[dropcap]దే[/dropcap]శంలో నేటి సామాజిక స్థితిగతులపై తన ఆలోచనలను ‘వారెవ్వా’ అంటూ కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు ఐతా చంద్రయ్య.
బాంకుల వ్యవహారములలో
బహు మెలికల గిలకలాయె.
వినియోగదారుల వెతలన్ని
చూసి, చూడనట్టాయెనా?
ప్రతి నెలకు రెండు శనివారాల్
నయముగ మూసి ఉంటాయని
పాసుబుక్కుల ఎంట్రీలు
ప్రతిసారి చేయమందురు.
తప్పించుకునే ప్రయత్నాలు
తలకు మించిన భారమాయె.
***
ఏ.టి.యం. ఛార్జిలైతే
ఏటేటా బాదుడాయె.
యస్సెమ్మెస్సులు రావు గాని
ఛార్జీలు తప్పక వసూలు.
మెయింటనెన్స్ ఛార్జీలంటూ
మరో మోత మోగిస్తారు.
కడు పెనాల్టీ చార్జిలాయె
కొంత కొంత నడవకుంటే
ఆసరా పెన్షన్లు గూడా
అక్కడనె చెల్లింపులాయె.
***
వేల రూపాయ లప్పు కొరకు
వేల సార్లు తిరుగవలెనోయ్.
వేల కోట్ల అప్పులంటె
వేదనలు ఏముండవోయ్.
వంగబెట్టి వసూలు జేతురు
చిన్న చిన్న మొండి అప్పులు.
వేల కోట్ల విలువ అప్పులను
వాయిదాలని వదిలివేతురు.
బాంకు లీలలు బహువిధమ్ములు
భావి భారత పౌరులారా!