Site icon Sanchika

వసంత లోగిలి-2

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[తన భర్త మీద అలిగి, ఇంట్లోంచి వెళ్ళిపోయి రైలెక్కి కూర్చున్న అత్తమామల్ని బ్రతిమాలి, బుజ్జగించి ఇంటికి తీసుకొస్తుంది నిత్య. వాళ్ళిద్దరికీ కాఫీ ఇస్తుంది. ఇంతలో లోపల్నించి వచ్చిన భర్త నవీన్ – వీళ్ళు రైలెక్కారా లేదా అని అడుగుతాడు. మాట్లాడవద్దని సైగ చేస్తూ, అత్తయ్యా మామయ్యా లోపలి గదిలో ఉన్నారు, మీ మాటలు వింటే నొచ్చుకుంటారని అంటుంది. కొడుకు గొంతు వినబడ్డ జగన్నాథం గారూ, ఆ బడుద్దాయ్ వచ్చాడా అని అడుగుతారు. వచ్చాడని చెప్తూ, వాళ్ళకి తినడానికి జంతికలు ఇచ్చి, సాయంత్రం వంటకి సిద్ధమవుతుంది నిత్య. కాసేపటికి నవీన్ వంటింట్లోకి వచ్చి, అమ్మానాన్నల కోపం తగ్గినట్టేనా అని అడుగుతాడు. వాళ్ళని ఏమీ అనకుండా ఉండలేరా అని అంటుంది. తనకి వీలు కానప్పుడే – వాళ్ళని తమ స్నేహితుడు ఆనందరావ్ ఇంటికి తీసుకువెళ్ళమని గొడవ చేశారని, నిత్యతో వెళ్ళండి అన్నా వినిపించుకోలేదని అంటాడు నవీన్. నువ్వే రావాలి అని వాళ్ళు అంటున్నారంటే, వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారని, అందుకే మీతో ఆ కాసేపు సమయమైనా గడపాలని అనుకుంటున్నారనీ, తమని తమ కొడుకు తీసుకువచ్చాడని మిత్రుడితో చెప్పుకుని సంతోషించాలని అనుకుంటున్నారని చెప్తుంది నిత్య. మర్నాడు తాను తీసుకువెళ్తానని అత్తగారితో అంటే ఆమె రుసరుసలాడుతుంది. పక్కింట్లో ఏడేళ్ళ తపస్వి ఒకటే ఏడుస్తూంటుంది. తనని ఆరోజే ఎగ్జ్‌బిషన్‌కి తీసుకువెళ్ళాలని. తండ్రి చేత తిట్లు తిని కూడా తను అనుకున్నది సాధిస్తుంది తపస్వి. తపస్విని, తన మామగారిని పోల్చి చూసుకుంటుంది నిత్య. భార్య సూచన మీద తల్లిదండ్రులని ఆనందరావు ఇంటి దగ్గర దించుతాడు నవీన్. వాళ్ళు తిరిగి రావడానికి సిద్ధమయిన టైమ్‍కి ఫోన్ చేస్తే వచ్చి తీసుకువెళ్తానంటాడు. మేడ మీద గదిలో ఒంటరిగా కాలం గడుపుతున్న ఆనందరావుని చూసి బాధపడతాడు. వీళ్ళని చూసిన ఆనందరావు ఎంతో సంతోషిస్తారు. నవీన్ వెళ్ళిపోయాకా, సాయంత్రం దాకా కబుర్లు చెప్పుకుంటారు మిత్రులు. సాయంత్రం వచ్చి అమ్మానాన్నలని ఇంటికి తీసుకువస్తాడు. వాళ్ళ ముఖాల్లో సంతోషం చూసి, వాళ్ళని తీసుకువెళ్ళి మంచి పని చేశానని అనుకుంటాడు. ఇక చదవండి.]

[dropcap]రా[/dropcap]త్రి 10 గంటలు. ‘రేపు సాయంత్రానికి పిల్లలిద్దరూ హాస్టల్ నుంచి వచ్చేస్తారు. వాళ్ళ కోసం తినుబండారాలు చేసి పెట్టాలి. ఉదయాన్నే వేగంగా లేచి ముందు అవి చేసాక మిగిలిన పనులు మొదలు పెట్టాలి. ఆఫీస్ పనిమీద నవీన్ వైజాగ్ వెళ్ళారు.. మరో రెండు రోజుల వరకు రారు. ఈ రెండు రోజుల్లో అత్తగారి సాయంతో పిండి వంట పనులు పూర్తీ చెయ్యాలి’ అనుకుని నిద్ర పోతున్న నిత్యకి ఒక ఫోన్ కాల్ వచ్చింది.

అటునుంచి నవీన్ –

“నిత్యా.. నిత్యా, ఆనంద రావ్ అంకుల్ పోయారుట.. అమ్మా, నాన్నలకి విషయం మెల్లిగా చెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళు”

“అదేంటి మొన్ననే కదా! మనవాళ్ళు, ఆయన కుటుంబంతో వెళ్లి గడిపింది.. ఇంతలో ఇలా అయ్యిందేంటి?” అంది నిత్య

“ఏమో! ఏమైందో తెలీదు నిత్య, నువ్వు వాళ్ళని మెంటల్‌గా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళు, తన మిత్రుడిని కళ్ళారా చివరిసారి చూసుకుంటారు. మొన్న నువ్వు తిట్టకపోయివుంటే నేను వీళ్ళని ఆయన దగ్గరకి తీసుకుపోయేవాడిని కాదు సుమా!… బతికుండగా తీసుకుని వెళ్ళలేకపోయానే అని ‘గిల్ట్’ ఫీల్ అయ్యేవాడిని. జాగ్రత్త నిత్యా! వాళ్ళని జాగ్రత్తగా తీసుకుని వెళ్లి తీసుకురా!” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నవీన్.

వెంటనే..

“అత్తయ్య గారూ! అత్తయ్య గారూ! అప్పుడే నిద్ర పోయారా!”

“లేదమ్మా! ఇదిగో మామయ్య గారికి మాత్రలు ఇచ్చి, లలితా సహస్ర నామాలు చదివి, నిద్రపోతా!” అంది అత్తగారు

“ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేసారు. రేపు ఉదయాన్నే మనం ఆనంద్ రావ్ అంకుల్ దగ్గరకి వెళ్తున్నాం” అంది నిత్య.

“ఏమ్మా! ఎందుకు? మొన్ననే కదా వెళ్లి వచ్చాం”..

“అదే.. కాస్తా ఆయనకీ..”

“ఆ.. ఆయనకీ ఏమైంది నిత్యా” అంటూ లేచారు మామయ్య జగన్నాథరావు.

“అబ్బే గాబరా పడాల్సింది ఏమీ లేదు.. మిమ్మల్ని మరోసారి తీసుకురమ్మని అన్నారట.. ఉదయాన్నే బయలుదేరుదాం మామయ్యగారూ” అంది ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలీక నిత్య.

“అదేంటి మొన్ననే కదా కలిసాం. పిచ్చాపాటి సాయంత్రం దాకా మాట్లాడి వచ్చాం.”

“పాపం మా ఆనందరావు బాగా చిక్కిపోయాడమ్మా.. భార్య లేదుగా! ఆ మేడ మీద గదిలో వాడు ఉంటాడు. కొడుకు, కోడలు అంత పట్టించుకునే బాపతలు కానట్టుగా ఉంది. మనవలు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వీడితో మాట్లాడేవాళ్ళే లేరు పాపం. సమయానికి భోజనం క్యారేజ్ పంపడమే గాని, తిన్నాడా! లేదా అని పట్టించుకునే వాళ్ళు లేరు అని బాధపడుతున్నాడు” అంటూ ఆనందరావ్ అంకుల్ గురించి, అక్కడ విశేషాలు నెమరు వేసుకుంటున్నారు కాసేపు.

“మీరు నిద్ర పోండి.. తెల్లవారి లేవాలిగా” అంటూ తన రూమ్‌కి వచ్చిన నిత్యకి ఆనంద్ రావ్ అంకుల్ గుర్తుకి వచ్చారు.

‘ఎంత సరదా మనిషి ఆయన! మామయ్య గారు, అత్తయ్యగారు అక్కడికి వెళ్లి వచ్చిన తరువాత ఎంత ఉత్సాహంగా ఉన్నారు. కళ్ళల్లో ఎంత మెరుపు. ఈసారి కనీసం రెండు నెలలకోసారైనా వీళ్ళని అక్కడకు తీసుకెళ్ళమని నవీన్‌కి చెప్పాలి అనుకున్నా!.. పాపం ఆయన ఇప్పుడు లేరు.. రేపు ఉదయం అక్కడికి తీసుకెళ్లాక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో!’ అనుకుంటూ నిద్రపోయింది నిత్య.

బళ్ళున తెల్లారింది. ‘అయ్యో! అప్పుడే ఉదయం ఆరు దాటుతోంది.. ఇంత సమయం వరకు నిద్రపోయానా!’ అని లేచిన నిత్యకి ఎదురుగా అత్తయ్య, మామయ్య కనబడ్డారు. నిత్య ఎప్పుడెప్పుడు నిద్ర లేస్తుందా! అని ఎదురు చూస్తూ, కూర్చున్నారు.

ఎదురుగా వాళ్లిద్దరినీ అలా చూసి

“అయ్యో అత్తయ్యా!.. మీరు లేపచ్చు కదా!.. ఆనంద్ రావ్ అంకుల్ గురించి ఆలోచిస్తూ.. అలా తెల్లారుఝామున మొద్దు నిద్ర పట్టేసినట్టు ఉంది” అంటూ తన మంచాన్ని సవరిస్తూ..

“ఇదిగో రెండు నిమిషాల్లో వచ్చేస్తా”.. అంటూ ఒక చేత్తో కాఫీ చేసి ఇచ్చి, బాత్రూమ్‌కి పరిగెత్తింది నిత్య.

అరగంటలో రెడీ అయిపోయి.. కారు బయటకు తీసింది నిత్య.

“నిత్యా.. ఆనందరావ్ హాస్పిటల్‌లో ఉన్నాడా!.. కొంచెం మనసు కీడు శ౦కిస్తోంది” అన్నారు మామగారు.

“ఆ.. అదే.. నాకు.. అర్థం కావటం లేదు మామయ్యా! కాని ఏదో జరిగింది.. ఆయన మానసిక పరిస్థితి ఏమంత బాగాలేదని మీ అబ్బాయి మొన్న నాతో అన్నారు. పాపం ‘ఒంటరితనం’ కదా. మనసుకి కష్టంగా ఉండి.. కాని, మనమేం చెయ్యగలం?.. అంతా పై వాడి దయ” ..అని అర్థం అయీ అవనట్టు డ్రైవ్ చేస్తూ చెప్పింది నిత్య.

గుమిగూడిన జనాన్ని చూస్తూనే.. ఏదో జరిగిందని అర్థం అయినట్టుగా.. “నిత్యా” అంది సావిత్రమ్మ.

“ఆ.. పోయినట్టున్నారు.. మీరు కాస్తా నిదానించండి” అంటూ నోరు జారి.. వాళ్ళని దగ్గరగా తీసుకుని వెళ్లి.. కుర్చీ లాగి కూర్చో బెట్టింది ఇద్దర్నీ.

విషణ్ణ వదనంతో శవపేటికలో ఉన్న ఆనంద రావ్ ముఖం చూస్తూ తన స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు జగన్నాథం గారు.

“అంకుల్ మొన్న మీరు వచ్చేటప్పుడు ఏమైనా మాట్లాడారా!.. అసలు ఆయనకి ఏమీ లోటు చెయ్యలేదు నేను” అంటూ ఆనందరావ్ కొడుకు శ్రీరాం జగన్నాథరావ్‌ని పట్టుకుని ఏడుస్తున్నాడు.

ఓదార్చే ప్రయత్నం చేసినా.. శ్రీరాం మీద కోపంగానే ఉంది జగన్నథరావ్‌కి.

ఆనందరావు పార్థివ దేహాన్ని చూడడానికి అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు.. ఉత్సవంలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసి చూసివెళ్తున్నారు. ఆప్త మిత్రుని పార్థివ దేహాన్ని చూడడానికి ఉత్సవంలా విచ్చేస్తున్న జనాలని చూసి.. “ఎంత పేరుంటే ఏం?.. చివరికి ఈ ప్రపంచంలో బతకలేక పోయాడు” అని బాధపడ్డారు జగన్నాథం.

“ఆయన ఆ మేడ మీద బతికున్నాడా! చస్తున్నాడా! అని చూసేవారే లేకపోయే. తిండి టైంకి అమరిస్తే చాలా?.. ఎవరు మాట్లాడకుండా.. ఎలా?” అంది ఒకావిడ.

“టి.వి. పెట్టాము, ఫ్రిడ్జ్ పెట్టాం అంటే సరిపోతుందా!.. పెద్ద వాళ్ళను కనిపెట్టుకుని ఉండద్దూ” అంది ఇంకో ఆవిడ.

ఇలా ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు

“నిత్యా.. ఇక మమ్మల్ని తీసుకెళ్ళమ్మా.. ఇక్కడ ఇంకా ఉండలేం” అంటూ వచ్చిన అత్తగారు సావిత్రిని చూసి, శ్రీరాం భార్య సునీతని వదిలి బయలుదేరింది నిత్య.

“జనం ఉత్సవంలా వస్తూనే ఉన్నారు.. చూసి వెళ్తున్నారు.. ఎంతమంది.. ఒక జనసంద్రం.. పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చారు?.. అందరూ వాడి మంచితనాన్ని మెచ్చుకునేవారే.. ఇది మామూలు మరణంలా అనిపించటం లేదు నిత్యా! ఏమి జరిగి ఉంటుందో.. ఏమో” అని అనుమానం వ్యక్తం చేసారు జగన్నాథం.

ఆ జనాలలోనుంచి బయటకి వచ్చి బయలుదేరి కారు ఎక్కారు మౌనంగా.. గుండె భారంగా ఉంది. దారిలో జగన్నథరావ్ గారు, సావిత్రి గారు ఏమీ మాటలాడలేదు.

ఇంటికి వచ్చాక.. “సావిత్రి.. వాడు, వాడు.. ఎలా పోయాడో తెలీదు గాని, ఎందుకు పోయాడో నాకు తెలుసు.. ఒంటరితనం.. భయంకరమైన ఒంటరితనం.. అది భరించడం చాలా కష్టం సుమా! పలకరింపు కరువైన వృద్దాప్యం ఉంటే ఎంత? పోతే ఎంత? మనసు వదిలి తనను తాను అంతం చేసుకుని ఉంటాడు. ..కేవలం పలకరింపు లేక..” అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తున్న మామయ్యగార్ని చూసి చలించిపోయింది నిత్య. అత్తయ్యని పట్టుకుని ఏడుస్తున్న మామయ్యగారిని చూసి “వృద్దాప్యంలో ఒంటరి అయితే ఇంత కష్టంగా ఉంటుందా!” అని వలవలా ఏడ్చేసింది నిత్య వాళ్ళతో పాటు.

ఆ రోజు సాయంత్రం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చక్రి, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నసునంద వచ్చారు.

తాతయ్యా.. నానమ్మా అంటూ పలకరించడానికి వెళ్ళిన వాళ్ళతో ముభావంగా ఉన్న వాళ్ళని చూసి వెనక్కి వచ్చేసారు.

“అమ్మా.. అమ్మా.. ఏంటి అలా డల్‌గా ఉన్నారు తాతయ్యా, నాని, ఏమైంది?” అన్నాడు చక్రి

“తాతయ్య బాల్య మిత్రుడు ఆనందరావ్ తాతగారు ఉన్నారు కదా! ఆయన చనిపోయారు. అందుకే మూడ్ ఆఫ్‌లో ఉన్నారు. కాసేపు పోయాక వెళ్లి మాట్లాడండి” అని చెప్పింది నిత్య.

మరుసటి రోజు వచ్చిన నవీన్‌తో కూడా అలా పొడి పొడిగా మాట్లాడారు వాళ్ళిద్దరూ.

“నిత్యా.. నిత్యా.. అమ్మానాన్నలు ఆనందరావ్ అంకుల్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళని అలా చూడలేకపోతున్నా! మనసుకి చాల కష్టంగా ఉంది నిత్యా” అని బాధపడ్డాడు నవీన్.

“నిజమే.. కాని ఏం చేస్తాం? కొంచెం సమయం పడుతుంది మరి .ప్రియమైన బాల్య మిత్రుడు చనిపోయాడ౦టే బాధే కదా! అందరూ ఉండి, ఒంటరిగా.. తలచుకుంటే భయంగా ఉంది నవీన్” అని ఏడ్చేసింది నిత్య.

ఒకర్ని ఒకరు ఓదార్చుకుంటూ.. “పిల్లలు సెలవులకు వచ్చారు.. తాతయ్య నానమ్మ అలా ఉండటం వాళ్లకి బాగా లేదట. ఫీల్ అవుతున్నారు” అంది నిత్య.

పిల్లలని పిలిచి “ఆ భాదని మరిపించేటట్టు మీరే చెయ్యాలి.. అలా వెళ్తూ.. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కాస్త డైవర్ట్ అవుతారు, వెళ్ళండి వెళ్ళండి” అంటూ పిల్లలకి చెప్పడంతో.. యథావిధిగా సరాసరి క్యారం బోర్డ్‌తో తాత రూమ్ లోకి పయనమైపోయారు చక్రి, సునందలు.

***

టక్.. టక్.. టక్.. మన్న శబ్దం.

“ఎవరై ఉంటారు?..” అంది నిత్య.

“ఏమో వెళ్లి తలుపు తియ్యి నిత్యా” అన్నాడు నవీన్

తలుపు తీసిన నిత్య.. ఎదురుగా రాజీ.. ఇంకో పక్కింటి ఆవిడని చూసి,

“రా.. రాజీ లోపలికి రా.. ఏంటి ఇలా వచ్చావ్?..” అంది.

ఒక వైపు పొయ్యి మీద టిఫిన్ కలుపుతూ, “రా కాఫీ తాగుదాం” అంటూ కాఫీ పెట్టడానికి సిద్దమైంది నిత్య.

‘ష్.. రాజీనా.. ఇక అంతే.. నిత్య నోరు తెరవదు.. రాజీ నోరు ముయ్యదు’ అనుకుంటూ లోపలికి వెళ్ళాడు నవీన్.

“ఒక్క నిమిషం రాజీ” అంటూ కుర్చీలో తనని కూర్చోబెట్టి హాట్ బాక్స్‌లో టిఫిన్ రెడి చేసి “సునందా ఇవి తీసుకుని వెళ్ళు” అని కూతురు సునందని కేకేసింది.

ఓ కప్పు కాఫీ రాజీకిచ్చి, కాఫీ తాగుతూ.. “ఏంటి సంగతులు రాజీ?” అని అడిగి వదిలేసింది నిత్య.

ఇక ఆపడం రాజీ వంతు.. అది ఎప్పుడు? ఎలా? ఎక్కడ? అన్న విషయం మనకు తెలియదు.. అందుకే గాబోలు.. నిత్య ముందుగా టిఫిన్ ప్లేట్స్‌తో పాటు హాట్ బాక్స్‌లో టిఫిన్ పెట్టి, “పిల్లలూ, మీరు తాతయ్య వాళ్ళతో తినండి” అని చెప్పి, “నవీన్ మీకు కూడా టిఫిన్ కూడా అక్కడే. తిన్నాక అన్నీ నేను వచ్చి తీసుకుంటా” అంది నిత్య.

అంటే మళ్ళీ భోజనం అయ్యేవరకు ఇటు రావద్దు సుమా! అని చెప్పకనే చెబుతుంది.. నిత్య.

కాఫీ తాగిన రాజీ “చాలా బాగుంది నిత్యా నీ చేతి కాఫీ” అంది.

“గ్లాసు కాఫీ తాగాలంటే భయం.. ప్లేట్ నిండా టిఫిన్ పెట్టుకోవాలంటే భయం.. ఇదేమి చోద్యం చెప్పు నిత్యా, బండెడు చాకిరి చేసిన నేను కడుపుకి తినకపోతే ఎలా చెప్పు? నా తిండికే జీతం అయిపోయినట్టు మా ఆయన ఫోజు.. వీళ్ళ అమ్మానాన్నకి, ఈయన గారికి మాత్రం అన్నీ చేసి పెట్టాలి. పొద్దస్తమానం పని చేస్తే ఇక నేను వీళ్ళని ఉత్సవాలకి ఎలా తీసుకుపోగలను? చెప్పు? పోనీ వంట, పెంట లేకుండా బయటకి తీసుకుని వెళ్లి, అటునుంచి అటు బయట తిందామంటే.. ససేమిరా వద్దట.. బయట ఫుడ్ వాళ్లకి పడదట.. తేరగా నేను ఒకదాన్ని దొరికాను చాకిరి చెయ్యడానికి. అయినా! ఇదేమి చోద్యం నిత్యా.. మమ్మల్ని ‘కట్టేశారు’.. ఇక్కడ తెచ్చి ‘పడేసారు’.. అంటారు ఎంత సేపూ.. ఆ పల్లెటూరులో ఏముంది? పోయే కాలం కాకపోతే, ఇక్కడ నీడ పట్టున వండి వార్చింది తినక. అయినా! నా మొగుడిని అనాలి.. వాళ్ళు అక్కడే చస్తానంటే.. ఇక్కడకి ఎందుకు తీసుకురావాలి నిత్యా.. ఈయన గారికేం? ఆఫీస్ ఉందని పోతాడు.. ఇంట్లో నేను కదా! చావాల్సింది..

పోనీ నాకైనా ఒక విలువ ఏడ్చిందా! ఈ చీర కావాలంటే, ఇంత నోరు.. ఆ వస్తువు కావాలంటే అంత నోరు వేసుకుని పడిపోవడమే కాని.. అయ్యో పాపం నా ఇంటిల్లపాదికి సేవ చేస్తున్న పెళ్ళానికి చిన్న చిన్న కోరికలుంటాయి, అవి తీర్చాలి అని ఉండదే ఆ మనిషికి? చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చడానికి మనసు ఒప్పదు కాక ఒప్పదు.. నా అవసరాలు ఆయనగారు కాకపోతే ఎవరు తీరుస్తారు చెప్పు? ఎవర్ని అడగగలను చెప్పు?

పెళ్ళాం ఒకర్తి ఉంది.. దానికి ఆశలు ఉంటాయి అని గమనించరేం వీళ్ళు?

నిన్నటికి నిన్న కూర ఎందుకు ఇంత ఎక్కువ వండావు? అంటాడు. పిల్లలిద్దరూ హాస్టల్‌లో ఉన్నారు కదా!.. కొంచెం పొదుపు పాటించు అంటాడు. ఇవాల్టికి ఇవాళ.. కడుపు నిండా తినాలి కదా!. ఎక్కడ లేని పొదుపు తిండి దగ్గరే నీకు.. ఇంట్లో నలుగురు ఉంటే.. ఇద్దరికి సరిపడా వండితే ఎలా?.. అమ్మానాన్న తినద్దా! అంటాడు.. చచ్చిపోతున్నా అనుకో నిత్యా.

మొన్న ఒక రోజు మా అత్తగారి చెల్లెలి కూతురు ఇంటికి వస్తే నా దగ్గర వాడని చీర ఒకటి ఉంటే బొట్టు పెట్టి ఇచ్చా.. ఇలాగే సంసారం తగలెడుతున్నావ్ అని మా అత్తగారు నస. ఇచ్చింది వాళ్ళ చెల్లెలు కూతురికేగా?.. అయినా ఎందుకో?

నిన్న మా చిన్నాన్న కూతురు వచ్చింది.. జాకెట్ గుడ్డ కూడా పెట్టకుండా కాఫీ ఇచ్చి పంపించేసా! అసలు మంచి మర్యాద ఉన్నాయా నీకు.. కనీసం జాకెట్ గుడ్డ కూడా పెట్టే మర్యాద తెలీదా! అని ఒకటే నస.. ఇంట్లో ఉండబుద్దికావటం లేదు నిత్యా.

అసలు ఎంత వింత కాకపోతేనూ!.. శుక్రవారం పూట తలంటుకుని తలలో పూలు పెట్టుకుని వంట చేస్తుంటే ఎవరి కోసం ఈ సింగారింపు అంటాడు నా మొగుడు ముండా కొడుకు. ఎంత బాధగా అనిపించిందో ఆ మాటలు విని.

ఈయన మాత్రం టింగురంగడులా తయారై ఊరు మీదకి సెంటు కొట్టుకుని మరీ పోతాడు.. వీళ్ళమ్మ ఈ వయసులో కూడా చీర నలగనీయదు.. చెమట పట్టనియ్యదు.. ఆ ముసలాడి పక్కనే కూర్చుని ముద్దుల మొగుడికి ముద్దలు అందిస్తుంది” అంటూ తనలో ఉన్నఅసంతృప్తిని బయటకి కక్కేసి, కళ్ళనుంచి జాలువారుతున్న కన్నీటిని చెంగుతో తుడుచుకుంది రాజీ.

‘హమ్మయ్య లాస్ట్ ఘట్టం ముగిసింది’ అని మనసులో అనుకున్న నిత్య “రా రాజీ ఈ రోజు మంచి పెసరట్టు వేసాను.. తిని వెళ్ళు” అంటూ పళ్ళెంలో ఒడ్డించి౦ది.

వారానికి ఒకసారి వచ్చే రేడియో కార్యక్రమంలా వచ్చే ఈ ‘రాజీ పడిని రాజీ’ బాధని వినాల్సిందే.

ఇవన్నీ చాటుగా వింటున్న నవీన్, ‘ఈ రోజు కాస్తా వేగం గానే ముగించింది.. థాంక్ గాడ్’ అనుకున్నాడు మనసులో.

అంతా ఓపికగా విన్న నిత్య “రా రాజీ.. ఆ ముఖం కడుక్కుని ఈ టిఫిన్ తిను ప్రశాంతంగా” అంది.

“అయ్యో! ప్రతిసారి నాకు ఏదో ఒకటి పెట్టి సముదాయిస్తావ్.. తినకపోతే వదలవ్ కదా! తింటాలే.. ఇవన్నీ నీకు చెబితే నా మనసు తేలిక పడుతుంది నిత్యా.. అన్నట్టు.. ఈ మాటలు నీ మనసులోనే ఉంచుకో సుమా!.. అయినా నువ్వెవరితో అంటావ్? నా పిచ్చి గాని. నీ మీద నాకు ఉన్న నమ్మకం అలాంటిది. అందుకే నా మనసులో ఉన్న బాధంతా నీతోనే చెప్పుకుంటా” అంటూ ముక్కు చీదుకుంటూ ముఖం కడుక్కుని నిత్య పెట్టిన టిఫిన్ నిదానంగా తిని ఇంటికి వెళ్ళిపోయింది రాజీ.

“నిత్యా ఏంటి ఈ సోద.. తను రావడం బాగుంది.. నువ్వు వినడం బాగుంది.. వారానికొకసారి తన భాదంతా నీతో చెప్పుకోనిదే..” అంటున్న నవీన్‌తో

“అయ్యో! నవీన్, పక్కవాళ్ళ బాధ వింటే మన భాధలు చిన్నవైపోతాయి తెలుసా! మన ఇంట్లో ఇటువంటి గొడవలు లేవు. మనం చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. ఒక్క అరగంట అలా మామయ్యా గారితో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పండి.. చిటికెలో గిన్నెలు సర్దేసి వచ్చేస్తా!” అంది.

నిత్యని మెచ్చుకోవాలని ఉంది.. ఎందుకంటే ఎంతో శ్రద్ధగా పక్కవాడి సమస్య వింటుంది.. పోనీ పరిష్కారం ఏమైనా చెబుతుందా అంటే.. హు.. హు..

“సమస్య వాళ్ళదే.. పరిష్కారం వాళ్ళదే. మనమేమి వాళ్లకు సలహా ఇవ్వనక్కరలేదు. వాళ్ళ సమస్యకు వాళ్ళే పరిష్కారం వెతుక్కోగలరు, ఎటొచ్చి వాళ్ళ సమస్యని వినే ‘శ్రోత’ కావాలి అంతే.. వాళ్ళ బాధ తగ్గిపోతుంది” అంది వేదాంతిలా నిత్య.

‘అయితే ‘శ్రోత’ పాత్ర నువ్వు పోషిస్తున్నావ్ అన్నమాట’ అనుకున్నాడు నవీన్ మనసులో

అనుక్నట్టే అరగంటలో వచ్చేసింది నిత్య.

“ఇదిగో ఈ రోజు ఆదివారం.. కాస్తా సాయంత్రం నా టైం ఎవరికీ ఇచ్చేయకేం?.. నీతో చాలా పనుంది” అంటూ కొంటెగా చూస్తున్న నవీన్ వైపు చూసి సిగ్గుపడింది నిత్య.

(సశేషం)

Exit mobile version