[శ్రీమతి మల్లాప్రగడ బాలాత్రిపుర సుందరి రచించిన ‘వరాలు’ అనే పెద్ద కథని పాఠకులకు అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]
[dropcap]కో[/dropcap]నేటి గట్టు మీద కూర్చొని ఉంది వరాలు. రెండు గంటలు నుంచి అక్కడే ఉంది తను. కానీ అంతవరకు ఉన్న సందడి, జన సందోహం ఇప్పుడు లేదు. ఆ కోనేట్లో అంతవరకు జరిగిన తెప్పోత్సవం చూడ్డానికి వచ్చిన జనం భక్తిశ్రద్ధలతో వచ్చిన వాళ్ళు, సరదాగా వచ్చిన తనలాటి వాళ్ళు, అందరూ వెళ్ళిపోయారు. అందంగా విద్యుద్దీపాలతో, పువ్వులతో, అరటి మొక్కలతో, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించిన తెప్పపై ఊరేగించిన రాముడు మళ్లీ తన ఇంటికి అదే రామాలయానికి వెళ్ళిపోయాడు. వేద మంత్రాల ఘోషలో, నాదస్వర మాధుర్యంలో, మృదంగ ధ్యానంలో పులకరించిన కోనేటి పరిసరాలన్నీ నిశ్శబ్దమై పోయాయి. ఆ నిశ్శబ్దం అప్పటి మానసిక స్థితిలో హాయిగానే వుంది తనకు. దూరంగా రోడ్డుమీద అరుదుగా వెళ్తున్న బస్సు స్కూటరు లాంటివి చేస్తున్న చిన్న చప్పుడు తప్ప సందడేం లేదు. విద్యుత్ దీపాల వెలుగులు నీటిలో జిలుగులు చిమ్ముతూ అలలతోపాటు జిగేల్ జిగేల్ మని కదులుతున్నాయి.
వరాలు మనసులో కూడా అందమైన ఊహలు, కంగారు, తెలీని అయోమయం.. ఏదీ అర్థంకాని ఆలోచనలతో కూడిన కదలికలు.. వెళ్ళే ముందు శీను అడిగేడు “ఈ సంబంధం నీకు మనస్పూర్తిగా ఇష్టమే కదా?” అని. అవును, తను ఇష్టపడ్డాకే ఇంట్లో అమ్మానాన్నలకి చెప్పమని శీనుకి చెప్పింది. ఇంతవరకు ఆ ఆలోచనే లేదు. తనలో ఒక పది రోజులలో ఎంత మార్పు? శీనుకి స్నేహితుడుగా తెలుసు కాని ఈ భావనతో చూడలేదు ఎప్పుడూ. “మా ఇంట్లో కూడా నీకేం పని ఉండదు. అమ్మా వాళ్లే అన్నీ చూసుకుంటారు. నిన్ను చాలా బాగా చూసుకుంటారు” చెప్పేడు తను. పెళ్ళంటే కొత్తగానూ ఉంది, మధురంగానూ ఉంది. తనకి నచ్చిన వాడితో, తన్ను మెచ్చిన వాడితో – ఎంతో బావుంది. కానీ బెంగగానూ ఉంది. అమ్మనీ, నాన్ననీ, శీనునీ, పద్మనీ, కిట్టూని, భాస్కరన్నయ్య, ఉషక్క, కమలక్క, ఇంకా పెద్దన్నయ్య అందరినీ వదలి కొత్త మనుషుల మధ్యకి, కొత్త జీవితంలోకి… ఎలా వుంటుందో!
అన్ని అద్భుతాలే! అన్నీ ఆశ్చర్యాలే! అన్నీ ప్రశ్నార్ధకాలే అయిన బాల్యంలోని అమాయకమైన, అనిర్వచనీయమైన ఆనందం – ‘ప్రపంచమంతా నాదే. నాకెవ్వరూ ఎదురు లేరు. నా పిడికిట్లోనే అన్నీ ఉన్నాయి. అందరి కన్నా నేనే స్పెషల్’ అనుకునే టీనేజ్ ప్రాయంలోని ధీమాతో కూడిన సంతోషం – ఉడుకు రక్తం.. ఉరకలు వేసే ఊహలు.. అల్లరి ఆటపాటలు.. స్నేహాలు.. సరదాలు.. అన్నిటితో నిండిపోయిన కాలేజి విద్యార్థిదశలోని అల్లరి చిల్లరి ఆనందాలు.. అన్నీ ఎంతో అపురూపమైనవి. ఆ అనుబంధాలు, ఆ అనుభూతులు, ఆ స్నేహాలు అన్నీ ఇప్పుడేమవుతాయి?
ఎవరో అనుకుంటుంటే వింది ‘పెళ్లయాక అమ్మాయి ప్రపంచమే మారిపోతుంద’ని. అంతకు పూర్వపు జీవితానికి చాలా దూరం వెళ్ళడం కాదు.. అసలు మర్చిపోతుందట. ఎంత అన్యాయం అనిపించింది. లేదు.. లేదు.. తనెప్పుడూ అలా అవదు. ఆ జీవితం నుంచి దూరంగా వెళ్ళినా ఆ ఆట పాటలు, కలిసి తిరగడాలు, దెబ్బలాటలు, చిన్న చిన్న సరదాలు అన్నీ.. అన్నీ తన మనసులో పదిలంగా ఉంటాయి. ఆ వెచ్చదనం అలాగే సాగుతుంది. ఎవరో సినీకవి చెప్పినట్లు తనకి జ్ఞాపకాలు – నిట్టూర్పు, ఓదార్పులు కావు. మైమరపులు మాత్రమే అవుతాయి. అలా అనుకుంటుంటే ఎంతో నిమ్మళంగా, నిశ్చింతగా, హాయిగా వుంది వరాలుకి.
***
“వరాలూ, తల్లీ! రావే! ఇంకెప్పుడూ నిన్ను ఆటల్లో చేర్చుకోకుండావుండను లేవే! రావే తల్లీ బంగారం!” బతిమాలుతున్నాడు శీను. బతిమాలిన కొద్దీ చెట్టెక్కి కూచుంది వరాలు. చెట్టెక్కడమంటే నిజంగా ఎక్కడం కాదు. చెట్టు క్రింద మాత్రం కూర్చొని వుంది వరాలు. ‘చిన్నారి చిట్టితల్లి’ అక్కలకీ, అన్నలకీ గారాల ముద్దుల చెల్లి. ఆ చెట్టే తన అలక గృహం, విశ్రాంతి గృహం, ఆటస్థలం అన్నీను. వాళ్లింటి నుంచి నాలుగిళ్ల అవతలగా ఉంది ఆ చెట్టు. చుట్టూ కొంతమేర సిమెంటు చప్టా. తరువాత అంతా పిచ్చి మొక్కలు. ప్రహారీ గోడ. పార్కుకని కేటాయించి తయారు చేయబోయి ఆగిపోయిన పార్కు కాని పార్కు అది.
ఇంతకీ వరాలు అలకకి కారణం శీను వరాలుని తనతో ఆటలకి తీసుకెళ్ళకపోవడం. వరాలుకి ఆటలంటే చాలా చాలా ఇష్టం. దొంగాట, నేలా బండ, కుందుళ్ళు పరుగులు, చెమ్మచెక్కా, ఒప్పులకుప్ప వయ్యారి భామ – ఇలా ఎన్నెన్నో ఆటలు. అలసిపోయినా, ఆయాసపడ్తున్నా, ఇంకా ఆటలాపి ఇంటి కెళ్ళాలనిపించదు ఎంతసేపటికీ వరాలుకి. “వానా వానా వల్లప్పా” అంటూ వాన లేకపోయినా సరే గుండ్రంగా గిర్రుగిర్రున తిరిగి బుట్ట బొమ్మలా పావుడా అంతా క్రింద పరుస్తూ కూచోడం ఎంతో బాగుంటుంది వరాలుకి. ఈ ఆటలన్నీ ఒకెత్తు. శీనుతో, శీనూ స్నేహితులతో ఆడే గోళీలాట, బొంగరాలాట అవన్నీ ఒకెత్తు. ఆటలు అమ్మాయిలెవరూ ఆడరు. అదేంటో వరాలుకి అవి మరీ మరీ ఇష్టం. శీనుని బతిమాలుకుని లేదా వాడొప్పుకోకపోతే అమ్మతో చెప్పించి, అదీకాకపోతే అలిగి సాధించుకుంటుంది. స్నేహితులందరూ, “మీ చెల్లి ఎందుకు?” అన్నా సరే వరాలు బాధపడలేక, చూడలేక “రావే తల్లీ!” అని తీసుకెళ్తాడు.
కానీ ఆవేళ ఆటలో గొడవొచ్చింది. గుండ్రంగా గీతగీసి దాని మధ్యలో ఖాళీ సిగరెట్టు పెట్టెలు బొత్తిగా పెట్టారు. ఒక్కొక్కరు రెండు రెండు పెట్టెలు పెట్టారు. ప్రతి ఒక్కరూ రాయితో వాటిని కొట్టాలి. గీత దాటి వచ్చినవి కొట్టిన వాళ్లవే. వరాలు సిగరెట్టు పెట్టెలు ఇవ్వనంటుంది. కానీ ఆటలో చేరుతానంటుంది. చెప్తే వినదు. విసుగొచ్చి శీను “పోవే నీవు ఆటలో లేవు” అనేసాడు. అదీ అలక. చెట్టెక్కి.. కాదు కాదు చెట్టు క్రిందకెళ్ళిపోయి కూచుంది. అన్నాలకి అమ్మ పిలిచే దాకా శీను గమనించలేదు. ఎంత బతిమాలినా రాదు. ఆఖరికి “తల్లీ పచ్చ గోళీలు ఇస్తానే” అన్నాడు.
ఊహూ.. సరే, ఆవేళ వాడు గెలిచిన సిగరెట్టు పెట్టెలు, లోపల ముచ్చెకాగితంతో సహా ఇస్తానంటే నవ్వింది. మళ్ళీ ఇదంతా అమ్మా వాళ్ళకి తెలీకూడదు. ముఖ్యంగా సిగరెట్టు పెట్టెలు వాళ్ళకి కనబడకూడదు. రహస్యంగా దాచుకోవాలి. అది ఎక్కడో తెలీక శీనుకే మళ్ళీ ఇచ్చేసింది వరాలు దాచమని.
* * *
ఏంటో ఇల్లంతా సందడి సందడిగా వుంది. అన్ని గదులూ అలికేరు. ముగ్గులు పెట్టేరు. గోడవారగా ఎర్రమన్ను గీత గీసేరు. గుమ్మాలకి పసుపు కుంకుమ పెట్టేరు. మామిడాకులు కట్టేరు. ఏదో పండగలాగే వుంది.
“అమ్మా ఏంటి ఈ రోజు పండగా? ఏం పండగ? లడ్డూలు చేస్తావా? వడలు, పాయసం ఏం చేస్తావు? చెప్పు” అమ్మ వెనక వెనక తిరుగుతూ అడుగుతోంది వరాలు.
“పండగే మరి” నవ్వింది అమ్మ.
ఆశ్చర్యంగా వుంది వరాలుకి. పండగయితే కొత్త బట్టలేవీ మరి? పండగంటే పదిరోజులముందే కొత్తబట్టలు కొని టైలర్ కివ్వాలికదా! ముందు రోజు తెచ్చుకోవాలి కదా! అవేవీ లేవే మరి. సరేపోనీ, దీపావళా అంటే కొత్త బట్టలు కాదుకాని టపాకాయలూ లేవు. ఎక్కడా ఢాంఢాంలు లేవు. భోగి పండగా అంటే తాటాకులు ఏవీ మంటకి తేలేదే. మరి వినాయక చవితికాదు. దేవుడి బొమ్మ, పత్రీ ఏదీ లేదు మరి.
“ఏం పండగ చెప్పు మరీ” అమ్మని వదల్లేదు.
“మీ పెద్దక్కని చూసుకోవడానికి వస్తున్నారు. మీరందరూ స్నానాలు చేసి, మంచి బట్టలేసుకుని చక్కగా తయారుకండి మరి” అమ్మ హడావిడిగా వెళ్ళిపోయింది.
ఏం అర్థంకాలేదు వరాలుకి. అమ్మ లాభంలేదని పద్మక్క దగ్గిరకెళ్ళింది. పద్మక్క ఆరిందాలా మొహం పెట్టి చెప్పింది. ఇవాళ చూసుకోవడం అయిపోయాక పెద్దక్కకి పెళ్ళవుతుందని, తమకి బావొస్తాడని. ఏంటో వరాలుకి అర్థం అయీ అవనట్లే వుంది.
“అమ్మ నిన్న మధ్యాహ్నం కూచుని తొక్కుడు లడ్డూలు, బూందీ అన్నీ చేసింది. నే చూసాను. అన్నీ డబ్బాల్లో దాచింది మరి.” నిజం శీను చెప్పేడు. అయితే పండగేనన్న మాట. కాని తమందరికీ కాదేమో! పెద్దక్కకి, ఆ వచ్చే వాళ్ళకి మాత్రమేనేమో. అంతేమరి. ఎందుకంటే పెద్దక్క ఒక్కతే కొత్త చీరె కట్టుకుంది మరి. తామూ పెట్లోంచి తీసి మంచి బట్టలే వేసుకున్నాము కాని అవి కొత్తవేం కాదు.
ఏమైతేనేం సాయంత్రం అవుతుంటే వచ్చేరు వాళ్ళు. ఒక ముసలాయన. తెల్లటి జుట్టు, గడ్డం – అసలేం నచ్చలే వరాలుకి. ఒక ఎర్రటి, మంచి క్రాఫ్‌తో వున్న అబ్బాయి వచ్చేడు. అతనెంతో నచ్చేడు వరాలుకి కాని అతనేం మాట్లాడలేదు, ఏం తినలేదు. ఆ ముసలాయన మాత్రం పెట్టినవన్నీ మాట్లాడ్తూ మాట్లాడ్తూ సుబ్బరంగా తినేసేడు. ఎర్రటి అబ్బాయి మంచి వాడులాగే వున్నాడు. తన్ని పిలిచి దగ్గర కూచోబెట్టుకుని ఒక తొక్కుడు లడ్డు ఇచ్చేడు తినమని. పాట పాడమని ఆ పెద్దాయన అడిగేడు. పెద్దక్కకి పాడడం రాదుగా మరి. ఉషక్క ఎంతో చక్కగా పాడుతుంది. అందుకని తనే పాడింది ఏదో దేవుడి పాట. వచ్చిన వాళ్ళు నవ్వుతూ వెళ్ళిపోయేరు. అమ్మా, నాన్నా అందరూ నవ్వుతున్నారు. వరాలుకి సంతోషంగానే వుంది, ఇక హాయిగా తొక్కుడు లడ్డూలు తినొచ్చని. (నిన్ననగా చేసి ఇప్పటివరకు ఇవ్వలేదు కదా మరి అమ్మ).
పెద్దక్కకి పెళ్ళవుతుందన్న మాట బానేవుంది కాని ఆ ముసలాయినే ఏం బాలేడు. సినిమాల్లో పెళ్ళికొడుకులు ఎంత బావుంటారు!
పెద్దగా అంది “ఏదో రంగా! రంగా! అని పాడేవు ఉషక్కా! ‘పుత్తడి బొమ్మా పూర్ణమ్మ’ అని పాడాల్సింది” అని.
రెండు రోజుల ముందే కన్యాశుల్కం సినిమా చూసొచ్చింది అమ్మతో. అందరూ ఒక్కసారి గట్టిగా నవ్వేరు.
“ఆ ముసలాయన కాదే పెళ్ళికొడుకు. ఆ పక్కన కూర్చున్న అబ్బాయిరా పెళ్ళికొడుకు”
“ఓహో! ఆ అబ్బాయే బావన్నమాట. బావుంది. మంచివాడే. అయినా కూడా ఆ ‘రంగా రంగా’ పాటేం బాలేదు. ‘జీవితమే సఫలము’ పాడాల్సింది” వరాలు సినిమా జ్ఞానానికి మళ్ళీ అందరూ నవ్వేరు.
* * *
“వరాలూ ఇదిగో! ఎప్పడూ కాఫీ కావాలంటూ గొడవ చేస్తుంటావు కదా. ఇదిగో ఈ వేళటికి ఇది తాగు. మరి ఇప్పట్లో అడగకూడదు. కాఫీ చిన్న పిల్లలకి మంచిది కాదు”.
అవును. ఎప్పుడూ అమ్మ, నాన్న, పెద్దన్నయ్య వాళ్ళు తాగడమే కాని ఎప్పుడూ కాఫీ ఇవ్వరు వరాలుకి. వరాలుకేమో కాఫీ తాగాలని చాలా చాలా కోరిక. గెంతుకుంటూ వెళ్ళింది వరాలు. గ్లాసు తీసుకోపోయి ఠక్కుమని ఆగిపోయింది. ఎక్కడో అడుగున కొంచెమే వుంది కాఫీ. ఉక్రోషం ముంచుకొచ్చింది వరాలుకి. “ఇంతకొంచెమేనా ఇంకా పొయ్యి” మారాంచేస్తూ అంది వరాలు.
“కాఫీ మంచిది కాదంటే వినవేం” అంటూనే మరికొంచెం కాఫీ గిన్నెలోంచి గ్లాసులోకి వంపింది అమ్మ.
“ఊ..ఊ.. ఇంకా పొయ్యి”.
“అబ్బ ముద్దెక్కువై మొండిదానివైపోతున్నావు” విసుక్కుంటూనే మరికొంచెం పోసింది అమ్మ. వరాలు గునుస్తూనే వుంది “ఇంకా పొయ్యి” అంటూ.
ఇంతలోనే వచ్చేడు పెద్దన్నయ్య “అమ్మా! ఏదీ నా కాఫీ?” అంటూ. “ఓ ఇక్కడుందా” అంటూ పట్టికెళ్ళిపోయేడా గ్లాసుని.
వరాలుకి పెద్దగా ఏడుపొచ్చింది. కానీ లోపలే అణిచేసుకుంది ఏడుపుని. అమ్మ దగ్గిరయితే ఎంత మారామైనా సాగుతుంది. పెద్దన్నయ్య ముద్దుగానే చూస్తాడు కాని, ఏంటో ఎందుకో మరి పెద్దన్నయ్య అంటే కొంచెం భయమే వరాలుకి. మేజిక్కు చేస్తానంటూ ఏవేవో చేసేవాడు. ‘వరాలూ ఇలారావే! ఇదిగో నా చేతిలో ఈ రూపాయి చూసేవా? మాయం చేసేస్తాను చూడు’ అనేవాడు. ‘ఛూ మంత్రకాళీ! అబ్రకదబ్ర!’ అంటూ చేయి తలచుట్టూ తిప్పి ముందుకి తెచ్చి పిడికిలి విప్పేవాడు. రూపాయి చేతిలో వుండేది కాదు. వరాలుకి అబ్బురంగా వుండేది. కొన్ని రోజులకి కిటుకు తెలిసిపోయింది. చేయి తలచుట్టూ తిప్పేటప్పుడు వెనక కాలరులో రూపాయి దాచేసేవాడు. అంతేకాదు పిల్లి బొమ్మని చేతిలో పట్టుకుని ‘చూడు ఈ బొమ్మని వంటింటి గూట్లోకి తెప్పిస్తా’ అనేవాడు. చూస్తే వంటింటి గూట్లో వుండేది – ఆ రహస్యం తెలిసిపోయింది. కిట్టూ చెప్పేసాడు ఒకరోజు. వాళ్ళే తీసికెళ్ళి తనకి తెలీకుండా వంటింట్లో పెట్టేస్తున్నారన్నమాట. అలా ఎన్నో ఆటలు ఆడించినా, కొంచెం భయమే. ఎప్పడూ ఇక్కడ వుండడు. ఉద్యోగమని వేరే ఊర్లో వుంటాడు. అప్పుడప్పుడు వస్తాడు. వచ్చేప్పుడు కొత్త బట్టలు, బిస్కట్లు ఏవేవో తెస్తాడు. అయినా ఎంతో పెద్ద పెద్దన్నయ్య కదా. శీను, కిట్టూ, భాస్కరం వాళ్ళతో వున్నట్లు వుండేదికాదు. ఎంతో ఇష్టమేకాని భయం కూడా మరి.
* * *
“అమ్మా, నేనూ వెళ్తానే సినిమాకి పద్దుతో” ఏడుస్తూ అంది వరాలు.
“పద్దూ అనకూడదమ్మా. నీకన్నా పెద్దకదా! పెద్దక్కా అనాలి. దీన్ని తిసికెళ్ళండే మీతోబాటు” రికమెండ్ చేసింది అమ్మ. “ఇదెందుకమ్మా. తను చూడదు, నన్ను చూడనివ్వదు” సణుగుతోంది పద్మ. ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్సు గురించి సినిమా. వెళ్ళాలని పద్మ, శీను, కిట్టూ ప్లాన్. వరాలూ వస్తానని పేచీ.
“చిన్న చెల్లి కదే పాపం! తీసికెళ్ళండమ్మా. అల్లరి చేయదులే” అమ్మ అనునయింపుతో ఒప్పుకుంది పద్మ.
వరాలుకి ఏడుపంతా ఎక్కడ పోయిందో హుషారొచ్చేసింది. “ఏం సినిమానే పద్దూ! చెప్పవే” పద్మ వెనకే తిరుగుతూ అడుగుతోంది.
“నీకెందుకే సినిమా పేరు? ఎలాగూ తిన్నగా చూడవుగదా”
“ ‘ట్రెజర్ ఐలెండ్’ అని ఇంగ్లీషు సినిమా. చాలా బావుంటుందట” శీను హుషారుగా చెప్పేడు.
అందరూ ఆర్ట్సు కాలేజికి అయిదుగంటలకల్లా చేరేరు. గ్రౌండులో తెరకట్టి అరుబయట చీకటి పడగానే సినిమా మొదలు పెట్టేరు. వరాలుకి ఏం అర్థం అవడంలేదు. శీను, కిట్టూ, పద్మకి కూడా అర్థం అవదు. అయినా సినిమా అంటే హుషారు. కదిలే బొమ్మలు చూడ్డం – అదొక సంతోషం. కళ్ళప్పగించి చూస్తోంది వరాలు. తల పైకెత్తి చూడాల్సొస్తోంది.
“ఆ అబ్బాయెవడు? ఎందుకలా ఆ పెద్ద పడవలో తిరుగుతున్నాడు? దాక్కుని దాక్కుని తిరుగుతున్నాడు” తలపైకెత్తి చూస్తోంది వరాలు. మెడనెప్పెడుతోంది. “అరే! ఆ పళ్ళబుట్టల వెనకాతల దాక్కున్నాడు. ఎర్రగా ఎంత బాగున్నాయో పళ్ళు.” ఆకలి వేస్తున్నట్లనిపించింది వరాలుకి. ఆ పిల్లాడిని వెదుకుతూ ఇంకోడు తిరుగుతున్నాడు, కుంటివాడు. కర్రకాలుతో ‘టక్ టక్’ అని చప్పుడు చేస్తూ అసహ్యంగా తిరుగుతున్నాడు. ఎందుకో ఉన్నట్లుండి భయమేసింది వరాలుకి.
“వెళ్ళిపోదామే అక్కా! నాకేం బాలేదు పోదాం రావే” అక్క చేయి పట్టి లాగుతూ ఏడవడం మొదలెట్టింది వరాలు.
“అందుకే నిన్ను తీసుకురానన్నది. కొంచెంసేపు కుదురుగా కూర్చోలేవు” విసుక్కుంది పద్మ. కిట్టూ, శీను ఎంచక్కా చూస్తున్నారు. పద్మకా భాగ్యం లేదు. పెద్దది కదా. వరాలుని ఊరుకోబట్టాలి. లేదా ఇంట్లో విడిచిపెట్టి రావాలి. రెండోదే మేలనిపించింది. తిట్టుకుంటూ, వరాలు చేయిపట్టుకుని గబగబా నడిచింది పద్మ. ఇంటి గుమ్మంలోంచే “అమ్మా ఇదిగో వరాలు. తీసెకెళ్ళు నేవెళ్తున్నా” గట్టిగా అరచి, రివ్వున వెనక్కి తిరిగి పరిగెత్తింది పద్మ, సినిమా ఎంతయిపోయిందో అనే ఆత్రుతతో.
“లోపలకొచ్చి దిగబెట్టచ్చుగా! ఏం పిల్లలో ఏమో” వరాలుని దగ్గరికి తీసుకుంది అమ్మ. ఎంతో నిమ్మళంగా, హాయిగా, ఏం భయం బెంగా లేకుండా ఎంతో బావుంది వరాలుకి అమ్మ ఒళ్ళో.
* * *
వరాలుకి చాలా సంబరంగా వుంది. అమ్మ, తను, కమలక్క కలిసి కమలక్క వుద్యోగం చేస్తున్న వూరికి వెళ్తోంది. అదీ రైల్లో. అంతవరకూ వరాలు రైలెప్పుడూ ఎక్కలేదు. సినిమాల్లో చూసింది కాని నిజంగా ఎప్పడూ చూడనుకూడా లేదు. శీను, కిట్టూ ఒకసారి స్నేహితులతో వెళ్ళి చూసేరుట రైలుని స్టేషనులో. ఎంత పెద్ద ఇంజిన్ వుంటుందో, దాన్నించి గుప్ గుప్ మని పొగ ఎలా వస్తుందో, ధడధడమని రైలు ఎలా పట్టాల మీంచి వస్తుందో వర్ణించి మరీ చెప్పేరు. రైలాటలో మాత్రం ఎప్పడూ తనే ఇంజనుగా వుంటానని పేచీపెట్టి సాధించేది. నోటికడ్డంగా చేయిపెట్టి కూ.. అంటూ నడుస్తుంటే తన వెనక పిల్లలందరూ ఒకళ్ళ చొక్కా ఒకళ్ళు పట్టుకుని రైలు పెట్టెల్లా నడుస్తుంటే భలేగా వుంటుంది.
పొద్దునే లేచి తయారయి రిక్షా ఎక్కి ఝమ్మని స్టేషనికెళ్ళిపోయేరు. రైలింకా రాలేదు. స్టేషను ఎంతో నచ్చేసింది వరాలుకి. తెల్లటి కోటేసుకుని ఒకాయన ఎర్రజెండా, పచ్చజెండా పట్టకుని అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నాడు. ఆ జెండాలు వూపాలని ఎంతో ఉత్సాహపడింది. కాని అమ్మ చెప్పింది. గార్డులే – ఆ తెల్లకోటాయనని గార్డు అంటారట – ఆ జెండాలు ఊపుతారట. ఎర్రజెండా ఊపితే రైలాగుతుందట. పచ్చజెండా వూపితే కదుల్తుందట. ఆశ్చర్యమేసింది వరాలుకి. అంత చిన్న జెండాలకి అంత పెద్ద రైలు ఆగి కదుల్తుందంటే, పెద్దయాక ఎలాగైనా ఒక్కసారి గార్డు అయి ఆ జెండాలు వూపాలని నిశ్చయించేసుకుంది వరాలు. చూస్తుంటేనే రైలొచ్చేసింది పట్టాల మీంచి. అమ్మ చేయి పట్టుకుని రైలెక్కుతుంటే ఎంతో గొప్పగా అన్పించింది. ‘పాపం శీను’ అనుకుంది జాలిగా. ‘కాఫీ కాఫీ’ అని అరుస్తూ తిరుగుతున్నాడు ఒకడు. కిటికిలోంచి తలపెట్టి చూస్తోంది. పెద్ద బేసినులో ఇడ్లీ, వడ పెట్టుకుని చక్రాలబండిపై తోసుకుంటూ తిరుగుతున్నాడు ఇంకో అబ్బాయి. తినాలన్పించింది వరాలుకి. కమలక్క తిడ్తుందని ఊరుకుంది. గార్డు పచ్చజెండా ఊపినట్లున్నాడు. రైలు ‘కూ’ అని కూతపెట్టి కదిలింది. ఇన్ని పెట్టెలు లాగలేక ఇంజను పాపం ‘కూ’ అని ఏడుస్తోందనుకుంది వరాలు.
కిటికిలోంచి చూస్తోంది వరాలు. కరెంటు స్తంభాలు, చెట్లు అన్నీ వెనక్కి వెళ్తున్నాయి. తామాడే రైలాటలో లాగ ‘చుక్ చుక్’ అనడంలేదు రైలు. ‘డగ్ డగ్ డగా’ అని అంటోంది. ఈసారి రైలాటలో తనూ అలాగే అనాలనుకుంది వరాలు.
“అంతలా కిటికీలో తలదూర్చేమాకు కంట్లో బొగ్గుపడుతుంది” అమ్మ వెనక్కి లాగింది.
‘బొగ్గేంటి! రైల్లో ఎవరన్నా కుంపటి పెట్టి వంట చేస్తారా?’ అర్థం కాలేదు వరాలుకి. అమ్మని అడిగేలోపే వచ్చేడు ఒక పెద్దమనిషి. పెద్దన్నయ్యంతున్నాడు, నల్లటి కోటేసుకుని చేతిలో కాగితాలు, పెన్ను పట్టుకుని. కమలక్క పర్సులోంచి రెండు టికెట్లు తీసి ఇచ్చింది ఆయనకి. అమ్మదీ, కమలక్కదీనుట. వరాలుకి టికెట్టు అక్కర్లేదుట. చిన్నపిల్ల కదా! అక్కడే అమ్మ పక్కనే కూర్చుని అందరి టికెట్లు తీసుకుని ఇచ్చేసేడు.
“నీ పేరేంటి పాపా” అడిగేడు వరాలుని. ‘తనకి టికెట్టు మాత్రం ఇవ్వరు కాని పేరు చెప్పాలట’ మొహం పక్కకి తిప్పుకుని కూర్చుంది వరాలు. రైలు మళ్ళీ ఆగింది.
“స్టేషనేంకాదు. ఎందుకాగిందో!” ఎదురుగా కూర్చున్న అబ్బాయి అన్నాడు. భాస్కరన్నయ్యకన్నా కొంచెం పొడుగ్గా వున్నాడు. “సిగ్నల్ ఇచ్చినట్లు లేదు అవుటర్‌లో ఆపేరు” నల్లకోటాయన అన్నాడు. వరాలుకి ఏం అర్థం అవలేదు. కిటికిలోంచి చూస్తోంది. రైలాగితే ఏం బాలేదు. కరెంటు స్తంభాలు, చెట్లు ఏవీ నడవడం లేదు.
“ఏంటా మొక్కలు” అమ్మనడిగింది వరాలు కిటికీలోంచి బయటకు చూస్తూ. “వేరుశెనగ పంటరా అదీ” అమ్మ అంది.
“మరి వాటికి శెనక్కాయలు కాస్తాయా?” అడిగింది వరాలు. ఏ చెట్లయితే వాటికి ఆ కాయలు కాస్తాయని తెలుసు వరాలుకి.
“అవును పాపా” నవ్వూతూ అన్నాడు ఎదుట సీట్లో అబ్బాయి. ‘నువ్వేంటి మధ్యలో’ అన్నట్లు చూసింది వరాలు.
“అమ్మా, మరి శెనక్కాయలు లేవు ఆ మొక్కలపై ఎందుకు?” అడిగింది వరాలు.
“క్రింద వేర్లకుంటాయి” మళ్ళీ ఆ అబ్బాయే చెప్పేడు. నమ్మనట్లు చూసింది వరాలు. ‘తన్నేడిపిస్తున్నాడీ అబ్బాయి’ అనుకుంది. తనకి తెలుసు – కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు చూసింది తను. వాటికంతా చెట్టుపైనే కాయలున్నాయి. పక్కింటి పోలీసు ఇంట్లో కూడా జామి చెట్టుకి పైనే వున్నాయి కాయలు.
“నమ్మవా, చూపిస్తానుండు” నవ్వుతూ రైలు దిగి నాలుగు మొక్కలు పీకి తెచ్చేడు అబ్బాయి. నిజమే ఆయనన్నట్లు వేరుకి శెనక్కాయలున్నాయి. భలే ఆశ్చర్యమన్పించింది మళ్ళీ వరాలుకి. ఆ కాయలు తెంపి నీళ్ళల్లో కడిగి వరాలుకిచ్చేడు. అంతే! వరాలు కోపమంతా మరిచిపోయింది. అమ్మ వలిచి ఇస్తుంటే శెనక్కాయ గింజలు తింటూ రైలు బయటకు మళ్ళీ చూడసాగింది.
రైలు ముందుకి.. చెట్లు, స్తంభాలు వెనక్కి..
***
“కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణి తాతుల నీలతనో..” నోరు ప్రార్థన చేస్తోంది కాని కళ్ళు మాత్రం చుట్టూ చూస్తున్నాయి. మనసు ఎవరి గురించో ఎదురు చూస్తోంది.
‘అమ్మయ్య! అదిగో మూడో వరసలోనే వుంది. వచ్చిందన్న మాట స్కూలికి’ స్థిమితి పడింది వరాలు. అంతలోనే మళ్ళీ ‘ఎప్పటికీ ప్రేయర్ అయిపోతుందో.. ఎప్పుడు ఒకటి రెండు మూడు పిరీడ్లు అయిపోతాయో.. ఎప్పడు ఇంటర్ బెల్ మ్రోగుతుందో..’ సాగుతున్న వరాలు ఆలోచనలకి బ్రేకు పడింది.
“అబ్బ!” వీపుమీద మోగింది విమానం మోత. “వెళ్ళు లైన్లో. క్లాసుకెళ్ళక ఏంటలా బొమ్మలా కళ్ళప్పగించి నిలబడిపోయేవు?” కళ్ళు తెరిచిన వరాలు ముందు పి.టి. టీచర్. చుట్టూ చూసింది. అందరూ అప్పటికే క్లాసుల్లోకి వెళ్ళిపోయారు. సుబ్బలక్ష్మి కూడా క్లాసులోకెళ్తూ తిరిగి చూసి నవ్వింది. వరాలుకి దిలాసా చిక్కింది ఇవాళ తన కోరిక తీరబోతోందని. ‘ఇంటర్ బెల్లులో దాన్నెలాగైనా పట్టుకోవాలి.’ మూడు యుగాలు గడిచిపోయేయి వరాలుకి. ఠంగ్ ఠంగ్ మని బెల్లు మోగిందో లేదో అందరికన్నా ముందు పరిగెట్టింది వరాలు. కళ్ళు గ్రౌండునంతా కలయచూసేయి. అదిగో ఆ మూలగా గంగరావి చెట్టుక్రింద పెట్టుకుని వుంది గంపని ఇడ్లీలమ్మే ఆవిడ. సుబ్బలక్ష్మీ అక్కడే వుంది. అక్కడికి పరిగెట్టింది వరాలు. గంపలో పెద్ద బేసిన్లో ఇడ్లీలు, ఇంకో గిన్నెలో చట్నీ. ఇంటర్ బెల్లులో ఇంట్లో నాస్తా చేయని వాళ్లందరూ ఎంచక్కా ఆవిడ దగ్గిరే ఇడ్లీలు కొనుక్కుని తింటారు. ఒకిడ్లీ అర్థణా. వరాలుకేమో రోజూ ఇంట్లో పెరుగన్నం, ఆవకాయ ముక్క టిఫిన్. పైగా ‘బయట ఏం తినకూడదు ఒంటికి మంచిదికా’దని అంటారు. అదేం కాదు డబ్బుల్లేకే ఇవ్వరని వరాలు అనుమానం. అదే నిజమైతే అప్పుడప్పుడూ సాయంత్రం ‘మురుకు కొనుక్కో’ అని కాణీ ఇస్తుందమ్మ. మురుకు మాత్రం బయట తిండి కాదా. ఆ ఇడ్లీలు ఆ ఎర్రటి కారం కారం చట్నీతో తినాలని వరాలుకెంతో కోరిక. అందరూ తింటుంటే వరాలుకి నోరూరిపోతుంటుంది రోజూ. సుబ్బలక్ష్మి వాళ్ళమ్మ రోజూ టిఫిన్ చేయదుట. ఎంచక్కా అది రోజూ ఇక్కడే ఇడ్లీలు తింటుంది. దాన్ని మంచి చేసుకుని, పొగిడి, దానికి లెక్కల హోమ్ వర్కు చేసిపెట్టి – అది మొద్దుది. తనకి వచ్చినన్ని మార్కులు దానికి రానేరావు. ఎలాగైతేనేం రెండిడ్లీలు ఆవేళ సుబ్బలక్ష్మి తనకి ఇప్పించేట్లు చేసుకుంది వరాలు. అదీ పొద్దుట్నుంచీ ఈ ఎదురుచూపుకి కారణం. సుబ్బలక్ష్మి మాట తప్పలేదు. లొట్టలేస్తూ తింటోంది వరాలు. ఎంత బాగున్నయో ఇడ్లీలు. ఎంత నెమ్మదిగా తిన్నా ఇట్టే అయిపోయాయి రెండు ఇడ్లీలూ. ఇంట్రబెల్లూ అయిపోయింది. మర్నాటి నుంచి మొదలయ్యింది అసలు బాధ. ‘ఎప్పుడిస్తావు నా అణా?’ రోజూ సుబ్బలక్ష్మి సాధింపు. అప్పుడేమో దానిగురించి ఎదురుచూడ్డం. ఇప్పుడేమో దాన్ని తప్పించుకు తిరగడం. ఇంట్లో తెలిస్తే అమ్మ తిట్టడం. ఆఖరికి దైవంలా వచ్చేడు ఒక చుట్టం. ఇంటిలో పిల్లలందరి చేతిలో తలా పావలా పెట్టేడు వెళ్ళేప్పుడు. అప్పుడు తీరింది సుబ్బలక్ష్మి బాకీ.
(సశేషం)