వారాల ఆనంద్ గారు రచించిన 6 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.
~ ~
1)
నీ సమక్షంలోనూ పరోక్షంలోనూ
నాలోన ఏవో ప్రకంపనలు అవి నీకర్థమవుతాయి
మౌనం చాటున చిరునవ్వును దాచేస్తావు
~ ~
2)
నువ్వు నా ముందర వున్నప్పుడు
నేను అద్దం ముందు నిలబడి
నాతోనే మాట్లాడుకున్నట్టు వుంటుంది
~ ~
3)
గత కొంత కాలంగా దుఃఖం సంతోషం
మంచానికున్న నవారులా పెనవేసుకుంటున్నాయి
నేనే చిక్కు ముళ్ళు విప్పుతున్నాను
~ ~
4)
కూలదోసారు పడిపోయాను లేచి నిలబడ్డాను
వెనక్కి చూసి వెక్కి వెక్కి ఏడ్చాను
ముందుకు చూసి ముసి ముసిగా నవ్వి అడుగేసాను
~ ~
5)
నా కల నిద్ర లోనే కాదు
మెలకువలోనూ వస్తుంది
కలా నేను వేరయితే కదా
~ ~
6)
సూర్యోదయాన్ని చూసి సంతోషిస్తాం ఆశగా
అస్తమయాన్ని చూసి దుఃఖిస్తాం నిరాశగా
బతుకంటేనే వెలుగు నీడలు
*