Site icon Sanchika

వసంత చంద్రుల కూర్పు : చేమకూర కవి తీర్పు

క్షితిపయి వట్టి మ్రాఁకులుఁ జి
గిర్ప వసంతుడు దా రసోపగుం
భిత పద వాసనల్ నెఱప,
మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస
న్నతయును, సౌకుమార్యము గ
నంబడ ఱాల్ గరఁగంగఁజేసె; నే
గతి రచియించిరేని సమ
కాలమువారలు మెచ్చరే కదా! (1-210)

[dropcap]చే[/dropcap]మకూర వేంకటకవి విజయవిలాసంలోని సుప్రసిద్ధమైన పద్యాలలో పేరెన్నిక గన్న రచన ఇది.

వసంతుడు, చంద్రుడు – ఇద్దరూ ప్రకృతివిలాస కావ్యకర్తలే. ఇద్దరూ తమ శక్తివిలసనంతో మనోహరమైన ప్రకృతికావ్యము యొక్క అందచందాలను ఇనుమడింపజేసినవారే. మన్మథుని ఆస్థానంలో ప్రముఖపాత్రను వహించే ఆ ఇద్దరిలో చంద్రునికి వసంతుడంటే ఎందువల్లనో అహమహమిక రగుల్కొన్నది. అందుకు పరిణామమే ఈ పద్యం.

ఆమని వేళ వచ్చేసరికి మన్మథసఖుడైన వసంతుడు తన ధర్మాన్ని నిర్వర్తించేందుకు పూనుకొన్నాడు. భూమిపై ఎండిపోయిన చెట్టుచేమలకు ప్రాణంపోసి పల్లవింపజేశాడు. “రసోపగుంభిత పద వాసనల్” నింపాడు. వృక్షశాఖలలో, ఫలపుష్పాలలో రసాన్ని నింపి సుగంధాలను వ్యాపింపజేశాడు. “రస = పాలతో, ఉపగుంభిత = నిండిన; పద = ఆకులు, పూలు, కాడలు మొదలైన స్థానములలో, వాసనల్ = పరిమళములను, నెఱపన్ = వ్యాపింపజేయగా” – అని వాక్యార్థం.

చంద్రునికి ఈ వసంతవిలాసం మెచ్చుగొలపలేదు. స్వాభిమానం ఉన్నవాడికి లోకంలో తనంతటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నిద్ర వస్తుందా? అందువల్ల తాను కూడా ఉపక్రమించి, తన శక్తిని ప్రదర్శించాడు. తానుండేది ఆకాశం కాబట్టి, “మిన్నునన్ ప్రసన్నతయును సౌకుమార్యము కనంబడ ఱాల్ కరఁగంగఁజేసె”. ఆకాశము నుంచే తన శక్తిని వెల్లడించాడు. తన ప్రసన్నత, తన సౌకుమార్యం కనబడేట్లుగా స్వీయప్రతిభతో రాళ్ళు సైతం కరిగేట్లుగా చేశాడు.

“ప్రసన్నత కనబడటం” అంటే లోకము పట్ల ప్రసన్నుడై తన అనుగ్రహాన్ని ప్రసరింపజేశాడన్నమాట. అదేదో శ్రమకోర్చి పనిచేసినట్లుగా కాక ఎంతో సుకుమారంగా తన శక్తిని ప్రదర్శించాడు. ఆయన ప్రసన్నత వల్ల, ఆ మసృణత్వఫలంగా వెన్నెల విరిసింది. ఆ వెన్నెల వెల్లువలో “ఱాల్ గరఁగంగఁజేసె” = చంద్రకాంత శిలలు కరిగేట్లు చేశాడన్నమాట.

ప్రసన్నత కనంబడజేశాడంటే ఆకాశమంతా విమలకాంతులు నిండాయని ఇంకొక అర్థం. చూచేవారికి మనస్సు ప్రసన్నం అయ్యేట్లుగా చేశాడు – అని కూడా మనము అర్థం చేసుకోవాలి.

సౌకుమార్యం కనబడటం అంటే, “ఓహో! ఈ మహాకార్యాన్ని ఎంత అలవోకగా, ఎంత సుకుమారంగా చేస్తున్నాడో చూడండి” అనిపించటం. చూచేవారికి ఆ వెండివెన్నెల వెలుగులో దృశ్యమానమైన చరాచర ప్రకృతి సమస్తం ఎంతో మసృణమనోహరమై కానవచ్చిందని మనము అర్థం చేసుకోవాలి.

ఈ సమాసకల్పనలో ఇంకొక చమత్కారం కూడా ఉన్నది. వసంతుడు క్షితిపయి వట్టి మ్రాకులు చిగిర్ప, రసోపగుంభిత పద వాసనల్ నెఱపగా  – ఎంతో కష్టపడ్డాడు. కాళ్ళకు సిద్ధరసాన్ని పూసుకొని, నేలంతా కలయదిరిగి, ఆ పాదలేపంతో కాళ్ళతో నేలను తొక్కుతూ ఆ ఔషధం నేలలోకి ఇంకి, చెట్లవేళ్ళకు ఆ రససారం సోకి, మోడువారిన చెట్లు సైతం చిగురించేట్లు చేశాడని కూడా శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి గారు తమ విజయవిలాస వ్యాఖ్యలో విశేషార్థం చెప్పారు. “రస = పాదలేపముతో, ఉపగుంభిత = పూయఁబడిన – పద = చరణముల యొక్క – వాసనల్ = తాఁకులను” అని వివరించారు.

చంద్రుడు ఆ కష్టమేమీ లేకుండా ఆతిసుకుమారంగా ఆకాశం నుంచి తన అనుగ్రహంతోనే క్షితిపయి ఉన్న చంద్రకాంత శిలలను కరిగేట్లు చేశాడు.

2

ఇప్పుడింకొక విషయం: ఆ వసంతుడూ, ఈ చంద్రుడూ ఇద్దరూ కవులే. ఒకరు కవివసంతుడూ, మరొకరు కవిచంద్రుడున్నూ.

ఇద్దరూ ప్రకృతివిలాస కావ్యకర్తలే కదా.

సమానప్రతిభులైన ఇద్దరు మహాకవుల మధ్య వైరం రగుల్కొంటే ఏమవుతుంది? పెద్ద చిక్కే వచ్చింది. పోటీ తప్పలేదు.

అంటే ఏమన్నమాట? వసంతుడు వట్టిమాకులు సైతం చిగురించేట్లుగా “రస – ఉపగుంభిత – పద – వాసనల్ – నెఱప” కవిత్వం చెప్పాడు. శృంగారాది రసభావాల ప్రతీతికి ఆవశ్యకమైన శబ్దశక్తితో రచన చేశాడు. వ్యక్తి ఏదైనా ఒక వస్తువును చూసి కామము, క్రోధము మొదలైన భావాలను పొంది ఉద్రిక్తమైనప్పుడు మనస్సు ఆ వస్తువు యొక్క ఆకృతితో నిండిపోతుంది. ఆ విధమైన ఆ రూప పరిణామానికి ‘వాసన’ అని పేరు. వసంతుని మనస్సులోని వాసనా రూపమైన సంస్కారం ఆతని సంకల్ప మాత్రాన ప్రకృతిలో పల్లవించింది.

చంద్రుడు శ్రమైకసాధ్యమైన ఆ రచనను మెచ్చక తన రచనలో ప్రసాదము, సౌకుమార్యము అనే కావ్యగుణాలను ప్రకాశింపజేస్తూ రాళ్ళు సైతం కరిగేట్లుగా కవిత్వం చెప్పాడు.

మొత్తం మీద ప్రకృతార్థంలో ఆమని వర్ణన, అప్రకృతార్థంగా కవిత్వపరమైన తారతమ్యవర్ణన – ఈ రెండూ వేంకటకవి దృష్టిలో ఉన్నాయన్నది స్పష్టం. ఆయనను కవిత్వేతర కారణాల వల్ల ఎవరో, ఎందుకో నిరాదరించినందువల్ల బాధపడి ఈ పద్యాన్నిక్కడ సందర్భస్థగితంగా నివేశింపజేశాడని జనశ్రుతిలో చెప్పుకొనే కథ ఒకటున్నది. అందులో ఎంత నిజం ఉన్నదో మనకు తెలియదు.

అయితే, వసంతుని చేతను చంద్రుడు ఎందుకు మెచ్చలేదు? అని ఎవరైనా అడిగితేనో? వేదము వారు కాని, తాపీ ధర్మారావు గారు కాని పేర్కొనలేదు. పరిశోధకులు చెప్పలేదు.

వసంతుని సృజనను చంద్రుడు ప్రశంసింపకపోవటానికి మాత్సర్యమో, కీర్తికాంక్షో కారణమై ఉండదు.

“వసంతుడు ఎండిన మోడు సైతం చిగురించేట్లు కవిత్వం చెప్పాడు. చంద్రుడు దానిని మెచ్చక రాళ్ళు కరిగేట్లుగా కవిత్వం చెప్పాడు. ఎంత బాగా చెప్పినా సమకాలం వాళ్ళు మెచ్చుకోరు కదా!” అన్నప్పుడు – కవి ఎవరిని విమర్శిస్తున్నట్లు?

రసజ్ఞులు కానివారికి సైతం మెచ్చుగొలిపే తీరున, ఎండిన మోడు సైతం చిగురించేట్లుగానూ కవిత్వం చెబితే చంద్రునికి వచ్చిన కష్టమేమిటి?

సందర్భాన్ని బట్టి చూస్తే కవియొక్క సానుభూతి వసంతుని మీదనే అన్నది స్పష్టం. వసంతుని చంద్రుడెందుకు మెచ్చుకోలేదు? అని పాఠకులు అడిగితే – చంద్రుడెందుకు మెచ్చుకోలేదో కల్పనలో సమాధానం తప్పక చెప్పబడాలి.

చంద్రుడు తన కవిత్వాన్ని మెచ్చుకోలేదు కాబట్టి చంద్రుని కవిత్వానికంటె తన కవిత్వమే మేలని వసంతుడు కూడా వాదిస్తే, దొందూదొందే కాబట్టి, “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అన్న అర్ధాంతరన్యాసం ఉభయతారకంగా ఉంటుంది. వారి కవిత్వం వీరికి నచ్చలేదు; వీరి కవిత్వం వారికి నచ్చలేదు. ఎంత బాగా వ్రాసినా, సమకాలం వాళ్ళు కాబట్టి వ్యక్తిగత కారణాలు రసాస్వాదనకు అడ్డువచ్చి మెచ్చుకోరు – అని మనము సరిపెట్టుకోవచ్చు.

కాని, ఇక్కడ అట్లా జరగలేదు. వసంతుని మెచ్చుకోని చంద్రుని ప్రవర్తన మాత్రమే వేంకటకవి పద్యంలో విమర్శకు గురైంది. వసంతుని చేతలో ఏదో లోపం ఉన్నందువల్ల చంద్రుడు వసంతుణ్ణి మెచ్చుకోకపోవటం జరిగి, ఆ చంద్రుని రచన నిజంగా వసంతుని రచనకంటె మేలుగా ఉన్నట్లయితే – ఆ గుణోత్కర్షను చూసిన వేంకటకవి, “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అని బాధపడటం భావ్యం కాదు.

నిజానికి వసంత – చంద్రులిద్దరూ మన్మథుని ప్రియానుచరులే. పద్యంలో వారికి విరోధం చిత్రింపబడి ఉంటుందనుకోవటం సంభావ్యం కాదు. ఎందుకంటే, ప్రథమాశ్వాసంలో దీనికి తర్వాతిదైన పద్యంలో వేంకటకవి, “వెడవిలుకానికిన్ జెఱకువిల్లును గల్వలకోరి కోరికల్, గడలుకొనంగ నామనియుఁ గల్వలరాయఁడు నిచ్చి మన్ననం, బడయుడు …” అని ఆ వసంతోత్సవ సమయంలో మన్మథునికి సభకు వెళ్ళి వసంతుడు చెరకువిల్లును, చంద్రుడు కలువబాణాన్ని మన్మథునికి బహూకరించి గౌరవాన్ని పొందారని – వసంత చంద్రులిద్దరినీ ప్రశంసాపూర్వకంగా అభివర్ణించాడు. అందువల్ల వారిద్దరూ పరస్పర మాత్సర్యోపహతులు కారన్నమాట.

చంద్రుడు వసంతుణ్ణి మెచ్చుకోకపోవటం ఎంత సమంజసమైనా, కేవలం జిగీషతో, ఔన్నత్యచికీర్షతో ఆ చంద్రుడు చేసినది వసంతుని చేతకంటె గొప్పేమీ కాదని; అందువల్లనే, అనాదరింపబడిన వసంతునిపై సానుభూతి కలిగి, అతనికి సమర్థనగా వేంకటకవి “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అని వ్యాఖ్యానించాడని మనము ఊహించాలి.

కవి మనస్సుకు కష్టం కలిగిన మాట వాస్తవం. మెరుగైన వసంతుని రచనను చంద్రుడు మెచ్చుకోకపోవటం, అలాగని ఆ మెచ్చుకోని చంద్రుని రచన వసంతుని రచన కంటె మేలైనదేమీ కాకపోవటం ఇందులోని చిత్రితాంశాలు.

వసంతుడు కూడా ఆ వాగ్వాదంలోకి దిగలేదు కాబట్టి, “సమకాలంలో మెచ్చని” వారి జాతిలో అతను లేడు. కాలిక కవిచంద్రులు శ్లాఘింపలేకపోయినా, తన రచన కాలపు ఇనుపతెరలను చీల్చుకొని చిరకాలం జీవిస్తుందని వేంకటకవికి ఆత్మవిశ్వాసం ఉన్నది.

3

అందువల్ల పద్యాన్ని ఇంకా లోతుగా తరచి చూడవలసి ఉన్నదన్న మాట స్పష్టం. అభినవంగా చదువుతున్నప్పుడు నాకు తోచిన భావం ఇది:

వసంతుడు చేసిన పని యేమిటి? ఆమని వేళ క్షితిపయి మోడువారిన వృక్షాలను చిగురింపజేశాడు. “వసంతుఁడు = మన్మథుని ఇష్టసఖుడైన వసంతుడు, తాన్ = తానై స్వయంగా పూనుకొని, రస = జలములచే, ఉపగుంభిత = పూర్ణములైన, పద = స్థానముల నుండి (నదీ జలాశయాల నుంచి), వాసనల్ = పరిమళాలను, నెఱపన్ = వ్యాపింపజేయగా” – అని అన్వయించుకోవాలి.

ఇది ప్రకృతి పరకమైన అర్థం.

ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉన్నది. అదే కవి ఉద్దేశించిన అసలైన వాక్యార్థం. పాఠకులు ఈ దళాన్ని –

వసంతుఁడు – ఉదార – సోపగుంభిత – పద – వాసనల్ – నెఱపన్

అని చదువుకోవాలి. వసంతుఁడు = మన్మథ సఖుడైన వసంతుడు, ఉదార = విరివిగా, సా + ఉపగుంభిత = ఆ రసము అను శబ్దము ‘సా’ అను ముఖవర్ణముచే కూర్పబడినప్పటిదైన, పద = సారసము అను పదముయొక్క (పద్మముల యొక్క), వాసనల్ = సుగంధములను, నెఱపన్ = వ్యాపింపజేయగా – అని ఇంకొక అర్థం.

రసము సా అనే ముఖవర్ణంతో ఉపగుంభితమై సారసము అయిందన్నమాట.

వసుచరిత్రలోని స్వైరవిహారధీర లగు సారసలోచనలు అన్న పద్యానికి సాటివచ్చే చమత్కారం ఇది. వసుచరిత్ర పద్యంలో సారసలోచనలు పదంలో రస భంగమై సారసలోచనలు – సాలోచనలు అయినట్లే, విజయవిలాసంలో దానికి ప్రతిభటంగా వేంకటకవి సోపగుంభితమైన రసము (సా + ఉపగుంభితమైన + రసము) సారసము అన్న శబ్దచిత్రాన్ని కల్పించాడు.

చంద్రుడు = చందమామ, మెచ్చక = సారసములకు శత్రువు కాబట్టి – నదీజలాశయాలలో ఆ సారస గంధవ్యాపన కార్యాన్ని శ్లాఘింపలేకపోయాడు.

ఇప్పుడు కవనపరంగా చూద్దాము.

వ్యాఖ్యాతలు చెప్పినట్లుగా కాక, వసంతుని రచనలో ఉదారత (శబ్దార్థముల పరస్పర ధ్వనన వ్యాపారము, వికటత్వము అనే కావ్యబంధం), స+ఉపగుంభిత+పదవాసనల్ = పదగుంభనము నిండిన వాసనలు (శబ్దవృత్తులు) విలసిల్లాయి – అని అర్థం.

“ఉదారత”, “సోపగుంభిత పద వాసనలు” అన్నవి రెండూ కావ్యప్రౌఢికి అనువర్తించే అంశాలు.

చంద్రుడు అంతర్గతమైన ఆ ప్రౌఢిని మెచ్చక – “ప్రసాద గుణము”, “సౌకుమార్యము” అనే శైలీపరములైన కావ్యగుణాలను అభిమానించాడన్నమాట.

జాగ్రత్తగా పరిశీలించితే – ప్రకృతిపరంగా చూసినా – చంద్రుని ప్రసన్నతా, సౌకుమార్యముల ఫలాలు పైకి “కనబడేవే” కాని, కఠినమైన చంద్రకాంత శిల నిజంగా కరగటం జరగలేదు. పైగా, ఆ చంద్రుని యొక్క విలాసం కాలానుగుణమే గాని స్వతంత్రం కాదు.

అంతర్గతప్రౌఢి మహాకవుల రసాత్మక వాక్యంలో అక్షరాక్షరం ప్రతినిబద్ధమై ఉంటుంది. ఆ ప్రౌఢికి ఆలంకారిక పరిభాషలో “చమత్కారము” అని పేరు. ఆ చమత్కారము చిత్తవిస్తారరూపమై విస్మయాపర పర్యాయముగా ఉంటుంది – అని సాహిత్యదర్పణములో విశ్వనాథుడు అన్నాడు. అది ఆలోచనామృతము, విచార్యమాణ రమణీయతా స్వరూపము అని చమత్కార చంద్రికలో విశ్వేశ్వర దేశికుడు అన్నాడు.

వసంతుడు ప్రకృతిలో జీవకళలను నింపినట్లు చమత్కారం కావ్యానికి ప్రాణకళను ప్రసాదిస్తుంది. మోడువారిన హృదయాలలో రసికతను నింపగల మహాశక్తి అది.

కవిత్వం చెబితే ప్రతిపద్యచమత్కృతిమత్కృతిగా చెప్పాలి. అటువంటి కవిత్వమే రఘునాథ రాయలకు ప్రీతిపాత్రం. ఒక్క రఘునాథరాయలే ఏమిటి, లోకజనులందరికీ ప్రీతిపాత్రం.

ఇదే వేంకటకవి కవిత్వాదర్శం.

రసికజనులకు ప్రీతిభాజనుడైన వసంతుని ఔదార్యం ముందు చంద్రుని శ్లాఘావిహీనత వెలవెలపోవటం సహజమే.

వసంత చంద్రులలో ఇద్దరి కవిత్వాలూ గొప్పవే. రెండూ మాధుర్య గుణశోభితములే. అయితే వసంతుని కవిత్వకళలోని జీవాతువునూ, హృదయస్పందాన్నీ అర్థం చేసుకోవటానికి కొంత కాలం పడుతుంది. ఒక్కసారి చదివినంత మాత్రనే అది సులభంగా అర్థం కావటం లేదని విమర్శింపకూడదు. లోతుగా అధ్యయనం చేసి చమత్కారాన్ని అవగతం చేసికొని రసార్థాన్ని అనుభవపూర్వకంగా ఆవిష్కరించుకోవాలి.

అందుకు సహృదయత అవసరం. సరస్వతీ తత్త్వం కవిసహృదయాఖ్యమని పెద్దలు అందుకే అన్నారు. ఆ సహృదయత జన్మజన్మల సంస్కారఫలం.

సమకాలం వారు మెచ్చుకొనకపోయినా, మహాకవులకు కాలాంతరంలో వారివారి కవిత్వాల గుణావగుణాల నిగ్గుతేరి సహృదయ సదస్సులలో గౌరవ పాత్రత సిద్ధిస్తుంది.

అందువల్లనే వట్టిమ్రాకులను చిగురింపజేసిన వసంతుడు చెరకువింటినీ, ఔదార్య సౌకుమార్యములతో రాల్గరగింపజేసిన సారసవైరి తనకు నచ్చిన కలువబాణాన్నీ రసజ్ఞుడైన మన్మథునికి బహూకరించి, ఆయన యింటిలో ఇద్దరూ మన్ననలను పొందారు.

సద్గతి రచియించిరేని కలకాలము వారలు మెత్తురే కదా! అని వేంకటకవి సందేశం.

Exit mobile version