Site icon Sanchika

వర్ణమాల

వర్ణమాల లో అక్షరాలు
ఒంటరిగా వుండవు
దేనికవిగా నిలబడవు
మౌనంగా అసలే వుండవు

ఒక అక్షరం భుజం మీద
మరోటి చెయ్యేసి పద పద మంటాయి
భుజం భుజం కలిపి బంధాలు కలుపుకుని
సారికొత్త మాటల్ని పుట్టిస్తాయి

అక్షరాలు
కరచాలనం చేస్తూ కబుర్లు కలబోసుకుంటాయి
ముద్దాడతాయి కౌగిలించుకుంటాయి
గుసగుసలు పెడతాయి
గుణ గుణ మంటూ పరుగులు పెడతాయి

అక్షరాలు
ఎప్పటికప్పుడు ఒంటరితనాన్ని వదిలి
సాయంత్రాలు గూళ్ళకు చేరే పక్షుల్లా
సమూహాలవుతాయి
సరికొత్త రూప చిత్రాలవుతాయి
మాటలై పాటలై
అలలు అలలుగా తరంగాలై
భావ ప్రవాహంలో ఓలలాడతాయి

అక్షరాలు
ఆర్తిగా వెన్నెలని వర్షిస్తాయి
అలతి అలతి మాటల్లో
చెట్టునీ నదినీ మబ్బుల్నీ పర్వతాల్నీ
దర్శింపజేస్తాయి
సంతోషాన్నీ దుఃఖాన్నీ
కోపాన్నీ తాపాన్నీ ధ్వనింప జేస్తాయి

అక్షరాల నడుమ వున్న
ఈ రసాయన బంధాన్ని
అంతర్ముఖుడయిన
ఒక్క కవే స్పృశిస్తాడు
ధ్వనిస్తాడు

Exit mobile version