Site icon Sanchika

వర్షం

[box type=’note’ fontsize=’16’] వర్షం కొందరికి ఆహ్లాదాన్నిస్తే, మరికొందరికి ఆక్రోశాన్ని మిగులుస్తుందనీ చెబుతూ వర్షం అందరికీ ఒకటే కాదని అంటున్నారు డా. చెంగల్వ రామలక్ష్మి ఈ కవితలో.[/box]

[dropcap]ఏ[/dropcap]టవాలుగ పడుతున్న జడివాన ధారలు
చెట్ల కొమ్మల నుండి జారి నేల తల్లిని
స్నానమాడిస్తుంటే
బాల్కనీలో వేడి వేడి టీ తాగుతూ
పరవశిస్తూ దృశ్యాన్ని అనుభవించటం ఎంతదృష్టం!

నాలుగు వైపులా వర్ష సముద్రం
మధ్యలో కళాశాల ద్వీపం
ఎటునుంచి వెళ్ళాలన్నా ఈదక తప్పని
భూవైతరణీ ప్రవాహం!
కళాశాలకు సెలవు పెడితే
ఒకరోజు జీతం కట్
ఆటోలో అయితే రోజు జీతంలో సగం ఫట్
ఆ జీతం మీదే బతుకు నావ నడుపుతున్న
అధ్యాపకురాలి పాపం వర్షం ఎంత కష్టం!

చిటపట చినుకులు పడుతుంటే
టీనేజి అమ్మాయి అబ్బాయి
ఒకే గొడుగులో సగం తడుస్తూ
సగం సగం తగులుతూ
కొంచెం బెరుకు, ఇంకొంచెం పరవశంతో
కాలేజీకి ఎగనామం పెట్టి
సినిమాకెళ్తుంటే
వర్షం ఎంత థ్రిల్!

హోరుగాలిలో, వాన నీటిలో
ముందుకెళ్ళనని మొరాయిస్తున్న సైకిల్‌ని
బలవంతంగా తోసుకుంటూ
తను పడిపోతూ, దినపత్రికలు పడకుండా
తను తడుస్తూ, దినపత్రికలు తడవకుండా
భద్రంగా ఇంటింటికీ చేరవేస్తున్న
పేపర్ బోయ్‌కి
వర్షం హర్షాన్నిస్తుందా!

పూరి గుడిసెలో
చిల్లు చిల్లుకో గిన్నెలో
వర్షం ధారలను నింపుతూ
చలిని దాచలేని చిరుగుల దుప్పటిని
కన్నీటితో తడుపుతూ
వణుకుతూ, గొణుగుతూ, దేహం కొంకర్లు పోతూ
వాన ఎప్పుడు తెరిపి యిస్తుందా అని
ఆకాశం కేసి ఎదురు చూపులు చూసే
బడుగు జీవికి
వర్షం ఎంత హృదయ విదారకం!

వర్షం అందరికీ ఒకటే ఎందుకవుతుంది?
మనుషులు అందరూ సమానమెలా అవుతారు?
సమాజం ఎప్పుడూ
అసమమే!

Exit mobile version