కాజాల్లాంటి బాజాలు-111: వెరైటీ అంటే..

2
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]వాళ పొద్దున్న లేవగానే నాకో ఆలోచన వచ్చింది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ రోజూ చేసినట్లే కాకుండా వెరైటీగా చేస్తే ఎలా ఉంటుందా అని. నిజమే.. రోజూ ఒక్కలాగే తింటే బోర్ కదా.. రొటీన్‌గా కాకుండా దేనికైనా మార్పన్నది చేసుకుంటే మనసుకీ, శరీరానికీ కూడా ఉత్సాహంగా ఉంటుంది. అనుకున్నానే కానీ వెరైటీ అంటే ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అర్థం కాలేదు.

పేరేదైనా టైముకి కడుపులో ఏదోకటి పడాలి కద.. దానికి రొటీనూ, పోస్ట్‌పోన్‌మెంటూ అంటూ ఉండవు కదా! బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, దోశ, పెసరట్టులాంటివి బదులు పొంగల్ లాంటివి చేస్తే మరి తర్వాత లంచ్‌కి కూడా బియ్యంతోనే ఏదో చెయ్యాలే! సరే పోనీ లంచ్‌కి పరోటాలూ, మసాలా కర్రీ చేసేస్తే సరీ అనుకుంటే మరి రాత్రి డిన్నర్‌కి ఇబ్బంది అయిపోదూ! రోజూ రాత్రి తినేదే చపాతీలాయె.. ఎంత ఆలోచించినా ఎటుపోయి ఎటొచ్చినా నా పిట్ట మెదడుకి అవే చపాతీలూ, ఇడ్లీలూ, పొంగళ్ళూ వస్తున్నాయి తప్పితే ఇంకో వెరైటీ రావటం లేదు. ఛ.. ఛా.. ఎంత వెనకపడిపోయేనూ! అందరూ పిట్జాలూ, బర్గర్లూ ఎలా చెయ్యాలో నేర్చేసుకుని, చేసేసుకుని తినేస్తుంటే నేనింకా ఆ పాతకాలం వంటలే పట్టుకు వేళ్ళాడుతున్నాను. లాభం లేదు. అవన్నీ నేర్చేసుకోవల్సిందే అని నిర్ణయించేసుకుందా మనుకునే లోపలే మరో ఆలోచన వచ్చేసింది. నేను నేర్చుకుంటాను సరే..ఇంట్లోవాళ్ళు తినొద్దూ! పెద్ద సందేహమే.

అడుగుదామంటే ఏదీ తిన్నగా చెప్పరు కదా! “ముందు చేసి చూపించు బాగుంటే తింటాం” అంటారు. తీరా చేసేక బాగులేకపోతే మళ్ళీ వాళ్ళు తినేది ఇంకోటి చెయ్యకా తప్పదూ.. ఈ చేసినదాన్ని ఏం చెయ్యాలో తెలీక బుర్ర బద్దలు కొట్టుకోకా తప్పదు..

‘శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలూ తెచ్చేవురా నాయనా’ అని పైకి పాడే ధైర్యం లేక మనసులోనే పాడేసుకున్నాను.

సరే.. ఈ గోలంతా ఎందుకూ.. మామూలుగా రోజూ చేసేది చేసేసుకుంటే సరీ అనిపించినా నాలోని అంతరాత్మ నన్నూరుకోనివ్వలేదు. ‘ఆరంభింపరు నీచ మానవులు’ అంటూ పద్యం పాడడం మొదలెట్టింది. హూ.. ఈ అంతరాత్మకి కూడా ఎంత చులకనైపోయేనూ అనుకుంటూ కిం కర్తవ్యం బేమిటా అని ఆలోచిస్తుంటే ఆపద్బాంధవి మా వదిన నా కళ్ళముందు ప్రత్యక్ష్యమైంది. హుర్రే అనుకున్నాను.

నా సందేహాలన్నీ తీర్చే వదినుండగా మరి నాకేల చింత అనుకుంటూ వదినకి ఫోన్ చేసి బ్రేక్‌ఫాస్ట్ ఏం చెయ్యాలో, లంచ్ ఏం చెయ్యాలో అలా అన్నీ వరసగా చెప్పెయ్యమని అడిగేను..

“అదేంటీ! ఎందుకివాళ ఇలా అడుగుతున్నావ్!” అంది వదిన.

నేను నా వెరైటీ ఊహని వదిన ముందు గర్వంగా ప్రవేశపెట్టేను. అంతే.. వదినకి ఏ శక్తి పూనిందో ఆగకుండా అరగంట ఫోనులోనే నాకు తలంటేసింది. దాని సారాంశం ఏమిటంటే..

“ఇంకింతే.. నీలాంటి ఆడవాళ్ళున్నంత వరకూ ఇలాగే ఆలోచిస్తారు. వెరైటీ కావాలనుకున్నావు.. ఓకే.. ఆ వెరైటీ ఏదో వెధవ వంటల గురించే ఆలోచించాలా! ఎంతసేపూ వండుకోవడం తినడం దాకానే ఉంటాయా మీ ఆలోచనలూ!

ఇంక జీవితంలో వేరే ఏమీ లేవా! మాయదారి వంటింటిని అంత వదల్లేకపోతున్నారా! ఏం.. వెరైటీ కావాలనుకున్నప్పుడు వెరైటీగా ఆ రోజుకి వంటకి శెలవు ఇచ్చెయ్యొచ్చుకదా! ఇంట్లో మిగిలినవాళ్లని చెయ్యమనో, లేకపోతే బైటనించి తెప్పించుకుందామనో అనుకోవచ్చు కదా! వెరైటీగా అలాంటి ఆలోచన ఎందుకురాదూ!

పోనీ ఓ పూట ఉపవాసముంటే ఇంటిల్లిపాదీ ఏమైనా శోషొచ్చి పడిపోతారా! వెరైటీగా వారాని కో పూట ఉపవాస ముందామని ఇంట్లోవాళ్లని ఒప్పించొచ్చు కదా! అబ్బే.. అదీ లేదు.

అసలు వెరైటీ అంటే ఎలా ఉండాలి! ఆ ఆలోచనల్లోనే వెరైటీ ఉండాలి. రొటీన్‌గా చేసేది కాకుండా ఆ రోజు లేటుగా లేవాలి. ఏదైమైనా సరే ఇంట్లో వున్న మిగిలినవాళ్లని కాదని రోజంతా టీవీ రిమోట్ నీ చేతిలోనే ఉంచుకోవాలి. నీ కిష్టమైనవన్నీ చెమట్లు కక్కుతూ నువ్వు వండుకోకుండా బైట నించి తెప్పించుకోవాలి. నీక్కావల్సిన వాళ్ళకి ఫోన్ చేసుకుని గంటల తరబడి పిచ్చాపాటీ మాట్లాడుకోవాలి. టెర్రెస్ మీదకెక్కి గట్టిగా అరిచెయ్యాలి. ఎవరైనా చూస్తే ఏవనుకుంటారోనన్న ధ్యాసే లేకుండా నీకు నచ్చిన పాటలన్నీ పాడేసుకోవాలి. డేన్సులన్నీ చేసేసుకోవాలి. కాలేజీలో స్టేజెక్కి చేసిన దుర్యోధనుడి ఏకపాత్రాభినయం అభినయించాలి. ముఖ్యంగా మయసభ సీనులో ఐక్యమైపోవాలి.

నిన్ను ముద్దరాలివనుకున్న ఇంట్లోవాళ్ళు తెల్లబోవాలి. నీలో ఇన్ని కళలున్నాయని తెలీనివాళ్ల కళ్ళు తెరిపించాలి. ఎంతసేపూ అమ్మకి వండడం, పెట్టడం తప్పితే ఏమీ తెలీదన్న వాళ్ల భావనలని చెల్లాచెదురు చెయ్యాలి. అమ్మంటే అన్నపూర్ణే కాదూ.. సకల కళా సరస్వతీ, అవసరమైతే ఆదిశక్తి కూడా అవగలదు అని వాళ్ల కళ్ళు విప్పాలి. ఇలా చెయ్యకపోవడం వల్లే ఇప్పటికీ ఇంకా నీలాంటివాళ్ళు అలా రొటీన్‌లో పడి కొట్టుకుంటున్నారు. కారణమేదైతేనేం.. ఇన్నాళ్లకి నీకు వెరైటీగా ఉండాలన్న ధ్యాస కలిగింది. దానిని మళ్ళీ నిద్రపోనీకు. వంటలతోటీ, ఇంటి పనులతోటీ వెరైటీలు ఆలోచించకు. పిల్లలు పెద్దవాళ్లయారు. వాళ్లకి నీ అవసరం ఇదివరకటంత ఉండదు. వాళ్లకి కావల్సినవి వాళ్లని చూసుకోనీ.. ఇంకా ఇలాగే కొన్నాళ్ళు వాళ్ల పెర్సనల్ విషయాల్లో కనక నువ్వు కల్పించుకుంటే వాళ్ళే నిన్ను తీసి పక్కన పెట్టేస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోకు. పిల్లల్ని చక్కగా సెటిల్ చేసేవు. ఇంక వాళ్ల బతుకు వాళ్లని బతకనీ. మీ ఆయన్ని ఆయన పాటికి వదిలెయ్యి. కొన్ని పనులైనా నేర్చుకుంటారు.

మరింక నువ్వు. ఎలాగూ వెరైటీ ఆలోచన వచ్చింది కనక నీ ఆలోచనలని స్వేచ్ఛగా వదిలెయ్యి. నీకు ఏది సంతోషంగా అనిపిస్తుందో అది చెయ్యి. అలా గన్నానని నాకు పిల్లలకి వండి పెట్టడమే సంతోషం అన్నావనుకో.. నేనూరుకోను. అలా అనుకునేదానివయితే నీకు ఈ వెరైటీ ఆలోచన రాదు. నీకు కొత్తదేదో కావాలి. కొత్తగా ఏదో చెయ్యాలి. కొత్తగా రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోవాలి.. అలా అనుకున్నావు కనకే నీకీ ఆలోచన వచ్చింది. దానిని అలాగే ఉండనీ. నీకున్న పరిధిలో కొత్తగా నీకు నచ్చేవి ఏమున్నాయో, ఏమి చెయ్యగలవో వెరైటీగా ఆలోచించుకో. ఒక కొత్త విద్య నేర్చుకుంటున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో నీకు తెలుసు. అలాంటి సంతోషాలని మూటగట్టుకో.”

ఇలా అంటూ వదిన ఇచ్చిన ఉపన్యాసం విన్న నాకు ఓ అనుమానం వచ్చింది. నాకిన్నిరకాలుగా చెపుతున్న వదిన మరి తనింటి విషయంలో ఎందుకిలాంటి ఆలోచన చెయ్యటంలేదూ! ఇంకా ఇల్లూ, పిల్లలూ అంటూ పట్టుకుని వేళ్ళాడుతోందెందుకూ! హూ.. నిజవే.. వదిన భలే దొరికిపోయింది. తను చెయ్యలేదు కానీ ఎదుటివాళ్లకి మటుకు ఉచిత సలహాలు ఇచ్చేందుకు ఎవర్రెడీ అన్న మాట.

వదిన గురించి ఇలా ఆలోచించగానే వెంటనే వదినకి ఫోన్ చేసి “నువ్వేం చేసావమ్మా వదినా!” అని వెక్కిరించా లనిపించింది. ఒకసారి అనుకున్నాక ఆగుతానా! వెంటనే వదిన మొబైల్‌కి ఫోన్ చేసేను. ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. నా ప్రశ్నకి వదిన దగ్గర్నించి వెంటనే సమాధానం రాకపోతే తోచేలా లేదనుకుంటూ అన్నయ్య మొబైల్‌కి చేసేను. అన్నయ్య వెంటనే పలికేడు.

“చెల్లాయ్, ఇప్పుడే నీకు చేద్దామనుకుంటున్నాను.. ఇంతలో నువ్వే చేసేవ్..” అన్నాడు సంబరంగా.

“ఎందుకన్నయ్యా..” అనడిగేను.

“అహా.. ఏం లేదూ.. పప్పులో ఉప్పు ఉడికేముందు వెయ్యాలా.. లేకపోతే ఉడికేక వెయ్యాలా.. అనడుగుదావనీ..” అన్నాడు. తెల్లబోయేను నేను.

అసలు వంటింటి ముఖమే చూడని అన్నయ్య దగ్గర్నించి ఇలాంటి ప్రశ్న ఊహించని నేను “వదిన ఒంట్లో బాగా లేదా అన్నయ్యా..” అనడిగేను.

“మీ వదినకేం.. నిక్షేపంలా ఉంది. వాళ్ల స్కూల్ ఫ్రెండ్స్‌ది ఓల్డ్ స్టూడెంట్స్ మీట్‌ట.. అక్కడికి పొద్దున్నే వెళ్ళింది.”

“వంట చెయ్యకుండా ఎలా వెళ్ళిందీ!”

“ఏమో మరి.. పొద్దున్నే నీతో ఫోన్‌లో మాట్లాడేక ‘నేను బైట కెడుతున్నానూ, మీ తిండి సంగతి మీరు చూసుకోండీ’ అని వెళ్ళిపోయింది. ఇంతకీ.. అసలు సంగతి చెప్పు.. పప్పులో ఉప్పు ఎప్పుడు వెయ్యాలీ!”

అన్నయ్యకి కావల్సిన సమాధానం చెప్పి ఫోన్ పెట్టేసేను.

అప్పుడు నాకు అర్థమయింది.. నేను వెరైటీ అనుకుంటున్నది వదిన ఆచరించి చూపించిందని. హమ్మ వదినా అనుకోకుండా ఉండలేకపోయేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here