వసంతంలో గ్రీష్మం

12
3

[ఝాన్సీ కొప్పిశెట్టి గారు రచించిన ‘వసంతంలో గ్రీష్మం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

శ్యాము వాచీ వంక చూసి కంగారుగా కూతురు నీల గదిలోకి తొంగి చూసాడు. నీల తన గదిలో ప్రశాంతంగా మొహానికి మేకప్ వేసుకుంటోంది. ఇంకా పార్టీ దుస్తులు కూడా ధరించలేదు. సమయం ఆరు కావస్తోంది.

ఆహ్వానంలో ప్రకటించిన తన షష్టిపూర్తి సమయం కూడా ఆరే. కూతురికి హోస్ట్‌గా సమయ నిర్వహణ చేయాలన్న జ్ఞానం లేకపోవటానికి శ్యాముకి చిరాకుగా వుంది. నిజానికి అతని చిరాకుకి అసలు కారణం అది కాదు. తను అతిథిగా ఆహ్వానించిన ఒక మిత్రురాలి కోసం అతని ఆరాటమంతా.

చిరకాల కలం స్నేహితురాలు, మంచి రచయిత్రి అయిన మిత్రమణి రేవతిని స్వయంగా రిసీవ్ చేసుకోలేనేమోనని అతని దిగులు. తను తప్ప అక్కడ ఆమెకు తెలిసిన వారెవరూ లేరు.

శ్యాము కూడా కొద్దో గొప్పో అడపా దడపా రాస్తుంటాడు. సాహిత్యపరంగానే రేవతితో అతనికి పరిచయం. శ్యాము రేవతికి వీరాభిమాని. ఆమె ఎంచుకునే అరుదైన అంశాలకు, నిర్భయంగా వాటిని వ్యక్తపరిచే శైలీ విధానానికి అతను ముగ్ధుడవుతూంటాడు. ఆమె ప్రతీ రచన పైన ఫోను చేసి మరీ తన స్పందనను తెలియ చేస్తూంటాడు.

అలా ఆమెతో అతని పరిచయం ఒక విశిష్టమైన స్నేహంగా పరిణమించింది. రేవతికి చెప్పే శుభోదయంతోనే అతనికి తెలవారుతుంది. అంత సంస్కారవంతురాలు, సహృదయురాలు, మంచి భావుకురాలితో తనకు స్నేహమేర్పడటం శ్యాము ఒక అదృష్టంగా భావిస్తాడు. క్రమేణా ఆమె మాటలు అతనికి ఒక వ్యసనమైపోయాయి. ఆమెతో మాటాడని రోజు ఏదో వెలితిగా వుంటుంది. ఆమె మాటల గలగలల నుండి ఎన్నెన్ని ముత్యాలను ఏరుకుంటాడో మరి. దేశదేశాలు తిరుగుతూ భూగోళమంతా చుట్టి వచ్చే ఆమె ముచ్చట్లతో కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఎన్నో నేర్చుకుంటూoటాడు శ్యాము. ఆమె చెప్పే పాశ్చాత్య దేశాల అనుభవాలకు విస్మయం, ఆమె చెప్పే తీరుకు సంభ్రమం, ఆమె మాటలు ఒక అద్భుతం అయిపోయాయి శ్యాముకి.

అల్పసంతోషి అయిన శ్యాము ఆమెపై తన అభిమానాన్నంతా చరవాణిలోకి ఒంపి సంతృప్తి పడుతూ ఆనందిస్తూంటాడు. ఒకరోజున వార్తల్లో రాష్ట్రప్రభుత్వం రేవతికి సన్మానం చేస్తుందని తెలిసి సంబరపడిపోయాడు. ఆ సందర్భంలో తనూ ఆమెను సత్కరించుకునే అవకాశముంటుందని ఉవ్విళ్ళూరాడు. భార్య దమయంతిని షాపింగ్ తీసుకెళ్ళి రేవతి కోసం మంచి పట్టుచీర ఎంపిక చేయమన్నాడు. తనకు చీరలు కొనటంలో ఎప్పుడూ ఉత్సాహం చూపని భర్త రేవతి చీర విషయంలో చూపే ఆరాటం గమనించిన దమయంతి మౌనంగానే మంచి చీరను ఎంపిక చేసింది. నిజానికి తన భర్త చీర విషయం కానీ, అది రేవతికి బహూకరించే విషయం కానీ ఆమెకు తెలియకుండా చేయవచ్చు. కాని పసిబిడ్డంటి భర్త మనస్తత్వం ఆమెకు తెలుసు. భర్తలోని పారదర్శకత, నిజాయితీ దమయంతికి ఎంతో ఇష్టం.

రేవతి సన్మానం రోజు శ్యాముకి పండుగ రోజే అయ్యింది. ఎన్నాళ్ళో వేచిన ఉదయంలా అతని హృదయం పురి విప్పిన నెమలి అయ్యింది. ఎంతో శ్రద్ధగా తయారయి తను కొన్న శాలువా, చీరలతో సభా ప్రాంగణాన్ని చేరాడు. ఆమెను తొలిసారిగా చూసిన ఆ రోజు జీవితంలో మరుపురాని స్మృతిగా మిగిలిపోయింది. అంతవరకూ నిత్యం ఆమెను వింటూ, చిత్రాల్లో మాత్రమే చూసిన ఆమె దివ్యస్వరూపం ముందు, దేవత ముందు భక్తుడిలా అతడి మనసు మోకరిల్లిపోయింది.

అప్పటినుండీ అతనిలో ఆరాధన అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఆమెతో ఫోనులో మాటాడుతూ మైమరిచిపోయేవాడు. అతని సాహిత్యాపేక్ష తెలిసిన అర్ధాంగి అర్థం చేసుకున్నా, తండ్రి ప్రవర్తన కూతురి కంటికి కంటకమైంది. ఆ వయసులో తండ్రి మరో స్త్రీతో అన్నేసి కబుర్లు కూతురి పంటి కింద కంకర్లు అయ్యాయి. పాతిక వసంతాలు చూసిన పాపాయికి తండ్రిపై శిశిరంలో పడే చిరుజల్లు, పసిబిడ్డయ్యే తండ్రి పరవశం నచ్చలేదు.

నిర్మలమైన మనసు, నిష్కల్మషమైన అభిమానం, స్వచ్ఛమైన ఆలోచనలు చేసే శ్యాముకి కూతురి వక్రాలోచనలు వీసమంతయినా తెలియవు. కూతురు అంగరంగ వైభవంగా చేస్తున్న తన షష్టిపూర్తికి వాట్స్ అప్‌లో రేవతికి ఆహ్వానం పంపాడు. తప్పకుండా రావలసిందిగా ఆమెను అభ్యర్థించాడు. రేవతి వస్తానని చేసిన వాగ్దానంతో మళ్ళీ ఆమెను మరోసారి చూడబోతున్నానన్న ఆనందోత్సాహానికి ఇప్పుడు కూతురి అలసత్వాన్ని భరించలేకుండా వున్నాడు.

“ఇక్కడే ఆరయి పోయింది. గెస్ట్ లను ఎవరు రిసీవ్ చేసుకుంటారు. నీకు ఇంకా సమయం పట్టేట్టయితే నేను, మమ్మీ క్యాబ్ తీసుకుని వెళ్ళిపోతాం..” అసహనంగా అన్నాడు శ్యాము.

“అయిపోయింది డాడీ. వధూవరులు ఆలస్యంగానే వెళ్ళాలి..” క్రీగంట తండ్రిని చూస్తూ అంది నీల.

“అయినా ఏర్పాట్లు అవీ చూసుకుంటూ మామయ్య అక్కడే వున్నారు. మీరేం కంగారు పడకండి” తాపీగా చెబుతూ ఫైనల్ టచప్స్ చేసుకుంటోంది నీల.

శ్యాము వెంటనే తన మొబైల్ తీసి బామర్దికి కాల్ చేసి తన స్నేహితురాలు, ప్రసిద్ధ రచయిత్రి రేవతి వస్తున్నారని ఆమెను సగౌరవంగా రిసీవ్ చేసుకోమని చెప్పాడు. తండ్రి కలవరం చూస్తోంటే నీలలో తెలియని రాక్షసానందం.

శ్యాము కూతురు చేసిన ఆలస్యానికి కోపంగా మౌనంగా కూర్చున్నాడు కారులో. కారు డ్రైవ్ చేస్తూ నీల తండ్రిని గమనిస్తోంది. దమయంతికి కూతురి ప్రవర్తన నచ్చటం లేదు. ఈ శుభవేళలో భర్తని బాధించటం, అతన్ని కోపావేశాలకు ఆదుర్దాకి గురి చేయటం నచ్చలేదు. భర్త పసితనం, మంచితనంతో పాటు అతని పట్టుదల, మొండితనం కూడా తనకు తెలుసు. తెగేవరకూ లాగే కూతురిని వారించలేక, భర్త భావోద్వేగాలను తాళలేక నిశ్శబ్దంగా కూర్చుంది.

ఇంతలో శ్యాము ఫోను రింగయ్యింది. రేవతి పేరు చూసిన శ్యాము మొహంలో వేల నక్షత్రాల కాంతి.

“హలో రేవతిగారూ, బయిల్దేరారా..”

అంతవరకూ చిరాకుతో ముడిపడిన అతని నొసలు ఆనందాతిశయంతో విచ్చుకున్నాయి.

“ఇప్పుడు బయిల్దేరటమేమిటండీ ఏడవుతోంటే.. నేను వచ్చి గంటయ్యింది”

“మన్నించండి మిమ్మల్ని ఒక్కరినే వదిలేసినందుకు.. మరో పావుగంటలో అక్కడుంటాం” అన్నాడు ఓ గంటగా ఆమెను ఒంటరిగా కూర్చోపెట్టినందుకు చింతిస్తూ.

“భలేవారే. ఒక్కదాన్నేమిటి. బోలెడు మంది అతిథులతో హాలు నిండిపోయింది. అందరినీ గమనిస్తూ ఎంజాయ్ చేస్తుంటేనూ ఇక్కడ” నవ్వుతూ చెప్పింది.

తేలికయిన తండ్రి మొహం చూసేసరికి రేవతిపై ద్వేషంతో బరువెక్కింది నీల మస్తిష్కం.

కారు ఫంక్షన్ హాలు దగ్గర ఆగీ ఆగగానే ఒక్క ఉదుటున బయటకు దుమికి గబగబా లోపలికి వెళ్ళాడు శ్యాము. నాలుగో వరుసలో ఒంటరిగా కూర్చొన్న రేవతి పక్క సీట్లో కూలబడి ఆయాసంతో రొప్పుతూ “సారీ రేవతి గారూ” అన్నాడు.

అతని వంక విభ్రమంగా చూస్తూ “ఇప్పుడేమయ్యిందని సారీ..” అంది రేవతి నవ్వుతూ.

అత్యంత సున్నిత మనస్కుడయిన అతని ఒళ్ళు సన్నగా కంపిస్తోంది.

అంతలో భర్త వెనుకే అక్కడకు చేరిన దమయంతిని భార్యగా రేవతికి పరిచయం చేసి తను లేచి ఆ కుర్చీ భార్యకిచ్చాడు. దమయంతి వినమ్రంగా రేవతికి నమస్కరించి “మావారికి మీరంటే చాలా అభిమానమండీ” అంది కూర్చుని నవ్వుతూ.

“తెలుసండీ. సినిమా నాయికానాయకులపైన ఇలాంటి అభిమానం వుండటం సహజమే. కాని ఒక రచయిత్రి పైన ఇలా చూడటం నాకిదే ప్రథమం” అని ప్రేమగా జవాబిచ్చింది రేవతి.

అంతలో దూసుకొచ్చిన నీల “మమ్మీ, నువ్వు కూర్చోవలిసింది ఇక్కడ కాదు. వేదిక పైన అమర్చిన ఆసనం పైన. ఇప్పటికే ఆలస్యమైంది. పద..” అంటూ భుజం పట్టుకుని తల్లిని లేపింది. శ్యాము రేవతిని నీలకు పరిచయం చేసే ప్రయత్నాన్ని గమనించనట్టుగా తల్లితో సహా వేదిక పైకి వెళ్ళిపోయింది నీల.

తప్పు చేసినవాడిలా తలదించుకున్న శ్యాముతో “మీరూ వెళ్ళండి పెళ్ళికొడుకులుంగారూ.. దమయంతి అడుగుజాడల్లో శ్యామ సుందరులు” అంది రేవతి కొంటెగా అతని మూడ్ మార్చేoదుకు.

అక్కడికొచ్చిన బామర్దికి రేవతి అతిథిమర్యాదలు చూసుకోమని వేదిక ఎక్కాడు శ్యాము.

అప్పటికే విచ్చేసిన పంతులుగారు షష్టిపూర్తి వైశిష్ట్యాన్ని, ప్రాధాన్యాన్ని చెప్పటం మొదలెట్టారు.

“ఇది నిజానికి వేడుక కాదు. ఇదొక శాంతి కలాపం. అరవై ఏళ్ళకు మనిషిని ఉగ్రరథుడు అనే శక్తి ఆవహిస్తుంది. దానిని శాంతింప చేయటానికి, మనిషి మరో పదేళ్లు ఆరోగ్యంగా బ్రతకటానికి చేసే శాంతి కలాపం ఇది. ఈ వయసులో బ్యాటరీ రీ-ఛార్జీ చేసుకుని పునః తేజస్సుని సమీకరించుకుని ఆయురారోగ్యాభివృద్దికై చేసే ఉగ్రరథ శాంతి ఇది..”

“పంతులుగారూ, ఇది కేవలం ఉగ్రరథుడి ఆవాహన మాత్రమే అరికడుతుండా లేక వేరే ఇతర దుష్ట గ్రహాల నుండి కూడా కాపాడుతుందా..” అని అడుగుతూ నీల రేవతి వంక కచ్చగా చూసింది.

నీల తనను పలకరించకపోయినా అప్పటివరకూ పట్టించుకోని రేవతికి నీల చూపులో తేడా తెలిసొచ్చింది. వేదిక పైన కార్యక్రమం కొనసాగుతున్నంతసేపూ నీల మధ్య మధ్యలో రేవతి వంక కొరకొరా చూస్తూనే వుంది. రేవతికి ఆ చూపులు చాలా ఇబ్బంది కలిగించాయి. మరో క్షణం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు. అటుగా వచ్చిన శ్యాము బామర్ది చేతికి శ్యామూ దమయంతుల కోసం తెచ్చిన పట్టుబట్టల ప్యాకెట్టు ఇచ్చి వెళ్ళిపోదామనుకుంది.

కాని అతను “ఒక ముఖ్యమైన కార్యక్రమం వుందని, మిమ్మల్ని అప్పటివరకూ వుండమన్నారు” అనే సరికి ముళ్ళమీద కూర్చొన్నట్టు కూర్చుంది.

తంతు పూర్తయి, అందరూ కానుకలు బహూకరిస్తున్నా రేవతిలో సత్తువ సన్నగిల్లి లేవలేదు. అన్యమనస్కంగా కూర్చుని అంతుచిక్కని ఆలోచనల్లో మునిగిపోయింది.

ఇంతలో వేదికపై నుండి శ్యాము “ప్రముఖ రచయిత్రి రేవతిగారిని వేదిక పైకి వచ్చి నా కథల పుస్తకాన్ని ఆవిష్కరించ వలసిందిగా కోరుతున్నాను” అని అన్నారు.

మైకులో తన పేరు వినిపించేసరికి ఆశ్చర్యంగా చూస్తున్న రేవతిని ఉద్దేశించి శ్యాము మరోసారి వేదిక పైకి రావాల్సిందిగా ప్రాధేయపడ్డాడు. లేని బలాన్ని తెచ్చుకుని రేవతి బలవంతంగా వేదిక పైకి వెళ్ళింది.

శ్యాము రేవతి రచనల గొప్పతనాన్ని కొనియాడి, తను ఎంతగా ఆమె రాతలకు ఆకర్షితుడయ్యిందీ చెప్పి, ఆమె ప్రేరణతో రాసిన కథల సంపుటిని ఆమెకే అంకితం చేస్తున్నట్టు, ఆమెతో తన పుస్తకావిష్కరణ తను చేసుకున్న అదృష్టం అన్నాడు. మాట మాత్రంగానయినా తనతో చెప్పకుండా శ్యాము ఇచ్చిన ప్లెజెంట్ సర్ప్రైజ్‌కి రేవతి కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. ఈ హఠాత్పరిణామానికి నీల కళ్ళల్లో అగ్గి రాజుకుంది.

పుస్తకావిష్కరణ కార్యక్రమం ముగిసాక రేవతి దమయంతి చేతిలో కానుక పెట్టి, ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంది.

శ్యాము భోజనం చేయమని ప్రాధేయపడుతున్నా స్నాక్స్ ఎక్కువగా తినేసానని రేవతి తప్పించుకుంది. కారు వరకూ సాగనంపిన శ్యాముతో “మీ మంచితనానికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మీరు మరిన్ని మంచి రచనలు చేయాలి” ప్రేమపూర్వకంగా అని వీడ్కోలు తీసుకుంది.

ఆ రాత్రి అనేక రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన రేవతి గుండె రాయి చేసుకుని శ్యాము నంబరు బ్లాక్ చేసేసింది.

విషయం ఏమయిందీ తెలియని శ్యాముని షష్టిపూర్తి చేసుకున్నప్పటికీ నిజంగానే ఉగ్రరథుడు ఆవహించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here