[dropcap]“వ[/dropcap]దినా వివేక్, శివాని వస్తున్నారు” ఫోన్‌లో గాయత్రి గొంతు చాలా హుషారుగా వినిపించింది.
“ఆ శబ్దం ఏమిటి? నువ్వు డాన్స్ చేస్తున్నావా ఏమిటి కొంపదీసి?” అంది మాలతి నవ్వుతూ.
“పో వదినా! అన్నీ నీకు తమాషా”
“ఇందాకే వివేక్ ఫోను చేసాడు టిక్కెట్లు కొన్నారుట. ఇంకో నెలలో వస్తారు. నెల ఉంటారుట” సంతోషంగా చెప్పింది గాయత్రి. వివేక్, శివాని గాయత్రీ కొడుకు, కోడలు.
“పోనీలే 5 సంవత్సరాల తరవాత వస్తున్నారు, సంతోషం” అంటున్న మాలతితో “మళ్లీ చేస్తాను వదినా ఇంకా వంట కూడా చేయలేదు” అని ఫోను పెట్టేసింది గాయత్రీ. గాయత్రి మాలతి ఆడపడుచు.
మాలతి భర్త మధు. వీళ్ళ కూతురు ప్రియ, కొడుకు ప్రవీణ్. ఇద్దరు ఇండియాలోనే ఉంటారు. అమ్మాయి ఢిల్లీ, అబ్బాయి బెంగళూరు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అందరూ ఉద్యోగస్థులే. శని ఆదివారాలతో ఇంకో రోజు సెలవ కలిసి వస్తే వచ్చి పోతూ ఉంటారు.
మధుకి ఒక్కతే చెల్లెలు గాయత్రి, ఆమె భర్త భూషణం. వాళ్ళ గారాబు కొడుకు వివేక్.
అతను ఇంటర్ చదువుతున్నప్పటినుంచి నుంచి గాయత్రీ , భూషణం వాడిని అమెరికా వెళ్ళమని అక్కడ స్వర్గంలా ఉంటుందని తెగ చెప్పేవారు.
“ఉన్న ఒక్కడిని ఎందుకు అక్కడికి? ఇక్కడే ఇండియాలో ఉంటే మీకు తోడుగా ఉంటాడు” అని మధు, మాలతి చెప్తే, అన్న, వదిన మీద కోపం వచ్చేది గాయత్రికి.
“ఇండియాలో ఏముంది? అమెరికాలో కోట్లు సంపాదించచ్చు, అమెరికాలో డబ్బులే డబ్బులు” అనేది గాయత్రి.
“వివేక్ అక్కడే ఉంటే, ఎంచక్కా మేము ప్రతి సంవత్సరం అమెరికా వెళ్ళచ్చు, అక్కడి నుంచి అన్ని దేశాలు తిరగచ్చు, గ్రీన్ కార్డు వస్తే మేము అక్కడే ఉండిపోవచ్చు” అంటే
మధు అనేవాడు “ఆ రోజులు పోయాయి ఇప్పుడు ఇండియాలో కూడా ఏమి తక్కువగా లేదు, జీతాలు బావున్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి హాయిగా మన దేశంలో ఉండకుండా ఎందుకు?”
ఆ మాటకి కోపం వచ్చి మొహం ముడుచుకుని కూర్చునేది గాయత్రి.
పాపం భూషణానికి కొడుకు ఇక్కడే ఉంటేనే బావుణ్ణు అని ఉన్నా భార్య బాధపడుతుంది అని ఊరుకునేవాడు.
“సరేలెండి, ఎవరి ఇష్టం వాళ్ళది” అని మాలతి సర్ది చెప్పేది.
తల్లి, తండ్రి కోరుకున్నట్టుగానే వివేక్ ఇంజినీరింగ్ అయ్యాక ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు.
కొడుకు వెళ్ళాక దిగులుగా అనిపించిన భూషణం ఒకటి రెండు సార్లు “చదువు అయ్యాక ఇండియా లోనే ఉద్యోగం చూసుకోవచ్చు కదా” అని అంటే
“అయ్యో ఇంత కష్టపడి వాడిని అమెరికా పంపింది వచ్చేయడానికా? అప్పు అయినా తీర్చాలికదా” అనేది గాయత్రి.
అక్కడి జీవితానికి అలవాటు పడ్డ వివేక్ “కొన్నేళ్లు ఉండి వస్తాలే నాన్నా” అనేవాడు.
ఉద్యోగం వచ్చి, అప్పు తీరి, కుదురుకున్నాక తల్లి, తండ్రి పెళ్లి చేసుకో అని గోల పెడితే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల సంబంధం కావాలని, అక్కడే తన లాగా ఇండియా నుంచి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి, శివానిని చూసాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చారని తెలిసాక ఇండియాలో ఇరువైపుల తల్లి తండ్రులు కలుసుకొని అన్ని మాట్లాడుకొని నిశ్చితార్థం పెట్టుకున్నారు.
ఇక్కడ వీళ్ళు తాంబూలాలు మార్చుకుంటే, అక్కడ అమెరికాలో అమ్మాయి ఒక ఊళ్ళో, అబ్బాయి ఇంకో ఊళ్ళో నుంచి వీడియోలో ఆ తంతు చూసారు.
‘అయ్యో! కాబోయే కోడలిని ముఖాముఖీ కలవకుండానే పెళ్లి ఏమిటి?’ అని ఒక నిమిషం అనుకున్నా – ‘ఆఁ అమెరికాలో ఉద్యోగం చేసే కోడలు కావాలంటే తప్పదు, సర్దుకోవాలి మరి’ అనుకుంది గాయత్రి.
ముహూర్తం పెట్టి తేదీ చెపితే సరిగ్గా వారం ముందు వచ్చారు వివేక్, శివాని. ఆ వారంలో ఇద్దరూ కలిసి బట్టలు కొనడం, పెళ్లి రిజిస్ట్రేషన్, ఫోటో షూట్లు సరిపోయాయి.
పోనీ, పెళ్లి బట్టలు కొనడానికి వెళదామనుకున్నా “మేము డ్రెస్ కోఆర్డినేట్ చెయ్యాలి” అంటూ వాళ్లే కొనుక్కున్నారు.
అబ్బాయిని అమ్మాయి తరఫు వాళ్ళు, అమ్మాయిని అబ్బాయి వేపు వాళ్ళు చూడడం పెళ్లి లోనే.
పెళ్లి అయ్యాక, అమ్మాయి అత్తగారింట్లో వ్రతానికి చుట్టంలా వచ్చి పూజ, భోజనం చేసి ఒక పూట అయినా ఉండకుండా వెళ్ళిపోయింది. “అదేమిటి గాయత్రీ” అని మాలతి అంటే “హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు వదినా, రాత్రి అక్కడే ఉంటారుట” అంది.
అబ్బాయి కూడా, అత్తగారింట్లో మూడు నిద్రలకు బదులు, ఒక పూట భోజనం చేసి, నిద్రకి ఇద్దరు కలిసి హోటల్‌కి వెళ్లారు.
పెళ్లి చేసుకొని, సెలవలు లేవు అని మళ్ళీ వారానికి ఎవరి ఊరికి వాళ్ళు వెళ్లిపోయారు.
ఇద్దరు పెళ్లి అయి అమెరికా వెళ్ళాక, నెలకి ఒకసారి ఎవరికి కుదిరితే వాళ్ళు ఇంకొకళ్ల దగ్గరికి వెళ్లేవారు.
అలా రెండు సంవత్సరాల తరవాత ఇద్దరు ఒక దగ్గరికి చేరారు.
మధు, మాలతి జాలి పడేవారు. ఏమిటి కొత్తగా పెళ్లి అయినా వాళ్ళు ఇలా దూరంగా ఉండడం అని, కానీ గాయత్రీ వాళ్లు మాత్రం ఇది మాములే అమెరికాలో అన్నట్టు ఉండేవారు.
పోనిలే ఒక దగ్గరికి చేరారు అనుకునే లోగా ప్రపంచాన్ని కరోనా ముంచెత్తింది.
కనీసం ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు అనే సంతోషం. వారానికి ఒకసారి తల్లి తండ్రులకి వీడియో కాల్ చేసి మాట్లాడేవారు. ఎక్కువగా “ఎలా ఉన్నారు? మేము బావున్నాము మీరు బావున్నారా?” తోనే సంభాషణ ముగిసిపోయేది.
ఎలాగో కరోనా తగ్గింది. ప్రపంచంలో కాస్త రాకపోకలు మొదలు అయ్యాయి.
అప్పుడు వివేక్ ఫోన్ చేసి చెప్పాడు ఒక నెల కోసం వస్తున్నాము అని. అంతే గాయత్రి సంతోషానికి అడ్డు లేదు.
కొడుకు వచ్చాక అందరిని ఒక రోజు భోజనాలకి పిలవాలి అని, కోడలికి ఏమి వంటలు రుచి చూపించాలి, ఏమి నేర్పించాలి ఇవే ఆలోచనలు.
“వదినా నువ్వు చేసే పులిహోర వివేక్‌కి ఇష్టం. మీ ఇంట్లో ఒక రోజు భోజనాలు పెట్టుకుందాము” అంటే “తప్పకుండా గాయత్రీ” అని మాలతి అంది.
“శివానిని తీసుకొని ఒక రోజు షాపింగ్‌కి వెళదాము, తనకి మంచి చీరలు, నగలు కొనాలి. ఒకసారి వాళ్ళ అమ్మగారు వాళ్ళని పిలుద్దాము, అందరం కలిసి గడుపుదాము. ప్రియాని, ప్రవీణ్‌ని కూడా ఫామిలీతో రమ్మను. నాలుగు రోజులు ఉండి వెళతారు” ఊపిరాడకుండా చెప్తున్న గాయత్రిని చూసి నవ్వింది మాలతి.
“గాయత్రీ నువ్వు ముందు కంగారు తగ్గించుకో. వివేక్ వాళ్ళు వచ్చాక, వాళ్ళతో మాట్లాడి అన్నీ ప్లాన్ చేయచ్చు” అన్నాడు మధు.
“నిజం అదే కరెక్ట్” అని మాలతి కూడా అనేసరికి గాయత్రి కొంచెం హడావిడి తగ్గించింది.
“విమానం వచ్చేసరికి అర్థరాత్రి అవుతుంది, నాకు ఇల్లు తెలుసు, మీరు ఎయిర్పోర్ట్‌కి రావద్దు” అని కొడుకు పదిసార్లు అనేసరికి, ప్రాణం కొట్టుకు పోతున్నా, వీళ్ళు ఇంట్లోనే ఎదురుచూస్తూ ఉన్నారు.
తెల్లవారుజామున 4 గంటలకి బెల్ మోగగానే ఇద్దరు పరిగెత్తుకు వెళ్లి తలుపు తీసేసరికి ఎదురుగా వివేక్ నుంచుని ఉన్నాడు.
గాయత్రికి 5 ఏళ్ళ తరువాత కొడుకుని చూసేసరికి దుఃఖం వచ్చింది.
కొడుకుని పట్టుకొని కళ్ళు తుడుచుకొని “ఎన్నేళ్లయిందిరా చూసి? ఎలా ఉన్నావు?” అని అటు ఇటు చూసి “శివాని ఏదిరా?” అని అడిగింది.
“రావద్దు అన్నా. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు ఎయిర్పోర్ట్‌కి, తను వాళ్లతో అటు వెళ్ళింది” అన్నాడు.
“అదేమిటిరా ముందు ఇక్కడికి వచ్చి వెళ్ళచ్చుగా” అంటున్న గాయత్రితో “ఏదో ఒకటి లేమ్మా. రేపు వస్తుంది, అలసి పోయాను పడుకుంటాను” అంటే, “నీ కోసం టిఫిన్ రెడీ చేశాను తిని పడుకో” అంది.
“లేదమ్మా, నేను విమానంలో తిన్నాను” అని రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు.
ఐదు ఏళ్ళ తర్వాత వచ్చాడు, కూచుని కబుర్లు చెప్తాడు అని ఊహించిన వీళ్ళకి కొడుకు ఏమి మాట్లాడకుండా పడుకునేసరికి ఉసూరుమనిపించింది.
వివేక్ లేచేసరికి సాయంత్రం 4 అయింది. ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు భోజనం చేస్తాడు అని ఎదురు చూస్తూ, తాను కూడా తినకుండా ఉంటానంటే భూషణం కోప్పడ్డాడు.
“వాడు లేచి తింటాడు నువ్వు అంత సేపు తినకుండా ఉండకు” అని.
వివేక్ లేవగానే “అమ్మా! కాఫీ ఇవ్వు” అని అడిగేసరికి గాయత్రి గబా గబా కాఫీ చేసి ఇచ్చింది.
“నీకు ఇష్టమైన వంకాయ కూర, మామిడికాయ పప్పు చేశాను. స్నానం చేసి తింటావా?” అని అడిగితే “లేదమ్మా, శివాని వస్తుంది. మేము బయటికి వెళ్లి భోజనం చేసి వస్తాము,శివాని బిరియాని తిందామంది” అన్నాడు.
పోనిలే రేపు వీళ్ళకి నచ్చింది చేద్దాము అనుకుని గాయత్రి నవ్వి ఊరుకుంది. వివేక్ స్నానం చేసి రెడీ అయ్యేలోగా శివాని వచ్చింది. వాళ్ళ నాన్నగారి కార్‌లో డ్రైవర్‌ని పెట్టుకొని.
“హాయ్ ఆంటీ, హలో అంకుల్ ఎలా ఉన్నారు” ఎవరో బయట వాళ్ళు పలకరించినట్టు అనిపించింది గాయత్రికి.
వీళ్ళు అనేది వినకుండానే “విక్కీ రెడీయేనా” అనేలోగా “నేను రెడీ” అంటూ వివేక్ వచ్చాడు.
“వస్తాము ఆంటీ” అని, “విక్కీ మన ప్రోగ్రాం చెప్పావా?” అని అడిగితే “లేదు నువ్వు వచ్చాక చెప్దామని ఆగాను” అన్నాడు వివేక్.
“ఆంటీ మేము రేపు రాజస్థాన్ వెళ్తున్నాము, మా పెళ్లి అయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు, అదికాక నా ఫ్రెండ్ పెళ్లి ఉదయపూర్ పాలస్‌లో నెక్స్ట్ వీక్, ఈలోగా నేను విక్కీ చుట్టుపక్కల చూసి, పెళ్లి చూసుకొని 10 డేస్ తరవాత వస్తాము. డిన్నర్ తరవాత, మేము మా ఇంటికి వెళ్లి, అటునుంచి అటే ఎయిర్పోర్ట్‌కి వెళ్తాము. మళ్ళీ రాజస్థాన్ నుంచి వచ్చాక అందరము కలుద్దాము. బై” అంటూ వివేక్ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళింది శివాని.
“అసలు ఏమి చెపుతోంది మీకు అర్థం అయిందా?” అయోమయంగా భర్తని అడిగింది గాయత్రి, అంతకంటే అయోమయంగా చూస్తున్న భూషణం తల అడ్డంగా ఊపాడు.
రాజస్థాన్‌కి వెళ్లి 10 రోజులు అన్నవాళ్ళు 15 రోజులకి వచ్చారు. రావడం డైరెక్టుగా ఇద్దరు ఇక్కడికి వచ్చారు. పోనిలే ఎప్పటికో అప్పటికి వచ్చారు అని సంతోషపడింది గాయత్రి.
ఒక పూట ఇంట్లో తిన్నారు. ఆ తరవాత రోజూ ఫ్రెండ్స్‌తో డిన్నర్లు, షాపింగులు.
“ఒక పూట అన్నా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి కలుద్దాము” అంటే ఇదుగో అదుగో అని అవలేదు.
“పోనీలే మేమే వస్తాము” అని మధువాళ్ళు వస్తే సరిగా అరగంట కూడా లేరు.
2 రోజులు ఫ్రెండ్స్‌తో ఫార్మ్ హౌస్ అని, ఇంకో రోజు ఫ్రెండ్‌తో చార్మినార్ గిఫ్ట్స్ కొనడానికి అని గట్టిగా 24 గంటలు పూర్తిగా ఇంట్లో ఉన్నది లేదు, భోజనము చేసింది లేదు.
శివాని వాళ్ళ అమ్మ నాన్న వచ్చి గోల, మా ఇంట్లో కూడా రెండు రోజులన్నా లేరు, మొదట ఉన్నదే అంటూ.
ఏదైనా చెప్దామా అంటే, అసలు మనుషులు కనిపిస్తే కదా? వేసుకున్న ప్లాన్లు అన్ని పోయాయి, కోడలికి చీరలు కొందామంటే నేను కట్టను అంటూ ఆ డబ్బులతో రెండు డ్రెస్సులు కొంది శివాని.
అత్తగారికి ,వాళ్ళమ్మకి అంటూ పట్టుచీరలు కొంది, ఒకోటి 25 వేలు పెట్టి. ముందు ఆ ధర చూస్తేనే అమ్మో అని కట్టబుద్ధి కాలేదు గాయత్రికి .
ఆ రంగులు ఆ జరీలు అసలు కట్టలేను, పోనీ బిల్ ఇవ్వు నేను మార్చుకుంటా అంటే “బిల్ ఎక్కడో పారేసాను, నచ్చకపోతే ఎవరికో ఒకరికి ఇచ్చేయండి” అంది తేలిగ్గా.
వాళ్ళ రూమ్ చూస్తే కాలు పెట్టే సందు లేదు. రూమ్ నిండా ఒకటే పాకెట్స్. అన్నీ పెట్టెలలో కుక్కేసారు.
బయట తిని తినీ కడుపులు పాడయ్యి చివరి రెండు రోజులు ఇంట్లో పెరుగు అన్నం తిన్నారు.
బాధ ఆపుకోలేక వివేక్‌తో అంది గాయత్రి. “నెల రోజులు ఉంటామన్నారు, కనీసం నాతో, నాన్నతో ఒక గంట కూడా కూచోలేదు. నీకు, శివానీకి ఇష్టమైనవి చేస్తే తింటారు అంటే, ఇన్ని రోజులు బయట తిని చివరికి ఇంట్లో పెరుగు అన్నం తిన్నారు. ఏమిట్రా ఇది నాకేమి నచ్చలేదు” అంటే
“ఫోన్‌లో మాట్లాడ్తున్నాము కదా! మీతో ఏమి కబుర్లు ఉంటాయి. ఏవైనా తినడానికి పంపాలి అంటే కొరియర్ చేయి. అక్కడ తింటాము, మేము ఎన్నో ప్లాన్లు చేసుకున్నాము అన్ని అవలేదు. అందరు స్నేహితులని కలవలేదు” అనేశాడు చిరాగ్గా.
“పొనీలేరా వచ్చే ఏడు మీరు స్థిమితంగా రండి, మీకు కుదరకపోతే మేము వస్తాము” అంది గాయత్రి ఆశగా.
“లేదమ్మా మాకు ఈ ట్రిప్‌కి 7, 8 లక్షలు ఖర్చు అయ్యాయి. ఇప్పట్లో మేము రాము. మీరు రావాలంటే మీరే టికెట్స్ కొనుక్కుని రండి” అన్నాడు.
“ఆంటీ వాళ్ళకి కూడా అదే చెప్పాము. అందరు ఒకసారి కాకుండా రండి” సింపుల్‌గా తేల్చేసాడు.
“బై బై” అంటూ ఓ హగ్, ఓ కిస్ ఇచ్చి ఇద్దరు వెళ్లిపోయారు, “ఎయిర్పోర్ట్‌కి రావద్దు” అని.
నీరసంగా కూలబడిన గాయత్రి “ఎన్నో అనుకున్నాను, ఒక్కటి అవలేదు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఒకళ్ళని పిలవలేదు, పట్టుమని పది నిముషాలు మాట్లాడలేదు, అసలు ఆ అమ్మాయికి ఏమి ఇష్టం? ఎలా వండుతుంది? ఏమీ కూడా తెలీదు.
మనమేమిటి మన పద్ధతి ఏమిటి అని కూడా ఆ అమ్మాయికి తెలీదు. ఇంటి కోడలి లాగా లేదు ఎవరో బయట వాళ్ళలాగా ఆంటీ, అంకుల్ అంటూ, వాడూ ఏమి మాట్లాడడు.
మన నలుగురమూ కూచుని ఒకసారి కూడా భోజనం చేయలేదు, ఏ రోజూ వాళ్ళు తింటారని వండడం, పని అమ్మాయికి ఇవ్వడం, రోజు లంచ్, డిన్నర్లు ఫ్రెండ్స్ తోనే , షాపింగులు వాళ్ళతోనే. అసలు వీళ్లు ఎవరి కోసం వచ్చారు? ఫ్రెండ్స్ కోసమా? మన కోసం రాలేదా” ఏడుస్తూ అంది గాయత్రి.
“వాళ్ళు ఫ్రెండ్ పెళ్లి కోసం వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళ కోసం గిఫ్ట్స్ కొనడానికి వచ్చారు. పనిలో పని మననీ చూసారు. హోటల్‌లో ఉండకుండా ఇంట్లో సామాను పెట్టుకున్నారు. ‘వలస పక్షులు’ గాయత్రీ వాళ్ళు. అవసరానికి వచ్చి పని అయిపోగానే ఎగిరిపోతారు. బంధాలు, అనుబంధాలు పెట్టుకోలేరు. మనతో ముఖాముఖీ మాట్లాడడం మర్చిపోయారు. ఫోన్‌లో మాట్లాడతారు. ఏ రెండేళ్ల తరవాతో వాళ్ళు పిల్లలని కంటే, వాళ్ళని చూడాల్సిన అవసరం ఉంటే, మన్ని పిలుస్తారు. ఆ అమ్మాయి ఆ టైంలో వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించుకుంటే అదీ ఉండదు. ఎవరూ లేకపోతే బేబీ కేర్‌లో పెడతారు.
తప్పు మనదే! వాడిని మనమే ఊదరగొట్టాము, అమెరికా, అమెరికా అని. చదువు అయ్యాక వచ్చి ఇక్కడే ఉద్యోగం చూసుకోమను అంటే నువ్వు వినలేదు. ఏదో కోట్లు పంపిస్తాడు అన్నావు. వాడిది వాడికే సరిపోవట్లేదు.
అప్పటికీ మీ అన్నయ్య, వదినా అంటూనే ఉన్నారు, వాడిని ఇక్కడే ఉండనివ్వండి, ఇప్పుడు ఇక్కడే బావుంది అని. అక్కడ ఏమి సుఖమో, ఏ కష్టమో మనకి తెలీదు, కానీ వాళ్ళు అలవాటు పడ్డారు. ఇక్కడికి రారు, చుట్టపు చూపుగా తప్ప. తప్పదు మనం చేసుకున్న దానికి అనుభవించాలి. ఇలా వీడియో కాల్ అమ్మ నాన్నలుగా బతకాలి అంతే” విసురుగా అన్నాడు భూషణం.
భూషణం అన్నది నిష్ఠూరంగా ఉన్నా నిజం కనక ఏమి అనలేక నిశ్శబ్దంగా ఏడ్చింది గాయత్రి.
(వేరే దేశానికి వెళ్లిన వాళ్ళు అందరూ ఇలా ఉంటారని కాదు, కానీ ఈమధ్య ఈ శాతం ఎక్కువ అయింది. అలా బాధపడ్డ కొందరు తల్లి తండ్రులని చూసి వ్రాసింది ఈ కథ)