[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరాం’ అన్న శీర్షికని దారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల – విశాఖ నగరంలో శివాజీపాలెంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌లో సెకండరీ గ్రేడ్ టీచరుగా పనిచేస్తున్న శ్రీమతి ఉమాగాంధీ గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]
తండ్రి వారసత్వంగా ఎంపిక చేసుకున్న ఉపాధ్యాయ వృత్తి:
ఆమె తండ్రి (లేటు) మురహరరావు రామకేశవరావు. పినతండ్రి మన్మధరావు ఉపాధ్యాయులు. తండ్రిని అనుకరిస్తూ ఎంతో ఇష్టంగా ఈ వృత్తిని అవలంబించడం అందులో నుండే ఎంతో ఉన్నత విద్యాభ్యాసాన్ని ఎన్నో ఉన్నత పురస్కారాలను అందుకోవడం అనేది శ్రీమతి మురహరరావు ఉమా గాంధీ యొక్క అభిరుచికి నిదర్శనం.
బాల్యం:
తండ్రి రామకేశవరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి భువనేశ్వరి గృహిణి. చుట్టూ ఉన్న పరిసరాలు ఆమె జీవితంపై ఎంతో ప్రభావం చూపాయి. బోధనలో ఉన్నత స్థాయి చేరటానికి తండ్రి ప్రధాన కారకులు. నలుగురు సంతానంలో ఉమా గాంధీనే పెద్ద. ఆమె సోదరులు రమణమూర్తి, విద్యాసాగర్ మరియు సోదరి శ్రీకళ ప్రభుత్వ ఉపాధ్యాయులుగానే స్థిరపడ్డారు.
తండ్రి ఉద్యోగరీత్యా గరివిడిలో పనిచేయడంతో ఉమాగాంధీ విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. కోడూరు ప్రభుత్వ పాఠశాలలో తండ్రి పనిచేసే పాఠశాలలోనే ఐదవ తరగతి వరకు చదివారు.
రామకేశవరావు కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాటలు పాడుతూ, ఆటలు ఆడిస్తూ, వారితో మమేకమవుతూ, పాఠాలు చెప్పేవారు. తన తండ్రి బోధన విధానం చూసి స్ఫూర్తి పొందిన ఉమా గాంధీ తాను కూడా ఉపాధ్యాయవృత్తి చేపట్టాలనుకున్నారు.
విద్యాభ్యాసం:
10వ తరగతి వరకు గరివిడిలోని శ్రీరామ్ విద్యాపీఠం ఇంటర్ డిగ్రీ ఎస్డిఎస్ కాలేజీలో పూర్తి చేశారు ఇంటర్లో బైపిసి చేశారు.
డిగ్రీలో తాను చదివే కళాశాలలో జువాలజీ లేకపోవడంతో బి.ఎ. తీసుకున్నారు
భీమవరంలోని జిటిపి కళాశాలలో బి.ఇడి. 1996లో పూర్తి చేశారు.
పట్టణ మురికివాడలలో ఏర్పాటు చేయబడిన పాఠశాలలో ప్రారంభించబడిన ఉపాధ్యాయ వృత్తి – భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకునే వరకు సాగిన గొప్ప ప్రయాణం.
ఉద్యోగ జీవితం ప్రారంభం విద్యల నగరం విజయనగరంలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ మరియు బ్రిటిష్ వారి సంయుక్త సహకారంతో డిస్పెక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ద పూర్ డి.పి.ఇ.పి. ప్రాథమిక విద్యాపథకము ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాలలో ప్రారంభించబడినది. అందులో విజయనగరం ఒకటి. దాని ప్రకారము
- బడి ఈడు పిల్లలకు అందుబాటులో పాఠశాల
- పాఠశాలలకు కనీస వసతి సదుపాయములు
- ఉపాధ్యాయులకు ఉత్తమమైన శిక్షణ
- విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడం
- డ్రాప్ అవుట్ల రేటు తగ్గించడం
మొదలైన లక్ష్యాలతో ప్రారంభింపబడినది.
అంతకుముందే యు.బి.ఎస్.పి. పథకం అనగా అర్బన్ బేసిక్ సర్వీసెస్ టు ది పూర్ పథకం ప్రకారం విజయనగరం జిల్లాలో 65 మురికివాడలు గుర్తించబడినవి. వాటిలో రిసోర్స్ పర్సన్లు చేసిన సర్వేలతో పది ఏరియాలలో డి.పి.ఇ.పి. పాఠశాలలు కొత్తగా ప్రారంభింపబడినవి. అందులో ప్రతి పాఠశాలకు ఇద్దరు మహిళా టీచర్లు చొప్పున నియమించబడగా, అందులో కొత్తమజ్జీపేట అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాఠశాలకు ఉమాగాంధీ నియమింపబడ్డారు.
డిపిఇపి పాఠశాలలో అనుభవాలు:
పాఠశాల భవన నిర్మాణమునకు ముందే పాఠశాల ప్రారంభించబడింది. కనుక ఒక పాకలో చెరువు పక్కన తాత్కాలికంగా పాఠశాల ఏర్పాటు చేశారు. స్లమ్ ఏరియాలో కనుక తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లిపోయినప్పుడు పిల్లలకు స్కూలు అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పథకం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల పాములు, తేళ్లు వంటి విషపురుగుల సంచారం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో పిల్లలను తరగతి గదిలో కూర్చోవాలని చెప్పినా పట్టించుకునే వారు కాదు. తల్లులు వచ్చి తమ బాధను మొరపెట్టుకునేవారు.
అప్పుడే బి.ఇడి. పూర్తిచేసుకుని 1998 డి.ఎస్.సి.లో ప్రైమరీ స్కూల్ టీచర్‌గా ఎంపికై విజయనగరంలోని డి.పి.ఇ.పి. పాఠశాలలో చేరారు. ఎంపిక కాబడి వచ్చిన ఆమెకు ఈ పిల్లల అల్లరి వాళ్ళకి పాఠం చెప్పడం ముఖ్యమా? శుభ్రత నేర్పడం ముఖ్యమా? అల్లరి చేయకుండా ఉంచడమా? చెరువుల్లో ఈత కొట్టడం, చెరువుల్లో చేపపిల్లలు పట్టుకు రావడం, పాములు పట్టుకొని తిరగడం ఇలాంటి పనులు చేస్తున్న పిల్లలతో ఆమెకు చాలా కంగారు వేసింది. అయినా సమయస్ఫూర్తితో పిల్లలను శుభ్రంగా తయారు చేయడానికి అవసరమైన టాయిలెట్ సామాను ఒక పెట్టెలో పెట్టి ఉంచేవారు. పిల్లలను ఒకరికి ఒకరు తయారు చేసుకునేవారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు చదువు పాఠంగా చెపితే వినే వయసు కాదు వారిది. కనుక పాటలతో, ఆటలతో పాఠాలు చెప్పడం తండ్రి వద్ద నేర్చుకున్న విద్య బ్రతుకు బాటలో సహాయపడింది.
ఒక ఉపాధ్యాయునిగా ఆమెకు స్ఫూర్తినిచ్చిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి మాటలు:
“Let us sacrifice our to-day so that our children can have a better tomorrow.”
భావవ్యక్తీకరణ ప్రేమ వాత్సల్యము ఈ మూడింటి సంగమమే ఒక మంచి ఉపాధ్యాయురాలు. అని నమ్మారు.
ఎలాగైనా పిల్లలను తరగతి గదిలోనే కూర్చోబెట్టాలని నిర్ణయించుకుని తన తండ్రి అనుసరించిన విధానాన్ని ఎంచుకున్నారు ఉమాగాంధీ. పిల్లలు ఇష్టపడేలాగా ఆటపాటలతో పాఠాలు చెబితే వినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ విధానాన్ని అనుసరించి పిల్లలను తన దారిలోకి తెచ్చుకున్నారు. అప్పటికప్పుడు పాటలను రాసి, బాణీలు కట్టి పాడేవారు. అభినయం జోడించి మనసుకు హత్తుకునేలా చెప్పేవారు. పాఠాలతో పాటుగా జాతీయ వేడుకలు, నాయకుల వర్ధంతులు, జయంతులు సందర్భంలో స్వాతంత్ర ఉద్యమంలోని కీలక ఘట్టాలను భారత రామాయణ ఘట్టాలను చిన్నారులకు పాటలుగానే బోధిస్తున్నారు. పాటలను రూపొందించడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు. అప్పుడప్పుడు చిన్నారులు చేసే పనులను చూసి పాటలుగా మలచి పాటలను పాఠాల రూపంలో ఆశువుగా చెప్తారు. “నాలోని కవిత్వాన్ని తట్టి లేపింది పిల్లలే!” అంటారు.
“డింభకు డింభకు వచ్చాడు
డప్పాలెన్నో చెబుతాడు
చొక్కా చింపుకు వచ్చాడు”
ఇలాంటివి సుమారు ఒక 60 బాల గేయాలు. పాలపుంత పిల్లల అల్లరిని, పాటలతో ఇతర కార్యక్రమాలను ఉమా గాంధీ గేయాలుగా మార్చి పాలపుంత పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. అందులో 60కి పైగా పాటలు ఉన్నాయి. పిల్లల ప్రతి యాక్టివిటీని అందులోని శబ్ద చిత్రం చేశారు.
ఈ సందర్భంగా మనసుకు హత్తుకుపోయే సంఘటన ఒక విద్యార్థి ద్వారా కలిగిందని ఇలా చెప్పారు –
“శ్రావణమాసంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి, చెరువులో మునిగి 108 కలువ పువ్వులు శ్రావణమాసం శుక్రవారం పూజకు కోసి, నా కోసం మా ఇంటి తలుపులు నాలుగున్నరకు కొట్టి ‘పూజ చేసుకోండి అమ్మగారూ!’ అని అందించే సురేష్ అనే అబ్బాయిని నేను ఇవాళకు మరచిపోలేను.”
పిల్లలు చూపించే అభిమానం ఆప్యాయత ఉపాధ్యాయునికి పిల్లలకు మధ్య ఆ బంధం ఏర్పడితే అభ్యసనం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. పిల్లలకు క్విజ్, ఆటలు, పదవిన్యాసం, మ్యూజిక్, యోగా, ధ్యానం వంటివి కూడా నేర్పిస్తున్నారు. విద్యార్థులతో పలు రేడియో కార్యక్రమాలు నిర్వహించారు.
“సెప్టెంబర్ 1న 1998లో గురువుగా మొదటి అడుగు మజ్జిపేటలో పేటలో పెట్టాను. పక్కనే చెరువు పాకలో పాఠాలు. కుదురుగా కూర్చునే వారు లేరు. అప్పుడే నాకు ఆట పాటలతో వారికి చేరువయ్యాను. సుమారు 14 సంవత్సరములు అక్కడ పనిచేసిన తర్వాత విశాఖపట్నం భర్త ఉద్యోగరీత్యా మారిపోవలసి వచ్చింది.
తిరిగి పాతిక సంవత్సరముల తర్వాత వారిని నేను ఈ విధంగా కలుసుకోగలిగాను.
రెండు రోజుల ముందు వారందరూ వచ్చి చెమ్మగిల్లిన కళ్ళతో సత్కారం చేశారు. ఇంతకంటే ఏం కావాలి? నాకు వాళ్ళ కష్టాలు అన్నీ చెప్పుకొని నేను వాళ్ళ సొత్తు అన్నట్లు నన్ను వారి గుండెల్లో దాచుకున్నారు. నేను ఆ స్కూల్ దాటిన వెంటనే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసేసారని బోరున ఏడ్చేసారు. ఎక్కడెక్కడి నుంచో నా స్కూల్ వెదుక్కుంటూ వచ్చారు.” అన్నారు ఉమా గాంధీ.
అంచెలంచెలుగా ఉన్నత విద్య:
శ్రీమతి ఉమ
B.A. మరియు M.A. (తెలుగు), ఆంధ్ర విశ్వవిద్యాలయం
B.Ed మరియు M.Ed, ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU)
M.Phil మరియు Ph.D తెలుగు సాహిత్యంలో చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు.
కుటుంబ నేపథ్యం:
ఆమె విజయనగరం జిల్లాలో దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం ఉపాధ్యాయురాలిగా తన జీవితాన్ని ప్రారంభించారు. తన ఆమె భర్త పక్కి మురళీ రమేష్ ఆంధ్రా మెడికల్ కాలేజి (కె.జి.హెచ్) లో ఉద్యోగం చేస్తున్నందున ఆమె విశాఖ నగరానికి మారారు.
అబ్బాయి అభిషేక్ భరద్వాజ్ కోడలు ప్రగతి,
అమ్మాయి సాయి అనుజ్ఞ అల్లుడు యోగేష్
అందరూ ఉన్నత ఉద్యోగాలలో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
బహుముఖ వ్యక్తిత్వం:
పుస్తకాల్లో ఉన్నదాన్ని విద్యార్థులకు బోధించడంతో పాటు దానికి మరింత విషయ జ్ఞానాన్ని జోడించి తేలికగా ఆట పాటలతో, కథలతో చెప్పడం ఆమె ప్రత్యేకత.
మరి మీరు యోగా శిక్షకురాలిగా ఎప్పుడు మారారు? అని అడిగితే, ‘ఏది జరిగినా మన మంచికే అనే తత్వము ఒకసారి స్కూటర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయి ఆరు నెలలు బెడ్ రెస్ట్ అవసరమైనది. ఆపరేషన్ చేసిన నయం అవుతుందో లేదో చెప్పలేము అని అన్నారు. ఆ సమయంలో మెడికల్ లీవ్ తీసుకున్నా’ అన్నారు.
సమయాన్ని సదుపయోగం చేయడం అంటే ఆమె దగ్గరే నేర్చుకోవాలి. ఒకరోజు వారి ఇంటి డోర్ ముందు ఒక పాంప్లెట్ పెట్టి ఉంది. గాయత్రి మేడం ఎంవిపి కాలనీలో యోగా చెప్తారని. ఆమెను కలిసి యోగా నేర్చుకుంటానని చెప్పినప్పుడు ఎక్కువగా శ్రమపడకుండా చేయగలిగినంత వరకు చేస్తూ ఉండండి అని చెప్పేవారు. రోజు వెళ్తూ ఉండడంతో ఆశ్చర్యకరంగా కాలు స్వాధీనమైంది. మీరు యోగా టీచర్‌గా శిక్షణ ఎందుకు పొందకూడదు? అని ఆమె అడిగారు. అప్పుడు బెంగుళూరులోని శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో యోగా ధ్యానంపై నెల రోజులు శిక్షణ పొందారు.
“యోగా శిక్షకురాలిగా క్లాసులు చెప్పడానికి అవసరమైన పరీక్షలన్నీ ఈ ఆరు నెలల్లో పాస్ అయ్యాను. ఇది నా జీవితంలో గొప్ప మార్పును తెచ్చింది. తెలుగు టీచర్‌గా ఉన్న నేను యోగ టీచర్‌గా కూడా మారి పిల్లలకు మరింత చేరువ అయ్యాను.” అన్నారు.
యోగాతో పిల్లల అనుభవాలు:
పిల్లలు ఇంట్లో అన్ని విషయాలు టీచర్తో చెప్పుకుంటారు ఇంట్లో అనేక రకాలైన డిస్టర్బెన్స్లు ఉంటాయి. అందువలన పిల్లలు పాఠాల మీద శ్రద్ధ చూపలేక పోతారు. కనుక ముందుగా వారికి ఐదు నిమిషాల పాటు మెడిటేషన్, యోగ చేయించడం వలన వాళ్ళు పాఠాలు వినడానికి ఉన్ముఖులవుతారు.
“ఈ అలవాటు నేను ఏ సభలలోనైనా, సమావేశాలకైనా, ప్రతిరోజు తరగతి ప్రారంభంలోనైనా తప్పనిసరిగా ఐదు నిమిషాల మెడిటేషన్ చేయించుతాను. అందరి చేత అది మన లక్ష్యం వైపు మనం ఆలోచించేందుకు దోహదమవుతుంది” అన్నారు.
సాహిత్య జీవనం:
“అక్షరాన్ని పరిచయం చేసినది శ్రీలక్ష్మి టీచరు. ఎలా రాయాలో సూచనలు ఇస్తూ, చిన్నచిన్న సవరణలు చేస్తూ నా తొలి కవితా సంపుటికి బాటలు వేశారు. అలాగే ఉపాధ్యాయ సమావేశాలలోనూ, పాఠశాలల సముదాయంలోను నా కవితలు చదివే అవకాశాన్నిచ్చిన గురుపరంపరలలో మీరు నా సాహిత్య గురువుగా చెప్పుకుంటూ ఉంటాను” అన్నారు ఉమ.
తాను నేర్చిన విద్యను పిల్లలకు ఏ విధంగా ఉపయోగించాలా అనే ఆలోచనతో యోగా, ధ్యానం ప్రాణాయామంల ద్వారా పిల్లల చదువులపై ఆసక్తిని పెంపొందించడానికి ఆమె నిరంతరం కృషి చేస్తారు.
సాహిత్య అభిలాష – చేసిన రచనలు:
రచనలు చేయడం, చేసిన దానిని చిన్న చిన్న గేయాలుగా పాటలు వరుస కట్టడం తండ్రి దగ్గర నేర్చుకున్న విద్య. తండ్రి పని చేసే పాఠశాలలోనే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదివిన సమయంలో అతని బోధన ఏ విధంగా ఆకర్షణీయంగా ఉంటుందో దగ్గరగా పరిశీలించి, చూసి తాను కూడా అదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.
శ్రీమతి ఉమా గత పది సంవత్సరాలుగా పిల్లల కోసం చాలా పుస్తకాలు రాశారు.
సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. పాలపుంత, రాధా మాధవీయం, పదనిసలు, రాగమాల ఆమె రచనలు చేసి ప్రచురించారు.
రాగమాల
ఆపదైనా.. ఆనందమే..
ఆదుకునే.. నీ స్నేహముంటే…
అనువాదం:
ఈ మధ్యనే నేషనల్ బుక్ ట్రస్ట్ (న్యూఢిల్లీ) వారి ఆధ్వర్యంలో మూడు పుస్తకాలు ఆంగ్లం నుండి తెలుగులోకి ఆమె అనువాదం చేశారు.
- చికా-చిక్-చిక్-
- నీలూ-పీలూ
- గోవా
పరిశోధనా పత్రాలు:
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా పత్రాలు రాసి పలు విశ్వవిద్యాలయాలకు సమర్పించారు.
- కందుకూరి వీరేశలింగం రచనల్లో స్త్రీ చైతన్యం
- గురజాడ కథానికల్లో స్త్రీ పాత్రలు సంఘసంస్కర్తలు చైతన్యం
- డాక్టర్ నాయని కృష్ణకుమారి గారి సాహితీ జీవితం
- పట్నాయకుని మోహన్ గారి నాటకాలు పాత్రలు
- వాసాల నరసయ్య గారి బాల సాహిత్యం
- మారిషస్ తెలుగు తల్లి తెలుగు మాతృభాష పరిరక్షణ
- తానా ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రసంగించడం
- 4వ ప్రపంచ తెలుగు మహాసభ ‘కవి సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఆల్ ఇండియా రేడియో (AIR) ద్వారా ప్రసారమయ్యే అనేక కార్యక్రమాలలో తాను స్వయంగా పాల్గొనడమే కాక ఆమె తన విద్యార్థులతో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.
మన స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలపై యువతరానికి అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక మంత్రిత్వశాఖ ద్వారా శిక్షణ పొందారు. పిల్లల్లో ప్రేమ, దయ వంటి మానవీయ విలువలను పెంపొందించేందుకు పాఠాలతో పాటు ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక శ్రధ్ధ కనబరుస్తారు.
తరగతుల వారీగా మాడ్యూల్స్ తయారీ:
రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌గా, ‘ఆనంద లహరి’ మరియు ‘ఆనంద వేదిక’ మాడ్యూల్ ల తయారీలో తన సేవలు ప్రభుత్వానికి అందించారు. పలు కార్యక్రమాలలో రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
ఒకటి నుండి పదవ తరగతి వరకు ఉపాధ్యాయ కరదీపికలు ఆనంద వేదిక మాడ్యూల్స్ తయారు చేశారు. పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సూచనల మీద మేరకు నాలుగు లెవెల్స్ లో
- ఒకటి రెండు తరగతులకు
- మూడు నాలుగు ఐదు తరగతులకు
- ఆరు ఏడు ఎనిమిది తరగతులకు
- తొమ్మిది పది తరగతులకు
శ్రీమతి ఉమా గాంధీ అందుకున్న పురస్కారాలు
- 2013 మరియు 2024 మధ్య జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక అవార్డులను గెలుచుకున్నారు.
- 2013లో ఉత్తమ ప్రధానోపాధ్యాయులు అవార్డు, 2014 మరియు 2015లో GVMC ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు,
- 2016లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, రాష్ట్రస్థాయి ‘బాల సాహితీ పురస్కారం అవార్డు
- 2017 మరియు 2019లో రాష్ట్ర స్థాయిలో ‘ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’.
- 2020 మరియు 2023 లో సేవారత్న పురస్కారం ,
- ఆమె తన పాటల ద్వారా ప్రజలలో పరిశుభ్రత భావనపై అవగాహన కల్పించినందుకు 2022లో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) నుండి స్వచ్ఛ పురస్కారం
- 2023లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారిచే గురజాడ పురస్కారం
- 2024లో ఫ్రెండ్షిప్ ఫోరం న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో భారత్ ఎక్సలెన్స్ అవార్డు మరియు లీడింగ్ ఎడ్యుకేషనిస్ట్ అవార్డును కూడా అందుకున్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
విశాఖనగరంలో శివాజీపాలెంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో సెకండరీగ్రేడ్ టీచరుగా గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. డా.మురహరరావు. ఉమాగాంధీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎం.హెచ్.ఆర్.డి.) ద్వారా జాతీయ ‘ఉత్తమ ఉపాధ్యాయురాలి’గా ఎంపికై విశాఖపట్నం గర్వించదగ్గ రీతిలో నిలిచారు. సెప్టెంబర్ 5, 2023 న న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు.
ఆమె 4వ ప్రపంచ తెలుగు మహాసభ ‘కవి సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక విద్య, ధ్యానం మరియు యోగాను ప్రోత్సహించడం, ప్రముఖ రచయితలలో ఒకరిగా గుర్తింపు పొందాలన్నది శ్రీమతి ఉమా ఆశయం.
ఉమాగాంధీ ఆటపాటలతో చిన్నారుల చదువు పట్ల ఆసక్తి కలిగించి వారిలో మనోవికాసానికి బాటలు వేయడానికి కృషి చేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలు మురహరరావు ఉమాగాంధీ విశాఖపట్నం శివాజీ పాలెం ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా తరగతి గదిలో విద్యార్థులు చక్కగా పాఠాలు వినేందుకు ఆమె వినూత్ అంశాలు ఎన్నుకున్నారు. ఆటపాటలతో బోధిస్తూ పిల్లలను అలరిస్తున్నారు.
పదనిసలు, రాధా మాధవి, రాగమాల పుస్తకాలను రాశారు. వాటిలో సాహిత్యం భాషా విన్యాసాలు శాస్త్ర సాంకేతిక అంశాలు యువతకు సంబంధించిన విషయాలను సమీకరించారు. కొన్ని వందల పాటలు రాశారు. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆమె ఒక్కరోజు పాఠశాలకు రాకపోయినా ఎందుకు రాలేదని విద్యార్థులు వాకబు చేస్తారు. ఇది తల్లిదండ్రులకు కూడా ఎంతో నచ్చుతుంది. ఉమాగాంధీ యూనివర్సిటీలు నిర్వహించే సదస్సులకు హాజరవుతున్నారు. 15 వరకు పరిశోధనా పత్రాలను సైతం సమర్పించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూడు పుస్తకాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ గా మూడు కీలక ప్రోగ్రాములకు పనిచేశారు. అనేక జాతీయ అంతర్జాతీయ వేదికల పైన తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ పాటలు పాడారు.
పట్నాయకుని మోహన మాస్టారి కవిత్వంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ద్వారా ఎం.ఫిల్. లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2016 శీలా సుభద్రాదేవి కవిత్వం పరిశీలన అంశంపై పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేటు అందుకున్నారు.
“నాకు స్ఫూర్తి నాన్న. భీమిలిలో ఉపాధ్యాయుడుగా నాన్నకు గ్రామ ప్రజలు ఇచ్చే గౌరవం చూసి నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను. పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ నాన్న పాఠాలు చెప్పేవారు. ఈ విధానం నన్ను బాగా ఆకర్షించింది. మంచి టీచరుగా పేరు తెచ్చుకోవాలంటే విద్యార్థుల మనసు గెలుచుకోవాలని అర్థమైంది. అదే స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నా” చెప్పారు ఉమ.
పాటలతో పాఠాలు:
ఏమీ లేనప్పుడు ఓపిక – అన్ని ఉన్నప్పుడు ప్రవర్తన మనిషి వ్యక్తిత్వాన్ని పెంచుతాయి.
ఆడపిల్లలకు కౌమార దశలోని సమస్యలపై అవగాహన కల్పించడం సాహితీవేత్తగా పిల్లలకు బాల సాహిత్యాన్ని అందుబాటులోకి తేవడం మాతృభాష పై మమకారాన్ని పెంచే కార్యక్రమాలు చేయడం.
విజయనగరం జిల్లా ఏర్పడి 40 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆమె రాసిన కవిత
విశ్వదిగ్గజాలెందరో..
నగర గర్భమందు పుట్టి,
దశ దిశలూ జయవేదికలకు
ఆలవాలమైనట్టి, మనందరి
విజయభేరి విజయనగరం!
~
గురుపూర్ణిమ సందర్భంగా గురువులపై అభిమానాన్ని తన కవితలో చాటుతూ
“అక్షర విలువలను సలక్షణంగా
మెరిపించే ప్రపంచీకరణ చిత్రకారులం
ఎక్కడ అక్షరాలు
వికసిత పూల వనాలవుతాయో
ఎక్కడ ఉపాధ్యాయుడు గురుదేవోభవ
అనే కొలవబడతాడో
ఆ బడి చరిత్ర సృష్టిస్తుంది
చరిత్రలో గురు పీఠమై నిలుస్తుంది.”
~
మీ గురించి మీరు ఒక రెండు మాటలలో చెప్పాలంటే ఎలా చెప్పుకుంటారు అని అడిగితే, “నా మస్తత్వం నాకిష్టం.. నాలోపలికే నన్ను ఉంచుతుంది. ప్రతి దగ్గరా ఏదో ఒకటి ఇప్పటికీ నేర్చుకుంటూ ఉంటాను. నాకు నా బడి పిల్లలు, నా సాహిత్యం, నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ మూడు తప్ప, వేరే ప్రపంచం లేదు. నాకు బడి పిల్లల కళ్ళల్లో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. కన్నపేగును మరిపించే అమృత భాండాగారం నా బడిపిల్లలు దగ్గర దొరుకుతుంది” అన్నారు.
(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)