‘రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.
***
[dropcap]“ఆ [/dropcap]విధంగా సీతాదేవిని పోగొట్టుకున్న రాముడు లక్ష్మణుడితో కలసి దండకారణ్యమంతా సీతాన్వేషణ గావించుచూ, సీతాదేవి ఎడబాటును భరించలేక మిక్కిలి దుఃఖించుచూ ఒక చోటనిలిచి నేత్రంబులు జలపాతాలై వర్షించు చుండగా ‘ఓ వనదేవతలారా! ఓ సమస్త జంతు జాలంబులారా! మీరైనా నా సతిని గాంచలేదా… నా మైధిలిని ఏ దుర్మార్గుడు దొంగిలించెనో తెలుపలేరా..’ అని ఆ పరంధాముడు మామూలు మానవ మాత్రునివోలే దగ్గర స్వరంతో ఆక్రోశించెను. అటుల దుఃఖ సాగరమున మునిగియున్న శ్రీరామచంద్రుని ఓదార్చి పైకి లేపి మరలా సీత అన్వేషణ గావించెను లక్ష్మణుడు. అలా రామలక్ష్మణులు ఆ కారడివిని బడి సీతమ్మ వారి కోసం గాలించుచూ చివరికి కిష్కింద రాజ్యమును సమీపించెను.” కథ చెప్పడం ఆపి పిల్లల వైపు చూసింది సత్యవతమ్మ. అందరూ ఆసక్తిగా వినడం గమనించి మరల కథ ఆరంభించింది.
“అలా నడువగా నడువగా పాదములు సలవరించగా ఒక చెట్టు కింద విశ్రమించినారు రామలక్ష్మణులు. కిష్కింధా రాజ్యాధిపతియగు సుగ్రీవుని మంత్రి అయిన ఆంజనేయుడు ఆ చెట్టు మీదనే ఉండి ఫలములను భక్షించుచుండెను. వానిని చూసి అదొక వింత వానరమని, దానివల్ల తమకు హాని కలుగునని భావించిన లక్ష్మణుడు బాణమును ఎక్కుపెట్టగా రాముడు వలదని వారించెను. అది ఈ కీకారణ్యమున ఫలముల భక్షించు వానరము, దానివలన మనకే అపాయము కలుగదని చెప్పెను. మానవకారులైన ఆ ఇద్దరినీ చూచుచు బెరకు బెరకుగా వృక్షము దిగిన ఆంజనేయుని చెంతకు బిల్చి కౌగిలించుకొనెను శ్రీరాముడు. అది ఈ సృష్టిలోనే అద్భుతమైన ఘట్టం. నర వానర సంయోగము. సాగర సేతుబంధనమునకు మరియు దుష్టరావణ సంహారమునకు ప్రారంభ హేతువు. ఆశ్చర్య చకితుడైన లక్ష్మణునితో ‘లక్ష్మణా..! ఇతడు అంజనీ తనయుడు ఆంజనేయుడు, వానర యోధుడు, శైవాంశ సంభూతుడు. మనకు గొప్ప భక్తుడు’ అని శ్రీరాముడు అనగా లక్ష్మణుడు కూడా సంతోషించెను. అప్పుడు ఆంజనేయుడు శ్రీరామచంద్రుని పాదములకు ప్రణమిల్లి ‘స్వామీ! తమ దర్శన భాగ్యమునకై ప్రతిదినము వేయి కళ్ళతో నిరీక్షించుచుంటిని. ఇన్నాళ్లకు తమ దర్శన భాగ్యమునకు నోచుకుంటిని’ అని తన్మయత్వముతో పలికెను. అంతట శ్రీరాముడు సీతాపహరణ మొదలు జరిగిన వృత్తాంతమును ఆంజనేయునికి వివరించి ‘హనుమా..! సీత అన్వేషణ కార్యములో సహాయమోనరించుమ’నగా, ‘చిత్తం స్వామి! ఇచ్చటికి కొలది దూరంలోనే గల ఋష్యమూక పర్వతమున నా రాజగు సుగ్రీవుడున్నాడు. అచటికి చేరిన పిదప అందరము కలిసి సమాలోచన సలుపుదము’ అన్నాడు ఆంజనేయుడు. రామలక్ష్మణులు అటులేయనగా ఆంజనేయుడు ముందు నడుచుండగా రామలక్ష్మణులు అతనిని అనుసరించుచు ఋష్యమూకము చేరిరి. అక్కడ సతివియోగముచే చిక్కిశల్యమైన సుగ్రీవునికి రామలక్ష్మణులను పరిచయం చేసెను. అంతట సుగ్రీవుడు పరమానందము చెంది కోసల రాజ్యపాలకులైన రామలక్ష్మణులకు ప్రణమిల్లి ‘స్వామి! అధికార మదముతో విర్రవీగు యా వాలిని సంహరించి నాకు కిష్కింద రాజ్యము ఇప్పించితివేని, నేను నేను సీత అన్వేషణ కార్యక్రమమున వలయు సహాయ మొనర్చేదన’ని సుగ్రీవుడు పలుకగా –
‘ఓ సూర్య నందనా! అటులనే మాట ఇస్తున్నాను. సూర్యచంద్రులు గతులు తప్పినా, కులగిరులు సైతము కూలబడిననూ ఆ గర్వాంధుడైన వాలిని హతమార్చి నిన్నీ కిష్కింధా రాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెద. సూర్యవంశ రాజులు ఎన్నడు ఆడిన మాట తప్పరు’ అన్నాడు శ్రీరాముడు. అప్పుడు సుగ్రీవుడు పరమానంద భరితుడు అవుతాడు. కానీ అతని మనసులో ఒక అనుమానం ఆరుద్ర పురుగు లాగా తోలుస్తుంటుంది. అదేమంటే వాలి మహాబలశాలి. మహా బలవంతుడైన దుందుభిని మట్టు పెట్టినాడు. అటువంటి దుర్భేద్యుడగు వాలిని శ్రీరాముడు చంపటం అటు ఉంచితే అసలు ఎదురుకొనగలడా అని సుగ్రీవుని మనసులో అనుమానం గూడు కట్టుకున్నది. ఒకనాడు శ్రీరాముడు, సుగ్రీవుడు అలా వ్యాహ్యాళికి అడవిలోకి బయలుదేరిన సమయంలో సుగ్రీవుడు తన మనసులోని అనుమానాన్ని బయట పెట్టాడు. ‘సుగ్రీవా! నీ అనుమానం నివృత్తి కావలెనంటే అదిగో సుదూరమునున్న సప్త తాళముల (ఏడు తాటి చెట్ల) ను ఏకకాలమున ఖండించెద చూడుమ’ని కోదండము నెక్కు పెట్టి బాణము విడిచెను. అంతట వరుసగానున్న ఏడుతాటి చెట్లు ఒకే క్షణంలో ఫెళఫెళమంటూ నేలకొరిగెను. ‘భళా రామచంద్ర భళా, ఇంతకాలం నా మనసులో ఉన్న అనుమానమంతయూ పటాపంచలైపోయినది’ అన్నాడు సుగ్రీవుడు.” అంటూ ఆపింది సత్యవతమ్మ.
“నానమ్మ… ఇది నిజమేనా..! నువ్వు చెప్పినట్లు రాములోరు వేసిన ఒక్క బాణానికే ఏడు తాటి చెట్లు పడిపోయినాయా..” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.
సత్యవతమ్మ కున్న పదిమంది మనవాళ్లలో రాంబాబు చాలా తెలివైనవాడు. ఆమె రెండో కొడుకు రెండో సంతానం రాంబాబు. చిన్న వయసు వాడైనా కథలు వినడంలోనూ, పురాణ పాత్రల్ని అర్థం చేసుకోవడంలోనూ, వాటిలోని అతిశయోక్తుల్ని కనిపెట్టడం లోను చాలా గట్టివాడు. ఏ కథ విన్నా అందులోని ఆశ్చర్యకర ఘట్టాలు వస్తే తప్పకుండా ప్రశ్నిస్తాడు. అనుమానం తీరకపోతే ఒకటికి నాలుగు సార్లు చర్చించి అనుమానాన్ని నివృత్తి చేసుకొనే రకం. ఇంకా అడ్డు తగల లేదేమో అని సత్యవతమ్మ అనుకుంటుండగానే అడ్డొచ్చాడు రాంబాబు. ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు రాంబాబు అడ్డు తగులుతూనే ఉంటాడు.
“అవును. నాయనా.. శ్రీరామచంద్రుని మహిమ అలాంటిది. చిన్నప్పుడు విశ్వామిత్రునితో కలసి అడవికి పోతున్నప్పుడు ఆయన కాలు తగిలి రాయి ఆడపిల్లగా మారిందంట!”
“నిజమా నానమ్మా! ఏంటి ఏంటి మళ్లీ చెప్పు. రాములోరి కాలు తగిలి రాయి ఆడమ్మాయిగా అయ్యిందంటనా!”
“అవునయ్యా… శ్రీరామచంద్రమూర్తి మామూలు మనిషి కాడు నాయనా… ఈ భూమ్మీద దుర్మార్గులైన రాక్షసుల్ని సంహరించడానికి సాక్షాత్తు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాయనా..!”
“నిజమా..! వైకుంఠం నుంచి వచ్చాడా… మరైతే దశరథ మహారాజుకి కౌసల్యమ్మకి పుట్టాడని చెప్పావే…”
“అవును నాయనా… ఆ వైకుంఠమూర్తి అంశతో దశరథ మహారాజుకి, కౌసల్యమ్మకి పెద్ద కొడుకుగా పుట్టి ఈ భూమి మీద మామూలు మనిషిగా అన్ని బాధలు పడి చివరికి తన భార్యని ఎవరో ఎత్తుకొని పోతే మామూలు మనిషిలాగ దుఃఖిస్తున్నాడు.”
“నానమ్మ ఈ కథ చాలా బాగుంది..! ఆ తర్వాత చెప్పు” అంటూ తొందర పెట్టాడు రాంబాబు. ఏ కళాకారుడికైనా ప్రేక్షకుల లేదా శ్రోతల స్పందన ముఖ్యం కాబట్టి ఇప్పుడు ఇంకా రెట్టించిన పెట్టించిన ఉత్సాహంతో చెప్పడం ప్రారంభించింది సత్యవతమ్మ.
“అప్పుడు ఇంక వాలి సుగ్రీవుల యుద్ధమారంభమైంది. ఋష్యమూక పర్వతాన్ని దిగి కిష్కింధపురి దాపులకేగి ఒక్కసారిగా సింహనాదం చేశాడు సుగ్రీవుడు. ఒక్క ఉదుటున వాయువేగంతో అక్కడికి చేరాడు వాలి. ‘ఓరి పిరికిపందా.. ఈ వాలి సంఘాత ధాటికోర్వజాలక బతుకు జీవుడా అని పారిపోయి ఋష్యమూకము చేరిన పిరికిపందా… మరలా నా చేతి గుద్దులు తిని చావడానికి వచ్చావా’ అంటూ బుస కొట్టాడు వాలి. ‘ఒరేయ్ పొగరుబోతా… గర్వాందకారంతో చెలగిపోయి నా రాజ్యాన్ని, నా భార్యను ఆక్రమించుకున్న నిన్ను ఇప్పుడే ఆ పితృదేవతల చెంతకు చేర్పించద’ అంటూ ముష్టి ఘాతంతో వాలి ముఖంపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బను తృటిలో తప్పించుకున్న వాలి ఆగ్రహంతో పిడికిలి బిగించి సుగ్రీవుని చాతి మీద గుద్దాడు. ఇద్దరూ పోట్లగిత్తల్లా పోట్లాడుకుంటున్నారు. వారి దెబ్బలకు సుగ్రీవుడు తట్టుకోలేక శ్రీరాముని వైపు చూస్తున్నాడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ ఒకే పోలికలతో ఉండటం వల్ల సుగ్రీవుడు ఎవరో పోల్చుకోవడం కష్టమై రాములవారు బాణం వేయలేకపోయారు. అప్పుడు వాలి దెబ్బలకు తాళలేక ఋష్యమూక పర్వతం వైపు పారిపోయాడు సుగ్రీవుడు.
‘మిత్రమా… వాలిని సంహరిస్తానని నీవు ఇచ్చిన మాట నమ్మి వాలిని ఎదుర్కొన్నాను. నీ మూలంగా వాలి చేత ఇన్ని దెబ్బలు తినవలసి వచ్చింది కదా..’ అంటూ వాపోయాడు సుగ్రీవుడు రాముని దగ్గర.
‘సూర్య నందనా…! మీరిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టినందున వాలి ఎవరో, సుగ్రీవుడు ఎవరో పోల్చుకోలేకపోయాను’ అంటూ లక్ష్మణుని పిలిచి ఒక పూలమాలను సుగ్రీవుని మెడలో వేయమన్నాడు. అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుని మెడలో పూలమాల వేయగా ‘మిత్రమా! ఇక నిన్ను పోల్చుకొనుట సులభము. ఈసారి తప్పక వాలిని వధించెదను’ అని శ్రీరాముడు పలకగా రెట్టించిన ఉత్సాహంతో మరల యుద్ధానికి బయలుదేరినాడు సుగ్రీవుడు.
మళ్లీ వాలి సుగ్రీవుల ఇద్దరూ మదగజాల వలె భీకరముగా పోరు సలుపుతుండగా చెట్టు చాటున నిలుచున్న శ్రీరాముడు అదను చూసి వాలిపై శరసంధానము చేయగా మొదలు విరిగిన మహా వృక్షం వలె దభీలుమంటూ పడిపోయాడు వాలి. తనను బాణంతో పడగొట్టినది ఎవరా అని పరిసరాలను పరికించుచుండగా చెట్టు చాటు నుండి రామలక్ష్మణులు బయటికి వస్తారు.
‘రామచంద్రా..! నీవా ఈ పని చేసినది? నీకు నేనే మపకారము చేసినాడను..? అకారణముగా నన్నిట్లు చెట్టు చాటు నుండి పరిమార్చడం న్యాయమా…?’ అనెను.
అప్పుడు శ్రీరాముడు ‘ఓ వానరేశ్వరా! నువ్వు మహాబలశాలివి. దుర్మదంధుడైన రక్కసి దుందుభిని దునుమాడిన భూరి విక్రమశాలివి. వాయుదేవుని అంశతో వానరసంతతిలో పుట్టిన పరాక్రమవంతుడివి. అయితే బలగర్వంతో ఉచ్చనీచాలు మరిచి, వావి వరుసలు లెక్కచేయకుండా కూతురు సమానమైన తమ్ముని భార్యను చెరబెట్టి ఆతని రాజ్యమునూ ఆక్రమించితివి. ఇక అకారణంగా హతమార్చానన్నావు కదా.. నీ కిష్కింద రాజ్యం మా తమ్ముడు పాలించే కోసల రాజ్యంలో అంతర్భాగం. రాజ్యంలో అశాంతి, అరాచకం చెలరేగినప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత మా రఘువంశ రాజులపై ఉన్నది. రాజులు జంతువులను వేటాడేటప్పుడు రకరకాల పద్ధతుల్ని ఉపయోగిస్తారు. ఇలా చెట్టు చాటు నుండి మట్టు పెట్టడం కూడా అందులో ఒక పద్ధతి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ కుమారుడు చిన్నవాడు కాబట్టి అంగదుడు పెద్దవాడయ్యేదాకా ఈ సుగ్రీవుడు రాజ్య భారము వహిస్తాడు. నీ భార్య తారాదేవి రాజ్య పాలనలో సుగ్రీవుడికి సలహాలనిస్తూ సహకరిస్తుంది’ అన్నాడు శ్రీరామచంద్రుడు…” అంటూ ఆపింది సత్యవతమ్మ.
“చూసావా నాయనా శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపాలన దక్షిత. కేవలం రాజ్యంలో అశాంతికి కారణమైన వాలిని చంపినా అతని కుటుంబానికి ఎలా న్యాయం చేశాడో… వాలి కొడుకు పెద్దవాడయ్యేదాకా సుగ్రీవుడు రాజుగా భారం వహించి అంగదుడు పెద్దవాడైన తరువాత వాలి కుమారుడికే రాజ్యం చెందేటట్లు చేయడం శ్రీరాముని యొక్క న్యాయ వర్తనకు నిదర్శనం” అంది.
“అది సరేగాని నానమ్మా… రాములోరిని అందరూ రామచంద్రుడు అంటారెందుకు..?” చాలా రోజులుగా మనసులో నానుతున్న ప్రశ్నను సంధించాడు రాంబాబు.
“ఎందుకంటే రాముల వారి ముఖం ఎప్పుడు పున్నమి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఆ తేజస్సు పండువెన్నెల వలె ఆ ప్రదేశమంతా వెదజల్లబడుతుంది. వాల్మీకి మహర్షి తన రామాయణ కావ్యంలో రాములవారిని వర్ణిస్తాడు.
‘శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం: సీతా పతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం: రామం నిశాచర వినాశకరంనమామి’
అంటే శ్రీరామచంద్రుడు రఘుకుల వంశంలో వెలుగుతున్న మణిదీపమని అర్థం. ఇంకా ఆజానుబాహుడు అంటే రాములవారు నిలబడితే ఆయన చేతులు మోకాళ్ళ దాకా ఉండేవట! తామర పూల వంటి కన్నులు కలవాడని, రాత్రివేళలందున సంచరించే చీకటి గ్రహాలని రాక్షసుల్ని సంహరించేవాడని ఆయన చెప్పాడు” అంది.
“ఊ… ఇంకా చెప్పు నానమ్మా..” శ్రీరాముని గుణగణాలు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో అడిగాడు రాంబాబు. పడుకున్న పిల్లల్ని ఒకసారి తేరిపార చూసింది సత్యవతమ్మ. దాదాపు అందరూ నిద్రపోతున్నారు ఒక్క రాంబాబు తప్ప. దాహం వాడి ఉత్సాహం మీద నీళ్లు చల్లడం ఇష్టం లేక కథను అందుకుంది.
“ఇంకప్పుడు సుగ్రీవుడు తన సైన్యంతో భూమి నాలుగు వైపులా వెదికించగా కిష్కిందకు ఆగ్నేయ దిక్కుగా సముద్రంలో ఉన్న లంకలో రావణుడు సీతమ్మ వారిని బంధించాడని తెలిసి వానరసేన సహాయంతో సముద్రంపై వారధి నిర్మించి యావత్ వానర సైన్యంతో రామలక్ష్మణులు సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలుగా గల వానర ప్రముఖులంతా లంకా పట్టణం దాపుకు చేరారు. ఆ లంకా నగరం మీదుగా వీస్తున్న గాలి సువాసన భరితమైన వాయువుల్ని మోసుకొస్తున్నందున వారి మనసులు ఒక ఆచంచలమైన మధురానుభూతికి లోను కాగా లక్ష్మణుడు రామునితో ఇట్లనెను – ‘అన్నా ఏమి సువాసన భరిత పరిమళము! ఈ మందగమన మలయ మారుతము మనసుకు తాకగానే ఏదో తెలియని అనుభూతికి లోనైతిని. ఇంతటి గొప్ప నగరము వీడ మనసు రాకున్నది. కావున ఇక్కడే శాశ్వతముగా ఉండిపోదమా’ అన్నాడు హాయి గూర్చిన మనసుతో. అప్పుడు శ్రీరామచంద్రుడు ‘వద్దు తమ్ముడా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి. అంటే మన తల్లియూ, మనము పుట్టిన ఊరునూ స్వర్గము కన్నను మిన్నయని శాస్త్రంబులు ఘోషించుచుండ నీ మనసున ఇట్టి కోర్కె కలుగుట విచారమ’నెను.
తరువాత శరణుజొచ్చిన రావణుని తమ్ముడైన విభీషణునికి అభయం ఇవ్వడం, యుద్ధరంగంలో ఎదురుపడిన రావణునితో ‘ఈరోజు పూర్తిగా అలసినావు. ఇంటికి పోయి రేపు రమ్ము’ అని పంపించడం ఇలా శ్రీరామచంద్రుడు పలికిన పలుకూ, నడచిన ప్రతి నడకా ధర్మ సమ్మతమై విలసిల్లింది. చివరికి ఇంత కష్ట నష్టాల కోర్చి రావణుని సంహరించి సీతమ్మ వారిని సమీపించిన శ్రీరామచంద్రుడు సీతమ్మను చేపట్టలేదు. అగ్ని ప్రవేశం చేయమని కోరాడు. ఎందుకంటే చాలా రోజులపాటు లంకలో ఉన్న సీతమ్మను చేపడితే లోకులు నిందిస్తారని.
ఇంకా ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నాడు వాల్మీకి మహర్షి” చెప్పింది సత్యవతమ్మ.
“అంటే ఏమిటి నానమ్మ అన్నాడు రాంబాబు అమాయకంగా…
“అంటే శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. శ్రీరాముని చూస్తే ధర్మాన్ని చూసినట్లే అని అర్థం. కాబట్టి నువ్వు కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి లాగా పెద్దల మాటకి ఎదురు చెప్పకుండా, అసత్య మాడకుండా, పర స్త్రీల వైపు కన్నెత్తి చూడకుండా ఆ సుగుణాభి రాముడిలా మంచి పేరు తెచ్చుకోవాలి సరేనా…” అంది సత్యవతమ్మ్మ.
“ఓ అలాగే నానమ్మ” అన్నాడు రాంబాబు. ఆ పిల్లవాడి మనసులో శ్రీరాముని లాగా మంచి పేరు తెచ్చుకోవాలన్న సంకల్పం అప్పుడే కలిగింది.
“ఇంక నిదరపో…” అంటూ కళ్ళు మూసుకుంది సత్యవతమ్మ. రాంబాబు కూడా నిద్రలోకి జారుకున్నాడు.