వందే గురు పరంపరా-1

3
3

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరా’ అన్న శీర్షికని దారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల – జిల్లా పరిషత్ హైస్కూల్ నందబలగలో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్న శ్రీ మింది విజయ మోహన్ గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]

[dropcap]ఎ[/dropcap]వరో ఒకరు
ఎపుడో అపుడు
నడవరా ముందుగా
అటో ఇటో ఎటోవైపు

మనలో చాలామంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటూ ఉంటాము. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి మనకు సమయం సరిపోకుండా పోతుంది. కానీ చాలా మంది చేసి చూపిస్తూ ఉంటారు. అటువంటి వారిలో ఒకరైన మింది విజయ మోహన్ గారు ఆంగ్ల అధ్యాపకులుగా జిల్లా పరిషత్ హైస్కూల్ నందబలగలో పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తితో పాటు 30 సంవత్సరాలుగా సాహిత్య, కళారంగాలలో సుమారు 200 దాటిన కార్యక్రమాలు.. చేసిన వీరి జీవితాన్ని దగ్గరగా చూద్దాం.

వ్యక్తిత్వానికి మూలాలు

సమాజంలో, ఊరిలో, పాఠశాలలో తనకు తానే ప్రేరేపకుడుగా వేసే అడుగులకూ, తీసే పరుగులకూ మూలమైన తొలి అడుగులు మాత్రం భారతీయ సంప్రదాయానికి, ఆర్థిక వ్యవస్థలకు మూలమైన వ్యవసాయ కుటుంబం. దాదాపు 30 మంది ఉన్న పెద్ద ఉమ్మడి వ్యవసాయ కుటుంబం.

వీరి తండ్రి మింది గుంపస్వామిగారు కూలిపని చేసుకుంటూ చదువుకుని, తొలితరం ఉద్యోగిగా ఉపాధ్యాయవృత్తి చేపట్టారు. తల్లి కాంతమ్మగారు పదిమందికీ ఉన్న దాంట్లోనే పంచిపెడుతూ కనీస సౌకర్యాలకు లోటు లేకుండా పిల్లలందరినీ పెంచారు. మనతో పాటు అందరూ ఎదగాలన్న తల్లిదండ్రుల తత్వంతో పాటు చదువుకు ప్రాముఖ్యత ఇవ్వడం వలన వీరి అన్నదమ్ములంతా ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలని కష్టపడి చదువుకుని తల్లిదండ్రుల లక్ష్యాన్ని నెరవేర్చారు.

ఉపాధ్యాయుడు నిత్యవిద్యార్థిగా నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి. తాను ఆచరించి చేసి చూపినదే ఇతరులకు స్ఫూర్తినివ్వాలని ఆలోచిస్తారు. మింది విజయమోహన్ రావుగారు ఆ దిశగా నిత్యము చేసే కార్యక్రమాలు –

ప్రతిరోజు ఉదయం గణపతి గుడి ఆవరణలోగల రావి చెట్టు కింద ధ్యానం చేస్తూ ప్రకృతితో మమేకమై పాజిటివ్ ఎనర్జీని పొంది స్ఫూర్తిని పొందుతారు. ఇది ఎవరికైనా ఆచరణ యోగ్యం. ఆ సమయంలో మనలో ఉన్న అస్పష్టమైన ఆలోచనలకు ఒక రూపం ఏర్పడుతుంది.

ఆహార పదార్థాలు వ్యర్థం చేయకూడదు అనే కాన్సెప్ట్‌ని ఒక మంత్రంలాగా జీర్ణించుకున్నారు. అందుకనే పొలాల వద్ద ఉన్న పశువుల కాపరులకు భోజనం పేకెట్లూ, మంచినీళ్ళతో పాటు ఊరవతల ఉన్న పందులకు మిగిలిపోయిన అన్నాన్ని సేకరించి, బకెట్లతో తెచ్చి అందిస్తూ ఉంటారు.

మార్నింగ్ వాక్‌లో తిరిగి వస్తూ ఆ ఊరిలో ఎక్కడైనా ఎవరింట్లో అయినా కార్యక్రమం జరుగుతూ ఉంటే వారి ఇంట పెద్దలతో కూర్చుని ఊరి సమస్యలను చర్చించి, అప్పటికప్పుడు చిన్నచిన్న కమిటీలు వేసి, పరిష్కారాలు కనుగొనడం చేస్తారు.

వినదగునెవ్వరు చెప్పిన- చెవి యొగ్గి ఆలకించు- సుభాషితాలు

తాను ఏ ప్రాంతాలకు వెళ్లినా అక్కడ పనిచేస్తున్న కార్మికులు, కర్షకులు, శ్రామికులు వీరితో మనస్ఫూర్తిగా మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకోవడం అతనికి అలవాటు.

ఎర్రటి ఎండలో మేకలను మేపే సమయంలో నీడకు రమ్మని పిలిచి అప్పయ్యతో మాట్లాడి జీవితసత్యాలు తెలుసుకుంటారు.

శుభోదయం! చెప్తున్న మాస్టారి పలకరింపులకు. ఉత్తరాంధ్రకే ప్రత్యేకమైన గ్రామీణ శైలిలో..

సీసాల సత్తెమ్మ చెప్పిన ‘మే’ డే సత్యాలు చెవియొగ్గి ఆలకిస్తారు.

ఒకసారి ఆగిచూడు – మాటలున్నది మనుషులను కలిపేందుకే. అందుకే

పెట్రోల్ బంకుల్లో పనిచేసే అమ్మాయిలైనా, ఆకాశంలో దేవదూతల్లా కనపడే విమానంలో పనిచేసే ఎయిర్ హోస్టెస్ లైనా, బట్టల షాపుల్లో సేల్స్ గర్ల్‌గా కనిపించే ఆడపిల్లలైనా, రోడ్లమీద సీసాలు ఏరుకొనే ముసలవ్వలైనా పలకరించి రెండు సానుభూతి వాక్యాలు పలకడం మాస్టారికి అలవాటు.

ఎవరైనా సరే స్పందించే మనుషులతోనే మాట్లాడుతారు. ఆ మాటల్లో వారి మనసులోని నిజాయితీ తెలుస్తుంది. అలాగే చల్లగాలి తగిలితేనే కదా! మేఘం వర్షిస్తుంది.

వేసవి సెలవుల అనంతరం పాఠశాల తెరిచిన వేళ అందరూ విచారవదనాలతో వస్తే వీరి పిల్లలు మాత్రం కళకళలాడుతూ ఎప్పుడెప్పుడు పాఠశాల తెరుస్తారా అని ఉత్సాహంగా వస్తారు.

బడి గురించి మోహన్ గారి మాటల్లో

బడి అంటే నా ఇల్లు/బడి అంటే కుటుంబం

బడి అంటే జీవితం/బడి అంటే ఒక పవిత్రస్థలం అంటారు.

దయగల గోడ

వీరుచేసే అనేకమైన అద్భుతమైన కార్యక్రమాలలో ‘దయగల గోడ’ ఒకటి. ప్రతి ఇంటిలో నుండి వాడని వస్త్ర, వస్తు సముదాయాలను సేకరించి, నలుగురు నడిచే త్రోవలో దయగల గోడను ఏర్పాటు చేశారు. వీళ్ళ ఊరి మీదుగా తమ నివాసాలకు వెళ్లే ఆదివాసీ గిరిజన ప్రజలు అక్కడ ఆగి, తమకు కావలసిన వస్తువులను తీసుకుని వెళ్లిపోతారు.

ఎంత అద్భుతమైన భావన!!!!

మన వంతుగా మనమే మన దగ్గర అదనంగా ఉన్న బట్టలు, ఇతర సామాన్లు దయగల గోడ వద్ద పెట్టేస్తే.. కావల్సినవారు.. ఎక్కడో గిరిజన ప్రాంతాల నుండీ కూడా వస్తూ పట్టుకుపోతుంటే.. చూసేందుకు ఇంతకన్నా ఆనందం ఏముంటుంది?..

ఈ దయగలగోడ భావన ఎపుడు? ఎలా మొదలైంది?? అని ప్రశ్నిస్తే ఇలా చెపుతారు.

మూడున్నర ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఒక ఆలోచన మదిలో రూపుదిద్దుకొని ఒక ఆచరణగా శాశ్వతదాతగా నిలబడి పోయిన రోజు. వీరి కుమారుడు దయగల గోడ అయిడియా చెప్పాడు. ఎలా చెయ్యాలో.. ఏమి చెయ్యాలో.. ప్రారంభిస్తే ఎలా కొనసాగించాలో, ఓపిక, సహనం ఎంతుండాలో..

అదే రోజు పాత బొబ్బిలి బస్ స్టాండు పక్కన గల జాగాను ఎన్నుకుని, దయగల గోడ అని పేరు సెలెక్ట్ చేశారు. మనం డాబుగా, టిప్ టాప్‌గా తయారై వెళ్తే మనలో తెలీకుండానే గర్వం వస్తుంది. దానకర్ణుడిలా మనం వుంటే వాళ్ళు కుచేలుడులా కుంచించుకుపోతారు. అవతల వాళ్ళు బెదురుతారు. జంకుతారు. తీసుకోడానికి, ఇవ్వడానికి మధ్య కనిపించని అంతరం ఏర్పడుతుంది.

డిసెంబర్ 20, నాటికి గోడ, షెల్ఫులు నిర్మించి, విజయ మోహన్ పుట్టినరోజు సందర్భంగా వీరి ఇంట్లో వున్న వాటర్ ఫిల్టరును మొదటిసారిగా దయగలగోడ వద్ద పెట్టారు. మంచి జ్ఞాపకం కదూ! దయగల గోడ దగ్గర గల వస్తువులను గిరిజన ప్రాంతాలకు మిత్రులతో కలిసి తీసుకుని వెళ్లి బడిపిల్లలతో వారి చేతుల మీదుగా గిరిపుత్రులకు అందించి వారి మొహాలలోని వెలుగులు చూడడం వీరందరికీ ఆనందం. ఇందులో బట్టలు, జోళ్ళు, బొమ్మలు, ఇంట్లోని సామాన్లు, మిక్సీలు, వాటర్ ప్యూరిఫైయర్లు మొదలైనవి ఎన్నో వస్తువులు ఉంటాయి. ఇవ్వడంలో వున్న తృప్తి పిల్లలకు పరిచయం అవుతుంది. ఆ మహిళలు ఎంతో సంతోషంగా బస్తాలలో ఉన్న అన్ని రకాల బట్టలు తీసుకుని పిల్లల్ని దీవిస్తారు. మనకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తారు. ఇంటిలో కాస్త తీరిక దొరికినప్పుడల్లా.. మీకు అవసరంలేని వస్తువులు, మంచిదుస్తులు మాకు ఇవ్వండి. ఇంటిలో 6 నెలలుగా మీరు వాడని సామాన్లు ఉంటే దయగల గోడ దగ్గర పెట్టండి. వాళ్లకు కనీసం ఒంటి నిండా కప్పుకునే అవకాశం లేనివారు. వారికి జీవన సమస్య ఇది. కడుపుకు తిండి ఎలా వారికి సమస్యో బట్ట కూడా అంతే. కొండప్రాంతాల వారికి ఇవి చాలా చాలా అవసరం. చిరునామా: విజయ మోహన్ ‘విహారి’; దయగల గోడ; పాత బొబ్బిలి బస్ స్టాప్. ఫోన్: 9440744741

సెలవుల్లో పిల్లలూ, స్కూలూ, పాఠాలూ లేక విసుగ్గా ఉంది. మాస్టారుకి ఏదో చేయాలని ఆలోచించుకుంటూ మార్నింగ్ వాక్‌లో రాణీగారి చెరువు ఒడ్డున గౌరీ గణపతి ఆలయం ధ్వజస్తంభం, ప్రాంగణం, పరిసరాలు ప్రతిరోజూ 5.30 నుండి 6.00 వరకు తుడిచే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ సందర్భంగా పూజారిగారు..

“ఎవరూ కోరకుండానే మీ అంతట మీరే ఈ పని చేస్తున్నారు. అదే శివ మహత్యం..” అన్నారు.

“అదేంకాదు. కాస్త పొట్ట తగ్గుతుంది అని చేస్తున్నా”

“అదే శివ సంకల్పం..ఆయన మీలో ఆ ఆలోచన కల్పించాడు.”

వేసవిలోసాంత్వన ఇచ్చేందుకు అమ్మా! అని పిలుస్తూ నిమ్మ చెట్టును పెంచుతున్నారు.

ఇంట్లో నిమ్మమ్మ రెండ్రోజుల కోసారి ఇన్ని నీళ్ళు, అప్పడప్పుడు ఇంత గెత్తం ఇస్తే చాలు. చాలినంత స్థలం లేకపోయినా వున్న దాంట్లో వేరులన్నింటినీ సర్దేసి. పచ్చ పచ్చటి పందిర్లు వేస్తూ మా కోసం ఇన్నేసి కాయలు ఇస్తుంది. పొద్దున్నే కమ్మటి వాసన, మండు వేసవిలో కుర్చీ వేసుకుని కూర్చుంటే చల్లదనం. సాయంత్రం హాయినిచ్చే గాలిని అడక్కుండానే ప్రసాదిస్తూ. మా నిమ్మమ్మ చెట్టు! గత పధ్నాలుగే ళ్లుగా.. ప్రకృతికి మనిషికి మధ్య ఉండాల్సిన నిర్వచనంలా కనిపిస్తుంది.

పాఠశాలలో పిల్లలతో

మాస్టారు స్కూల్ పిల్లలతో మధ్యాహ్న భోజనం చేసిన ప్రతిరోజూ ఒక గొప్ప అనుభవంగా భావిస్తారు. వరండాలో నేల మీద కూర్చున్నప్పుడు పిల్లల జోకులు, నవ్వులతో వాతావరణం ఉల్లాసంగా మారుతుంది. వారితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, సెలవులలో ఏమేం చేసాము? ఏ ఏ వూర్లు వెళ్ళాం? వంటి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవచ్చు. మా మధ్య ఉపాధ్యాయ-విద్యార్థి అడ్డుగోడలను తొలగిస్తూ.. చల్లటి లేలేత గాలులు వీస్తాయి. పిల్లల ఉత్సాహంతో పంచుకునే ఈ క్షణాలు ఎంతో విలువైనవిగా అనిపిస్తాయి. విద్యార్థులు తరగతి బయట కూడా ఏవిధంగా పరస్పరం మమేకమవుతున్నారో చూడడానికి ఉపాధ్యాయులకు ఇది ఒక మంచి అవకాశం. వారిలో ఒక సామూహికభావన, సాన్నిహిత్యం పాఠశాల పరిసరాలను నిర్మాణాత్మకంగా నిర్మించడంలో ఎంత ముఖ్యమైనవో ఈ అనుభవం ద్వారా తెలిసి వస్తుంది.

ప్రతిసారి ఆ భావన మరింత బలపరుచుకుంటూ మోహన్ గారు తన విద్యార్థులతో గత పాతికేళ్లుగా మధ్యాహ్న భోజనాలు కలిసి చేస్తూనే ఉన్నారు.

ప్రతిరోజు పిల్లలు హోంవర్క్ చేయలేకపోతే ఉపాధ్యాయులు వారిని దండిస్తారే గానీ చేయలేక పోయిన కారణాలు తెలుసుకొని చకితులై వారిని క్షమాపణ కోరి బుజ్జగించడం ఎంతమంది ఉపాధ్యాయులు చేయగలరు? ఆ అనుభవం ఇలా ఉంది.

సారీ రా రామ్! నువు హోం వర్క్ చేయట్లేదని రోజూ తిడుతున్నాను. కానీ నువు చేయలేక పోవటానికి గల కారణాలు తెలుసుకున్న తరువాత సారీ చెప్పి, ఇకపై ఇక్కడే స్కూల్లోనే లీజర్లో చేసుకుందాం. సరేనా! అంటూ దగ్గరకు తీసుకున్నారు.

చదవడంలో వెనకబడిన వారికోసం ఇదో ప్రయత్నం.. one of the best practices.. లెసన్ అవుతున్న వారం రోజులూ అందులోని ‘కీ’ వొకాబులరీని ఇలా ప్రదర్శించడం వల్ల వాళ్ళు ఎదురుగా అన్ని రోజులూ చూస్తూ నేర్చుకుంటూ వుంటారు. ఇది బాగా వర్కౌట్ అయింది.

నవ్విన నాపచేను.. శిష్యులను కలిసిన ఒక మధురజ్ఞాపకం

ఓ ఫంక్షన్‌లో మోహన్ మాస్టారి దగ్గర చదువుకున్న నలుగురు సంస్థానం హైస్కూల్ స్టూడెంట్స్ చాలా సంవత్సరాలకి కనిపించేరు.

“ఎలా వున్నారు రా..?” అని పలకరించేసరికి మాస్టారిని చూసిన ఆనందంతో వారంతా తమ జీవితానుభవాలను చెప్పడం మొదలెట్టారు.

“మాస్టారూ!! మీరు అసలు మారలేదు. అప్పటిలాగే ఉన్నారు..” అని ఒక ప్రశంస ఇస్తూనే అప్పట్లో స్కూల్ స్పోర్ట్స్ నంబర్ వన్‌గా ఉండే సురేష్ ఆర్మీ service పూర్తి చేసి విజయనగరంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డుగా సొంత ఇంట్లో ఉంటున్నట్లు చెప్పాడు.

స్కూల్ సెకండ్ టాపర్ జగదీష్ బొబ్బిలిలోనే బెల్లం, హోల్సేల్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పాడు.

లెక్కల్లో వందకి వంద మార్కులు తెచ్చుకునే గోపీ. రామభద్రపురంలోనే fertilizers కంపెనీలో చేస్తూ కుటుంబ బాధ్యతలు తీరేసరికి జీవితం అయిపోయిన ఫీలింగ్ కలుగుతోంది అన్నాడు.

“అన్నట్లు వాసు? ఎలా వున్నాడు? ఒంట్లో కూడా సరిగా లేక అన్నింట్లో మార్కులు తక్కువ వచ్చేవి కదా! మాట కూడా నత్తిగా వచ్చేది.”

“అవునండీ! వాడు ఇంట్లోవాళ్ల బాధలు పడలేక. రాయగడ పారిపోయాడు. ఇరవై ఏళ్ల తరువాత కనిపించేడిప్పుడు. బాగా సెటిల్ అయ్యాడు. నాలుగిళ్ళు, పెద్ద కిరాణాషాపు, పెద్దింటి ఇల్లరికం, ఇద్దరు పిల్లలు, ఎనిమిది స్థలాల బిట్లు. చింతపండు, మిరప. సీజన్ బట్టి హోల్ సేల్ కొండవాళ్ళ బిజినెస్స్ అంతా వీడిదే! బాగా సంపాదిస్తూన్నాడు.”

“అవునా! ఇది ఎలా??” మాస్టారి ఆశ్చర్యం చూసి

“వాడినే అడగండి.. దూరంగా ఐస్ క్రీం తింటున్న వాసూని పిల్చి అడిగేరు. వాసు వస్తూనే మోహన్ మాస్టర్‌కి నమస్కరించి

“నాకు చదువు రాలేదు. మాస్టారూ! బతకడం కోసం. రాయగడ వెళ్ళా. మీరు అప్పట్లో నాకు చెప్పేవారు. మన దగ్గర లేనివాటి గురించి బాధపడొద్దురా..! ఉన్న వాటితోనే సాధించాలి అని…”

“నాకు గొడ్డులా కష్టపడటం వచ్చు. నమ్మకంగా వుండటం వచ్చు. అదే చేశాను. చేస్తున్నాను. మీరు ఇంకోటి కూడా చెప్పేవారు. పుస్తకం పది మార్కులు ఇస్తే.. జీవితం తొంభై మార్కులు ఇస్తుందని. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.” అంటూ పాదాలకు వంగి నమస్కరించి వినయంగా నిలబడ్డాడు వాసు. మిగిలిన వారిలో లేని ఆప్యాయతేదో చిరుగాలిలా తాకింది.

సమాజాన్ని మార్చగలమా? ప్రయత్నమైనా చేయాలిగా!!

పాపం-పుణ్యం.. పేరుతో కొందరు వారు చేసేవి తప్పులు కాదని ఇతరులు చేసేవే తప్పులని అనుకుంటారు. అలాంటి కొందరు ఉపాధ్యాయుల వద్దకు వచ్చి ఇలా వాదించుకుంటారు.

“ఓహ్! చూడండి మాస్టారు..! దేవాలయానికి వెళ్లే దోవలో అశుద్ధం చేస్తున్న ఈ పిల్లాడిని వాళ్ళమ్మ కొట్టదు. మంచి మాటలు చెప్పదు. గ్రామాలలో ఈ సమస్య బాలబాలికలకే కాదు పెద్దలది కూడా ఆ బాటే. అటువంటి వారిని దండించండి” అని ఉపాధ్యాయుల దగ్గరకు తీసుకొస్తారు.

“వీడు చేస్తున్నది తప్పైతే.. పాపమైతే.. మరి కొందరు వారి స్నేహితులతో కలిసి రోజూ.. రాత్రిళ్ళు ఇదిగో! ఈ పక్కనే.. గుడి ముందే.. బడి ముందే మందు, బిర్యానీలు, పార్టీలు.. సీసాలు చిదక్కొట్టడాలు.. తన్నుకోడాలు.. తప్పు కాదా..? అది పాపం కాదా..?”

“ఒరే ఎదవా? అలాంటి పన్లు ఇక్కడ చెయ్యకూడదురా?.. కళ్ళు పోతాయ్. అని ఎప్పుడైనా ఆ తల్లి అన్నదా?”

“వాళ్ళు తాగిన సీసాల పెంకులు ఇక్కడ కడుతున్న పశువులకు గుచ్చుకోవా? సాయంత్రం ఆడుకోడానికి వస్తున్న పిల్లలకు, సీసాలు ఏరుకొడానికి వచ్చేవాళ్ళకు, పెరట్లోకి వెళ్ళే కూరాకులోల్లకు గుచ్చుకోవా?? అది పాపం కాదా?”

ఈ సమస్యకు మన మాస్టారు ఒక నూతన పరిష్కారం కనుగొన్నారు. విజయబాటలో నడిచే విజయమోహనుని వెంట నడిచే గో, గోవత్స, గోప బాలురు ఆ అనుభవమే ఈ నూతన విధానం.

దండోరా

ఇంతకు వరకు ఎవ్వరు చేయని విధంగా వినూత్నంగా ఒక దండోరా చేశారు. మోహనుని తలపులలోనే మెదిలినది. మద్యం తాగి సీసాలు పగులగొట్టవద్దు టీచర్ విజ్ఞప్తి.

ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు ఓ ప్రభుత్వ టీచర్ విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మందు తాగిన తర్వాత సీసాలను పగులగొట్టవద్దని అలా పగులగొట్టడం వలన గాజుపెంకులు గుచ్చుకుని పిల్లలు, రైతులతో పాటు మూగజీవాలు కూడా ఇబ్బంది పడుతున్నట్లు గమనించారు. అలాగే పగులగొట్టని సీసాలు ఏరుకొని అమ్ముకుని జీవించేవారు బాగుపడతారని పాఠశాల బాలబాలికలతో కలిసి దండోరా వేయడం వలన అతనికి గల సామాజిక అవగాహన అర్ధమై మీడియా ద్వారా ప్రశంసలు అందుకున్నారు.

సామాజిక చైతన్యం కోసం ఏర్పాటుచేసిన సంస్థలు

1. రచనా సమాఖ్య (తెలుగు భాషా సాంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ సంస్థ)

పుస్తకావిష్కరణల సమయంలో బాలబాలికలను పిలిచి పద్యాల పోటీ వినూత్నంగా పెడతారు. ప్రతి పద్యానికి పది రూపాయలు ఇస్తారు. ఆ విధంగా ఎవరు ఎన్ని పద్యాలు చెప్తే అన్ని పది రూపాయలు ఇస్తారు. పిల్లలలో ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు దోహదపడుతాయి. భాష పట్ల అభిమానం పెరుగుతుంది.

రచనా సమాఖ్య సంకలనం చేసిన పుస్తకాలు అంశాలు 7

  1. 2013 లో సమైక్యాంధ్ర కవన భేరి,
  2. 2016 లో జలమే మన జీవితం,
  3. 2017 లో ఆకు పచ్చని జీవితం,
  4. 2018 లో ప్రాణ దాత,
  5. 2020లోమద్యం ఓ మహమ్మారి,
  6. 2021 లో చిట్టి తల్లీ జాగ్రత..
  7. 2023 లో గురుబ్రహ్మ..

రచనా సమాఖ్య అధ్యక్షుడు శ్రీ విజయమోహన్ గారు జాతీయస్థాయిలో 108 మంది ఉపాధ్యాయుల నుండి కవితలను సేకరించి ‘గురుబ్రహ్మ’ అనే సంకలనం వేశారు. ఆ పుస్తకావిష్కరణ విజయనగరం ఉత్సవాల సందర్భంగా సాహిత్య వేదికపై పెద్దలు, సాహితీ వేత్తలు, కవులూ, ఆవిష్కరణ చేసారు.

రచయితగా తాను చేసిన రచనలు

  1. పరీక్షా విజయం, 2. జయం మనదే, 3. విజయం మీ చేతుల్లో.. 4. ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్, 5. మీ స్కూల్ magazine 6. స్నేహిత బాలల పత్రిక 7. శ్రీరాముడికి శంబూకుడికి మధ్య సంభాషణ. స్కిట్ (ఏ వర్ణం వారయినా వారి విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తే. వారికి ఆత్మ సాక్షాత్కారం సిద్ధించినట్లే!)

2. ‘ఆనందోబ్రహ్మ’ – ‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ (ఆనందమే జీవన మకరందం)

ప్రకృతిలో ప్రతి శబ్దానికి మానసికంగా, శారీరకంగా స్పందించడం మానవ సహజం..

అందుకే ప్రకృతి మనకోసం లయ బద్దమైన సంగీతాన్ని సృష్టించింది. సాక్షాత్తూ శివుడే నటరాజుగా మనకు మార్గదర్శనం చేశాడు. పదం, పాదం, చరణం, మొత్తంగా దేహ విన్యాసం చేయమన్నాడు. అందులోనే ఆనందో బ్రహ్మను ఆస్వాదించమన్నాడు. లక్ష్యసాధనకు శరీరాన్ని సిధ్ధం చేయమన్నాడు.

‘ఆనందోబ్రహ్మ’ ఆధ్వర్యంలో అన్ని వయసుల వారికి శిక్షణ, నటన, కోలాటం, సినీ, జానపద, శాస్త్రీయ నృత్యాలు బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆర్.వి.ఎస్.ఎస్.కే.కే. రంగారావుగారు (బేబీ నాయన) వీరి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో జరుగుతూ ఉంటాయి.

ప్రతి సాయంత్రం 6 నుండి 8 వరకు ‘కళాభారతి’ కళావేదిక పై కోలాటం, సినీ, థింసా, జానపద, నృత్యాలు, కామెడీ, ఆధ్యాత్మిక స్కిట్స్ చేస్తూ ఎ.బి.సి. డాన్స్ అండ్ acting school student లతో..

మహిళాసభ్యులచే యోగా కార్యక్రమాలు అలాగే అన్ని వయసుల బాలబాలికలచే వార్మప్ విన్యాసాలు చేయిస్తారు.

ఎ.బి.సి. డాన్స్ అకాడెమీ పిల్లలు రెండు గంటలు ఆపకుండా ఫాస్ట్ డాన్సులు చేస్తారు. బయట ఎక్కడైనా ప్రదర్శనలకు అవకాశాలు వస్తూ ఉంటాయి. సంతోషం ఏమిటంటే వీళ్ల తల్లిదండ్రులకు గల సానుకూల దృక్పథం. వాళ్ళు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇలా పిల్లల్ని పంపడం నిర్వాహకుల మీద నమ్మకం ఉంచడం. వాళ్లు చెప్పిన మరో విషయం ఏమిటంటే “అకాడమీలో జాయిన్ అవకముందు వాళ్ల పిల్లల్లో ఉండే నిరాసక్తత, బద్ధకం, చదువులో వెనకబాటుతనం, ఉబ్బసం, జలుబు, నీరసం లాంటివి ఇపుడు చాలా వరకూ తగ్గాయని, ప్రతిరోజూ చేసే ప్రాక్టీస్ వల్ల హుషారుగా, ఆరోగ్యంగా ఉన్నారని చెప్తూ ఉంటారు. పైగా సెల్ఫోన్లు, టి.వి.లు వాటికి దూరంగా ఉన్నారని ఓపిక, సహనం, ఇతరులను అర్థం చేసుకునే అలవాటు వల్ల చదువు మీద ఏకాగ్రతతో ఎక్కువగా చదువుతున్నారని” చెప్తూ ఉంటారు.

పిల్లలతో గడిపే ప్రతి క్షణం. తనలో కొత్త ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని అంటారు ఈ మాస్టారు. పిల్లల నోట ఈ పాట

అద్భుతాలు సృష్టిస్తాం/ అమ్మకు నాన్నకు జేజేలు/

ప్రదర్శనలు వన్స్మోర్ అనిపిస్తాం/గురువులకు సాల్యుట్ చేస్తాం

ఇహ ఏరోబిక్స్ చేస్తారో, మార్నింగ్ వాక్ చేస్తారో, ఆసనాలు వేస్తారో, Treadmill ఎక్కుతారో. ..

లేకపోతే కుర్చీ మడత పెట్టే డాన్సులు వేస్తారో.. మీ ఇష్టం.. ఆరోగ్యమస్తు..

విజయ మోహన్ విహారి; ఫౌండర్ ఏబీసీ డాన్స్ అకాడెమీ; డాన్స్ మాస్టర్ కరుణ్ కుమార్

~

3. బొబ్బిలి ఫిలిం సొసైటీ (మంచి సినిమా మంచి సమాజం)

సామాజక సమస్యల్ని ఎత్తిచూపి, పరిష్కారం కోసం తీయబడిన షార్ట్ ఫిల్మ్స్ – 1) Full stop 2) మళ్లీ బడికి 3) చిట్టి తల్లి జాగ్రత్త 4) మన ఆడపిల్ల కథ..  5) జ్ఞానధార.. చదువులో  6) మద్యం బ్రతుకులు ఇంతేలే.. 7) The mask.., 8) ప్రాణ దాత.

Full stop

మన దగ్గర లైసెన్స్, సి బుక్ లేక పోయినా.. ఫర్లేదు.. బతికేస్తాం. కానీ హెల్మెట్ లేకపోతే..

జీవితానికి full stop తప్పదు.. అంటే మరణం..

ట్రాఫిక్‌లో తీసిన ఫిల్మ్.. బొబ్బిలి పోలీస్ సహకరించారు..

దీనికి తెలంగాణా స్టేట్ పోలీస్ అవార్డు వచ్చింది..

మళ్లీ బడికి..’’

బాల్య వివాహం నేపథ్యంలో.. బాలికలు తిరుగు బాటు చేసి మళ్ళా బడికి పోయే కథ ఇది.

దీనికి జిల్లా విద్యా శాఖ అవార్డు లభించింది.

చిట్టి తల్లీ జాగ్రత్త..

Good touch bad touch తో..తీసింది. దీనికి VZM పోలీస్ అవార్డు లభించింది.

మన ఆడపిల్ల కథ..

బహిరంగ మల విసర్జన నేపథ్యంలో ఆడపిల్లలు పడుతున్న బాధలు.. చిత్రం..

విజయనగర వుత్సవ్ అవార్డు.. ప్రథమ స్థానం

జ్ఞాన ధార.. చదువులో

వెనుక బడిన స్టూడెంట్స్ కోసం తీసింది..

జిల్లా విద్యాశాఖ అవార్డు

మద్యం బ్రతుకులు ఇంతేలే..

మద్యానికి బానిసైన వారు.. ఎలా నాశనం అవుతున్నది.. తీసిన ఫిల్మ్..

దీనికి స్టేట్ కాంపిటీషన్స్‌లో థర్డ్ ప్రైజ్

The mask..

కరోనా సమయంలో అవగాహన కోసం తీసినది.

స్టేట్ అవార్డు

ప్రాణ దాత..

జూనియర్ రెడ్ క్రాస్ సంస్థ కోసం.. తీసింది.

~

4.‘మనం’ బ్లడ్ డొనేషన్ క్లబ్ (ప్రాణదాత-సుఖీభవ)

నా లక్ష్యాన్ని, నా భావాల్ని, నా జీవితాన్ని, అవసరం అయినప్పుడు అదనంగా నా దగ్గర వున్నపుడు ఇతరులతో పంచుకోవాలనే మనస్తత్వాన్ని వరంగా ఇచ్చిన వారికి!

నా రక్త బిందువులను, నా జీవనదిని నా గుండె చప్పుళ్ళను స్వీకరించిన వారికి!

ప్రాణాపాయంలో ఉన్నపుడు దేవుడు, వైద్యుడు వరుసలో నన్ను తలుచుకునే వారికి!

వందవ రక్తదాతగా నన్ను నిలబెట్టేదిశలో రక్తదాన స్ఫూర్తిప్రదాతగా నన్ను ప్రేరేపిస్తున్నవారికి !

రక్త దానం చేసిన ప్రతీ సారీ నన్ను కొంగొత్త శక్తిశాలిగా పునర్నిర్మిస్తున్న రక్త గ్రహీతలందరికీ!!!

రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు విజయ మోహన్ విహారి 88 సార్లు రక్త దాత

~

5. ‘మనం’ స్వచ్ఛంద సంస్థ (మన ఊరు మన కోసం)

చూడటానికి చిన్న పనే! కానీ పెద్ద ప్రయోజనం. ఇళ్ళల్లో, రోడ్లు మీద పడేసిన పాలిథిన్, ప్లాస్టిక్ కవర్ల వల్ల ఎన్ని నష్టాలో మనకు తెలుసు. వాటిని అలా చెల్లా చెదురుగా వదిలేయకుండా ఇలా పెద్ద ప్లాస్టిక్ బాటిల్స్ లో కుక్కేస్తుంటే. నేల మీద చెల్లా చెదురుగా పడి వున్న ప్లాస్టిక్ భూతాన్ని అదుపు చేయవచ్చు. అలా నిండిన బాటిల్స్ ను మూత బిగించి డంపింగ్ యార్డుకో, రీసైక్లింగ్ యూనిటుకో పంపించవచ్చు. విజయమోహన్ గారు తన ఇంట్లో విజయవంతంగా చేస్తున్నారు. తన స్టూడెంట్స్ కు పరిచయం చేశారు. గ్రామస్థులు అందరికీ కూడా చెప్పారు. మరి మీరు కూడా.. చేయండి అంటున్నారు.

~

6. గాంధీస్మారకనిధి (మహాత్ముని మార్గంలో మనందరి ప్రయాణం)

గాంధీ స్మారకనిధి ఆధ్వర్యంలో.. మూడేళ్లుగా అన్నదానం బొబ్బిలి (అంతర్జాతీయ ఆకలి దినోత్సవం సందర్భంగా..)

అన్నం పరబ్రహ్మ స్వరూపం

మీ ఇళ్లల్లో జరిగే వివిధ ఫంక్షన్లలో మిగిలిపోయిన మంచి, పరిశుభ్రమైన, రుచికరమైన భోజనాలు అంటే రకరకాల కూరలు, సాంబారు, బిర్యానీ, అన్నంలాంటి ఆహారపదార్థాలను వృథాగా పార బోయకండి. మాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి. వాటిని మా కేన్స్ తో మేమే స్వయంగా తీసుకు పోతాము. ఆకలి గొన్న వృద్ధులకు,అన్నార్తులకు, గిరిజన ప్రాంతాలకు. మీ పేరు మీద అందిస్తాం.

సదా అన్నార్తుల సేవలో

విజయ మోహన్ ‘విహారి’- 9440744741

‘వనమిత్ర’ కృష్ణ దాస్ – 919492545298

గంటెడ మహేష్ – 919550550101

ఇన్ని పనులు ఒక్కరు చేయాలంటే అసాధ్యమే!

వ్యక్తి అందరినీ కలుపుకుంటూ కదిలిననాడు సామూహికశక్తిగా మారతాడు.

~

7. జిల్లా ఆంగ్లభాష ఉపాధ్యాయుల సంఘం (డెల్టా)

జిల్లా ఆంగ్లభాష ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులుగా జిల్లాలో మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయిలో జిల్లాపరిషత్ హైస్కూలులో స్పెల్లింగ్ బి పోటీలు నిర్వహించారు. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం, పద పరిచయం పెంచడానికి ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయని అందరూ భావించారు. 96 మంది పాల్గొన్న ఈ పోటీలలో ఆరు రౌండ్లలో డిక్టేషన్ మరియు పదాలకు స్పెల్లింగ్ అడగడం ద్వారా సుమారు 400 పదాలు విద్యార్థులకు పరిచయం చేశారు. గ్రామస్థాయిలో నందబలగా గ్రామంలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు, గ్రామస్తులు, గ్రామపెద్దలు, అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇంతవరకు ఇటువంటి పోటీని ఇక్కడ ఎవరూ ఈ స్థాయిలో నిర్వహించలేదని గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు.

8. ‘మై స్కూల్’ బాలల ఆంగ్ల మాసపత్రిక మరియు ‘స్నేహిత’ బాలల తెలుగు మాసపత్రిక

విజయమోహన్ మాస్టారి పిల్లలు మహీధర్, సంజన అన్నాచెల్లెలు. 2002లో ‘స్నేహిత’ పేరుతో బాలలకు అవసరమైన విషయాలను మాసపత్రిక రూపంలో క్రమం తప్పకుండా వెలువరిస్తూ పెద్దలకే ఆదర్శప్రాయంగా ఉన్నారు. వీరిద్దరూ సంయుక్తంగా తెలుగుభాషపై ఆసక్తి కలిగించే విషయాలను అంతర్జాలం ద్వారా, బాల పత్రికల ద్వారా, సేకరించి, చేతివ్రాతతో రాసి అవసరమైన చోట్ల బొమ్మలు వేసి 16 పేజీల సమాచారాన్ని తయారుచేసేవారు. దీనిని సుమారు 300 జిరాక్స్ ప్రతులు సిద్ధం చేసి, పిల్లలకు ఉచితంగా, పెద్దలకు రెండు రూపాయలకు అమ్మేవారు. పాఠకులు కూడా నచ్చిన అంశాలను పంపితే ప్రచురిస్తారు. అన్ని పత్రికలలాగే పోటీలు పెట్టి విజేతలకు బహుమతులు అందజేస్తారు తమ ఇంటినే పత్రిక కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. ఇంగ్లీషులో కూడా ‘మై స్కూల్’ అనే పత్రికను ఇలాగే నడుపుతున్నారు.

వీరిరువురూ ఆ కొమ్మకు పూచిన పువ్వులే! అని ఎంతో గర్వంగా చెప్పవచ్చును.

~

అవార్డ్స్..

  • జిల్లా బెస్ట్ టీచర్
  • జాతీయ బాల సేవక్.. బండారు ట్రస్ట్
  • తెలుగు వెలుగు హైదరాబాద్ వారిచే అస్తిత్వం
  • కృష్ణా పుష్కర పురస్కారం
  • సాహిత్యరత్న & సాహితీ లహరి
  • ఉత్తమ రక్త దాత ..88 సార్లు రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర blood banks..
  • National Icon award.. Hindustan టైమ్స్ తో
  • స్టేట్ బెస్ట్ రైటర్. ZBNF తోటపల్లి
National Icon Award

తాత్విక చింతన

ఎన్ని పనులు చేసి ఎంత ముందుకు సాగినా మనిషి అంతర్ముఖులైనప్పుడు తనలో తాను ఒక తాత్విక చింతనలో ఉంటారు. అందుకు విజయమోహన్ గారు కూడా అతీతులు కారు. ఆయన భావాలు ఇలా ఉన్నాయి.

కాసేపు ఆగి నిలుచుంటే.. అంతా
నలుపు తెలుపుల గందరగోళం..
తోడుగా నీడగా దన్నుగా ఉంటారని అనుకోవడం
కలిసి కట్టుగా సాగి పోతామని అనుకోవడం..
ఒట్టి కథ.. అదంతా భ్రమ..
నిజానికి ఇదంతా రంగుల వల..
వేలాది గుంపులో నేను ఎప్పుడూ ఏకాకినే!
చీకటి పడితే.. తోడు రాని మాయమయ్యే
నా నీడ సాక్షిగా.. నేనెప్పుడూ ఒంటరినే!
జగమెప్పుడూ.. పలు ముఖాల సమాహారం..
నన్ను ఎప్పుడూ.. ఏమార్చాలని చూస్తున్నది..!!
పలు వేషాల సందోహం.. నన్ను ఎల్లపుడూ..
నస్తిత్వంగా మార్చాలని చూస్తున్నది!
కల్పిత చిత్రాల విచిత్రాల నడుమ
నా వాస్తవ రూపానికి మెరుగులు దిద్దే దిశగా నేను!!

~

నాన్నకు ప్రేమతో..

ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి లేఖ రాసి తన భావాలను ఇలా పంచుకుంటున్నారు.

ప్రియమైన నాన్నా!

మీరు మంచి ఆరోగ్యంతో ఎల్లపుడూ ఉత్సాహంగా ఉండాలి. చిన్నప్పటి నుండీ మీరు నా కోసం చేసే ప్రతి ప్రయత్నానికి కృతఙ్ఞతగా నా ప్రతి స్పందన జీవితాంతం వెలిబుచ్చినప్పటికీ చాలదు.

నేనుసమాజంలో పెరుగుతున్నప్పుడు,తిరుగుతున్నప్పుడు మీ తిరుగులేని మద్దతు, భరోసా, ప్రేమ..

నన్ను కాచిన కాపు.. మీరు నా అల్లరి, తొందరపాటు, మిడుసిపాటు, నిర్లక్ష్యం..

ఇవన్నీ చెయ్యలేదు అన్నట్లు.. సహించి.. సహిస్తూ..

ఓరిమి, క్షమ, శాంతి.. విలువలు పాటిస్తే..

ఎలాంటి అద్భుత జీవితాన్ని ఆస్వాదించగలమో.. చేసి చూపిస్తున్నారు..

నేను డస్సిపోయి, ఓడిపోతున్నపుడల్లా.. నేను కఠినమైన నిర్ణయాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా తెలివైన సలహాలను అందిస్తున్నారు.. ఆ క్షణాలు నన్ను మీలా అచ్చు మీలానే నన్ను తీర్చిదిద్దాయి.

నేను మీ బలాన్ని, దయను అంకితభావాన్ని చూస్తున్నపుడల్లా ఆశ్చర్యపోతూ వుంటాను. మీరు ఎల్లప్పుడూ నాకు రోల్ మోడల్. కృషి, చిత్తశుద్ధి, కరుణ ఇవే ఆదర్శ జీవితానికి ఆనవాళ్ళుగా మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తూ వుంటుంది. నేను పలు సందర్భాల్లో గమ్యం తెలియని కూడలిలో దారి తెలీక, ఒంటరిగా చీకటిలో నిలబడేటప్పుడు, వెనక నిలువెత్తుగా భుజం తడుతూ ధైర్యం, ఆశ, స్ఫూర్తిగా మీ రూపం, మాట..

సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా, ఆశాజనకంగా ఉండగల మీ సామర్థ్యాన్ని నాకు అణువంత అయినా రావాలని నిజంగా కోరుకుంటున్నాను.

నా జీవితంపై మీరు చూపిన ప్రభావం ఎనలేనిది. మీ మార్గదర్శకత్వంలో నా జీవితంలో పలు ఒడిదుడుకులను దాట గలుగుతున్నాను.

నాపై మీకున్న నమ్మకం, మీ కలలను, ఆశయాలను కొనసాగించగల ధైర్యం

ఆ విశ్వాసం.. నన్ను మీ అంశగా మరింత బలోపేతం చేస్తున్నది. మిమ్మల్ని నా తండ్రిగా పొందడం నా జన్మ జన్మల పుణ్యం..

మీరు సృష్టించిన రూపం నేను.

మీరు వెలిగించిన దీపం నేను..

మీరు సంధించిన బాణం నేను..

నా మార్గదర్శి, నా గురువు, నా మిత్రుడు ..

మీతో మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి, మరింతగా మిమ్మల్ని అనుసరిస్తూ..

ఎదురు చూస్తున్నాను. ప్రేమతో,

మీ విజయ..

~

నటునిగా వేదికపై నిలచినప్పుడు కూడా ఈ తాత్విక భావనలు వెంటాడుతూనే ఉంటాయి. మన లక్ష్యం ఏమిటో నిర్దేశిస్తూనే ఉంటాయి. అదే కవితాత్మకంగా చెప్పాలంటే ఈ విధంగా ఉంటుంది.

నటన..అంతా ఒక నటన../ పుట్టుక నుండి మరణం వరకు..

ఆది నుండి అంచుల వరకు/ మజిలీ నుండి అంతంవర కు..

నటన..అంతా నటన../ నమ్మకమే ఒక నటన..

ప్రతి కలయిక ఒక నటన../ ప్రతి స్పందన ఒక నటన..

కనిపించే దంతా../ కనిపించని దంతా… ఒక నటన..

నలుగురు ఉన్నారనేది../ ముందూ వెనకాల ఉన్నారనేది నటన..

నువ్వొక్కడివే../ ఎప్పటికయినా../ అనేది ఒక్కటే../ కాదు కాదు నటన..

***

(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here