[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘వరమాల’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]చీ[/dropcap]కటి అవనిని ఆక్రమిస్తున్న వేళ
వేవేల నక్షత్రాలు ఆకాశంలో
మిణుకు మిణుకు మంటూ
తమ ఉనికిని చూపుతుంటాయి!
దారంటూ కానరాని
నిస్సహాయ స్థితిలో సైతం
మనిషి మనసులో ఆశ
ఏదో మూల సన్నగా చిగురిస్తూనే ఉంటుంది!
ఒక్కొక్కటిగా పరిచయమవుతున్న ఆశలు
కాంతిపుంజాలై తిరిగి శక్తిని పుంజుకునే
అవకాశాన్ని, అదృష్టాన్ని కలుగజేస్తూ..
జీవితానికి అర్థం తాము అన్నట్లుగా
ఆశలు ఆశయాలుగా మారుతూ..
ముందుకు నడుపుతుంటాయి!
నేస్తం..
ఓటమి ఒక గుణపాఠం!
నిన్ను నువ్వు సరికొత్తగా
..మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునే ప్రేరణ!
సమస్యలు ఎన్ని రకాలుగా
చుట్టుముట్టి కలవరపెడుతున్నా..
ఆత్మవిశ్వాసమనే ఆయుధం నీ సొంతమైతే..
ఘన విజయం నిన్ను వరించే వరమాల!