అభిమానుల్ని నిరాశపరచని వకీల్ సాబ్

7
3

[dropcap]ఇ[/dropcap]ది వకీల్ సాబ్ సినిమా చూసిన తర్వాత నాలో కలిగిన భావాలని వ్యక్తపరుస్తు వ్రాసిన వ్యాసం అనుకోవచ్చు.

లాక్షణికులు దీన్ని సినిమా రివ్యూ అని ఒప్పుకోకున్నా నాకేమి అభ్యంతరం లేదు. కాబట్టి నేను ముందుగానే చెప్పేస్తాను. ఇది రివ్యూ కాదు. ఈ సినిమా గూర్చి నా అభిప్రాయాలు మాత్రమే.

కరోనా లాక్ డవున్ ఉపసంహరణ తర్వాత థియేటర్లలో విడుదల అయిన పెద్ద చిత్రాలలో ఒకటి ఈ వకీల్ సాబ్. కరోనా రెండవ విడత వ్యాప్తి ఉధృతికి దోహదపడిన అంశాలలో ఈ చిత్రం కూడా ఒకటి అని చెప్పటంలో ఏ సందేహం లేదు.

నేను అదృష్టవశాత్తు థియేటర్‌లో కాక అమెజాన్ ప్రైమ్‌లో విడుదల రోజే అంటే ఏప్రిల్ ముప్ఫయ్యవ తేది మధ్యాహ్నం చూడటం జరిగింది.

ఈ సినిమా హిందీ సినిమా ’పింక్’ సినిమాకు రీమేక్ అన్న సంగతి అన్న సంగతి అందరికీ తెలుసు. కాకపోతే తెలుగు ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో చాలా మార్పు చేర్పులు చేశాము అని, ఇంచుమించు మాతృకకి ఈ వకీల్ సాబ్‌కి మౌలికంగా కథలో తప్ప, టేకింగ్‌లో చాలా మార్పులు ఉంటాయి అని దర్శక నిర్మాతలు సినిమా నిర్మాణం ఆరంభం అయింది లగాయతు చెపుతూ రావటం వల్ల ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఒకింత ఉత్సుకతతో ఎదురు చూస్తూ వస్తున్నారు, ఒక రకంగా చెప్పాలి అంటే ప్రేక్షకులు ఏ విధమైన అంచనాలు పెట్టుకోకుండా, మొత్తంగా ఒక కొత్త చిత్రం చూడబోతున్నాము అన్నఓపెన్ మైండ్ తో దీన్ని స్వీకరించటానికి ఇది ఉపయోగ పడింది.

తెలుగు ప్రేక్షకుల అభిరుచిని చాలా తక్కువ అంచనా వేశారు దర్శకులు అని ఫేస్‌బుక్‌లో విమర్శలు కూడా వచ్చాయి.

ఇది వరలో కూడా పవన్ కళ్యాణ్ తన దర్శకుడికి ఇలాంటి స్వేచ్ఛని ఇచ్చాడు, గబ్బర్ సింగ్ సినిమా విషయంలో. కొంత మేరకు హీరోకున్న బలహీనతల్ని, నెగెటివ్ షేడ్స్‌ని తొలగించి ప్రధాన పాత్ర అయిన పోలీసు ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్‌ని కొత్తగా ఆవిష్కరించారు గబ్బర్ సింగ్‌లో కూడ.

ఈ సినిమా విషయంలో కూడా దర్శకుడు అలా స్వేచ్ఛని తీసుకున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కున్న స్టార్ ఇమేజిని, అభిమానుల అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని అతని పాత్రకి ఫైటింగ్ దృశ్యాలు, సంభాషణలలో, అతని రాజకీయ అవసరాల దృష్ట్యా కొన్ని సందేశాలు అందించటం చేశారు.

పింక్‌తో పోల్చటం ఇక్కడ అప్రస్తుతం. ఎందుకు అంటే దర్శక నిర్మాతలు ముందునుంచే చెబుతున్నారు కాబట్టి, తెలుగు వారికి, అందునా పవన్ కళ్యాణ్ సినిమాల దర్శకులకు అది కొత్త కాదు కాబట్టి , దీనిని మూల చిత్రంతో పోల్చకుండా ఒక తాజా చిత్రంగానే చూద్దాము.

సూక్ష్మంగా ఇది కథ:

మీలో చాలా మంది చూసే ఉంటారు ఈ సినిమా. అయినా పద్దతి కాబట్టి కథ వ్రాస్తాను సూక్ష్మంగా.

ముగ్గురు మధ్య తరగతి అమ్మాయిలు హైదరాబాదులో ఉంటు ప్రయివేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటు ఉంటారు. వీళ్ళు ముగ్గురూ ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటు ఏ చీకు చింత లేకుండా, సరదాగా ఉంటూ తమ తమ ఉద్యోగాలు చేసుకుంటూ, తమ తమ కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిస్తూ ఉంటారు. ఒక సాయంత్రం సరదాగా సైట్ సీయింగ్‌కి వెళ్ళి వస్తూ ఉండగా చీకటి పడుతుంది. ఆ టైం లో వాళ్ళ కాబ్ చెడిపోవటం, ఆ క్యాబ్ డ్రయివర్ వాలకం వారికి అనుమానస్పదంగా తోచడం, వేళ కాని వేళలో , ఊరిబయట చీకట్లో అలా చిక్కుబడిపోవడం, అటుగా దారిలో వెళుతున్నా ఏ ఒక్క కారు సహాయానికి ఆపకపోవడం వల్ల వీరు బాగా భయపడిపోతారు. వీరి ప్రయత్నాలు ఫలించి ఒక కారు ఆగుతుంది. యాధృచ్చికంగా ఆ కారు లోంచి ఆ అమ్మాయిల్లో ఒకరి చిన్నప్పటి క్లాస్‌మేట్ ఒకడు దిగుతాడు. అతన్ని నమ్మి కారెక్కుతారు.

ఆ తరువాత సీన్‌లో ఈ ముగ్గురమ్మాయిలు హడావుడిగా భయం భయంగా పారిపోవటం, ఆ కుర్రాడి తలకు బలమైన గాయం అవటంతో అతని మిత్రులు అతన్ని సిటీలోని ఆసుపత్రికి తీస్కువెళ్ళటం చూపెడతారు.

అక్కడ ఏమి జరిగింది? ఈ విషయం సినిమా చివరలో చూపుతారు. నమ్మి కారెక్కిన అమ్మాయిల్ని, సిటీకి కాకుండా ఊరిచివర విల్లాకి తీసుకువెళ్ళటం, ఒకమ్మాయి మీద ఆఘాయిత్యం చేయబోవడం, ఆమె తన మాన రక్షణార్థం జరిపిన పోరాటంలో అతని తలపై బలంగా సీసాతో కొట్టి గాయపరచడం, ఈ ముగ్గురమ్మాయిలు పారిపోవటం జరుగుతాయి.

ఇరుపక్షాల వారు పోలీసు రిపోర్ట్ ఇవ్వరు. కానీ ఈ అబ్బాయిలు రాజకీయ ప్రాబల్యం ఉండటం వల్ల అహంకారంతో, ఆ అమ్మాయి మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒక దశలో విధి లేని పరిస్థితిలో ఈ అమ్మాయి పోలీసు రిపోర్టు ఇస్తుంది. అందుకు ప్రతిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడతారు. వారిని అనేక విధాలుగా ఇబ్బంది పెడతారు. ఏ ఒక్క లాయరు, ఏ ఒక్క పోలీసు వీరికి సాయం చేయటానికి ముందుకు రారు. ఆ దశలో సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) అనేక నాటకీయ పరిణామాల అనంతరం, వీరి కేసు చేపట్టి, కేసు గెలిచి సత్యమేవ జయతే అని నిరూపిస్తాడు. చివరి సీన్లలో నిస్సహాయులైన ఆ అమ్మాయిలు కృతఙ్జతతో కళ్ళనీళ్ళు పెట్టుకుని ఒక పెద్దన్నని ప్రేమగా పట్టుకున్న రీతిలో పవన్ కళ్యాణ్ ని పట్టుకున్న దృశ్యం అప్పుడు ప్రేక్షకుడికి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. దర్శకుడికి ప్రేక్షకుల భావోద్వేగాలను ఒడిసి పట్టడం తెలుసు అన్నది ఇలాంటి సన్నివేశాలలో తెలుస్తుంది. ఆ సమయంలో సంగీతం కూడా బాగా కుదిరింది.

ఇదీ కథ.

మొత్తం మీద ఈ సినిమాకి మంచి మార్కులే ఇవ్వచ్చు.

ఇది మాస్ మసాల చిత్రం అని అనుకుని ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్ళి కూర్చుంటే నిస్సందేహంగా ఈ చిత్రం మీకు నచ్చుతుంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది పండగే. అతని పాత్రని ఆకాశం అంత ఎత్తుకు మలచారు. ఆ పాత్రకి తగిన విధంగా మెట్రో ట్రయిన్‌లో, టాయిలెట్లలో ఫైటింగ్ లు అభిమానులకు నచ్చుతాయి., కోర్టు రూమ్‌లో కుర్చీలు విరగగొట్టటం, టేబులుని విరగ గొట్టటం, ప్రత్యర్థి లాయర్‌తో బాహా బాహీకి దిగబోవడం ఇవన్నీ ఆ పాత్ర లక్షణాలుగా సరిపెట్టుకుంటే చింత ఉండదు.

దర్శకుడు ప్రేక్షకుల నాడి బాగానే పట్టాడు.

పవన్ కళ్యాణ్‌కి పెట్టిన కొన్ని సంభాషణలు అతని రాజకీయ ఉద్దేశాలని తేటతెల్లం చేస్తాయి.

“ప్రజలు భయస్తులు. మనతో ఉన్నట్టే ఉంటారు. ఎదుటి వాడు భయపెడితే భయం వేసి మనకు దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళు నాతో ఉన్నా లేకున్నా, నేను వారితోనే ఉంటాను.”

“నేను వస్తాను. తప్పకుండా వస్తాను” లాంటి సంభాషణలు అభిమానుల చప్పట్ల కోసం పెట్టారు అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ కాస్తా ఒళ్ళు చేశాడు. పొట్ట కనిపిస్తోంది. నడకలో కూడా చురుకుదనం తగ్గింది. డైలాగుల్లో ఆ పదును వాడి తగ్గలేదు. ముఖకవళికలు, నటన, మాటల్లో విరుపు బాగున్నాయి. అతిథి పాత్రలో శృతిహాసన్ చక్కగా చేసింది. గబ్బర్ సింగ్ మాజిక్ కాసేపు తెరపై కనిపించింది.

అంతా బాగుంది కానీ నాకు వ్యక్తిగతంగా నచ్చని కొన్ని విశేషాలు చెబుతాను.

తనకు నచ్చని దుస్తులే తమ వంటిని టచ్ చేస్తే చిరాకు పడతారే అమ్మాయిలు, అలాంటిది తనకు నచ్చని వాడు నచ్చని విధంగా తాకితే ఎదురుతిరగరా అంటాడు పవన్ కళ్యాణ్. అంత వరకు బాగుంది.

ఇరవై ఒకటో ఏట తన బాయ్ ఫ్రెండ్‌తో తను కన్యాత్వాన్ని కోల్పోయానని చెబుతుంది ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఒకరైన నివేథ థామస్. ఆమె ఇష్టపడి తన బాయ్ ఫ్రెండ్‌తో సంభోగించింది కాబట్టి అది తప్పు కాదని సమర్థిస్తాడు పవన్ కళ్యాణ్. అసలు ఈ అంశం కథతో ఏ విధంగా సంబంధంలేదు.

అమ్మాయిలు మద్యపానం చేయటం, వివాహానికి పూర్వమే శృంగారంలో పాల్గొనటం తప్పే కాదు అన్న హింట్ ఎందుకో ఇస్తున్నారు ఇటీవలి చిత్రాలలో. చేతన్ భగత్ నవలల్లో కూడా ఇదే తరహా భావాలు చూస్తాము. ఇప్పటి సమాజంలో అమ్మాయిలు తనకిష్టమొచ్చినట్టు వస్త్రధారణ చేసుకోవడం తప్పు కాదు అని కొందరు వాదిస్తుంటారు. పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఇదే చెబుతుంది. వస్త్రధారణ కారణంగా అబ్బాయిలు రెచ్చిపోవడం నిజమైతే పసిపిల్లల్ని ముసలివాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మానవమృగాలు అని కూడా ప్రశ్నిస్తాడు. వినటానికి ఈ లాజిక్ బాగానే ఉంటుంది. సగటు ఫెమినిస్టులు లేవనెత్తే ప్రశ్న ఇది. సినిమాల ద్వారా, ఇంటర్‌నెట్ ద్వారా, బయట అమ్మాయిల వస్త్రధారణ ద్వారా మతి చెడిన రాక్షసులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాటేస్తారు అన్న చిన్న కామన్ సెన్స్‌తో కూడిన పాయింట్‌ని మిస్ అవుతున్నారు.

సమాజాన్ని సినిమాల ద్వారా, సీరియళ్ళ ద్వారా క్రమంగా విశృంఖలత వైపు అనైతికత వయిపు డ్రయివ్ చేసే ప్రయత్నాలు బాహాటంగా సాగుతున్నాయి. ఈ సినిమా కూడా మినహాయింపు కాదు ఈ పరంగా. నచ్చిన వారితో నచ్చిన విధంగా శృంగారంలో పాల్గొనటం తప్పు అన్న విధంగా హీరోలు, మన గౌరవ సుప్రీంకోర్టులు కూడా చెప్పటం లేదు. కాకపోతే సురక్షిత శృంగారం చేసుకొమ్మని సలహా ఇస్తున్నారు. మనం ఎటు వెళుతున్నాం?

కోర్టులో ఈ సన్నివేశం అప్పుడు ఆ అమ్మాయి తండ్రి తలవంచుకుని బయటకు వెళ్లి పోతాడు. అక్కడికి బుద్ధిమంతుడే డైరెక్టర్. “ఏ హోటల్లో కలిసారమ్మా, ఎలా జరిగింది” అని ఆసక్తిగా ఆడిగినట్టు చూపలేదు ఆ పాత్రని ఇంకా నయం.

“ఆయన మద్యం తాగితేనే బాలెన్స్‌గా ఉంటాడు. మద్యం తాగకపోతే రెచ్చిపోతాడు” అంటూ పవన్ కళ్యాణ్ దగ్గర సహాయకుడిగా ఉండే ఒక పాత్ర చెపుతూ ఉంటుంది. ఇది కూడా నాకు నచ్చలేదు. యువతకు ఎలాంటి సందేశాల్ని ఇస్తున్నారు మన చిత్ర దర్శకులు?

ఈ ముగ్గురమ్మాయిల పాత్రలని నివేతా థామస్, అనన్య నాగల్ల, అంజలీ జరీన్ పోషించారు. శృతి హాసన్ , పవన్ కళ్యాణ్‌కి జోడీగా అతిథి పాత్రలో తళుక్కు మంటారు. ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, దేవ్ గిల్, వంశీ కృష్ణ, కేదార్ శంకర్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, నాగినీడు, సీవీ ఎల్ నరసింహరావు, అనీష్ కురువిళ్ళ ఇలా చాలా మందే తారాగణంలో ఉన్నారు.

నిర్మాత దిల్ రాజు. చిత్ర సమర్పణ బోని కపూర్. (వీరిద్దరి జీవితాల్లోని విషాదం నుంచి బయటపడి వృత్తి పట్ల ఏకాగ్రత చూపటం వారి నిబద్ధతని చూపిస్తుంది)

దర్శకత్వం వేణూ శ్రీరాం. ఇతనికి నూటికి నూరు మార్కులు ఇవ్వవచ్చు. తనకు అప్పజెప్పబడ్డ బాధ్యతని నిజాయితీగా నెరవేర్చాడు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ యొక్క అంచనాల్ని తలకిందులు కానివ్వకుండా మూలకథలో ఆత్మ దెబ్బతినకుండా, మాస్ టచ్ ఇవ్వటానికే ప్రాధాన్యత ఇస్తూ క్లాస్ లుక్ తెప్పించే ప్రయత్నం చేశాడు. అసభ్యతకి అవకాశం ఉన్న కథ. కథనం, సంభాషణలు, చిత్రీకరణ అన్నీ సభ్యతగానే తెచ్చాడు. అతనిపై ఉన్న భారాన్ని అర్థం చేసుకోగలము.

సంగీతం ఎస్. తమన్. బాగా చేశాడు. ‘మగువా మగుగా’ పాట బాగా హిట్టయ్యింది. ఫోటోగ్రఫీ పీ ఎస్ వినోద్‌కి మంచి మార్కులే ఇవ్వాలి. మొత్తం మీద ఈ సినిమా అభిమానుల్ని నిరాశపరచదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here