వర్తమానం ఓ వరం

    0
    5

    [box type=’note’ fontsize=’16’] వర్తమానమొక్కటే మనకందుబాటులో ఉంటుందని. దాన్ని వరంలా మల్చుకుంటామా లేక శాపంలా మార్చుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు సలీంవర్తమానం ఓ వరం” అనే కల్పికలో. [/box]

    [dropcap]అ[/dropcap]తనికిప్పుడు అరవై యేళ్ళు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో ముప్పయ్ నాలుగేళ్ళు పనిచేసి రెండేళ్ళ క్రితం రిటైరైనాడు. పెద్ద పెద్ద పదవులు నిర్వహించాడు. కార్య నిర్వహణలో చండశాసనుడని పేరు తెచ్చుకున్నాడు. తన పై అధికార్ల మెప్పు పొందాడు. పదవీ విరమణ రోజు తన ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించానన్న తృప్తితో, మెడ నిండా పూల దండల్లో, కారు వెనకంతా నిండిపోయిన బొకేలతో ఇంటికి తిరిగివచ్చాడు. ఇంట్లో తన రాక కోసమే వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న జానకిని చూడగానే అతన్ని పశ్చాత్తాపం కొండ చిలువలా చుట్టేసింది.

    పెళ్ళయి ముప్పయ్ మూడేళ్ళు. కాళ్ళకు పసుపు పారాణితో, కళ్ళనిండా తీయని కలల్ని పొదువుకుని, గుండె నిండా మధురోహల్ని నింపుకుని కొత్త పెళ్ళి కూతురిలా తన జీవితంలోకి అడుగు పెట్టిన జానకి గుర్తొచ్చింది. అప్పుడు జానకి ఎంతందంగా ఉండిందో… విచ్చుకున్న తెల్ల కలువల్లాంటి కళ్ళు, చిత్రకారుడి కుంచెలోంచి జాలు వారినట్టుండే పొందికైన పెదాలు, నాజూకైన నాసిక… మనిషంతా సన్నజాజి పువ్వులా ఉండేది. అప్పటి జానక్కి ఇప్పుడు తన కళ్ళముందున్న జానక్కి పోలికే లేదు. ఇద్దరు మగపిల్లలు, ఓ ఆడపిల్ల… వాళ్ళ పెంపకం, చదువులు, పెళ్ళిళ్ళు. పురుళ్ళు… ఎన్ని బాధ్యతలు మోసిందో… తను తన ఉద్యోగం తప్ప ఇవేవీ పట్టించుకోలేదు.

    ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఇంట్లో దేనికీ తడుముకునే దుస్థితి ఏర్పడలేదు. తిండికీ బట్టకీ లోటు లేకుండానే గడిచిపోయింది. కానీ ఎప్పుడైనా జానక్కి సంతోషాన్నిచ్చాడా? అసలు జానకిని మనసున్న ఓ మనిషిలా గుర్తించాడా? తనకు శారీరిక సుఖాన్ని ఇవ్వడానికి తెచ్చుకున్న ఓ మరబొమ్మలానే భావించాడు. తనకూ తన పిల్లలకూ చాకిరీ చేయడానికి ఇంట్లో ఉన్న పనిమనిషనే అనుకున్నాడు. ఎప్పుడైనా ఆమె మనసులో ఏ ముందో అడిగాడా? లేదు. ఆమెకేది ఇష్టమో ఏది అయిష్టమో కనుక్కున్నాడా? లేదు. ఆఫీస్ లోనే కాదు ఇంట్లో కూడా చండశాసనుడిలానే ప్రవర్తించాడు. తన ఇష్టాల్ని అభిరుచుల్ని ఆమె మీద రుద్దాడు. తన అభిప్రాయాల్ని చెల్లుబాటు చేసుకునే క్రమంలో ఆమెకవి సమ్మతమో కాదో అని ఎప్పుడూ ఆలోచించలేదు.

    అతనికి దిగులేసింది. పదవీ విరమణ చేయటం వల్ల ఏర్పడిన తీరిక సమయాల్లో గతంలో జానకి విషయంలో తన ప్రవర్తన గురించి ఆలోచించడం ఎక్కువైంది. ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవాడో… ఎప్పుడైనా ప్రేమగా, మృదువుగా మాట్లాడాడా? అలా మాట్లాడితే ఆడవాళ్ళు చనువు తీసుకుని నెత్తినెక్కి తొక్కుతారని అతని ప్రగాఢ విశ్వాసం. ఓ తీయటి పాటలా సాగాల్సిన సంసార జీవితాన్ని తన కఠినమైన ప్రవర్తన వల్లే ఇంత పేలవంగా రసహీనంగా మార్చుకున్నాడు. జానకిని ఎన్నిసార్లు కసురుకున్నాడో… ఎన్నిసార్లు అకారణంగా కోప్పడ్డాడో… మరొకరినైతే జానకి కార్చిన కన్నీళ్ళు ఉప్పెనలా ముంచెత్తి వూపిరాడకుండా చేసి ఉండేవి. ఆమె విషయంలో తనో రాయిలా మారిపోయాడు. అందుకే ఆమె కన్నీళ్ళ తడి స్పర్శ తన అనుభవంలోకి రాలేదు.

    తనకో సంఘటన పదేపదే గుర్తుకొస్తోందీ మధ్య. అప్పటికి పెళ్ళయి రెండేళ్ళు. తను చాలా శ్రమపడి తన ఉద్యోగంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న రోజులు. పై అధికార్ల నుంచి ప్రశంసలు అందుకుని ప్రమోషన్ల నిచ్చెన మెట్లని వేగంగా ఎక్కాలన్న తాపత్రయం. మరో రెండ్రోజుల్లో ఇన్‌స్పెక్షన్ ఉంది. ఎంత తొందర పెడుతున్నా సిబ్బంది తమ నత్త నడకను మార్చుకోవటం లేదు. బాస్ పిలిచి చీవాట్లేశాడు. తనకు అవమానం అన్పించింది. పొగడ్తలు అందుకోవాలని శ్రమపడ్తుంటే తెగడ్డ రావడంతో ఖిన్నుడైనాడు. తన కింది సిబ్బందిని పిలిచి ఉగ్ర నరసింహుడిగా మారి మరీ తిట్టాడు. రేపటిలోపల పని పూర్తి కాకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరించాడు.

    జానకి నుంచి ఫోన్… సమయం సాయంత్రం నాలుగ్గంటలు. బిజీగా ఉన్నానంటూ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేశాడు. ఐదింటికి మళ్ళా ఫోన్… పనిలో ఉన్నానంటూ ఆమెకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు. ఆరింటికి మరోసారి ఫోన్. ‘ఎన్నిసార్లు చెప్పాలి బిజీగా ఉన్నానని? బుద్ధిలేదా నీకు? మరోసారి ఫోన్ చేసి విసిగించావంటే మర్యాద దక్కదు’ అంటూ విసురుగా ఫోన్ పెట్టేశాడు. ఆ సమయంలో తను పట్టించుకోలేదు కానీ జానకి తప్పకుండా ఏడ్చి ఉంటుంది.

    అతను ఇంటికెళ్ళేటప్పటికి రాత్రి తొమ్మిదయింది. పొగబండిలా ధుమధుమలాడూనే ఇంటి లోపలికెళ్ళాడు. జానకి చిన్నచిన్న వూదారంగు పూలున్న తెల్లటి ఆర్గండి చీర కట్టుకుని ఉంది. జడలో మల్లెపూల దండ. పెదవులమీద లేత గులాబీ రంగు లిప్‌స్టిక్…

    “తొందరగా కాళ్ళూ చేతులు కడుక్కుని రండి. భోజనం వడ్డిస్తాను’ అంది. ఆమె వైపు ఎగాదిగా చూశాడు. ‘ఏదైనా పేరంటానికి వెళ్ళాచ్చావా?” అని అడిగాడు.

    “లేదు”

    “మరెందుకా సింగారం? ఇది సంసారుల లక్షణమా?” అన్నాడు కోపంగా.

    జానకి గుండెల్లో ఉబికిన గాయాలు ఆమె కళ్ళల్లో ప్రతిఫలించినా అప్పుడతనికి కన్పించలేదు. ఆమె ఏడుస్తూ గోడ ఆసరాగా కూచుండిపోయింది.

    “అన్ని సార్లు ఎందుకు ఫోన్ చేశావు? పనిలో ఉన్నప్పుడు డిస్ట్రబ్ చేయకూడదన్న ఇంగితం కూడా లేదా?” ఆమె ఏడుస్తుందన్న జాలి కూడా లేకుండా తిట్ల దండకం మొదలెట్టాడు.

    జానకి వెక్కిళ్ళు పెడ్తూనే చెప్పింది. “ఈ రోజు మన పెళ్ళి రోజు సాయంత్రం తయారుగా ఉండమని మీరేగా చెప్పి వెళ్ళారు. సినిమాకెళ్తామన్నారు. అట్నుంచి ఏదైనా హోటల్ కెళ్ళి డిన్నర్ చేద్దామన్నారు. మీరు పనిలో పడితే మర్చిపోతారని, ఆ విషయం గుర్తు చేయడానికి ఫోన్ చేశాను”.

    అతనికి వెంటనే గుర్తొచ్చింది. ఆ రోజు తమ పెళ్ళి రోజని. జానకి సింగారించుకుంది తనతో కలిసి బైటికెళ్ళడానికని… ఐనా ఆడదానిముందు తప్పు ఒప్పుకోవడం అవమానంగా భావించాడు. పురుషాహంకారం జూలు విదిల్చింది. ‘ఆఫీస్‌లో పని ముఖ్యమా? పెళ్ళి రోజు టింగురంగా అంటూ సినిమాలకు షికార్లకు తిరగడం ముఖ్యమా? ఆడదానివి నీకేం అర్థమవుతుంది? పెళ్ళి రోజులు ఎన్నయినా వస్తాయి. కానీ ఈ ఉద్యోగంలో కొన్ని అవకాశాలు తప్పిపోతే మళ్ళా రావు. ఐనా పెదాలకు ఈ పూతలేంటి? జడలో అన్నన్ని పూలేమిటి? అసహ్యంగా…’ అన్నాడు.

    ఆ రోజు తర్వాత జానకి ఎప్పుడూ జడలో పూలు తురుముకోవడం తను చూడలేదు. సినిమాలకు రావడం మానేసింది. పిల్లలు బతిమాలినా వచ్చేది కాదు. మొహానికి పౌడర్ పూసుకోవడం లాంటి చిన్నచిన్న సింగారాలు కూడా మానేసింది. ఆ విషయం తన దృష్టికి వచ్చినా తనకేమీ పట్టనట్టే ఉండిపోయాడు. ఆడదానికే అంత పట్టుదల ఉంటే మగాణ్ణి నాకెంత ఉండాలి అనుకున్నాడు. ఆమె కొన్నిటిని మానుకోవడం వల్ల తనకేమిటి నష్టం అనుకున్నాడు.

    కానీ ఇప్పుడు ఆలోచిస్తే తను చాలా తప్పుగా అహంకారంతో ప్రవర్తించాడనిపిస్తోంది. మళ్ళా ఆ కాలం తిరిగొస్తే ఎంత బావుంటుంది? తను మరోలా ప్రవర్తిస్తాడు. జానకి సంతోషపడేలా… జానకి మనసు తెలుసుకుని మసలుకుంటాడు. కానీ కాలంలో వెనక్కి వెళ్ళడం సాధ్యమా? టైం మెషీన్ లాంటిదేమైనా ఉంటే ఎంత బావుండు… తను తన సంసారాన్ని తప్పకుండా తీయటి పాటలా మల్చుకుంటాడు.

    ఎవరో స్వామీజీ వూళ్లోకొచ్చారనీ, హిమాలయాల్లో ఎన్నో యేళ్ళు తపస్సుచేయటం వల్ల ఆయనకు ఎన్నో మహిమలు సంక్రమించాయని విని స్వామీజీని దర్శించుకోడానికి వెళ్ళాడు. ఎంత మంది భక్తులో… ఒక్కొక్కరినీ లోపలికి పంపుతున్నారు. ఐదు నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తారట. అతని వంతు రావడానికి నాలుగు రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది.

    అతను సాష్టాంగపడి లేచాక “నాదో కోరిక స్వామీ” అన్నాడు.

    అదేమిటో చెప్పకముందే స్వామీజీ చిద్విలాసంగా నవ్వారు. “నాకు తెలుసు. ఇష్టఫల సిద్ధిరస్తు” అంటూ దీవించారు. చేతిలో రెండు గుళికలు పెట్టారు. ఒకటి తెల్లగా స్ఫటికంలా ఉంది. మరొకటి ఇటుక రంగులో ఉంది. “తెల్ల గుళిక వేసుకుంటే నువ్వు కోరుకున్న గతంలోకి ప్రయాణిస్తావు. ఇంక చాలనుకున్నప్పుడు ఎర్ర గుళిక మింగితే వర్తమానంలోకి వచ్చేస్తావు” అన్నారు. అతను వెళ్ళబోయేముందు “మరో ముఖ్యమైన విషయం… ఆ గుళికలు ఒక్కసారి మాత్రమే పని చేస్తాయి. కాబట్టి గతంలో ఏ రోజులోకి వెళ్ళాలనుకుంటున్నావో జాగ్రత్తగా ఆలోచించుకో నాయనా” అన్నారు.

    అతను ఇంటికెళ్ళాక చాలా సేపు ఆలోచించాడు. తమ పెళ్ళిరోజునాడు జానకి విషయంలో అమానుషంగా ప్రవర్తించిన తీరుని సరిదిద్దుకోవాలనుకున్నాడు. తెల్ల గుళిక మింగాడు.

    ***

    ఆఫీస్‌కి వెళ్ళబోతూ “సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. తయారుగా ఉండు. సినిమా కెళ్తాం. ఆ తర్వాత మంచి హోటల్ కెళ్ళి డిన్నర్ చేద్దాం’ అన్నాడు..

    ఆఫీస్‍లో పని ఒత్తిడి. కింది సిబ్బంది తను ఆశించినంత వేగంగా పని చేయడం లేదు. రెండ్రోజుల్లో ఇన్‌స్పెక్షన్ ఉంది. బాస్ పిలిచి ‘పని ఎంత వరకు అయింద’ని వాకబు చేశాడు. ఇంకా చాలా పని మిగిలి ఉందని తెల్సుకుని భగ్గున మండిపడ్డాడు. ‘యూ ఆర్ అన్‌ఫిట్ టు బి ఎన్ ఆఫీసర్’ అంటూ తిట్టాడు. అతనికి తల కొట్టేసినట్టయింది. తన ఛాంబర్ కొచ్చి కింది సిబ్బందిని పిలిచి చెడామడా తిట్టాడు. సస్పెండ్ చేస్తానని బెదిరించాడు. ఇంటినుంచి ఫోన్… సాయంత్రం ఆరు లోపల మూడు సార్లు ఫోన్… బుద్దుండక్కర్లా… పనిలో ఉన్నప్పుడు డిస్ట్రబ్ చేయకూడదన్న ఇంగితం కూడా లేదా?

    రాత్రి తొమ్మిదింటికి ఇంటికెళ్ళాడు. జానకి ఆర్గండి చీరలో మెరిసిపోతోంది. కళ్ళకు కాటుక… పెదవులకు పల్చటి లిప్‌స్టిక్… జడనిండా మల్లెపూలు… ‘సంసారుల లక్షణమేనా’ అంటూ కోప్పడ్డాడు. జానకి ఏడుస్తోంది. ఈ రోజు తమ పెళ్ళి రోజని గుర్తు చేసింది. ‘సినిమాకు తీసుకెళ్తానన్నారుగా, అందుకే సింగారించుకున్నా’ అంది. అతనికి తన తప్పు ఒప్పుకోవాలనిపించలేదు. ఆడదానిముందు ఓడిపోకూడదు. మరింత రెచ్చిపోయి తిట్టాడు. ‘నేను వూపిరాడనంత పనిలో తలమునకలై ఉంటే నీకు షోకులు కావాల్సి వచ్చాయా?’ అంటూ తూలనాడాడు. జానకి రాత్రంతా ఏడుస్తూనే ఉంది.

    ఉదయం లేచాక తన ప్రవర్తనలో ఏమీ మార్పులేదన్న విషయం అర్థమైంది. ఎర్ర గుళిక మింగి సాయంత్రం స్వామీజీని కల్సుకున్నాడు.

    “వెర్రివాడా… సమయాన్ని వెనక్కి తిప్పినందు వల్ల నువ్వు భూతకాలంలోకి వెళ్ళావు. అంతే గానీ నీ స్వభావంలో మార్పు లేదుగా. నువ్వు అప్పటి నువ్వే. నీ కోపాన్ని, అహంకారాన్ని, స్వార్థాన్ని వదులుకోనంత కాలం నువ్వు ఎన్ని సార్లు భూతకాలంలోకి వెళ్ళినా ప్రయోజనం శూన్యం” అన్నారు స్వామీజీ.

    కోపం, అహంకారం నిజమే. స్వార్థం ఎక్కడుంది తనలో? అదే ప్రశ్న వేశాడు.

    “నీ కోరిక తీర్చుకోడానికి నా దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చావు తప్ప నీ భార్య గురించి ఆలోచించావా? నీ భార్య కోరికలేమిటో కనుక్కోడానికి ప్రయత్నించావా?” అన్నారు స్వామీజీ.

    “తప్పయిపోయింది స్వామీ. మరోసారి గుళికలివ్వండి”

    “వరాలు పదేపదే ఇచ్చేవి కాదు నాయనా. నీకా అదృష్టం దొరికినపుడే దాన్ని సద్వినియోగపర్చుకోవాలి. జీవితం కూడా అదృష్టమే. వెళ్ళిరా”

    “అయ్యో స్వామీ… ఇప్పుడెలా? నా భార్యని గతంలో బాధించిన సందర్భాల్ని ఎలా సరిదిద్దుకోను?”

    “గతాన్ని మార్చలేవు. భవిష్యత్కాలం వర్తమానంలోకి, వర్తమానం భూతకాలంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. వీటిలో వర్తమానమొక్కటే మనకందుబాటులో ఉంటుంది. దాన్ని వరంలా మల్చుకుంటామా లేక శాపంలా మార్చుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. వర్తమానాన్ని నీకనుగుణంగా మల్చుకో. మగవాడినన్న అహంకారాన్ని వదులుకో. నీ భార్యని ప్రేమించు. సాటి మనిషిలా ఆదరించు. ఆమె మనసు తెల్సుకుని మసలుకో. ఆమె తప్పకుండా సంతోషపడ్తుంది” అన్నారు స్వామీజీ.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here