మగబిడ్డ జనియింప నగణితంబుగ కట్న
మేతెంచు తమకని యెంచువారు
కట్నాల కోసమే కాలేజి చదువుకు
తమ పిల్లలను అంపదలచువారు
విద్యలో తమవాడు పెరిగెడి స్థాయికిన్
తగు కట్నమడుగంగ దరలు వారు
వరకట్నముంబెంచ వసుధనుద్యోగుల
గుఱ్ఱవాండ్రకు కొనగోరువారు
స్థాయికొక రేటు చొప్పున జంకులేక
పెచ్చు కట్నంబు వాంఛించు పెద్దవారు
బుద్ధిగోల్పోయి సంఘాన హద్దుమీరి
సంచరించుత వరకట్న జాడ్యమెకద? 15
కాటక బాధచే గర్భస్త శిశువును
చంపగాయత్నంబు సలుపుచుంట
దారిద్య్ర వేదనన్న్ తమకన్నబిడ్డల
వైద్యశాలల యందె వదలుచుంట
కరము కట్నపు భీతి పురిటిలో పాపల
జంకేమియునులేక జంపుచుంట
ఆడపిల్లలగన్న అయ్యలు నిరతంబు
కడలేని యిడుములు పడచునుంట
ఎంత తిరిగిన కూతుకు నిజ్జగాన
వరుని తేలేని దుస్థితి న్వగచుచుండి
తనువులంబాయు తరిలోన తండ్రులుంట
అరువు లేకను సతతంబునడ్డులేక
వరలు వరకట్న భూతంబు వలనగాదె. 16
వరకట్నమే లేని పెండ్లియో పెండ్లియా
అని నవ్వుచును పల్కిచనెడువారు
వరసుంకమీలేని వాడు పురుషుడౌన
అప్రయోజకుడాతడనెడువారు
వరశుల్కమందని వరుడేమి వరడంచు
అవహేళనము చేసియరుగువారు
కట్నమే లేకను గౌరవమెట్లబ్బు
పరిణయంబునకంచు పలుకువారు
అపరిమితమైన సంఖ్యలో నవని ప్రజలు
కానుపించుచు శుల్కమున్ గౌరవింప
కన్నెలంగన్న తండ్రుల కష్టములకు
అవధియనునది యుండునా? యరసి చూడ. 17
ఎన్ని కుటుంబాలు నెద్దానిచేనల్గె
అప్పుల బాధచే ననుదినంబు
ఎందరు తండ్రులు నెందుచే ప్రాణాలు
కోల్పోవుచుండిరీ కువలయమున
ఎందరు యువతులు నే కారణంబుచే
కోర్కెలన్విడనాడి కుందుచుండ్రి
ఎందరో కోడండ్రు ఏ ప్రభావంబున
అత్తల యాగడాలనుభవించ్రి
అరయ పెట్రోలు దహనాలననుదినంబు
నందుచుండిరి యెందుచేనాడవారు
ఆ దురాచారమికపైన నడ్డకున్న
మనుజ జాతికి గల్గదు మహిత శుభము. 18
ఇట్టి దుష్టమైన యీదురాచారమున్
సమయజేయుటకును జగతిప్రభుత
సాహసించి యొండు చట్టంబుజేసిన
వనితలకును దొలగువంతలెల్ల. 19
వనితలు వారి తన్వులను భర్తల మాటున వెళ్ళదీయుయో
చనలను మాని సత్వరమె సాగుచు ముందుకు విద్యలందునన్
అనితరలీల బెంపుగని యార్థికవృద్ధిని బొంది తాముగా
అనిశము జీవయాత్రల నహ! యన సల్పుటమేలు కార్యమౌ. 20
యువతీ యువకులునెల్లరు
అవమానముగూర్చునిట్టి యపమార్గంబున్
జవమరికట్టగబూనుట
అవసరమగు చర్యయిప్పుడవనీ స్థలిలోన్. 21