[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘వర్ణలిపి’ అనే పుస్తకంపై సమీక్ష అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]క[/dropcap]ళ అంటే ఏమిటి అనే దానికి ఎన్నో అభిప్రాయాలున్నాయి. కళ అనే పదానికి భిన్నమైన నిర్వచనాలున్నాయి. కళ అంటే భావ ప్రకటన అనేది స్పష్టం. భారతీయులకి 64 కళలున్నాయి. అందరూ అన్ని కళలలో ప్రావీణ్యం సాధించలేకపోయినా, ఆసక్తి కలిగి, తగిన సాధన చేస్తే కొన్ని కళలలో రాణించవచ్చు.
మానసిక ఒత్తిడిని తొలగించి, ఏకాగ్రత పెంచడంలో కళల సాధన తోడ్పడుతుంది. ఒకప్పుడు స్కూళ్ళల్లో ‘ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్’ పీరియడ్ ఉండేది. పిల్లలకు కొన్ని రకాల హాస్తకళలలో శిక్షణ ఇచ్చి – పాఠ్యేతర కార్యక్రమాలలో సైతం పిల్లలు చురుగ్గా పాల్గొనేలా చేసేవారు. చదువులో వెనుకబడ్డ పిల్లలు, క్రాఫ్ట్స్‌లో రాణించి, ఉపాధ్యాయుల మెప్పు పొందిన ఉదంతాలూ ఉన్నాయి. అంటే తాము మిగతా వారికంటే తక్కువ కాదు అనే భావం పిల్లల్లో కలిగేది. ఫలితంగా వారిలో న్యూనతా భావం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండేవారు.
కాలక్రమంలో విద్యావిధానంలో మార్పులొచ్చి, మార్కులకి ప్రాధాన్యత పెరిగి, కెరీర్ పై మాత్రం దృష్టి నిలపాల్సి వచ్చిన పరిస్థితుల వల్ల బహుశా నేటి పిల్లలు ‘ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్’కి కాస్త దూరమయ్యారనే భావించాలి. అంతేకాకుండా బడిలో నేర్పే ‘ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్’ భవిష్యత్తులో పిల్లలకు ఉపకరిస్తాయా? ఆర్థికంగా ప్రయోజనం కలిగిస్తాయా అని ప్రశ్నించే కొందరు తల్లిదండ్రుల వల్ల కూడా వీటి ప్రాధాన్యత తగ్గుతోంది.
కానీ ‘ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్’ అనేవి నేడు పిల్లలకే కాదు పెద్దలకీ కూడా అత్యంత అవసరమని అంటున్నారు డా. కందేపి రాణీప్రసాద్. చదువులు, ఆఫీసు ర్యాంకులు, టార్గెట్లు పెట్టే మానసిక ఒత్తిడిని తగ్గించటానికి కళల సహచర్యం అవసరమని రచయిత్రి అభిప్రాయపడ్డారు. యంత్ర సమానులుగా పనిచేస్తూ మానవుడు హృదయాన్ని కోల్పోయి మరబొమ్మగా మారుతున్నాడనీ ఆవేదన వ్యక్తం చేశారు. అతి వేగంగా సాగిపొతున్న ఈ కాలంలో కళలని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తమ బాల్యంలో తమ ఊర్లో ప్రతి ఇంట్లోనూ కుట్టు అల్లికలు విరివిగా సాగేవనీ, కళల రాజ్యం విలసిల్లుతూ ఉండేదనీ చెప్పారు రాణీప్రసాద్. అటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకు కళల పట్ల ఇష్టం సహజంగానే ఏర్పడుతుందనీ, తనకి కూడా ఆ అభిరుచి అలానే కలిగిందని తెలిపారు. చిన్నప్పుడు తాను నేర్చుకున్న కళలు, గీసిన బొమ్మలు, చేసిన కళాకృతులు గురించి వివరించారు. వివాహానంతరం తన సృజనాత్మకతలో మార్పు వచ్చి కొత్త కళాకృతుల వైపు మళ్ళిన వైనం వివరించారు. రాణీప్రసాద్ గారు దేశంలో వివిధ రాష్ట్రాలలోని హస్తకళా మ్యూజియంలు, రవీంద్రుని శాంతినికేతన్, మైసూర్ రవివర్మ ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్స్ వంటివి సందర్శించి అక్కడి సాంప్రదాయ, జానపద, గిరిజన కళలను అధ్యయనం చేశారు. వివిధ కళాకృతులు సృష్టించడం నేర్చుకున్నారు. వాటిని నేటి తరం పిల్లలకు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగమే ‘వర్ణలిపి’ అనే కళా వ్యాసాల సంపుటి.
ఈ పుస్తకంలో – క్విల్లింగ్ కళాచిత్రాలు, రాజస్థానీ అద్దాల చిత్రకళ, మహాద్భుత మండల ఆర్ట్, అపురూపమైన ఆప్లిక్ వర్క్, సీషెల్స్ సింగారాలు, కేరళ మ్యూరల్ చిత్రాలు, కాగితపు గుజ్జు కళారాజాలు, బీహార్ మధుబని చిత్రకళ, వర్లి గిరిజన చిత్రకళ, బంగారు తంజావూరు చిత్రకళ, రంగుకాగితాల కత్తిరింపులు, కొబ్బరాకుల కళాకృతులు, పూసల అల్లకాల డిజైన్లు, ఒరిగామి కాగితపు మడతలు, గుజరాత్ లిప్పన్ ఆర్ట్, హాని చెయ్యని కొయ్యబొమ్మల తయారీ, జపాన్ బోన్సెకి కళ, బంకమట్టి బొమ్మలు, కాపర్‌వైర్‌తో కళాకృతులు, పట చిత్రకళ, కర్నాటక బీద్రీ కళ, భగల్పూరు మంజూష కళ అనే 22 వ్యాసాలున్నాయి.
ఒక కళని పరిచయం చేయడంతో బాటు, దాని చరిత్ర తెలిపి, దానిలో ఏయే కళాకృతులు చేయవచ్చు, ఎలా చేస్తే బాగుంటాయో సులువుగా అర్థమయ్యేలా వ్యాసాలు రాశారు. ఐతే విశేషం ఏమిటంటే, ఒక్కో వ్యాసానికి సంబంధించి తక్కువ నిడివిలో, వీలైనంత సమగ్రంగా ఈ వివరాలు అందించారు.
చదివినప్పుడు ఉత్సాహం కలిగి ఆ కళ పట్ల ఆసక్తి కలిగి, అందులో కృషి చేసేలా రచించారు రాణీప్రసాద్. ఔత్సాహికులు మొదట వీటితో ప్రారంభిస్తే, తర్వాత ప్రావీణ్యం సాధించి మరికొన్ని కళలలోకి ప్రవేశించవచ్చు. వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా తొలి అడుగుతోనే మొదలవుతుందన్నట్లు – ఈ ‘ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్’తో ప్రారంభించి, సాధన చేసి, విస్తారమైన కళారంగంలోకి ప్రవేశించవచ్చు. ఇటువంటి ఉపయుక్తమైన పుస్తకం అందించినందుకు డా. కందేపి రాణీప్రసాద్ అభినందనీయులు.
***
రచన: డా. కందేపీ రాణీప్రసాద్
ప్రచురణ: తపస్వీ మనోహరం పబ్లికేషన్స్
పేజీలు: 98
వెల: ₹ 125/-
ప్రతులకు: డా. కందేపీ రాణీప్రసాద్,
మేనేజింగ్ డైరెక్టర్, సృజన చిల్డ్రన్స్ హాస్పటల్,
సిరిసిల్ల – 505301.
తెలంగాణ.
ఫోన్: 9866160378
~
డా. కందేపి రాణీప్రసాద్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-dr-kandepi-raniprasad/