[dropcap]ఇ[/dropcap]ప్పుడు వారికి కావల్సింది
సానుభూతి కాదు
గృహ నిర్భంధం
అంత కన్నాకాదు
వాళ్ళని బ్రతికించండి
విధి రాసిన వింతనాటకంలో
అతిధి పాత్రలు వాళ్ళు
గమ్యంలేని
గూడు లేని
వలస పక్షులు వాళ్ళు
వాళ్ళని బ్రతికించండి
ఏ సౌభాగ్యానికి నోచుకోని
నిర్భాగ్యులు వాళ్ళు
చెల్లాచెదురైన పిచ్చుక గూళ్ళు
చితికి పోయిన బ్రతుకులు వాళ్ళవి
వాళ్ళని బ్రతికించండి
పేగు బంథం నడిపిస్తుంది
ఆకలి పేగు ఏడిపిస్తుంది
దూరం ఎరుగని
భద్రతలేని
బహుదూరపు బాటసారులు వాళ్ళు
వాళ్ళని బ్రతికించండి
కాలేకడుపులు చేత్తో పట్టుకుని
వేదనలన్ని గుండెలో పెట్టుకుని
ఉపాధి భారమేకాని
భౌతిక దూరం తెలియని
అభాగ్యులు వాళ్ళు
వాళ్ళని బ్రతికించండి
సాయం చేసే చేతులుకోసం
కడుపు నింపే ఆర్తుల కోసం
ఉపాధి చూపే మనసులకోసం
రక్తాశ్రువులతో ఎదురుచూస్తున్నారు
వాళ్ళని బ్రతికించండి