[box type=’note’ fontsize=’16’] ఇతరులకు నీతులు చెప్పి, తాము పాటించని ఘనులను గురించి వివరిస్తున్నారు భువనచంద్ర ‘వక్త’ సిరీస్‌లో. ‘మనుగడకి మార్గం’ మొదటి కవిత. [/box]
[dropcap]బ్ర[/dropcap]హ్మాండమైన ఉపన్యాసం
వక్త గారి ముద్ద మాటలు
ముందు మసాలా వడలు
వెనక వంధి మాగధులు
మధ్యమధ్య ‘వాహ్‌వా’లూ
అప్పుడప్పుడూ ‘ఆహాహా’లూ
ఉపన్యాసం సాగుతూనే వుంది.
రాజకీయపుటెత్తులూ
సినీ నవరసాలూ
పడుచుల వయ్యారాలూ
పేదల కష్టనష్టాలూ
ఆత్మస్తుతులు
పరనిందలూ
సాగిపోతూనే వున్నాయి.
“మధ్యే మధ్యే ఫారిన్ పానీయం సమర్పయామి”
“పవిత్ర ధూపం ఆఘ్రాపయామి”
వడల నైవేద్యం వుండనే నుంది…
మాటలు మొలకైత్తుతూనే వున్నాయి.
“అమ్మ అన్నానికి పిలుస్తోంది… రావూ”
పసి పాప పలుకు
“ఛీ నీయమ్మ ఫో…”
నాన్నగారి హుంకరింపు
“ఇదండీ సంగతి
ఆడది గాడిద”
కురిశాయి చప్పట్లు
విరిశాయి చిరునవ్వులు.
“ఇంతకీ ఎక్కడున్నాం?”
వక్తగారి సందేహం
“పసి పిల్లల పాలన గురించి”
శిష్యుడి గారి సమాధానం.
“అదే మరి పిల్లల్ని ప్రేమగా చూడాలి
పెంపకంలో ప్రేమ రంగరించాలి
పిల్లల కోసం తల్లిదండ్రులు తమ
పెడ బుద్ధులను విడవాలి…
పసి పిల్లల పసిడి నవ్వుల్తో యీ
ప్రపంచం మురియాలి.
పొరబాటు మనం చేస్తే
గ్రహపాట్లు పిల్లలవేగా!
పిల్లల కోసం.. వాళ్ళ
తల్లుల కోసం.. మనం
అలవాట్లు మార్చుకోవాలి
మంచి పౌరులుగా మనం
మనుగడ సాగించాలి!”
“నిజం నిజం”
ఊగాయి ఎన్నో తలకాయలు
“కళ్ళు తెరిపించారు”
వర్షించాయి ఎన్నో కళ్ళు.
అర్థరాత్రయ్యే సరికి
అన్ని గ్లాసులూ ‘ఢీ’కొన్నాయి.
ఆకలితో ఆత్రంగా
అన్నాలు అందుకున్నాయి.
మందు తాగిన మత్తులో
చిత్తుగా వూగిన వక్త
వాకిలి తలుపు తెలిచి
వరండాలో పడ్డాడు.
నవజీవనానికి నాంది
నడుము నెప్పి.
మనుగడకి మార్గం
మత్తు మందే!
ఏ ప్రమాణం మిగలకపోయినా
ఈ ప్రమాణం పక్కా మిగిలింది.