వందనమిదె భారతీ!

4
3

[శ్రీమతి జె. శ్యామల రచించిన ‘వందనమిదె భారతీ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]యం సమయం. సమత అలవాటుగా బాల్కనీలో కూర్చుంది. ఆకాశం ఎంతో ఆహ్లాదంగా ఉంది. సూర్యుడు, చంద్రుడు విధులు మార్చుకునే ఆ సమయంలో ఆకాశాన్ని వీక్షించడం సమతకు ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడు ఆ అందాలేవీ ఆమె మనసును తాకడం లేదు. కారణం, ఆమె అన్యమనస్కంగా ఉండడమే. ఈ మధ్య ఎడతెగని ఆలోచనలతో అలసిపోతోంది సమత. ఇప్పుడూ అదే పరిస్థితి. ఆమె ఆలోచనలు తన తాతగారి దగ్గరకు వెళ్లిపోయాయి.

‘తాతయ్య ధర్మారావు గొప్ప దేశభక్తుడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లాడు. అమ్మమ్మ తన నగలను స్వాతంత్ర్యోద్యమానికి విరాళంగా ఇచ్చేసింది. అవి కూడా ఒకటీ, అరా నగలు కాదు. స్థితిపరులైన తల్లిదండ్రులకు ఆమె, ఒక్కర్తే కూతురు కావడంతో ఆమెకు లేని నగ అంటూ ఉండేది కాదట. అలాంటిది, దేశం కోసం అవన్నీ తృణప్రాయంగా ఇచ్చేసిందంటే ఆమెకున్న దేశభక్తికి వెలకట్టగలమా? ఉద్యమంలో ముందు నడిచేందుకు భర్తకు పూర్తి మద్దతునిచ్చింది. ఇక తన తండ్రి రామచంద్ర, ఉన్న భూమినంతటినీ వినోబా భావే చేపట్టిన భూదానోద్యమానికి విరాళమిచ్చాడు. మామయ్య భరత్ భూషణ్, సైన్యంలో చేరి కర్తవ్య నిర్వహణలో అసువులు బాశాడు. తన నరనరాల్లోనూ అదే దేశభక్తి ప్రవహిస్తోంది. దేశం మనకేమిచ్చింది అని కాకుండా, దేశానికి నేనేం చేస్తున్నాను అనే ఆలోచనతోనే తన వంతుగా సేవాపథంలో పయనిస్తోంది. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ మాటతో స్ఫూర్తి పొందింది. చేతనైనంత వరకు అనాథలకు ఆర్థిక సాయం చేస్తోంది. ఎన్నోసార్లు రక్త దానం చేసింది. మొన్న కరోనా సమయంలోనూ పేదలను ఆదుకునేందుకు తన వంతుగా కొంత సాయపడింది. పిల్లలు స్వేచ్ఛ, స్వరాజ్ లకు కూడా చిన్నప్పటినుండి దేశభక్తి బోధిస్తూనే ఉంది. భారత స్వాతంత్ర్య గాథను వారికి అర్థమయ్యే రీతిలో పదేపదే చెప్పింది. బడిలో ఏటా స్వాతంత్ర్య దినోత్సవానికి దేశభక్తి గీతాలు శ్రద్ధగా నేర్పి పంపేది. అలాగే వ్యాస రచన, వక్తృత్వం, చిత్ర లేఖనం పోటీలకు కూడా దేశభక్తి అంశంపై వారికి తర్ఫీదునిచ్చి పంపేది. పిల్లలు కూడా చురుకుగా ఉంటూ, అన్నీ బాగా నేర్చుకుని, బహుమతులు పొందడం తల్లిగా తనకెంతో గర్వకారణంగా ఉండేది. కాలం పరుగులు తీస్తుండగా ఇద్దరూ హైస్కూల్ చదువు ముగించి, కాలేజీ చదువులు చదివి గ్రాడ్యుయేట్లు అయ్యారు. స్వరాజ్, కలెక్టర్ అవుతానని సివిల్స్ కోచింగ్‌లో చేరాడు. స్వేచ్ఛ హైస్కూల్‌లో వుండగానే ఎన్.సి.సి.లో చేరింది. ఇంటర్‌లో ఎంపిసి గ్రూప్ తీసుకుని ర్యాంక్ తెచ్చుకుంది. ఇంజనీరింగ్‌లో చేరుతుందేమో అనుకుంటే అందులో ఆసక్తి చూపలేదు. బి.ఎస్.సి కంప్యూటర్స్ చేసింది. మరో వైపు యోగా మొదలుపెట్టింది. శరీర దారుఢ్యానికి కావలసినవన్నీ చేస్తోంది. ఆ తర్వాత చెప్పింది, తనకు భారత వైమానిక దళంలో చేరాలని ఉందని. తను ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్వేచ్ఛను వైమానిక దళానికి పంపడమా? నచ్చిన చదువు చదివించి, ఇష్టమైన ఉద్యోగం సాధించాక, మెచ్చిన వాడితో పెళ్లిచేసి, సంతోషంగా ఉంటే చూడాలనుకుంది. కానీ స్వేచ్ఛ ఆశయం వేరుగా ఉంది. తన మనసులో కలవరం మొదలైంది. ఆరోజు కూడా ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంది.’

అంతలో ‘అమ్మా!’ స్వరాజ్ పిలుపు.

ఉలిక్కిపడి చూసింది.

‘ఏంటమ్మా ఆలోచిస్తున్నావ్?’ అడిగాడు

‘చెల్లి గురించేరా’ అంది తను.

‘స్వేచ్ఛ గురించా? ఏమయిందిప్పుడు?’ అన్నాడు.

‘ఏమీలేదు, వైమానిక దళంలో చేరుతానంటోంది’ చెప్పింది.

‘ఏమిటీ, స్వేచ్ఛకు ఏమైనా పిచ్చా? మగవాడిని నేనే ఐ.ఎ.ఎస్. చేయాలనుకుంటే, తను వైమానికదళంలో చేరుతుందా! అక్కడికి నేను పిరికి దద్దమ్మను, తనేమో వీరనారి అనుకుంటోందా? నాన్నకు తెలుసా ఈ విషయం?’ కోపంగా అడిగాడు స్వరాజ్.

కొడుకు తీరుకి సమతకు బాధ, కోపం కలిగాయి. తనను తాను నిగ్రహించుకుంటూ ‘ఆడ, మగ వివక్ష భావనలతో మిమ్మల్ని, నేను పెంచలేదు. ‘మగవాడిని నేనే..’ అన్న నీ మాట నాకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తోంది. నేను, స్వేచ్ఛను వైమానిక దళానికి పంపడానికి వెనుకాడడం కేవలం దాని మీద నాకున్న ప్రేమాతిశయంతోనే కానీ ఆడపిల్ల అన్న చిన్నచూపుతో కాదు. ఎవరికి ఇష్టమైన రంగం వారు ఎంచుకుంటారు. నాన్నకు కూడా చెప్పాను. మరోసారి బాగా ఆలోచించుకోమన్నారే కానీ నీ లాగా మాట్లాడలేదు. స్వేచ్ఛ చిన్నపిల్ల కాదు. తన అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి’ స్పష్టంగా చెప్పింది.

స్వరాజ్‌కు తన మాటలోని పొరపాటు తెలిసివచ్చింది. తన తీరు తనకే చిన్నతనంగా అనిపించింది.

‘సారీ అమ్మా! నువ్వు చెప్పినట్లు స్వేచ్ఛ అభిప్రాయానికే విలువనివ్వాలి. నేను ఇందాక అన్న మాటలు స్వేచ్ఛకు చెప్పవు కదూ’ అన్నాడు.

‘చెప్పనులేరా. నీ చిన్నారి చెల్లిని నువ్వే స్వయంగా అభినందిద్దువు గానిలే’ నవ్వుతూ అంది సమత.

***

ఆ మర్నాడు సాయంత్రం షరా మామూలుగా సమత బాల్కనీలో కూర్చుని ఉండగా, స్వేచ్ఛ వచ్చి, ఆత్మీయంగా భుజంపై చేయి వేసింది.

‘రా! వచ్చి కూర్చో’ అంది సమత.

స్వేచ్ఛ వచ్చి, తల్లికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని, నవ్వుతూ ఆమె వంక చూసి, ‘ఏమిటీ ఆలోచిస్తున్నావ్?’ అడిగింది.

‘ఏం ఉంది, నీ గురించే.. మమ్మల్ని వదిలి వెళుతున్నావుగా’ అంటుంటే సమత గొంతు వణికింది.

‘ఓ అదా.. పిచ్చి అమ్మా, అసలు దేశభక్తిని మాకు చిన్నప్పటినుంచి నేర్పించింది నువ్వే కదా. భారత స్వాతంత్ర్య గాథ ఎన్ని సార్లు వర్ణించి, వర్ణించి చెప్పావు. ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం నాచేత చేయించి మురిసిపోయావు కదా. ఉత్తమ పౌరులుగా ఉండాలని ఎప్పుడూ చెపుతుంటావుగా.. అన్ని రంగాలలో మహిళలు అడుగుపెడుతున్న ఈ కాలంలో రక్షణ రంగంలో మాత్రం వెనుకడుగు ఎందుకు? పురుషులే త్యాగాలు చేయాలా? మహిళలు చేయకూడదా? సైన్యంలో మహిళలకు అవకాశాలు లభించాక కూడా అందుకోవడానికి వెనుకాడితే ఎలా? వైమానిక దళంలో చేరాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది. దేశ సేవ వేరే రంగాలలో కూడా చేయవచ్చు. మానవ సేవ చేయడం కూడా దేశ సేవే అవుతుందని నాకు తెలుసు. కానీ నాకు నచ్చిన మార్గమిది. అమృత హృదయంతో నన్ను ఆశీర్వదించు. నీ కూతురు వైమానిక దళానికి వెళ్ళడం నీకు గర్వకారణం కాదా అమ్మా? మా అమ్మ అందరిలా కాదు, ఆడ, మగ వివక్ష లేకుండా బిడ్డలకు మద్దతు ఇస్తుంది. నా ఆశకు, ఆశయానికి ఊతమిస్తుందని నా నమ్మకం. నువ్వు, నా నమ్మకాన్ని వమ్ము చేయవనే నా మనసు బలంగా చెపుతోంది. అమ్మగా నువ్వు, నాకు పెళ్ళి చేయాలని, నేను పిల్లాపాపలతో సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలని కోరుకోవడం సహజం. కానీ దాని కంటే మిన్నగా, భరత మాత సేవలో తరిస్తానన్న నన్ను ఆశీర్వ దించలేవా?’ అడుగుతున్న స్వేచ్ఛను చూసి, సమత మారు మాట్లాడలేకపోయింది. ఆ మాటలకు గర్వంగా అనిపించింది.

‘తన చిన్నారి స్వేచ్ఛ ఎంతగా ఎదిగిపోయింది! ఆలోచనలో ఎంత పరిణితి. నిజమే, అమ్మలందరూ స్వార్థ ప్రేమతో ఉంటే దేశ రక్షణ సాధ్యమేనా? ఎంతెం తమంది వీరమాతలు, వీర తిలకం దిద్ది తమ బిడ్డలను సైనిక రంగానికి పంపుతున్నారు.. ఇప్పుడు తను కూడా వారిలో చేరుతుంది. వీర మాతను నేను’ లోలోపల అనుకుంటుంటే ఆమె హృదయం అనిర్వచనీయ ఆనందంతో నిండిపోయింది. వెంటనే లేచి స్వేచ్ఛను గుండెలకు హత్తుకుని, ‘స్వేచ్ఛా! నీ ఇష్టమే నా ఇష్టం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న నీకు, నా ఆశీస్సులు నిరంతరం నిండుగా ఉంటాయి’ అంటూ నుదుటిని చుంబించింది.

‘మా మంచి అమ్మ’ అంటూ స్వేచ్ఛ, భక్తిగా తల్లికి ప్రణమిలింది.

***

ఆ తర్వాత వైమానిక దళంలో ఉద్యోగావకాశాల ప్రకటన రావడం, స్వేచ్ఛ ఫ్లయింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకోవడం జరిగిపోయాయి. పైగా స్వేచ్ఛకు ఎన్.సి.సి. ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ సర్టిఫికెట్ కూడా ఉండడంతో, ఎన్.సి.సి. స్పెషల్ ఎంట్రీ ద్వారా దరఖాస్తు చేసుకుంది ఆపైన వైమానిక దళ ఎంపిక బోర్డ్ వారి పరీక్షలలో రెండు అంచెలను విజయవంతంగా దాటింది. వైద్య పరీక్షలు కూడా అయ్యాయి.

స్వేచ్ఛ కల ఫలించింది. శిక్షణకు పిలుపు వచ్చింది. స్వేచ్ఛ మనసుకు రెక్కలొచ్చి ఆనందలోక విహారం చేయసాగింది.

అమ్మను అమాంతం పైకెత్తి తిప్పింది.

‘ఏయ్ స్వేచ్ఛా! ఆగు’ సమత భయపడి అరిచింది. ఆ తర్వాత ‘అమ్మా స్వేచ్ఛా! అభినందనలు!! నీ కల నెరవేరింది. అమ్మగా నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఎంతో గర్వకారణంగా ఉంది’ అంటూ లోపలకు వెళ్లి, లడ్డూ తెచ్చి స్వేచ్ఛ నోటికి అందించింది.

‘ధన్యవాదాలు సమతమ్మా’ చిలిపిగా అంది స్వేచ్ఛ.

కూతురు విజయం విని తండ్రి గుండె ఆనందంతో ఉప్పొంగింది. స్వరాజ్ కూడా చెల్లిని మనస్ఫూర్తిగా అభినందించాడు. స్వేచ్ఛ వెళ్లడానికి ఏర్పాట్లు ఒక వైపు, కుటుంబమంతా కలిసి రోజుకో వేడుకగా గడపడం మరొక వైపు. అంతా సందడే సందడి. స్వేచ్ఛ వెళ్లే రోజు రానే వచ్చింది. ఎవరికి వారు బెంగను మనసులోనే దాచుకుని, స్వేచ్ఛకు చిరునవ్వుతో వీడ్కోలు పలికారు.

***

స్వరాజ్ కూడా తన కల సాకారం చేసుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. అతడి కష్టం ఫలించింది. స్వరాజ్ ఐ.ఎ.ఎస్. అయ్యాడు. ఉత్తరాదిలో పోస్టింగ్ వచ్చింది. ఆ విషయం చెపుతూ స్వరాజ్ తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. ‘స్వరాజ్! ఈ రోజు మాకెంతో సంతోషంగా ఉంది. నీ కల, చెప్పాలంటే మా కల కూడా ఫలించింది. ప్రజా సేవ చేయడానికి నీకు మంచి అవకాశం లభించింది. ధర్మం, న్యాయం, బీదాబిక్కీ అంశాలను దృష్టిలో ఉంచుకుని కర్తవ్య నిర్వహణ చెయ్యాలి నువ్వు. నీకు మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి’ సంతోషంగా అంది సమత.

‘అలాగే అమ్మా!’ వినయంగా అన్నాడు స్వరాజ్.

‘మన పిల్లలిద్దరూ రత్నాలండీ’ భర్త వైపు చూస్తూ అంది సమత.

‘అవును’ అంటూ తండ్రి, స్వరాజ్‌ను ప్రేమగా దగ్గరకు తీసుకుని భుజం తట్టాడు.

ఆ తర్వాత స్వేచ్ఛ నుంచి కూడా స్వరాజ్‌కు అభినందనలు అందాయి.

***

ఉదయ భానుడు ‘శుభోదయం’ చెపుతూ ఆకాశంలో అరుణిమలు పరుస్తున్న వేళ కాఫీ తాగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది సమత. అంతలో హఠాత్తుగా దినపత్రిక వచ్చి కాళ్ల ముందు పడడంతో ఉలిక్కిపడింది, ఆపైన దాన్ని చేతుల్లోకి తీసుకొని చూసింది.

పత్రికలో పై భాగంలో స్వేచ్ఛ ఫొటో.. సమత గుండె వేగంగా కొట్టుకుంది. కళ్లు అక్షరాల వైపు పరుగులు తీశాయి. ‘ఇండియా, చైనా సరిహద్దుల్లో తొలి మహిళా ఫ్లైట్ కమాండర్‌గా స్వేచ్ఛ..’ ఆనందంతో మనసు తేలిపోతుండగా.. భర్తకు ఆ వార్త చెప్పాలని ‘ఏమండీ’ అంటూ లోపలి గదిలోకి పరుగు తీసింది. అదే సమయంలో స్వేచ్ఛ దగ్గరనుండి ‘అమ్మా! పేపర్ చూసేశావా? నీకు ఆశ్చర్యానందాలు కలిగించాలనే ముందుగా చెప్పలేదు. నాకు ఆకాశం అందుకున్నంత ఆనందంగా ఉంది. మీరు పండగ జరుపుకోండి. నా మిఠాయిలు కూడా మీరే తినేయండి.. ప్రేమతో..’ అని వర్తమానం.

సమత ముఖంలో వెల్లువైన సంతోషాన్ని చూస్తూనే భర్త, ఆమె చేతిలోని పేపర్ అందుకుని చూశాడు. ఆనందంతో ఉక్కిరబిక్కిరవుతూ ‘సమతా! మన స్వేచ్ఛ!’ అంటూ ఆమె చేతులు అందుకున్నాడు.

‘అవునండీ.. మన ముద్దుబిడ్డే.. మేటి మహిళా ఫ్లైట్ కమాండర్’ సంతోష గర్వాతిశయాలు పెల్లుబికే స్వరంతో అంది సమత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here