వరి ధాన్యం కుప్పలను దాటుతూ..!

0
1

[dropcap]కో[/dropcap]టిలింగాలను రాజధానిగా చేసుకొని
పాలించిన శాతవాహనుల రాజ్యం నుండి
కాకతీయ సామ్రాజ్యమైన ఓరుగల్లు వరకు
అలుపులేని, మరువలేని ప్రయాణం
గర్భిణిలా నీళ్ళతో నిండిన గోదావరిని
రాయపట్నం వంతెనపై నుండి వీక్షించడమొక
అపూర్వ, అద్భుతమైన దృశ్యావరణమది
అనిర్వచనీయమైన అనుభూతిని ఆస్వాదిస్తూ
కనువిందుగా ముందుకు సాగడమొఖ సాహసమే..!

ప్రాంతాలను అనుసంధానం చేసే మార్గమే కావచ్చు
వేల సంవత్సరాలుగా వారధిగా నిలిచే ఉన్నది
ప్రజల మధ్యన బంధుత్వాన్ని కాపాడుతూనే ఉంది
కొందరు కాలినడకన, మరి కొందరు కార్లు, బైకులపై
ఇంకొందరు ఇతర వాహనాల్లో వెళ్ళుతుంటారు
బడుగు జీవుల బతుకు జీవన పోరాటానికి
రహదారెప్పుడు చేదోడు వాదోడుగానే నిలిచింది.!

వెల్గటూరు, ధర్మారం, మల్లాపూర్ ,చొప్పదండి
కరీంనగర్, హుజురాబాద్, ఎల్కతుర్తి ఊరేదైనా
ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి
ఏదో ఒక అవసరం నిమిత్తం వెళ్లక తప్పదు కదా
ఆదిమానవుడు ఆహారం వేటకై కదిలిన నాడే
ఈ నేల మీద మొదటి ప్రయాణం మొదలైంది
చలనమే మానవ నాగరికతకు మూలం
అనేక ఆవిష్కరణలకు దారి దీపమైనది
బతకడానికి ఊతమైన ఆలోచనలు
మనిషిని మహా జ్ఞానిని చేశాయి..!

సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో
బంగారు వర్ణంలో శోభిల్లుతున్న
వరి ధాన్యం కుప్పలు
అందరి ఆకలిని తీర్చే అన్నం రాశులు
వ్యవసాయ మంటేనే ఆహారాన్ని పండించే కళ
వైపరీత్యాలను తట్టుకొని అందే ఫలసాయం
మోకాలు లోతు బురదలో పల్లె ఆడపడుచులు
వాకిలి ముందు ముగ్గుల చుక్కలు వేసినట్లుగా
మడుల్లో వరి నారును నాటిన చిత్రాలను
ఎన్ని మార్లు చూసిన తనివి తీరేవి కావు కదా..!

నేలతల్లి పై ఆకుపచ్చని కంబలిని పరిచినట్లుగా
ఎదిగిన మొక్కలను అల్లారుముద్దుగా చూసుకొని
మురిసిన రైతు కుటుంబాలు అనేకం
పంట పండించడమంటే సులువైన పనేమి కాదు
తుఫాన్లను తట్టుకోవాలి,ఎండలను తట్టుకోవాలి
నాశనం చేసే పురుగులను అంతం చేసే మందులను
ఎప్పటికప్పుడు సరైన మోతాదులో వాడుతుండాలి
చంటి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకొన్న
ఆ కృషీవరుల సేద్యం అన్నింటికంటే గొప్పదే
రైతు ఇంటిలో సిరులు కురిసినప్పుడే కదా
సంతోషాల ఏరువాక కు హారతిని పట్టేది…!

వరి ధాన్యం ఆరబోతకు కల్లాలు కాన రాక
రహదారికి ఇరువైపులా ఆర పెడుతున్నారు
మద్దతు ధర కోసం నిరీక్షిస్తూ, ఉద్యమిస్తూ
నిలువ చేసుకోవడానికి చోటు లేక
నష్టమైనా సరేనని అమ్ముకుంటున్న తీరుకు
కలత చెందుతూ కన్నీళ్లను దిగమింగుకుంటాం
ఇంకెన్ని దశాబ్దాలు గడవాలని నిరీక్షణ
రైతే రాజని నినదించిన ఈ దేశంలో
రైతు మోములో చిరునవ్వులు చూడడానికి..!

ఊరు పేరు తో సంబంధం లేదు
రైతు కుటుంబాల ఇక్కట్లన్ని ఒకటే
ఓటు బ్యాంకని చూడకుండా
మానవీయమైన ప్రణాళికలను రచించాలి
గ్రామీణ భారతంలో అభివృద్ధి చిగుళ్లను
చూడాలని తపన పడుతున్న పౌరులారా
రైతుల దగ్గరికి నడవండి, చెప్పిన ధరలకు కొనండి
కార్పోరేట్ వ్యాపార యజమానుల వ్యూహాల నుండి
సన్నకారు రైతు కుటుంబాలను రక్షించుకోవాలంటే
ఇకపై పల్లెలకు తరలక తప్పదు
కాడిని మోయక తప్పదు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here