Site icon Sanchika

తెలుగు సాహిత్యవిమర్శకు ఒక నూతనాలంకారం – ‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’

[ఏల్చూరి మురళీధరరావు గారి ‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. రాయదుర్గం విజయలక్ష్మి.]

సాహిత్యచరిత్రలో వ్యాసఘట్టాలు అంటే సాహిత్యంలో కఠినమైన విషయాలు/వివరాలు అని సామాన్యార్థం. సంస్కృత మహాభారతాన్ని వ్యాసమహర్షి చెబుతూ ఉండగా వినాయకుడు వ్రాశాడని ఐతిహ్యం. తన కలం ఆగినప్పుడు తానిక రాయడం మానేస్తానని వినాయకుని నిబంధనమట. అందుకు తాను చెప్పే ప్రతి పదాన్ని అర్థం చేసుకొంటూ రాయాలని వ్యాసమహర్షి మాట. అలా వ్రాత సాగుతుండగా తన ఊహ కొంత ఆలస్యమైనపుడు వ్యాసమహర్షి కొన్ని గ్రంథగ్రంథులతో శ్లోకాన్ని చెప్పారని, వాటినే ‘వ్యాసఘట్టాలు’ అంటారని, అటువంటివి భారతంలో 8800 ఉన్నాయని ఒక ఐతిహ్యం. ఈ సంఖ్యలో నిజానిజాలు ఎంతో కాని, సాహిత్యంలో కొంత క్లిష్టతను కల్గిన రచనలను వ్యాసఘట్టాలు అనడం పరిపాటి అయింది. క్రీ.శ. పదవ శతాబ్దికి ముందే సంస్కృత మహాభారతం వ్రాతలోకి అడుగుపెట్టి ఉండవచ్చునని నమ్మబడుతున్న వ్యాసఘట్టాలకు గల తక్కిన ఆరు పేర్లను చెబుతూ, ఈ గ్రంథ రచయిత ఆచార్య ఏల్చూరి మురళీధరరావు గారు, “వ్యాసఘట్టములు అన్న పదబంధం అప్రతీత శబ్దార్థఘటితమై, క్లిష్టమైన అన్వయం కలిగిన శ్లోకాలకు వర్తిస్తున్నది” (పీఠిక – xxvi) అని చెప్పిన వివరణ గమనింపదగిన మాట. అటువంటి క్లిష్టమైన సాహిత్య సమస్యలను వివరించడం ఈ గ్రంథంలో శ్రీ ఏల్చూరి వారు చేసిన మౌలిక విమర్శనాత్మకమైన శోధన.

ప్రాచీన, అధునాతన సాహిత్యాలతోపాటు చీనా దేశపు కవిత్వం వంటి వాటిని కూడా కలిపి, దాదాపు యాభైకి పైబడిన వ్యాసరాజాలను అందించిన ఈ గ్రంథం తెలుగు పరిశోధకులకు ఒక దారిదీపం వంటిది అనడం అతిశయోక్తి కాదు. ఏ విషయాన్ని చెప్పినా, దానికి అనేకానేక ఆకరాలను సవివరంగా చూపడం వారి శేముషికి నిదర్శనం. ఏ విషయాన్ని కూడా దాటవేయక, ప్రతి పదానికి అర్థాన్వయాలను ఇస్తూ రచన సాగించడం, తాము ప్రతిపాదించిన విషయ వివరణకు ఉపబలకమైన ఉపపత్తులను చూపి విశ్లేషించడం వీరి ప్రత్యేకత. ఒక విషయాన్ని అతి ప్రాచీనకాలానికి చెందిన ఆకరాల నుండి నుంచి పరిశోధించడం, ఆ అంశాన్ని గురించి తెలుగులోనే గాక సంస్కృత, ప్రాకృతాది భాషలలో ఏయే వివరాలు ఉన్నాయి? అని అన్వేషించడం, తాము సత్యమని నమ్మిన వివరాలను ప్రాచీనమైన ఆకరాలతోపాటు విశదీకరించడం వీరి మౌలిక పరిశోధనకు నిదర్శనం. ప్రతి వ్యాసాన్నీ చదివి ముగించగానే వీరి విమర్శనా పాటవానికి అంతులేని సంభ్రమాశ్చర్యాలతోపాటు ఒక అలౌకికానందాన్ని పొందడం పాఠకుడి వంతు అవుతుంది. అది ప్రాచీన సాహిత్య విషయమే కావచ్చు, ఆధునిక సాహిత్య విషయమే కావచ్చు, ప్రతి వాక్యం మౌలిక సౌరభాన్నిస్తూ మన మనసులను దోచుకుంటుంది.

ఒకటి రెండు ఉదాహరణలను చూద్దాం.

ఈ వ్యాస సంపుటిలోని “ఆంధ్ర వాఙ్మయంలో అత్యంత ప్రౌఢమైన పద్యమేది?” అన్న మొదటి వ్యాసంలో, ‘ఉపమాంతర్భావిగా ఇన్ని ఆహ్లాదనీయ చమత్కృత వాక్యాలను సాలంకృతంగా అనుప్రాణింపగలగడం కవి యొక్క కావ్యకళాశిల్పప్రౌఢికి నిరుపమానమైన నిదర్శనం’ అంటూ, ‘శబ్దచిత్రాల సమ్యఙ్నివేశానికి, అత్యంతప్రౌఢికి ఉత్తమోదాహరణ’ అంటూ, ‘తెలుగులో ఇటువంటి రచన మరొకటి లేదు’ అంటూ, తెనాలి రామకృష్ణకవి యొక్క “అల ఘన చంద్రబింబసమమై..” అన్న పద్యాన్ని తెలుగు సాహిత్యంలో అత్యంతప్రౌఢమైన పద్యంగా ఇతర ఉపపత్తులతో కలిపి విశ్లేషించి, నిరూపించిన తీరు అనితర సాధ్యం. పాఠకులు, విమర్శకులు స్వయంగా చదివి ఆనందింపవలసిన వ్యాసం ఇది.

మానవల్లి రామకృష్ణ కవిగారు నన్నెచోడుని కుమారసంభవ కావ్యం లోని “అలిధమ్మిల్ల, మృణాలహస్త” అన్న పద్యాన్ని తెనాలి రామలింగకవి తన కందర్పకేతువిలాసంలో అర్థచౌర్యం చేసి వాడుకొన్నాడని (‘నన్నెచోడుని కుమారసంభవములో “అలిధమ్మిల్ల” పద్య వివాదం’ – పుటలు: 31-57) చేసిన ప్రతిపాదనను తిరస్కరించడమే కాదు, నన్నయకు పూర్వీకుడు నన్నెచోడుడు అన్న వాదాన్ని తిరస్కరించిన విధానికి కూడా ఈ వ్యాసం గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నది. ఆ రెండు పద్యాలలోని గుణదోషాలను పరిశీలిస్తూ నన్నెచోడుని పద్యానికి మూలం కాళిదాసు కృతమని ప్రచారంలో ఉన్న శృంగారతిలక కావ్యంలోని మొదటి శ్లోకమేనని చెబుతూ, ఇంతకూ ఈ కావ్యం ‘అభినవ కాళిదాసు’ అని బిరుదాన్ని కలిగిన కోటిజిత్కవిదని చెబుతూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ కావ్యం, తెనాలి రామకృష్ణుని ఉద్భటారాధ్య చరిత్రం – ఇలా అనేకానేక ఉపపత్తులను చూపుతూ, ‘రామలింగకవి పద్యానికి మూలాన్ని కల్పించబోయిన కుమారసంభవ కర్తకే ఆ ప్రయత్నంలో తడబాటు కలిగింద’ని నిరూపించిన విధం ఎంతైనా ప్రశంసనీయం.

ఈ గ్రంథంలో నాకు చాలా కొత్తగా అనిపించిన రచన, ‘సాహిత్య చరిత్రలో కనీవినీ యెరుగని పర్యాయ పద కావ్యం’ అన్న వ్యాసం. “పర్యాయ పదాలు” అంటే ఒక పదానికి పర్యాయాలుగా ఉన్న సమానార్థక పదాలు అని మనకు తెలుసు. మరి కావ్యం పర్యాయ పద కావ్యం ఎలా అయింది? అని పఠితలో ఒక అనుమానం కలగడం సహజం. “ఒకే ఒక ఆశ్వాసంతో, 887 పద్యాలతో, సూది మొన కంటె కొంచెం పెద్దదైన కథతో ఉన్న గణపవరపు వేంకట కవి (క్రీ.శ. 1650-1740) కృతమైన ‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము’ అన్న కావ్యం అది” అని వ్యాసకర్త అంటారు. కందుకూరి వీరేశలింగం గారు తమ ‘ఆంధ్ర కవుల చరిత్ర’లో ఈ కావ్యాన్ని గురించి, “వేంకటకవి గ్రంథచౌర్యము చేసినాడు” అని తీవ్రంగా విమర్శించారు. “ఒకే ఒక ఆశ్వాసముతో నున్న ఈ కావ్యము ఒక తెరనాటకము” అని వేదము వేంకటరాయశాస్త్రి గారు తీర్మానించారు. ఇది గ్రంథచౌర్యం కాదని, ఒక అపూర్వమైన పర్యాయ పద కావ్యమని – ఈ కావ్యం యొక్క తాళపత్ర ప్రతిని మదరాసు థియోసాఫికల్ సొసైటీలో దొరికించుకొన్న రచయిత ఈ గ్రంథాన్ని గూర్చి దాదాపు అరవై పుటలలో చేసిన వివరణ చదివి తీరవలసిన వ్యాసం. ప్రతి పద్యంలోనూ నరస భూపాలీయము అనే పేరు గల కావ్యాలంకార సంగ్రహము అన్న అలంకార శాస్త్రకావ్యం మొదలు పెక్కుమంది కవుల పద్యాలను అనుకరణ చేసిన గణపవరపు కవి, తన కావ్యం “అవతారికా వచనము” (పుటలు – 478,479) లో చెప్పిన అంశం అతి ముఖ్యమైనదని వ్యాసకర్త ప్రతిపాదించారు. ఈ కావ్యం ఆదికాలం నుంచి తెలుగులో వెలసిన ప్రబంధాలన్నింటినీ కలిపిన ఒక సంకలన గ్రంథమని వీరి అపూర్వమైన నిర్ణయం. ఇది “నేటి అభ్యాసకులకు సహాయగ్రంథం వంటిదన్నమాట. దీని సాయంతో కవుల తెలుగు కవితా రీతులను అభ్యసించవచ్చు నన్నమాట” అని నిర్ధారించిన రచయిత, ఈ కావ్యంలో “వేంకటకవి సొంత పద్యాలు లేనే లేవా?” అని ప్రశ్నను వేసికొన్న రచయిత – తన పరిశోధనలో తేల్చిన అంశం – ఈ కావ్యం ఒక సామాన్యకావ్యం కాదని, “ఒక పర్యాయ పద సంకలన లక్ష్యగ్రంథం” అని!

తెలుగు సాహిత్యంలో “శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణగాథను మహా ప్రబంధంగా మలిచిన తొలి కావ్యం” ఇది. “కావ్యాలంకార సంగ్రహం వంటి పెక్కు కావ్యాలలోని పద్యాలను అనుకరిస్తూ, ఆయా కవుల పేర్లను చెప్పక, ప్రబంధ రచనకు ఒక గొప్ప లక్ష్యగ్రంథంగా మలిచేందుకు వేంకటకవి సేకరింపని లక్షణాలు గాని, సేకరింపని ప్రయోగాలు కాని లేవు” అన్నది రచయిత పరిశోధన సారాంశం. “అవతారికలో తన గ్రంథాలని చెప్పుకొన్న పట్టికలు గల పద్యాలు మాత్రమే కవి స్వతంత్రములని భావించాలి” అంటారు రచయిత.

“ఛందస్సుకు అప్పకవీయం లాగా అలంకార శాస్త్రంలో కావ్యకర్తలకు, కావ్యపాఠకులకు శబ్దార్థరచనా రహస్యాన్ని ఎత్తిచూపే వస్తువిమర్శ కలిగిన కావ్యశిక్షాగ్రంథం ఒక్కటీ లేదు. అటువంటి లోపాన్ని పూరించడానికి బహు సంవత్సరాలు కృషిచేసి, వందలకొద్దీ గ్రంథాల నుంచి ప్రయోగాలను సేకరించి, అన్నింటి లక్షణాలనూ సూక్ష్మేక్షికతో పరీక్షించి, ఛందోవ్యాకరణాలంకార సర్వలక్షణ శిరోమణి అనదగిన ఒక బృహద్విజ్ఞానకోశాన్ని ‘సర్వలక్షణ శిరోమణి’ అన్న పేరుతో కూర్చి, అందులో ఉపదేశింపబడినదానికే లక్ష్యానుబంధంగా విదగ్ధముఖమండనమైన ఒక ప్రబంధరాజాన్ని సంధానించిన ఒకే ఒక్క మహనీయుడు శ్రీ గణపవరపు వెంకట కవి.(పు.450)” అని అంటారు రచయిత.

అంతే కాదు. ఈ వ్యాస సంపుటిలోని 876-వ సీసపద్యం గణపవరపు కవి ప్రతిభకు అద్దం పట్టే ‘బహుభాషామిశ్రము’ అనే చిత్ర రచన. ఈ సీసపద్యానికి కవి పెట్టిన పేరు, “ప్రాకృత శౌరసేనీ మాగధ పైశాచీ చూలి కాపభ్రంశ సంస్కృతాంధ్రాష్టభాషాసీసము”. ఈ వ్యాస వివరణలో ఈ పద్యం తాళ్లపాక పెదతిరుమలాచార్యుల ‘అష్టభాషా దండకము’నకు దీటుగా ఎన్నదగిన మేలిరచన అని శ్రీ ఏల్చూరివారు కూర్చిన వ్యాసం చదివి ఆనందింపవలసిన అద్భుతమైన వ్యాసం. ఇది వీరికి గల బహుభాషాపరిచయాన్ని నిరూపించే ఒక మేలి వ్యాసం కూడా!!

ఈ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం తెలుగు సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణగాథను మహాప్రబంధంగా మలిచిన తొలి కావ్యం. ఇది వ్యాసకర్త పిహెచ్.డి. పరిశోధన విషయం కూడా కావడం విశేషాంశమే!

శ్రీనాథుడు శృంగార నైషధంలో తన ఆంధ్రీకరణ శిల్పసూత్రాన్ని నిర్వచించాడని ఇంతకాలం మనం భావిస్తూ వచ్చాము. కాని, అలా “విమర్శకులు భావించినవన్నీ యాదృచ్ఛికాలు. వేమభూపాలుని శృంగార దీపికను చూడక పోవడం వల్ల స్థితిగతిచింతనగా ఏర్పరచు కొన్న అభిప్రాయాలు” (శ్రీనాథుని ఆంధ్రీకరణ శిల్పసూత్రం: అర్థ పరిశీలన) అంటూ వ్యాసకర్త ఏల్చూరి చేసిన సిద్ధాంతం చాల క్రొత్తదైన సిద్ధాంతం. మనను ఆశ్చర్యానందాలకు లోనూ చేసే పరిశోధన కూడా!

ఈ గ్రంథంలోని ప్రతి వ్యాసం ఎన్నో కొంగ్రొత్త సిద్ధాంతాలతో అలరిస్తూ ఉన్నది.

‘పోతన, నన్నెచోడులు చిత్రించిన రథనిర్మాణ కళాభిజ్ఞత’ కాని;

అమృతత్వాన్ని పొందగోరే వారు బ్రహ్మవిద్యా సారసంగ్రహమైన ఐతరేయోపనిషత్తును అధ్యయనం చేయాలన్న దృక్కోణాన్ని వివరించడంలో కాని;

గరుడ పురాణంలోని కొన్ని కొత్త వెలుగులను ప్రసరింపజేయటంలో కాని;

నైమిశారణ్య మాహాత్మ్య వివరణలో పోతనగారి సుదీర్ఘమైన వచనాన్ని వివరించడమే కాక, ఎన్నో పురాణాలను ఆకరాలుగా చూపుతూ – ఏ ఒక్క మతం వారికి మాత్రమో గాక, ఆస్తికులకందరికీ పుణ్యక్షేత్రమిది.. అని చెప్పడములో కాని;

తెలుగు కవులపై గల సుబంధుని ‘వాసవదత్తా కథ’ ప్రభావాన్ని నిరూపించడంలో కాని; ‘వాణి నా రాణి’ అన్న పిల్లలమర్రి వారి మాట ‘కవిబ్రహ్మ’ అన్న మాటకు సామ్యప్రకటనమని, అందుకే కవిత్రయము చేసిన భారతానువాదాన్ని కొనసాగిస్తూ ఒక్క చేతిమీదుగా, ‘జైమిని భారత’ రచనను చేశాడన్న వివరణలో కాని;

‘ధూర్జటి పల్కుల కేలఁ గల్గెనో ఈ మాధురీమహిమ’ అన్న కృష్ణదేవరాయల వారి ప్రశ్నకు శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యములోని వారవనిత అయిన మాణిక్యవల్లి కుమార్తెలు వైరాగ్యమూర్తులై, శ్రీ కాళహస్తి క్షేత్రంలో పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందిన విషయాన్ని మనోమందిరంలో నిలుపుకొన్న ధూర్జటి పవిత్ర వాక్కులకు మాధురీ మహిమ కలిగినదని రామకృష్ణుడు పూరణ చేశాడని సోపపత్తికముగా నిరూపించడంలో కాని

..ఇలా చెప్పుకొంటూపోతే ప్రతి వ్యాసమూ ఒక కళాఖండమే అనడంలో ఎటువంటి విప్రతిపత్తి లేదు అని మనము గుర్తించగలము.

శ్రీనాథుని రచనలను గూర్చి విశ్లేషించిన వ్యాసాలు, పినవీరన కాలం, ఆయన కవిత్వాన్ని గూర్చి చేసిన అనుశీలనలు, అన్నమయ్య భక్తి శృంగార వర్ణనలు.. వీటితోపాటు చీనాదేశపు ‘మహాకవి ఛు యువాన్ కవితల వివరణ, ఆ కవి విషాదమోహన జీవిత వివరణ.. ఇలా ప్రతివ్యాసం మనలో విమర్శనాత్మకమైన కళాభిజ్ఞతను సృజించగలదు అనడం కూడా సత్యవాక్యమే.

ఇక ఈ వ్యాస సంపుటిలోని ఆధునిక సాహిత్య సమీక్షలు, విమర్శలు సాహిత్యాభిమానులకు విందుభోజనాలే! ఈ వ్యాసాలలోని కవులందరితోనూ వీరు ప్రత్యక్షంగానో, లేదా వారి సంతానంతోనో పరిచయాన్ని కలిగి ఉండటం – ఈ వ్యాసాలకొక అదనపు అలంకారాన్ని చేకూర్చిన విషయం అనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. దాదాపు ఇరవై యెనిమిది వ్యాసాలున్న ఈ ఆధునిక సాహిత్యానికి సంబంధించిన ప్రతివ్యాసం ఏల్చూరి వారి విస్తారమైన వ్యుత్పత్తి జ్ఞానానికి నిదర్శనం.

ఇంకా ఈ సంపుటిలో – మను-వసుచరిత్రాది కావ్యాలకు టీకను మాత్రమే గాక, పెక్కు కావ్యాలకు శబ్దసూచికలను రూపొందించిన జూలూరి అప్పయ్య (19-వ శతాబ్దం) గారి వాఙ్మయ సేవను గురించి మాత్రమే గాక, నూత్నపాఠకుల సౌలభ్యార్థమై జూలూరి అప్పయ్య గారి మనుచరిత్ర ముద్రణలో లేని తాత్పర్యాలను సరికొత్తగా వ్రాసిన డా. కోడూరి ప్రభాకరరెడ్డి గారి వరివస్యను గూర్చి పేర్కొంటూ అప్పయ్య గారి ప్రగాఢమైన సాహిత్యంపై ఇంకా పరిశోధనలు జరగవలసిన అవసరముందని (పుటలు..531-552) సూచించిన వాఙ్మయానుశీలకులు వీరు.

శబ్దక్రీడ అయిన చిత్రకవిత్వంలో అర్థవంతమైన ప్ర్రాణశక్తిని నింపి వ్రాసిన ‘రాధాకృష్ణసంవాదం’ వంటి కావ్యాలతోపాటు తమ ఆత్మకథను తొలిసారిగా శతకరూపంలో చెప్పిన శ్రీ మండపాక పార్వతీశ్వరకవి (1833-1897) గారి సాహిత్యాన్ని పరామర్శించడంలో కాని, తెలుగులో తొలిసారిగా రామకృష్ణ, వివేకానంద సాహిత్యాన్ని సాధికారంగా ప్రకటించిన గ్రాంథిక భాషావాది కూచి నరసింహం (1866-1948) గారి సాహిత్యసేవను వివరించడంలో కాని, అజ్ఞాన తిమిరాన్ని విచ్ఛిన్నం చేసిన వేటూరి ప్రభాకరశాస్త్రి (1888-1950) గారి సాహిత్య, జీవిత విశ్లేషణలో కాని, వ్యాసకర్త ఎన్నెన్నో అపురూపమైన వివరాలను అందిస్తారు.

ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి వ్యాసాన్ని ఉటంకించవలసి వస్తుంది. ఆచంట జానకిరామ్ గారి ‘సాగుతున్న యాత్ర’ గ్రంథ పరిచయమొక్కటి చాలు, ఏల్చూరి వారి ప్రతిభకు అద్దం పట్టడానికి. అమ్మ చదివి తనకిచ్చిన ఆ పుస్తకం, తనను ఎంత ఉత్తేజపరిచిందో చెబుతూనే, ఆచంట వారి జీవితంలోని సానుకూల, ప్రతికూల అనుభవాలను, వారు ఎదుర్కొన్న విధివిధానాలను, వారి గ్రంథరచనా శేముషిని, వారి వ్యక్తిగత జీవితాన్ని వివరించడాన్ని చదివినపుడు, ‘సాగుతున్న యాత్ర’ను చదివి నపుడు మనమెంత ఉద్వేగానికి లోనవుతామో – అంతకు రెట్టింపు ఉద్వేగాన్ని కలిగిస్తుంది, వీరి పరిచయం.

ఏల్చూరి వారి వ్యాసాలలో పేర్కొనదగిన ప్రధానమైన అంశం – ఒక గొప్ప వ్యక్తిని గూర్చి చేస్తూన్న పరిచయంలో వారి సమకాలీనుల పరిచయం కూడా బాహాటంగానో, అంతర్లీనంగానో ప్రతిఫలిస్తూ ఉండటం. ఉదాహరణకు ఈ వ్యాసంలోనే వారు పేర్కొన్న పదులకు పైబడిన కవులు, రచయితలు, ఆకాశవాణి ఉద్యోగ పర్వంలో నిష్ణాతుల నుంచి.. చలం మొదలు సౌరీస్ దాకా కూడా.. మనను ఆశ్చర్యానందాలకు లోను కావిస్తారు.

కవులు, రచయితల ప్రసిద్ధ రచనలను గూర్చి ఉట్టంకించడం అందరూ చేసే పనే! కానీ, 1976లో తమ గురువు గారు పొట్లపల్లి సీతారామారావు గారితో కలిసి, విశ్వనాథ వారిని దర్శించడం; అప్పుడే వారు ఎవరికో వ్రాసిన వివాహాశీస్సుల ప్రతి ప్రూఫు కాగితాలు రావడం, విశ్వనాథ వారు తనకిచ్చిన ఆ ప్రతిని అతి భద్రంగా దాచుకొని, ఆ పద్యాలను విశ్లేషించిన వ్యాసం (పుటలు. 591-594) మాత్రం ఒక్క ఏల్చూరి వారు మాత్రమే చేయగలిగిన అద్భుతమైన వ్యాసరచన!

“ఆ కవితాపఠనాన్ని ఆరాధకులు అనుసరించే శకం ఆయనతోనే ముగిసిపోయింది” అంటూ కృష్ణశాస్త్రి గారి వైభవాన్ని వివరించడంలో కాని, “నయాగరా” ఆవిష్కరణోత్సవాన్ని కనులకు కట్టించడంలో కాని, “డిటెక్టివ్ నవల అని చులకనగా అనుకుంటాము గాని దాని ప్రభావశీలిత అంత బలవత్తరం” అంటూ ఆరుద్ర గారి డిటెక్టివ్ నవలలను విశ్లేషించడంలో కాని, చీకటి నీడలలోని బైరాగి జాడను వెతకటంలో కాని, ‘అనువాదకోవిదాగ్రణి’ మద్దిపట్ల సూరివారి జీవిత, సాహిత్య విశ్లేషణలో కాని, అబ్బూరి, కుందుర్తి, బోయిభీమన్నల సాహిత్య విశ్లేషణలో కాని, పి. బి. శ్రీనివాస్ గారి సంగీత సాహిత్య ప్రతిభా వివరణలో కాని, ద్వారం వారి, ముళ్ళపూడి వెంకట రమణ గారల స్మరణలో కాని, సృజనాత్మక విమర్శను కళాత్మకంగా నిర్వహించిన శేషేంద్ర గారి తలపులో గాని, ఢిల్లీలో తెలుగు వారి స్థానాన్ని వివరించడంలో గాని, ఇంకా శ్రీశ్రీ నుండి శృంగేరీ పరమాచార్యుల వరకు, తమ పాఠశాల గురువు శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి గారి అతులితమైన జీవితం నుంచి, ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి రచన వివరణలో కాని, “అంతరిక్షం ప్రపద్యే” అంటూ శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణ గారి తారావళి రచనలను పరిచయం చేయడములో గాని,.. ఏల్చూరి వారి ప్రతిభ అనితర సాధ్యం!

ఇలా ప్రతివ్యాసం ఇటు సాహిత్యం, అటు సంగీతం, మరొక వైపు ప్రాఢమైన తాత్త్వికతలతో వెలసిన వీరి విమర్శనాత్మకమైన రచనలు కూడా ఈ గ్రంథాన్ని వెలిగింప జేస్తున్న వెన్నెల కాంతులే! ఒక వ్యాసం చదవగానే మరొక వ్యాసాన్ని వెంటనే మొదలుపెట్టలేము. చదివిన వ్యాసం మనలో కలిగించే ఆనందం, రచయిత ప్రతిభా పాటవాలపట్ల కలిగే అంతులేని ఆశ్చర్యం.. కొంగ్రొత్త వివరణల పట్ల విస్మయం.. మనను చాలా కాలం వెన్నాడుతూనే ఉంటాయి. కళాత్మకమైన శీర్షికలతో, ప్రౌఢమైన శైలిలో సాగిన ఈ గ్రంథం లోని ప్రతివ్యాసం స్వయంగా చదివి ఆనందింపవలసినవే గాని, వాటి వివరణ చాలా క్లిష్టమైన కార్యం.

ప్రతిభామూర్తి, శేముషీధురంధరుడు, వినయశీలి, నిత్య సాహిత్య వ్యవసాయి, బహుముఖ ప్రజ్ఞామూర్తి, బహుభాషానిష్ణాతుడు అయిన శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు గొప్ప భావుకులు. అంతకు మించిన అతిగొప్ప విమర్శకులు. ఈ కాలంలో వారివంటి వారుండటం అరుదని ఘంటాపథముగా చెప్పవచ్చు. చెప్పవలసిన విషయాన్ని సూటిగా, నిర్మొహమాటంగా చెప్పగలగడం వీరి ప్రత్యేకత! ఇవి కేవలం స్తుతి మాటలు గావు. సాహిత్యాంశాలలో ఏ విషయాన్ని గూర్చి ప్రశ్నించినా కించిన్మాత్రం ఆలస్యం లేక వివరణను ఇవ్వగలిగిన ప్రతిభావంతులు వారు. వారు కూర్చిన ఈ గ్రంథం తెలుగు సరస్వతికి నిజంగా ఒక అలంకారం మాత్రమే కాదు, తెలుగు సాహిత్యోద్యానవనంలో నిత్యనూతనముగా విరాజిల్లగలిగిన ఒక కల్పవృక్షం కూడా అనడం అతిశయోక్తి గాదు.

***

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు
రచన: ఏల్చూరి మురళీధరరావు
ప్రచురణ: అజో-విభొ-కందాళం ఫౌండేషన్
పేజీలు: 800
వెల: ₹ 1,000/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగూడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్‌లైన్‍లో:
https://www.telugubooks.in/products/vangmayacharitralo-konni-vyasaghattalu-marikonni-visheshamshalu

 

 

~

డా. ఏల్చూరి మురళీధరరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-elchuri-muralidhararao/

Exit mobile version