వారాశి

0
2

[dropcap]ఆ[/dropcap]కాశం సన్ముని మనసులా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది. నులివెచ్చని తొలి కిరణాల స్పర్శతో పల్లె సుషుప్తం లోంచి వాస్తవానికి ఉదయిస్తోంది.

కరి మబ్బులు వినయంగా దినమణికి దారిస్తూ ఆ వూరి సంస్కారాన్ని ప్రతిబింబిస్తున్నాయి. చుట్టూ ఉన్న కొండలు ఆ వూరి ఔన్నత్యానికి ప్రత్రీకల్లా ఉన్నాయ్.

ఉదయం ఆరు గంటలకే ఆ ఆశ్రమ ప్రాంగణం అంతా తెల్లని బట్టలు ధరించిన సందర్శకులతో కిక్కిరిసిపోయి ఉంది.

వెయ్యి మందికి పైగా ఉన్న ఆ సుజన సమూహం పీల్చే ఊపిరి, వాళ్ళు దర్శించబోయే మందిరం నుంచి వచ్చే స్పూర్తి వీచికలతో నిండి పోయి ఉంది. అంత మంది ఉన్నా అ ప్రదేశం శాంతి తరంగాలని మాత్రమే ప్రసారం చేస్తోంది.

సరిగ్గ ఆరు గంటలకి మందిరం తలుపులు తెరుస్తారు. మొదటిసారి ఆ మందిరానికి వచ్చిన వాళ్ళలో ఏదో ఆత్రుత. లోపల ఏదో తెలియని అనుభూతి కలుగుతుందని వచ్చారు కానీ అదేంటో ఇతమిధ్ధంగా తెలియదు. ఆ అనుభూతిని స్వయంగా పొందడం కోసమే ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తూ ఉంటారు.

ఆరు గంటలు మ్రోగాయి. క్రమంగా తలుపులు తెరుచుకున్నాయి. సందర్శకులు ఒక్కరొక్కరుగా లోపలకి క్రమశిక్షణతో వెడుతున్నారు. ఎక్కడా తొక్కిసలాట లేదు. ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడమూ లేదు. లోపలకి వెడుతోనే కనపడే విగ్రహం ఏ దేవుడి విగ్రహమో కాదు. దేవతల చిత్రాలూ కాదు. తెల్లని కోటు ధరించి మెడచుట్టూ stethoscope ని మాలగా ధరించి, ప్రేమ కురిసే కళ్ళతో ఉన్న విగ్రహం; మెడలో పాముని ధరించి లోకకల్యాణం కోసం విషం తాగిన శివుడిని తలపించేలాగ ఉన్న విగ్రహం దర్శనం ఇస్తుంది. అది విగ్రహం అన్న మాటే గానీ నిజ రూపంలో ఉన్న వైద్య శాస్త్రవేత్తలా ఉంటుంది. ఆ మందిర నిర్మాణంలో ఉన్న అంతరార్థమే అది. అదే స్ఫూర్తి మందిరం. కదలాలనిపించకపోయినా దర్శనం చేసుకుని క్రమంగా కదిలిపోతున్నారు సందర్శకులు.

వాళ్ళ కుడి వైపు ఉన్న ద్వారం ఒక మ్యూజియానికి దారి తీస్తుంది. అందులో అద్భుతంగా చెక్కబడిన రాతి శిల్పాలు మనోహరంగా దర్శనమిస్తున్నాయి. పాల రాతితో చెక్కిన వైద్య శాస్త్రవేత్తల శిల్పాలవి. ప్రతీ శిల్పానికీ పక్కన వాళ్ళ గురించిన వివరాలు రాసి ఉన్నాయి. ప్రతీ శిల్పానికీ పక్కన చిన్న గది ఉంది. ఆ గదిలో సుమారు పదిమంది ఏక కాలంలో నుంచోవచ్చు. ఆ గదిలో ఏర్పాటు చేయబడ్డ తెర మీద ఆ శాస్త్రవేత్త జీవిత జీవిత విశేషాలూ, చేసిన పరిశోధనల వివరాలూ అందరికీ అర్ధమయ్యేలాగ సినిమాగా ప్రదర్శింపబడుతుంది. ఆ మ్యూజియంలో మొత్తం 100 మందికి పైగా ప్రముఖ వైద్య శాస్త్రవేత్తల విగ్రహాలున్నాయి. పెనిసిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త విగ్రహం మొదలుకొని, పోలియో వాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త విగ్రహంతో పాటు మరెంతో మంది శాస్త్రవేత్తల శిల్పాలు ఉన్నాయి.

ఆ మ్యూజియం లోంచి బయటకి వస్తున్న సందర్శకుల మొహాలలో ఆశ్చర్యం, స్ఫూర్తి స్ఫుటంగా కనిపిస్తున్నాయి. వాళ్ళలో ఒక జంట ఉంది.

వెంకన్న రైతు కూలి. భార్య వీరమ్మ, అతనితో పాటు పొలం పని చేస్తూ ఉంటుంది. ఆరు నెలల కడుపుతో ఉంది వీరమ్మ. వారాశి పురం గురించి విన్నారు కానీ ఎప్పుడూ వెళ్ళ లేదు. వీళ్ళ గ్రామానికి సుమారు ౩౦ కిలోమీటర్ల దూరం ఉంటుంది వారాశి పురం. ఈమధ్య వీరమ్మకి వైద్య పరీక్షల కోసం ఊళ్ళో ఉన్న వైద్యశాలకి వెడితే వీరమ్మకి కొన్ని టీకాలు వేయాలని చెప్పింది కొత్తగా ఆ ఊరికి వచ్చిన డాక్టరమ్మ. “టీకాలు దేనికి” అని వెంకన్న కుతూహలంగా అడిగినప్పుడు ఎప్పుడు ఏ టీకాలు ఇవ్వాలో వివరించే పట్టికని చూపిస్తూ వివరించింది డాక్టరమ్మ.

మందులివ్వడం, రాయడంతో పాటు వీలయినంత వరకు రోగులకి రోగం గురించి, వాడే మందుల గురించి కొంత అవగాహన కలగజేసే ప్రయత్నం చేస్తుంది కొత్త డాక్టరమ్మ. “వారాశి పురం వెళ్ళి అక్కడ ఉన్న మ్యూజియం చూడండి. వైద్య శాస్త్రంలో విశేష ఆవిష్కరణలు చేసిన మహానుభావుల చరిత్రలు, వాళ్ళ ఆవిష్కరణలు, అందరికీ అర్థమయ్యేలా వివరించబడ్డాయి” అని ప్రొత్సహించింది. అప్పటినుంచి వారాశి పురం చూడాలన్న కోరిక ఈ రోజుకి తీరింది.

వెంకన్న పది వరకు చదువుకున్నాడు. సహజంగా తెలివైనవాడు. పై చదువులు చదివే స్తోమత లేక ఊళ్ళో ఉన్న Food processing పరిశ్రమలో చేరేడు. కొంతకాలం జీవితం బాగానే సాగింది. ఆ ప్రాంతంలోంచి ఎగుమతి చేసే చేపల్లో విష పదర్ధాలున్నాయని అక్కడి ఉత్పత్తులు విదేశాల్లో ఎవరూ దిగుమతి చేసుకోపోవడంతో ఆ పరిశ్రమ మూత పడింది. బ్రతుకు తెరువు కోసం వెంకన్న, వీరమ్మ విద్యా పురం వలస వెళ్ళి పొలం పన్లు చేసుకుంటూ బతుకుతున్నారు.

స్ఫూర్తి మందిరం లోంచి బయటకి వస్తూనే వెంకన్న వళ్ళంతా ఏదో శక్తి ఆవహించినట్లుగా అనిపించింది. తన జీవితంలో అంత ఉత్సాహంగా ఎప్పుడూ లేడు వెంకన్న. “మనం వాడే మందులు, టీకాల వెనక ఇంతమంది శ్రమ, నిరతి ఉన్నాయా” అని ఆశ్చర్య పోయాడు వెంకన్న. అక్కడే తిరుగాడుతున్న Tour guide దగ్గరకి వెళ్ళి “ఈ మందిరం వెనుక ఉన్న చరిత్ర తెలుసుకోవాలని ఉంది. నా దగ్గర పది రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇవి fees గా ఇస్తా. తీసుకుని ఈ మందిరం, దానికి అనుబంధంగా ఉన్న మ్యూజియం గురించి చెప్పగలరా” అని ప్రాధేయ పడ్డాడు.

ఎప్పుడూ తనే సందర్శకుల వెంట పడి చెప్పించుకోమని ప్రాధేయ పడడమే కానీ ఎవరూ ఇంత వరకూ తనని అడిగి చెప్పించుకున్న వాళ్ళు లేరు. ఆశ్చర్యం, ఆనందం కలిసిన విస్మయంతో “తప్పకుండా” అని చెప్పి కొంచెం దూరంలో ఉన్న తోటలోకి తీసుకెళ్ళి ఉత్సాహంగా చెప్పసాగాడు Tour guide. ఆయన కధ చెప్పే విధానం మైమరపించేలా ఉండడంతో వెంకన్న, వీరమ్మ చరిత్ర పుటల్లోకి జారుకున్నారు.

“ఇప్పుడు మనం ఉన్న వారాశి పురానికి సుమారు 3౦ కిలొమీటర్ల దూరంలో వేదవరం అనే అగ్రహారం ఉండేది. ఆ ఊళ్ళో రామయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఆయన శివ భక్తుడు. ఆ అగ్రహారంలో సుమారు 100 మంది వేద పండితులుండే వారు. సూర్యోదయానికి ముందే లేచి వేద పఠనం చేస్తూ పిల్లలకి వేదం బోధిస్తూ ఉండేవారు. ఆ ఊళ్ళో ఎక్కడకెళ్ళినా వేదనాదమే; ఎవరిని కదిపినా త్యాగ భావమే. రామయ్యకి చాలా కాలం పిల్లలు కలగ లేదు. వేదపురానికి దగ్గరలో ఉన్న శివానంద స్వామి దగ్గరకి వెళ్ళి “స్వామీ, నాకు ఇంతకాలం పిల్లలు లేరు. అగ్రహారంలో ఉండే నాకు వేదవతి ఎప్పుడు పుడుతుందా అనే ఆశ నాకు ఉండేది. ఇప్పటి వరకూ ఆ కోరిక తీర లేదు. మీరు అనుగ్రహిస్తే నాకు ఆ భాగ్యం కలుగుతుందని నా నమ్మకం. దయచేసి ఆశీర్వదించండి” అని ప్రార్ధించాడు.

“రామయ్యా, ఎవరైనా అబ్బాయి కావాలి, వంశాభివృధ్ధి జరగాలి అని కోరుకుంటారు కాని, నువ్వేంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నావు. ఇది లోక విరుధ్ధంగానూ, ఆశ్చర్యకరం గానూ ఉంది” అని బదులిచ్చారు స్వామి.

“స్వామీ, అమ్మాయితో లోకంలో సంస్కారాభివృధ్ధి, సమాజాభివృద్ధి జరుగుతుంది. శివుడిని సేవించే నాకు లోకమే సంసారం లాంటిది. కాబట్టి నాకు ఒక అమ్మాయి ఉంటే ఆమె ద్వారా లోక కళ్యాణానికి దోహద పడాలని నా కోరిక” అని బదులిచ్చాడు రామయ్య.

“ఇంత విస్తృత భావాలున్న ఇతనికి అమ్మవారు బిడ్డగా పుడితే లోక కళ్యాణం జరుగుతుంది. తప్పకుండా ఇతని కోరిక తీరడం కోసం శివుడిని ప్రార్థిస్తాను” అని మనసులో అనుకున్నారు స్వామి.

“రామయ్యా, నీలాంటి సామాజిక స్పృహ, మానవతా దృష్టి ఉన్న వ్యక్తి ఇంట్లో అమ్మవారు పుట్టకపోతే లోకమే వెలవెల బోతుంది. వచ్చే వసంతంలో నువ్వు బిడ్డ భవానితో కలిసి నన్ను కలుసుకుంటావు” అని ఆశీర్వదిస్తారు స్వామి.

తెలియని అనుభూతితో ఉప్పొంగి, “నాకు వేదవతి పుడుతుంది, స్వామి భవాని అనే పేరు కూడా నిశ్చయం చేసారు. ఎంత భాగ్యం” అనుకుంటూ ఇంటికి వెళ్ళి భార్య సవితకి వివరాలు చెప్పాడు.

ఆనందానికి అవధులు లేని భార్య రాత్రంతా నిద్రపోలేదు. పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచనలన్నీ.

కాలం గడిచింది. చైత్ర పౌర్ణమి నాడు తేజస్సంపన్నురాలైన బిడ్డకి జన్మనిచ్చింది సవిత.

శివానంద స్వామి దగ్గరకి భవానిని తీసుకు వెళ్ళి, “స్వామీ, మీరు ఆశీర్వదించినట్లుగానే ఆడబిడ్డ కలిగింది. మీ ఆదేశం మేరకు భావాని అని పేరు పెట్టుకున్నాం. దయచేసి పాప జన్మ పత్రిక రాసి ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేసేటట్లు అశీర్వదించండి” అని కోరతాడు.

పుట్టిన రోజు వివరాలు తెలుసుకుని, కొంత సేపు ధ్యానంలోకి వెళ్ళి, “నా అశీర్వాదం అవసరం లేదు. పార్వతీ దేవి నీ ఇంట్లో పుట్టింది. ఇక నుంచి నువ్వు చేయాల్సింది శివస్తుతి, లలితా నామ ధ్యానం మాత్రమే. జన్మ పత్రిక రాసి పెడతాను, ఈసారి వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళు” అని చెప్పి శెలవిస్తాడు.

“స్వామి ఏదో నన్ను ఉత్సాహ పరచడానికి చెపుతున్నట్లుంది గానీ పార్వతి పామరుడింట్లో పుట్టడమేంటి” అని విస్మయం చెందుతాడు?

“భవాని పార్వతే కాకపోయినా, ప్రతి అడబిడ్డ పార్వతి ప్రతీకే. సంశయం దేనికి” అని నిర్ణయించుకుని ఇంటికి వెడతాడు రామయ్య.

భవాని శుక్ల పక్ష చంద్రుడిలా, క్రమంగా మనోజ్ఞంగా ఎదుగుతూ పరిణతి చెందుతోది. శరీరం రంగులు మారుతోంది. మనసు ఆటుపోట్లకి గురి అవుతోంది. మేధస్సు అవధులు దాటి విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటోంది.

“అమ్మా భవానీ, మన ఊళ్ళో ఉన్న పదవ క్లాసు వరకు చదుకున్నావు. ఇక పై చదువులకి పట్నం వెళ్ళాలి. నీకు చదువు కోవాలని ఉంటే ఏర్పాటు చేస్తాను. ఆలోచించి చెప్పు తల్లీ” అంటాడు.

“ఇందులో ఆలోచించాల్సినదేముంది నాన్న. ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు బడిలో చదివాను. పుస్తకాల్లో చదివిన దానికి మించి మీ దగ్గర, అమ్మ దగ్గర నేర్చుకున్నాను. పుస్తకాల్లో వ్రాయనివి మిమ్మలిని చూసి, మీరు చేసే పనులు చూసి నేర్చుకున్నాను. అంతకు మించి మన అగ్రహార జీవన విధానం, మన చుట్టూ ఉన్న ప్రకృతి సౌరభాన్ని ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ, పరిశీలిస్తూ నేర్చుకున్నాను. ఈ అగ్రహరాన్ని మించిన విద్యాలయం ఉంటుందనుకోను. నీలాంటి తండ్రిని మించిన గురువు దొరుకుతాడనుకోను. మీకభ్యంతరం లేకపోతే ఇక్కడే మీకు అమ్మకీ సేవ చేస్తూ వేదవరం అగ్రహార అనుగ్రహం పోదాలని ఉంది. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశీలుస్తూ పరిశోధిస్తూ గడపాలని ఉంది” అని అంది భవాని.

జవాబు చెప్పలేని సందేశం, ఉపదేశం, సమాధానం.

“సరే తల్లీ, నీ ఇష్టం. పార్వతి మాట, భవాని నోట అనుకుంటాను”.

“మీ నోటి మాట నాకు అనుశాసనం నాన్న. పిల్లల అభీష్టాన్ని మన్నించే తల్లితండ్రులు ఉండడం నా అదృష్టం” అని అక్కడనుంచి వెడుతుంది భవాని.

తన భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచిస్తోంది. “భగవంతుడు ఇంత వ్యాపితంగా, అపూర్వంగా, మనోహరంగా, ప్రపంచాన్ని సృష్టించాడు. కనిపించి గొప్పలు చెప్పుకోడు. కనిపించక తన గొప్పతనాన్ని దాచుకోడు. సమయానికి వికసించే పువ్వులు, ఆకలి తీర్చి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయలు ఎవరడిగారు? అడగకుండా ఇచ్చేవాడే ఈశ్వరుడు” అనుకుంటూ నిద్రలోకి జారుకుంది భవాని.

ఇంటి పెరట్లో తనకిష్టమైన మొక్కలు పెంచుతూ శాస్త్రీయంగా పరిశోధనలు మొదలు పెట్టింది భవాని. భవానికి ప్రకృతి అంటే అమిత ప్రేమ. తన పెరటిలో, పొలంలో ఉండే ప్రతీ మొక్క, పాదు, చెట్టు గురించి తెలుసు.

అది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన సంవత్సరం. 1984. George Orwell రాసిన 1984 అనే నవల ప్రపంచాన్ని ఉత్కంఠతో నింపింది. మేధావులందరూ ప్రభావితులయ్యారు. ఏది సత్యం, ఏదసత్యం; ఏది నిత్యం, ఏది అనిత్యం అనే ప్రాథమిక ప్రశ్నలని ప్రపంచ స్ఫురణకి బలంగా తెచ్చింది ఆ పుస్తకం. ఆ పుస్తకాన్ని చదువుతున్న భవాని “అద్వైతాన్ని ఆంగ్లంలో అర్థం కాకుండా చెబితే ప్రపంచం ఆస్వాదిస్తోంది. ఉత్తేజితులవుతున్నారు మేధావులు. ఎంత ఆశ్చర్యం” అనుకుంటూ విస్మయం చెందుతోంది.

వార్తలొచ్చే సమయం అయిందని TV on చేసింది భవాని. “నారాయణి” జిల్లాలో వింత అంటు వ్యాధి వ్యాపిస్తోందని అధికారులు ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు. ఈ జిల్లాకి పక్కన ఉండే కైలాసగిరి ప్రాంతంలో మాత్రం ఈ వ్యాధి వ్యాపించలేదని అదికారులు నిర్ధారించారు” అని వార్త చదివారు. ఆశ్చర్య పోయింది భవాని. తాము ఉండే ప్రాంతమే కైలాసగిరి మండలం. వేదవరం కైలాసగిరి మండలం లోనిది. కైలాసగిరి మండలం చుట్టుపక్కల గ్రామాల్లో ఈ వ్యాది ప్రబలిందని చెబుతున్నారు. వేదవరంలో ఎవరూ ఎలాంటి వ్యాదితోటీ బాధపడట్లేదని తెలుసు. ఎలా సాధ్యం? అని ఆలోచించ సాగింది. వార్తల్లో చెప్పిన అంటువ్యాధి తన ప్రాంతంలో ప్రబలకపోవడానికి ఏదో ప్రకృతి పరమైన కారణం ఉండి తీరాలి అనుకుంది భవాని.

‘ఇది ప్రకృతి ప్రసాదించే రక్షణ వల్ల మాత్రమే సాధ్యం’ అని సునిశితంగా అలోచించడం మొదలుపెట్టింది భవాని.

ఉదయం లేస్తూనే ఎప్పటిలా ధ్యానాదికార్యక్రమాలు పూర్తి చేసుకుని రామయ్య పొలానికి బయలుదేరే ముందే వెళ్ళి, “నాన్నా, నాతో వస్తావా?” అని అడిగింది.

“ఎక్కడికమ్మా” అని ఆత్రంగా అడిగాడు రామయ్య.

తను ముందు రాత్రి విన్న వార్తల సారాంశం చెప్పి “మన ప్రాంతానికి ఎలా రక్షణ కలుగుతోందో తెలుసుకుంటే ఈ వ్యాధికి నివారణ దొరుకుతుంది. మన అగ్రహార పొలిమేరలకి, పక్కన ఉన్న గ్రామాలకి వెళ్ళి అక్కడ ప్రకృతిలో ఏమైనా కొత్తదనం ఉందా అని పరిశీలిద్దాం నాన్నా” అంది.

“మంచి ఆలోచన తల్లీ. నేను తప్పకుండా నీతో వస్తాను” అన్నాడు రామయ్య.

మొదట వేదవరం పొలిమేరల్లోకి వెళ్ళి చూసారు. “నాన్నా, ఇదే అనుకుంటా మనకి రక్షణ ఇచ్చేది”

“నీకెందుకల్ల అనిపించిది?”

“ఈ మొక్క కలుపు మొక్కలా లేదు. సౌష్టవంగా మిగతా మొక్కలకి భిన్నంగా ఉంది. ఇంతకు ముందు చూసినట్లు లేదు” అంది.

“కొన్ని మొక్కలని ఇంటికి తీసుకెళ్ళి నాటి పరిశీలిద్దాం. మిగతా ప్రాంతాల్లో కూడా తిరిగి చూద్దాం ఇంకా ఏమైనా మొక్కలు కనిపిస్తాయేమో” అని అంది భవాని.

“అలేగే నమ్మా” అని కొన్ని మొక్కలు పెకలించి ఇంటికి తీసుకు వెడతారు.

అలా కొన్ని రోజులు వేదవరం పొలిమేరలకి, పక్కన ఉన్న గ్రామాలకి వెళ్ళి పరిశీలించ సాగింది భవాని. మూడు వారాల పాటు ప్రతీ రోజూ అదే పని.

ఇంట్లో వేసిన మొక్కల ఎదుగుదల రోజూ పరిశీలిస్తోంది.

ఒక రోజు నాన్నతో కలిసి ఇంటికి వెడుతూ, “నాన్నా, మనం ఇంట్లో నాటిన మొక్కలో వ్యాధి నిరోధక శక్తి ఉంది అని నేను నిర్ధారణకి వచ్చాను. ఈ మొక్క విత్తనాలు కొన్ని సేకరించి నాటాను. అవి మళ్ళీ మొలకెత్తాయి. ఇలా మనం అధిక మొత్తంలో విత్తనాలు సేకరించి ప్రపంచం అంతా పంచితే ఈ వ్యాధి నయం చేయగలం, రాకుండా నిరోధించగలం” అంది నాన్నతో భవాని.

“చాలా సంతోషం తల్లీ. నువ్వు పార్వతీ దేవి అంశవని, లోక కళ్యాణం చేస్తావని స్వామి చెబితే శంకించాను. ఇప్పుడు స్వామి మాటలు యథార్థమని తెలిసి పులకించి పోతున్నాను” అని ఉద్వేగానికి గురవుతాడు రామయ్య.

ఇంటికి వెళ్ళి పరిశీలించిన విషయాలు రాసుకోనే పుస్తకంలో తను గమనించిన విషయాలు, వివరాలు రాసుకుంది.

“నాన్నా ఈ విషయం వీలయినంత తొందరగా ప్రపంచానికి తెలియ చెప్పాలి. అలాగే మన ప్రాంతంలో ఉన్న మొక్కలన్నీ సేకరించి ఒక వనంలా నాటాలి. విత్తనాలు సేకరించాలి. ఏదైన ఉపాయం ఆలోచించు నాన్నా” అంది భవాని.

“అమ్మా, మన పొలంలో ఈమధ్యనే కుప్పనూడ్చేం. మన ఊళ్ళో ఉన్న మొక్కలు తెచ్చి ఆ రెండెకరాల్లో ముందు ఎంత వీలయితే అంత వేద్దాం. విత్తనాల సేకరణ పని జరుగుతూ ఉంటుంది” అన్నాడు సోమయ్య.

“మంచి ఆలోచన నాన్నా!”

“ఇప్పుడు మనం స్వామి అశ్రమానికి వెళ్ళి ఆయనకి చెప్పి ఆయన సాయంతో ఈ విషయం ప్రపంచానికి ఎలా తెలియచేయాలో చూద్దాం” అన్నాడు.

అలా వాళ్ళిద్దరూ స్వామి దగ్గరకి వెళ్ళి విషయం విరించి, ఆశీర్వాదం కోరి, ప్రపంచానికి తెలియచేయడం ఎలా అని అడుగుగుతారు. అప్పుడు ఆయన కార్యదర్సితో జిల్లా కలెక్టర్ ద్వారా మీడియాని పిలిపించి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేస్తారు.

ఎంతోమంది దేశ విదేశాలకి సంబంధించిన మీడియా, ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ చూసే ఏర్పాటు చేసుకున్నారు.

కేవలం పదవ తరగతి వరకు మాత్రమే చదివిన అమ్మాయి చెప్పే విధానంలా లేదు. దశాబ్దాల అనుభవం ఉన్న శాస్త్రవేత్తలో నిండిన ఆత్మ విశ్వాసంతో మొక్కని చూపిస్తూ వివరిస్తోంది.

“తులసి మొక్క లాగే ఉండే, ఈ మొక్క మొలకెత్తడం మొదలుపెట్టీనప్పటి నుండి 14 రోజుల్లో క్రమంగా పెరిగి 27 అంగుళాల వరకు ఎదిగి పరిణతి చెందుతుంది. పదిహేనవ రోజు నుంచి క్రమంగా క్షీణిస్తుంది. ఈ మొక్క క్షీణించడం మొదలు పెట్టినప్పటి నుంచి 2 పిల్ల మొక్కలు పెరగడం మొదలవుతుంది. అదే దశలో విత్తనాలుండే సంచులు, ఏలకులులా రెమ్మల్లో తయారవుతాయి. ఈ మొక్క ఆకులు, రెమ్మల నుంచి వచ్చే వాయువులు రోగనివారణ, రోగనిరొధక శక్తి కలిగి ఉంటాయి. ఒక మొక్క లోంచి వచ్చే వాయువులు సుమారు 2000 ఘనపు అడుగుల గదికి రక్షణనిస్తాయి. ఈ మొక్క భూమిలో గాని, మట్టి తొట్టిలో గాని ఉన్నప్పుడే శక్తి కలిగి ఉంటుంది. చాలా వివరాలు తెలియ వలసి ఉంది. కాబట్టి ఇంకా ప్రయోగాలు చేయవలసి ఉంది” అని చెబుతుంది.

“ప్రపంచానికి కావలసిన మొక్కలు, విత్తనాల సరఫరా చేయాలంటే మీకు ఏమి కావాలి” అని అడుగుతారు.

“మా 2 ఎకరాల పొలంలో మొక్కలు నాటుతున్నం. ఎవరైనా ముందుకు వస్తే ఇంకా కొన్ని ఎకరలాలలో మొక్కలు నాటి విత్తానాలు సేకరించవచ్చు”. ఏ వివరాలకైనా స్వామి వారి కార్యదర్శి ద్వారా తనని సంప్రదించ వచ్చని కార్యదర్శిని పరిచయం చేస్తుంది.

ఆ మాట అనగానే అక్కడ ఉన్న ఇద్దరు రైతులు వాళ్ళ పొలంలో నాటడానికి ముందుకు వచ్చారు. ఎన్నో ప్రశ్నలు, ప్రశంశలు, శంకల మధ్య పత్రికా సమావేశం ముగుస్తుంది.

కొన్ని వారాలపాటు ఈ మొక్కలని సాగు చేసి విత్తానాలు సేకరించి ప్రభుత్వం ద్వారా వ్యాధి ప్రబలిన ప్రాంతాలికి పంపిస్తుంది. కొన్ని వారాలలో ప్రపంచ వ్యాప్తంగా ఈ అంటు వ్యాధి నయం అవడంతో స్వామివారి కార్యదర్శికి ఊపిరి సలపనంతగా ఎంతో మంది ప్రముఖుల నుంచి అభినందనలు, సన్మానిస్తాం అని విన్నపాలు వచ్చాయి. అవి విన్న భవాని “అవన్నీ నాకు ముఖ్యం కాదు. దయచేసి మరొక విలేఖరుల సమవేశం ఏర్పాటు చేయండి. అందులో నాకు ఏమి కావాలో చెబుతాను” అని కార్యదర్శికి చెబుతుంది భావాని.

ఆమె చెప్పినట్టు గానే ఒక విలేఖరుల సమవేశం ఏర్పాటు చేస్తారు. అందులో మీడియా తో పాటు ప్రపంచలో ఉండే ప్రముఖులు పాల్గొంటారు.

ప్రశ్నలు జవాబుల సమయంలో ఒకాయన లేచి “మీకు 25 కోట్ల రూపాయల బహుమతి ప్రకటిస్తున్నాను” అని అంటాడు. సున్నితంగా తిరస్కరిస్తుంది భవాని.

“మీరు వినయంగా ఏ పురస్కారానీ తీసుకోవడం లేదు. మీకు ఏమి కావాలో చెబితే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఈ విలేఖరుల సమవేశం చూస్తున్న వాళ్ళు గానీ స్పందించవచ్చు” అంటాడు ఒక సంపాదకుడు.

“ధన్య వాదాలు. నాకు వ్యక్తిగతంగా ఏమీ అవసరం లేదు. కానీ, నా మనసుకి కష్టంగా ఉండే ఒక విషయం ఉంది” అని మొదలు పెట్టగానే అందరూ అప్రమత్తంగా వింటున్నారు.

“స్వంత సుఖాలని, తన వాళ్ళ సుఖాలని త్యాగం చేసి ఎంతో కష్త పడి పరిశోధనలు చేసి రోగాలకి మందులు కనిపెడతారు శాస్త్రవేత్తలు. తమకి అంటువ్యాధులు సంక్రమిస్తాయనే భయం కూడా లేకుండా రోగులకి వైద్యం చేస్తారు. కొంతం మంది ఆ క్రమంలో మరణిస్తారు కూడా.

మనం తినే కూరగాయలు, పళ్ళు, పాలు, ఒకటేమిటి మనం తినే, తాగే ప్రతి దాంట్లోనూ రోగ నివారణ మరియు నిరోధక శక్తి ఉంది. అలాటి పంటలు పండించే రైతు కూడా స్వంత సుఖాలని, తన వాళ్ళ సుఖాలని త్యాగం చేసి మనకి ఆహారాన్ని అందిస్తాడు. ఒక రకంగా రైతు కూడ శాస్త్రవేత్తే.

దురదృష్టవశాత్తూ ఇద్దరికీ తగిన పారితోషికం గాని, గుర్తింపు కానీ దొరకవు. నేను స్వంతంగా ఏమీ కనిపెట్టలేదు. ప్రకృతిలో ఉన్న దానినే గుర్తించి అందరికీ తెలియచేసాను. ఒక రైతు బిడ్డగా, ఒక రైతు సాయంతో నేను యాదృచ్ఛికంగా కనిపెట్టిన విషయానికి నాకు ఎవరైన పురస్కారం ఇవ్వాలనుకుంటే, నాకున్న కోరిక ఒక్కటే. రైతులని, శాస్త్రవేత్తలని గుర్తిస్తూ ఒక స్ఫూర్తి మందిరం కట్టించండి. దానికి అనుబంధంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అందులో మానవాళి మనుగడని మార్చిన మహనీయ శాస్త్రవేత్తల విగ్రహాలు ఉంచి వాళ్ళు చేసిన పరిశోధనల గురించి ముందు తరాలకి తెలియచేసేలా ఏర్పాటు చేయండి” అను ఉద్వేగంతో కూడిన ప్రసంగాన్ని ముగిస్త్తుంది భవాని.

25 కోట్ల బహుమతి ఇస్తానన్న ఆయన మళ్లీ లేచి, “ఈ కార్యక్రమానికి నేను సహకరిస్తాను, ఎవరైనా భూమి ఇస్తే” అంటాడు.

“పంటలు పుష్కలంగా పండుతున్న ఏ భూమినీ ఈ మందిర నిర్మాణానికి వాడకూడదని నా అభిమతం” అని తన అభీష్టం తెలియ చేస్తుంది భవాని.

అక్కడ ఉన్న జిల్లాలో పలుకుబడి ఉన్న ఆయన లేచి, “ఈ ఆశ్రమానికి దగ్గరలోనే నాకున్న భూమి ఈ మందిరానికి ఇస్తా. ప్రభుత్వంతో సంప్రదించి అవసరమైన భూమి సేకరించే బాధ్యత నేను తీసుకూంటా. శివానంద శ్వామి వారి ఆశ్రమం ట్రస్ట్ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం చేపడదాం” అన్నాడు.

సమావేశం ముగిసింది.

రామయ్యకి ఇదంతా ఒక కలలా ఉంది.

స్వామి దగ్గరకి వెళ్ళి “స్వామీ, ఇదంతా నిజమేనా” అని అడుగుతాడు రామయ్య.

“ఇంకా ఏమి రుజువు కావాలి రామయ్యా?” అంటారు స్వామి.

“స్వామీ, మీరు అమ్మాయి చిన్నప్పుడు రాసిన జన్మ పత్రిక తెచ్చాను. ఇది చూసి అమ్మాయి జాతకం దయచేసి వివరించండి” అని అడుగుతాడు.

“అమ్మాయి పుట్టినప్పుడే చెప్పాను, ఈమె దేవాంశతో పుట్టిందని. ఒకప్పుడు జరిగిన దేవ దానవ యుధ్ధంలో, ఒక రాక్షసి ఒక దేవత చేతిలో చచ్చిపోతుంది. అతి భయంకరంగా జరిగిన ఆ యుధ్ధంలో రాక్షసి శరీరం తునాతునకలై వాయుమండలం లోకి చెల్లాచెదురై పోతుంది. ఆ రాక్షసికి జీవితం మీద ఆశ తీరలేదు, తనని చంపిన దేవత మీద కోపమూ తగ్గలేదు. కోరికతో చచ్చి పోయింది కాబట్టి ఆ రాక్షసి శరీర శకలాలు ప్రాణాలతో వాయు మండలంలో తిరుగాడుతూ, ఈ దేవత భూమి మీద ఎప్పుడు పుడుతుందా, ఎప్పుడు ఆమె మీద దాడి చేసి చంపుదామా అని ఎదురు చూసేవి. ఆ దేవత నీ కూతురుగా పుట్టినప్పటి నుంచి భూమి మీదకి వచ్చి ఆమెని హింసించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

అవి గాలిలో తిరిగేవి కాబట్టి ఆవిడని ముట్టడించే యత్నంలో భూలోకంలోని చాలా ప్రాంతాలకి వ్యాపించడంతో అక్కడి ప్రజలు వింత వ్యాధికి పాల్పడతారు. అప్రయత్నంలో భాగంగా వేదవరంలో ఉన్న భవాని మీద దాడికి ప్రయత్నించాయి. ఇది గమనించిన దేవతలు కొత్త మొక్కలుగా వేదవరం చుట్టూ రక్షణగా నిలిచారు” అని స్వామి చెప్పడంతో రామయ్య ఆశ్చర్యంతో పులకించి పోయాడు.

“ఆ తర్వాత ఈ స్ఫూర్తి మందిర నిర్మాణం వేగంగా జరిగిపోయింది. ఇదిగో మనం నుంచున్న చోటుకు ఉత్తరంగా రైతు స్ఫూర్తి వనాన్ని ఏర్పాటు చేసి అభివృధ్ది చేసారు. రైతుకి ప్రాణం పొలమే కాబట్టి రైతు స్ఫూర్తి మందిరం ఇలా వనంలో నిర్మించబడింది.

లోతైన, విశాలమైన సాగరం లాంటి భవాని మస్తిష్కం పుట్టిన ఆలోచనామృతం ఈ స్ఫూర్తి మందిరం కాబట్టి ఈ ఊరికి వారాశి పురం అని పేరు పెట్టారు.

ఇదీ, ఈ స్ఫూర్తి మందిరం వెనక ఉన్న ప్రాముఖ్యత” అని టూర్ గైడ్ వెంకన్నకి, వీరమ్మకి వివరిస్తాడు.

“మావా, మనకి కూడా భవాని లాంటి అమ్మాయి పుడితే బాగుంటుంది కదా” అని అశ వెళ్ళబుచ్చుతుంది వీరమ్మ.

“నీకు కోరిక పుట్టడం నీ కోరిక తీరడానికి మొదటి అడుగు. మనకి పుట్టేది పాపో, బాబో తెలియదు కాబట్టి ఇప్పటి నుండి భవానిని పూజిద్దాం. ఫలితం దేవుడికొదిలేద్దాం” అని టూర్ గైడ్‌కి నమస్కరించి ముందుకి కదిలాడు వెంకన్న. వెంకన్న అంతరంగాన్ని అనుసరిస్తూ అడుగులు వేసింది వీరమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here