[dropcap]జ[/dropcap]నవరి 30, 2024వ తేదీ సాయంత్రం 5 గంటలకు త్యాగరాయ గానసభ చిక్కడపల్లి, హైదరాబాద్ లోని గుండవరపు హనుమంతరావు కళావేదిక మీద ‘వంశీ-లేఖిని జాతీయ పాహిత పురస్కారాల ప్రదానం- 2024’ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
స్వర్ణయుగం వాటి కీర్తిశేషులయిన 9 మంది రచయిత్రుల పేర్ల మీద నేటి 9 మంది రచయిత్రులకు ‘నవరత్నాలు’ పేరుతో పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమానికి వంశీ రామరాజు అధ్యక్షులుగా, వి.యస్.జనార్ధన మూర్తి విశిష్ట అతిథిగా, పొత్తూరి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఇల్లిందల సరస్వతీదేవి పురస్కారం ఆచార్య సుమతీ నరేంద్రకి, భానుమతీ రామకృష్ణ పురస్కారం వారణాసి నాగలక్ష్మికి, ద్వివేదుల విశాలాక్షి పురస్కారం చెంగల్వల కామేశ్వరికి, గోవిందరాజు సీతాదేవి పురస్కారం సుజల గంటికి, అబ్బూరి ఛాయాదేవి పురస్కారం పోల్కంపల్లి శాంతాదేవికి, మాదిరెడ్డి సులోచన పురస్కారం అల్లూరి గౌరీలక్ష్మికి, డా.సి. ఆనందారామం పురస్కారం గంటి భానుమతికి, అరికెపూడి కౌసల్యాదేవి పురస్కారం తురగా జయశ్యామలకి, యద్దనపూడి సులోచనారాణి పురస్కారం జి.యస్.లక్షికి అందజేశారు.
ప్రముఖ రచయిత్రులు సరస్వతీ కరవది, ఉమాదేవి కల్వకోట, భార్గవి రమురామ్, నండూరి సుందరీ నాగమణి, మణి వడ్లమాని, కస్తూరి అలివేణి, నళిన ఎర్రా తదితరులు పురస్కారగ్రహీతలను పరిచయం చేశారు.
తమకు మార్గదర్శకులయిన రచయిత్రుల పేరు మీద పురస్కారాలను అందుకోవడం సంతోషంగా ఉందని పురస్కార గ్రహీతలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
లేఖిని అధ్యక్షురాలు అత్తలూరి విజయలక్ష్మి నిర్వహించిన ఈ కార్యక్రమం, కార్యదర్శి సరస్వతి కరవది వందన సమర్పణతో ముగిసింది.