[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరా’ అన్న శీర్షికని దారావాహికగా అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap]చార్యదేవోభవ!
🙏
గు – చీకటిని
రు – తొలగించే
వు – వ్యక్తి
అని అర్థం చెప్పేసుకుని, ఒక దండం పెట్టేసుకుంటే తీరేది కాదు గురు శిష్య అనుబంధం.
సాంప్రదాయ ఆహార్యం
మృదువైన స్వరం
చల్లని చిరునవ్వు
భయం లేదని చేరదీసి
సందేహాలను తీర్చి
ప్రాచీన ఆధునిక శాస్త్రాల సారాన్ని గోరుముద్దగా అందించిన ఎంత తవ్వినా తరగని విజ్ఞాన ఖని!
విద్యను అందించడమే కాదు
పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది
అజ్ఞానపు స్థాయిలు తెలుసుకుని
అవసరమైన వేళల చిరుదీపంగా నిలిచి
జీవితంలోని ఒత్తిడులను ఎలా ఎదుర్కోవాలో
వ్యక్తులతో ఎలా మసలుకోవాలో
ఉద్వేగాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో
దృష్టిని బట్టే సృష్టి అనే
జీవిత సత్యాన్ని అవగతం
చేయిస్తూ
క్షమకు సాకారంగా
దైవానికి మారురూపుగా
తమ అమూల్యమైన సమయాన్ని
మన కోసం వెచ్చిస్తూ
మన తప్పొప్పులను సవరిస్తూ
మరో ప్రపంచపు ద్వారాలు తెరిచి
ఆవల ఏముందో తెలియజేసే ద్రష్ట!
అమ్మానాన్నల బాధ్యత తానే వహించి
గురుస్థానం స్వీకరించి
మేధోశక్తిని పదునుపెట్టించి
ప్రతిభకు పట్టం కట్టించి
ఆచార్య స్థానం అధిరోహించి
ఉన్నత శిఖరాలను అధిరోహింప చేసి
మన ఉన్నతికి ఆనందించే దైవమా!
ఏమిచ్చినా తీర్చగలమా వారి ఋణం!
అశ్రుపూరిత నయనాలతో
నతమస్తకులం కావాలి
గురుకృప
ఒకానొకప్పుడు ‘ధౌమ్యుడు’ అనే గురువుగారు ఉండేవారు. అతని దగ్గర ఉపమన్యువు, ఆరణి, వేదుడు అనే ముగ్గురు శిష్యులు విద్య నేర్చుకునేవారు. ఆ రోజుల్లో శిష్యులు అత్యంత గురుభక్తిని కలిగి ఉండేవారు. అంటే గురువు చెప్పిన పని ఎంత కష్టమైనదైనా ఎదురు చెప్పకుండా చేసేవారు.
ఒక వర్షాకాలం సాయంత్రం సమయంలో ధౌమ్యులవారు ఆరణిని పిలిచి “పొలంలోని వరి చేనులోంచి నీరు బయటకు పోతోంది. దానికి అడ్డుకట్ట వెయ్యి.” అని పంపించారు.
ఆరణి ఎంత ప్రయత్నించినా నీరు ఆగకుండా పోతోంది. ఆఖరుకు అతడే ప్రవాహ వేగానికి అడ్డంగా పడుకున్నాడు. ప్రవాహ వేగం తగ్గి, అందులోని గడ్డి అతడే హద్దుగా ఆగింది. అందులో అతడు పూర్తిగా కప్పబడిపోయాడు.
ఆరణి ఎంతసేపటికీ ఇంటికి రాలేదని గురువుగారు ఇతర శిష్యులతో వెదకడానికి బయల్దేరాడు.
“నాయనా! ఆరణీ! ఎక్కడున్నావు? రావయ్యా!” అని పిలిచేసరికి గురువుగారి స్వరం వింటూనే వెంటనే తనను చుట్టుకున్న వరిచేను గడ్డిని చీల్చుకుంటూ బయటకు వచ్చాడు.
“గురువుగారూ! చేలోని నీరు బయటకు పోకుండా అడ్డంగా పడుకున్నాను. మీ పిలుపు వినగానే బయటకు వచ్చాను” అన్నాడు. అతని కార్యదీక్షకు సంతసించిన ధౌమ్యులవారు
“నాయనా! అన్ని వేదాలూ, ధర్మశాస్త్రాలూ, నీకు చదివినవన్నీ సమయానికి స్ఫురణకు వచ్చేటట్లు ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు నుండి నువ్వు ‘ఉద్దాలకుడు’గా పిలువబడతావు. అన్నారు ధౌమ్యులవారు.
మనలో చాలామందికి ఎన్నో విషయాలు తెలిసినా, సమయానికి గుర్తురాకపోవడం అనే సమస్యతో బాధ పడుతుంటాం. చదువుయందు అవగాహన, చేసే పనిపట్ల శ్రధ్ధ, పెద్దలయందు గౌరవం ఉంటే గురుకృప సంపూర్ణంగా ఉన్నట్లే!
వందే గురు పరంపరా
ఈ విశ్వమంతటికీ ప్రథమ గురువు ఆదిగురువు ఆ శివమహాదేవుడు.
నిత్యమూ ధ్యానముద్రలో ఉంటూ, విశ్వాన్ని నడిపించే శక్తి సామర్థ్యాలు సంపాదించుకుంటూ ఉంటాడు.
తల్లిదండ్రులు గురువులుగా ప్రథమస్థానం అందుకుంటే
విద్య నేర్పి బ్రతుకు తెరువు చూపిన వారు ద్వితీయ గురువులు.
గురుశిష్య సంబంధం లోకోత్తరం.
మంచి గురువు దొరకాలని శిష్యుడు తపించినట్లే మంచి శిష్యులు దొరకాలని గురువు కూడా తపిస్తారట.
సరియైన శిష్యుడు దొరకగానే తన విజ్ఞాన సర్వస్వం ధారపోయడానికి వెనుకాడని సద్గురువులు వారు.
దీనికి మంచి ఉదాహరణ మనం నిత్యం పఠించే రామాయణంలో ఉంది.
ఎవరూ కోరకుండానే విశ్వామిత్రుడు దశరథ మహారాజు సభలో ప్రవేశించి, రామలక్ష్మణులను తనతో తీసుకు వెళ్ళి, తాను ఎన్నో వేల సంవత్సరాల తపస్సు చేసి సంపాదించిన అస్త్రశస్త్రాలు మంత్రవిద్యలూ రామునికి ఉపదేశిస్తాడు. అంతేకాదు శిష్యుని అభ్యున్నతి కోరి మిథిలానగరానికి తీసుకువెళ్ళి శివధనుర్భంగానికి అవసరమైన సాహసాన్ని అందించి, శిష్యునికి వివాహం చేసి తాను వెళ్ళిపోయాడు.
అంతటి గురువులు ఈనాడూ ఉన్నారు. కానీ శ్రీరాముని లాంటి శిష్యులు మనం కాగలమా?
ఆ వినయవిధేయతలు మనలో ఉన్నాయా అనేది ప్రశ్న!!!
అలాంటి గురు శిష్యులను వెదకి వెదకి తెచ్చి మీకు చూపించాలన్నదే మా ఈ ప్రయత్నం.
(మళ్ళీ కలుద్దాం)