ని అంతం చేయలేని
నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది!
జాతీయ అంతర్జాతీయ వేదికలపై
భరతజాతి ఘనకీర్తిని..
కంచు కంఠాల స్వరధ్వనులతో వినిపిస్తున్న
జాతినేతల నోళ్ళు మూగబోయాయి!
జనగణమన అధినాయక జయహే
భారత భాగ్య విధాత..
నీ మృత శరీరం ముందు
సిగ్గుతో మోకరిల్లాడు!
స్వతంత్ర భారత వజ్రోత్సవ పండుగ వేళ..
నీ మరణం..
ఈ దేశానికి శాపమేరా తండ్రీ!

Exit mobile version