Site icon Sanchika

వసంత లోగిలి-3

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[రాత్రి పదవుతుంది. నిద్రపోడానికి సిద్ధమవుతున్న సమయంలో నిత్యకి ఫోన్ చేస్తాడు నవీన్. ఆనందరావు అంకుల్ చనిపోయారని చెప్పి, మర్నాడు ఉదయం అమ్మానాన్నలని అక్కడకి తీసుకువెళ్ళమని చెప్తాడు. బాధ్యపడుతుంది నిత్య. అత్తయ్య వాళ్ళ గదిలోకి వెళ్తుంది నిత్య. మీ అబ్బాయి ఫోన్ చేశారత్తయ్యా, ఆనంద రావుగారికి బాలేదుట. రేపు పొద్దున్న మిమ్మల్ని తీసుకువెళ్ళమని చెప్పారు అని చెప్తుంది. వాడికేమయింది అంటూ కంగారు పడతారు జగన్నాథదరావు. కంగారు పడాల్సిందేం లేదని వాళ్ళకి చెప్తుంది. మర్నాడు ఉదయం వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ చాలామంది ఆనందరావు భౌతికకాయాన్ని చూడ్డానికి వస్తారు. మిత్రుడు చనిపోయాడని జగన్నాథరావుకి అర్థమవుతుంది. కాసేపు శవం దగ్గర కూర్చుని, తర్వాత ఇంటికి వచ్చేస్తారు. మర్నాడు ఉదయం పని చేసుకుంటుంటే తలుపు తట్టిన చప్పుడు వినిపిస్తుంది. ఎవరో చూడమంటాడు నవీన్. వెళ్ళి తలుపు తీస్తే, పక్కింటి రాజీ కనబడుతుంది. ఆమెను లోపలికి పిలుస్తుంది నిత్య. నవీన్ లోపలి గదిలోకి వెళ్ళిపోతాడు. నిత్య అత్తమామలకు, భర్తకు టిపిన్ ఏర్పాటు చేసి, తనకీ, రాజీకి కాఫీ కలుపుతుంది. కాఫీ ఆమెకు అందిస్తూ, ఏంటి విషయం అని అడిగుతుంది. రాజీ తన గురించి, తన కుటుంబం గురించి తన ఇబ్బందుల గురించి చెప్పుకొస్తుంది. ఆమెను ఊరడించి పంపుతుంది నిత్య. వాళ్ళ సమస్యలన్నీ మనకెందుకు అని నవీన్ అడిగితే,  సమస్య వాళ్ళదే, పరిష్కారమూ వాళ్లదే. వాళ్ళకి కావల్సిందాల్లా తమ గోడు వినే ఓ శ్రోత, అంతే అంటుంది. ఇక చదవండి.]

[dropcap]“అ[/dropcap]మ్మా! అమ్మా ఏం చేస్తున్నావ్.. నా ట్రైన్ రేపు మద్యాహ్నం మూడు గంటలకేగా.. గుర్తు లేదా! బట్టలు సర్దుకోవాలి రా.. మా.. సాయం చెయ్యి” అంటూ వచ్చింది సునంద.

“అదేంటి చక్రి కూడా రేపే బయలుదేరుతాడా! వచ్చినట్టే లేదు.. పది రోజులు యిట్టే గడిచిపోయాయి” అంటూ “చక్రీ సున్నుండలు, చేగోడియాలు, జంతికలు రెడీగా ఉన్నాయి.. ఇంకా ఏమైనా కావాలంటే ఇప్పుడే చెప్పు” అంది నిత్య.

“అమ్మా! అన్నీ వాడికిష్టమైనవే.. నాకిష్టమైన లడ్డు చెయ్యలేదా!” అంది సునంద.

“ఎందుకు చెయ్యలేదు సునందా!.. అవిగో నేను చేసాను” అంటూ వచ్చింది నానమ్మ సావిత్రి.

“ఎందుకు నాని, దానికి చేసి పెట్టడం శుద్ధ దండగ.. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ తిని బతికేస్తుంది ఆవిడ.. ఆ లడ్డు కూడా నాకే పెట్టు” అన్నాడు చక్రి.

“అలా ఏమీ లేదు నాని.. వాడన్నీ అలాగే చెబుతాడు.. నేను బయట ఫుడ్ ఎపుడైనా మిత్రులతో.. అలా అలా.. వెళ్ళినప్పుడు తింటాను.. అంతే నానమ్మా” అంది సునంద.

“అన్నట్టు మిత్రులంటే గుర్తొచ్చింది.. నిన్న నీ స్నేహితురాలు ఇంటికి వెళ్ళావ్ కదా! కుందన ఎలా ఉంది? వాళ్ళ అమ్మ, నాన్న బాగున్నారా! వాళ్ళ అమ్మమ్మ.. తాతయ్య ఎలా ఉన్నారు.. పాపం మన ఇంటి పక్కనే ఉన్నప్పుడు బాగా కబుర్లు చెప్పేది.. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాక కలవడమే లేదాయే” అంది సావిత్రి.

వాళ్ళని తలచుకోగానే ముఖంలో రంగులు మారిపోయాయి సునందకి. అది గమనించిన నానమ్మ.. “ఎందుకే అలా ఉన్నావ్.. ఏమైంది సుశీల అమ్మమ్మ, సుబ్బారావ్ తాతగారి గురించి అడుగుతుంటే అలా ముఖం మాడ్చుకున్నావేంటి?” అని అడిగింది.

“అదే నానమ్మ.. నాకు.. వాళ్ళను తలచుకోగానే భలే బాధ అనిపిస్తోంది.. నాకు వాళ్ళు కనపడలేదు. వాళ్ళ గురించి అడిగితే కుందన బాగా ఏడ్చింది నానమ్మా.”

“అవునా! ఎందుకు?” అంది అప్పుడే అక్కడికి వచ్చింది నిత్య.

“మొన్న ఈమధ్య కుందన వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని బయటకి ‘నెట్టేసారంట’ వాళ్ళ నాన్న.. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలియదు.. కుందన వాళ్ళ అమ్మ గారు రోజూ ఏడుస్తున్నారుట.” చెప్పింది సునంద.

“అయ్యో రామా!.. అలా ఎలా జరిగింది. ఎందుకలా చేసారుట?” అన్న నానమ్మతో

“ఏమో నానమ్మా! కారణాలు పెద్దగా తెలియవు.. కుందన బాగా ఏడుస్తోంది.. కుందనకి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం. పైగా వాళ్లకి కుందన వాళ్ళ అమ్మ ఒక్కరే ఉన్నారు.. మరి ఎక్కడికి వెళ్ళారో ఏమో” అంటున్న సునంద మాటలకి సావిత్రి భృకుటి ముడిపడింది.

“అయ్యో.. వాళ్ళు ఎక్కడున్నారో అత్తయ్యా.. పాపం.. సుశీల ఆంటీ చాలా మంచివారు.. సుబ్బారావు అంకుల్ కూడా చాలా మంచివారు.. ఎందుకో.. అలా..” అంది నిత్య.

“మనకి ‘మంచి’ అయితే ఏమి లాభం నిత్యా.. అల్లుడికి ‘మంచి’ కావద్దు? దుర్మార్గుడు.. బయటకు నెట్టేయడమేంటి?” అంది సాలోచనగా సావిత్రి.

“అల్లుడా..”

“అవును నిత్యా.. ఆ అల్లుడు ఒక దుర్మార్గుడు.. వీళ్ళకున్నది ఒక్కటే కూతురు.. వాళ్ళు తన దగ్గర కాకపొతే ఎక్కడ ఉంటారు చెప్పు?.. ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూతురు అల్లుడు పేరు మీద బదిలీ చేసి సుశీల అంటీ వాళ్లు వీళ్ళ పంచన చేరారు. ఆ అల్లుడు మంచివాడు కాదని, కూతుర్ని తమ ముందే హింసిస్తాడు అని చాలా సార్లు చెప్పుకుని బాదపడింది. పాపం వీళ్ళని కూడా బయటకు నెట్టేసాడ౦టే ఎంత దుర్మార్గుడో.. ఆ అల్లుడి మీద నమ్మకం లేక.. కూతురి పేరు మీద ఆస్తి రాయబోతే, ఇద్దరి పేరు మీద రాసి, ‘ఇక్కడ ఉండండి’ అని వాడే బలవంతం చేసాడంట.. దాంతో ఇద్దరి పేరు మీద రాయక తప్పలేదు. పాపం వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. ఏమో!” అంది సావిత్రి.

“మన పక్కింట్లో ఉన్నప్పుడు పాపం కష్టం, సుఖం చెప్పుకునేది నిత్యా”.. అంది సావిత్రి.

“అయ్యో! పాపం.. వయసు మీద పడ్డ వాళ్ళు ఎక్కడకని వెళ్తారు.. ఎలా వెళ్తారు?” అంటూ బాధపడింది నిత్య.

“అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లి ఉ౦టారు నిత్యా?” అంది అత్తగారు సావిత్రి.

“అదే నాకు అర్థం కాలేదు అత్తయ్యా” అంటూ ఏదో ఆలోచిస్తున్న నిత్య మనసు పరి పరి విధాలుగా పోతోంది. వృద్దాప్యం ఇంత కష్టమా!.. అది శాపమా!.. దురదృష్టమా!.. ఎంత గొప్పవారికైనా తప్పని ‘కష్టం’. ఎవరు తప్పించుకోలేని ‘కష్టం’.. ఈ కష్టాన్ని ఇష్టంగా మార్చేది ఎలా? ఎలా? అనుకుంది మనసులో.

ఆమె ఆలోచనలకు భంగం కలిగిస్తూ.. ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్ మోగింది.. నిత్య ఆలోచనలకు అడ్డుకట్ట పడింది.

“హలో హలో.. ఎవరు?”

“నేను నిత్యా, శారదని..”

“ఏంటి శారదా.. ఎలా ఉన్నావ్?.. చాలా రోజులకు గుర్తొచ్చినట్టు ఉన్నాను.. ఊరకనే ఫోన్ చెయ్యరు మహానుభావులు.. మా సహాయ సహకారాలు ఏమైనా కావాలా?.. ఏమి సంగతులు?” అని ఆపకుండా ప్రశ్నిస్తున్న నిత్యతో ..

“కాస్త ఆగుతావా నిత్యా!.. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను మద్రాస్ వచ్చి చెప్పాలనుకుంటున్నా, నీకేమైనా అభ్యంతరమా!” అంది శారద.

“ఎంత భాగ్యం? ఎంత భాగ్యం? మా మద్రాస్‌లో మెరీనా బీచ్ పునీతమయ్యే భాగ్యం.. మా చెన్న కేశవ పెరుమాళ్ పొంగిపొరిలే భాగ్యం.. మా ఇల్లు పావనమాయే భాగ్యం.”

“అమ్మా! భాగ్యం కాస్తా ఆపుతావా! నీ భాగ్య పురాణం. అక్కడకి వచ్చి నీ ముందు నిలబడి గుంజీలు తీస్తాను నిత్యా.. ప్లీజ్.. నన్నుమోసేయ్యకే.. కాస్తా గ్యాప్ ఇస్తే.. నీతో మాట్లాడాలి” అంది శారద

“ఆ.. అలా రా దారికి.. ఇప్పుడు చెప్పు శారద” అంటున్న నిత్యతో..

“ఈ నెల రెండో తారీకున మా సీనియర్ సిటిజన్‌ని వెంటపెట్టుకుని మద్రాస్ వస్తున్నా.. మీ ఇంట్లో ఓ నాలుగు రోజులు ఉండాలనుకుంటున్నాను. ఎందుకు వస్తున్నాం.. ఏమిటి? అన్న వివరాలు అక్కడకు వచ్చి మాట్లాడుతా.. నీ అవసరం చాలా ఉంది.. నువ్వు హెల్ప్ చేస్తావన్న నమ్మకంతో అక్కడకి వస్తున్నా. పరవాలేదు కదా!.. మీ ఇంట్లో ఉండచ్చు కదా నిత్యా!” అంది శారద.

“భేషుగ్గా ఉండచ్చు.. అందులో ఎటువంటి మోహమాటం లేదు శారదా..” అంది నిత్య.

“ఓ.కే. నేను వచ్చాక మాట్లాడతా తీరిగ్గా” అని ఫోన్ పెట్టేసింది శారద.

“ఎవరు నిత్యా ఫోన్‌లో..” అడిగాడు నవీన్.

“మా శారద, నవీన్.. విశాఖపట్నం నుంచి. తను వాళ్ళ మామగారితో మద్రాస్ వస్తోంది.. మనింట్లో నాలుగు రోజులు ఉంటుందిట.. ఏదో పని మీద వస్తున్నట్టు చెప్పింది. పని ఏమిటో చెప్పలేదు.”

“ఓహ్.. అవునా!.. నాన్నగారికి మంచి కాలక్షేపం.. పోనీలే” అన్నాడు నవీన్.

“ఏ పనో.. వచ్చాక చెబుతా.. నీ సహాయం కావాలి అంటోంది.. ఏంటో!.. నాకు అర్థం కావటం లేదు నవీన్” అంది నిత్య.

“వచ్చాకా ఎలాగూ చెబుతుంది.. రెండో తారీకు అంటే నాలుగు రోజులే ఉంది.. తినబోతూ రుచి ఎందుకు?” చెప్పు అన్నాడు నవీన్

“కదా!.. సర్లెండి. పిల్లలకి కావలసినవి సర్ది పెట్టాలి. రేపే వాళ్ళ ప్రయాణం” అంటూ లోపలికి వెళ్ళింది నిత్య

“నేను కూడా నీకు హెల్ప్ చేస్తా నిత్యా” అంటూ కొంగు పట్టుకుని వెనకాలే వెళ్తున్న కొడుకుని చూసి నవ్వుకున్న సావిత్రమ్మ.. వాళ్ళ మధ్య నేనెందుకు అన్నట్టు తమ గదికి వెళ్ళిపోయింది.

***

“నిత్యా.. నిత్యా” అంటూ లోపలికి సరాసరి వస్తూనే.. “ఏంటే దాదాపు పదేళ్ళ తరువాత వచ్చిన నేస్తానికి నువ్వు చేసే మర్యాద ఇదేనా! మీ ఆయనని కారిచ్చి పంపితే చాలా! మేళాలు, తాళాలు, భాజా భజంత్రీలు లాంటివి ఉండాల్సిన అవసరం లేదా! ఏంటి మాట్లాడవ్? మీ అరవ మర్యాదలు ఇవేనా!” అంటూ అభినయం చేస్తున్న స్నేహితురాలిని చూస్తూ..

“అయ్యో రామా! అవన్నీ పంపాను కదా! రాలేదా! నా స్వాగత సత్కారాలు ముందుగానే వచ్చి వాలాయే! నువ్వు రౌండ్‌గా తయారయ్యావు కదా! నీ పాత ఫోటో పెట్టి పంపానులే.. బహుశా వాళ్ళు పోల్చుకుని ఉండరు” అంటూ.. వెనకాలే నిలబడ్డ బక్కచిక్కినట్టు కనిపించే పెద్దాయనకి ఒక నమస్కారం పెట్టి “రండి అంకుల్ నేను, శారద చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్.. అంటే హైస్కూల్ నుంచి కలసి చదువుకున్నాం.. అందుకే చనువుగా ఇలా.. ఇదంతా మాకు అలవాటే.. మీరు రండి” అంటూ లోపలికి ఆహ్వానించింది నిత్య.

“సంతోషం తల్లీ, మా కోడలు నీ గురించి చెప్పింది” అన్నారు శారద మామయ్య సూర్యనారయణగారు.

“అమ్మా! నేను కాస్తా బాత్ రూమ్‌కి వెళ్ళాలి”.. అనగానే..

“రండి మామయ్యా నేను తీసుకువెళ్తాను” అంటూ చేతిలో బాగ్ తీసుకొని, అందులో టవల్ తీసి,.. “బాత్ రూమ్ ఎటువైపే నిత్యా?” అని అడిగి, తీసుకు వెళ్ళింది వాళ్ళ మామగార్ని శారద.

స్నానం చేసి వచ్చిన వెంటనే నిత్య మామగారికి, శారద మామయ్యని పరిచయం చేస్తూ ఇద్దరికీ టిఫిన్ పెట్టించి వారి రూమ్ లోకి పంపింది నిత్య.

అల్పాహారం అనంతరం ఓ వైపు నడుం వాల్చారు నిత్య అత్తగారు.

“బడలిక తీరే వరకు కాస్త రెస్ట్ తీసుకోండి” అంటూ నిత్య మామగారు, శారద మామగారికి చెప్పడంతో ఆయన కోసం ఏర్పాటు చేసిన మంచం మీద ‘హమ్మయ్య’ అంటూ సాగిలపడ్డారు సూర్యనారాయణ గారు.

టిఫిన్ తింటూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న నిత్య, శారద.. కాసేపు అయ్యాక మేను వాల్చారు.

ఇంతలో.. “నిత్యా.. నాకు నీ సహాయం కావాలి, మా మామయ్య గారి విషయంలో” అంది శారద.

“అడగవే.. మీ మామయ్య గారి విషయంలో నేనేమి హెల్ప్ చెయ్యగలను?” అంది నిత్య.

“ఆఁ, ఏం లేదు.. నీకు తెలుసు కదా.. మామయ్య గారు ప్రైవేటు కాలేజ్‌లో తెలుగు లెక్చరరు.. వయసు 58 సంవత్సరాలు.. ఈమధ్య ఆయనకి అనారోగ్య సమస్యలు వచ్చాయి. ప్రయివేట్ కాలేజ్ కదా! వాళ్ళు తీసేసారు.. మాయదారి గుండె జబ్బు వచ్చి, ఆయన హార్ట్ బాగా డామేజ్ అయింది, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చెయ్యాల్సి ఉంది. కాని దానికి చాలా ఖర్చు చెయ్యాలి. నీకు తెలుసు కదా! మధ్య తరగతి బతుకులు ఎలా ఉంటాయో!.. నా భర్త సునీల్ ఆరు నెలల నుంచి ఉద్యోగం లేక ఇంట్లో ఉన్నాడు.. జాబ్ సెర్చింగ్‌లో ఉన్నాడు.. పిల్లలు ఇద్దరు ఇంకా కాలేజ్ చదువుల్లో ఉన్నారు.. ఈ పరిస్థితుల్లో మామయ్య గారికి ఇప్పుడు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే.. భయంగా ఉంది..” అంటూ ఆగింది శారద

“దేనికి భయం శారద? ఇక్కడ మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ చెయ్యచ్చు.”

“కరెక్టే.. కాని.. నువ్వు నాకు.. నాకు ఒక సహాయం చెయ్యాలి నిత్యా! మీ మామయ్య హార్ట్ స్పెషలిస్ట్ కదా!.. అతని దగ్గర.. ఆపరేషన్” అంది శారద

“ఎందుకే అలా నసుగుతావ్, ఇందులో ఆలోచించడానికి ఏముంది చెప్పు” అంది నిత్య.

“అతని దగ్గరకి తీసుకుని వెళ్లి .. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అవసరం లేదని చెప్పించగలిగితే..” అని ఆగింది నిత్య ముఖం చూసి శారద.

“ఏం మాట్లాడుతున్నావ్ శారదా.. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ చెయ్యాల్సి ఉందని నువ్వే చెప్పావు కదా!.. డాక్టర్స్ చెప్పారని చెబుతున్నావ్ కదా!”

“చెప్పానే కాని.. అది చెయ్యాలంటే చాలా డబ్బు కావాలి.. ఆ డబ్బు నా వద్ద లేదు.. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ చేయిస్తానని చెప్పి తీసుకువచ్చాను.. కాని మీ మామయ్య డాక్టర్ కదా! ఆయనకీ ఒకసారి చూపించి ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అవసరం లేదు.. మీ గుండె బాగానే ఉంది, అని చెప్పించాలి. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అవసరం లేదు అని చెబితే చాలు.. డాక్టర్ చెబితే పరవాలేదు.. ఆయన నమ్ముతారు” అని ఆగింది శారద.

“నమ్మడమేంటి శారద?.. నమ్మించడమేంటి శారద? నాకేమి అర్థం కావటం లేదు” అంది నిత్య

“అవును నిత్య నమ్మించాలి. ఎందుకంటే.. ఆయనకి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చెయ్యాల్సిందే అన్నారు డాక్టర్స్ కాని, నా దగ్గర అంత డబ్బు లేదు.. పైగా మా ఆయన నుంచి పైసా ఆదాయం లేదు ఇప్పుడు నాకు. పట్నం డాక్టర్ ఆపరేషన్ అవసరం లేదని చెబితే.. మామయ్య హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఊసు ఎత్తరు. అదే నేను చెబితే డబ్బు ఖర్చు గురించి ఆలోచిస్తున్నాను అని అనుకుంటారు. అదే.. మీ మామయ్య డాక్టర్ కదా! అతని చేత చెప్పిస్తే..” అని ఆగింది శారద.

“ఏంటీ? హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమైనా, అవసరం లేదు అని చెప్పించాలా!.. అసలు ఏమి మాట్లాడుతున్నావ్ శారదా! మతి ఉండే మాట్లాడుతున్నావా! ఓహ్.. ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చెయ్యడానికి వచ్చావన్నమాట.. నీకు సిగ్గుగా అనిపించలేదా శారదా? అది ‘ప్రాణం’. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే నిలుస్తుంది.. లేకుంటే – కొన్ని గంటలు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కళ్ళముందుండే ప్రాణం పోతుంది. మనిషి కనుమరుగైపోతాడు.. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాడు. ఖర్చు కోసం అలోచించి ఇంత నీచంగా ఎలా అలోచించావ్ శారదా. నా స్నేహితురాలివని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది” అంది నిత్య.

సిగ్గుతో తల కిందకి దించుకుంది శారద. కాసేపు ఇద్దరి మద్య మౌనం రాజ్యమేలింది.

“ఆరోగ్య శ్రీ లాంటి స్కీమ్స్‌లో కూడా ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ లేదు. పోనీ అలా చేద్దమన్నా వీలు కాలేదు నా ‘నిస్సహాయత’ని అర్థం చేసుకో నిత్యా. నీకేం ఎన్నైనా చెబుతావ్.. పెద్ద పెద్ద చదువులు చదివిన, బహుదూర్ బిడ్డవి, కోట్ల ఆస్తికి వారసురాలివి. నేను నీలా కాదు. మధ్య తరగతిలో పుట్టి, డిగ్రీ వరకే చదివి, మధ్య తరగతి మగాడిని మనువాడిన ఇల్లాలిని. నెల జీతం వస్తే గాని పిల్లల కడుపు నింపలేని నిస్సహాయురాలిని. పెళ్లి చేసుకుని కాలం వెళ్ళబుచ్చుతున్నాను. వచ్చే ఏడాది పెద్దవాడు ఇంజనీరింగ్ చదువుకి డబ్బు కట్టాలి.. ఆ తరువాత చిన్నవాడు..” అని ఆగింది శారద.

“వద్దు శారదా ఇంక నువ్వు మాట్లాడకు. ఇంత పిరికిగా అలోచిస్తావని అనుకోలేదు. నిన్ను చూస్తే నాకు చాల సిగ్గుగా ఉంది శారదా. నువ్వు చాల తెలివైనదానివి.. మనిద్దరం కలిసి డిగ్రీ వరకు చదువుకున్నాం.. పై చదువు కోసం నేను బయటకు వెళ్ళాను.. నువ్వు వైజాగ్‌లో ఉన్నావ్.. నీ వంతు నువ్వు ఏదో ఒకటి చేస్తావేమో అనుకున్నాను.. ఇలా ఖాళీగా ఉంటావని అనుకోలేదు.. అవసరం ఉన్నప్పుడు ఉద్యోగం చెయ్యల్సింది కదా శారదా” అంది నిత్య.

“లేదు నిత్య.. ఇంట్లో, బయట చెయ్యటం చాలా కష్టం. పైగా నా చదువుకి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమోస్తాయి చెప్పు?”

“ఉద్యోగం అనే ఏముంది శారదా, వ్యాపారం అయినా పెట్టచ్చుకదా! కుటుంబ పోషణ మగవాళ్ళది మాత్రమే అనుకోకూడదు.”

“ఆ పనీ అయింది.. చేతకాక చేతులు కాల్చుకున్నాను.. చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టి, ఏదీ వర్క్ అవుట్ కాక వదిలేసాను నిత్యా.. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో ఇంతకన్నా దారి ఇంకొకటి లేదు నిత్యా” అంది శారద. మౌనంగా కాసేపు ఊరుకుంది నిత్య.

“ఇంతకీ నీ పనులు ఎంతవరకు వచ్చాయి నిత్యా” అంది శారద టాపిక్ మారుస్తూ

“నాదొక ‘బృహత్ ప్రణాలిక’.. ఇంత గొప్ప చదువు చదివి ఇంట్లో ఉంటున్నా.. నాకు డబ్బు అవసరం లేకపోవచ్చు.. కాని నా చదువు ఈ సమాజానికి ఉపయోగపడాలన్న ఆశ అయితే ఉంది. ఆ దిశగా అడుగులు వేసి మనుషుల అవసరాలు తెలుసుకున్నా.. మనుషులను చదివాను. సమాజాన్ని అంచనా వేసాను. నా ‘బృహత్ ప్రణాళిక’కు అవసరమయ్యే ముడి సరుకు తయారు చేసాను. నా ‘బృహత్ ప్రణాళిక’కు ఒక రూపం ఇచ్చి ప్రారంబించాను. మంచి ఫలితాలే వస్తున్నాయి” అంది నిత్య.

“నువ్వు ఏదైనా చెయ్యగలవు నిత్యా.. నీ పట్టుదల నాకు తెలుసు. కానీ నా సమస్య.. అది కాదు కదా! మధ్యతరగతి బతుకులు నిత్యా” అని ఆగింది శారద.

“అయితే? మనుషులను చంపేస్తావా!.. ఆ పెద్ద మనిషి నిన్ను నమ్మి నీ వెనుక వచ్చారు.. ఆయన నీ భర్తకి స్వయానా నాన్నగారు.. ఆయనని మోసం చెయ్యాలని ఎలా అనిపించింది శారదా నీకు?” అంది నిత్య

“పరిస్థితులు నిత్యా.. పరిస్థితులు..” అంది శారద

“ఎవరికి లేవు పరిస్థితులు, ఎవరికి రాని పరిస్థితులు. రేపు నీ కుటుంబ ఆదాయం బాగుండి.. నీ పిల్లలు బాగా సెటిల్ అయ్యాక.. అప్పుడు కావాలనుకుంటే మీ పిల్లలకి ఒక తాతని, మీ ఆయనకి ఒక నాన్నని, నీకు ఒక మామగారిని తెచ్చుకోగలవా శారదా! ఇంకో మాట శారదా!.. అదే మీ నాన్నఅయితే?.. బతికించుకునేందుకు తాపత్రయపడవా!” అని నిత్య అనగానే చెంపు చెల్లున కొట్టినట్టనిపించింది శారదకి.

కాసేపు పోయాక మళ్ళీ తేరుకుని ..

“అది కాదే ఎప్పుడైనా పోవాల్సిందే కదా! ఆయన అన్ని అనుభవించేసారు కదా! అని.. మనం హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినా గ్యారంటీ లేదు.. అలాగే చెయ్యకపోయినా గ్యారంటీ లేదు. అందుకని..” ఆగింది శారద.

“అయితే మరెందుకు ఇప్పుడే చచ్చిపోవే! ఎప్పుడైనా పోవాల్సిందే కదా!”..

“అది కాదు నిత్యా.. నాకంటూ కొన్ని బాధ్యతలు..”

“చూడు శారదా, మన పుట్టుక, మన చావు.. ఈ రెండు మన చేతుల్లో లేనివి .. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే నూరేళ్ళు బతికేస్తారు అని అనలేం.. కాని హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే కొన్నాళ్ళు బతకచ్చు అన్నారు వైద్యులు.. వారి మాటే మనం వినాలి గాని.. డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చెయ్యకుండా ఉండటం నా దృష్టిలో తప్పే శారదా!

ఏమో! ఎవరికీ తెలుసు? ఆయన వయస్సు ఇప్పుడు ఇంకా 58. ఇంకా ఎంత కాలం ఆయన్ని భూమ్మీద ఉంచాలని ఆ దేవుడికి ఆశగా ఉందో.. ఆయన చేత ఇంకా ఏమైనా చేయించేది ఈ భూమ్మీద మిగిలి ఉందేమో!

మనం హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసాక కూడా పోవచ్చు.. ఈ భూమ్మీద మనం ముందుగా ఉహించనివి రెండే రెండు. ఒకటి మనం ఎలా పుడతామో! రెండు.. ఎలా పోతామో! ఆ రెండింటిని మనం ప్రకృతికి వదిలేయాలి. కాని, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే కొన్నాళ్ళు బతికే అవకాశం ఉన్నప్పుడు.. తప్పనిసరిగా చేయించాల్సిందే.. శారదా.. మనకు ఆ ప్రాణాన్ని రక్షించే అవకాశం ఆ దేవుడు ఇచ్చాడేమో! అలా ఎందుకు అలోచించవ్? డబ్బు లేని కారణంగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయక ఒక పెద్దాయనని, ఒక అనుభవశాలిని పోగొట్టుకోవడం నాకు నచ్చలేదు శారదా.. పైగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చెయ్యకపోతే మన కళ్ళ ముందే ఆయని ఆరోగ్యం క్షీణిస్తుంది.. అది చూస్తూ మనం ఉండగలమా!

డబ్బు లేకపోవడం అనేది పెద్ద సమస్యే కావచ్చు. కాని ప్రాణం పోవడం అనేది ఇంతకంటే పెద్ద సమస్య అని నీకు అనిపించలేదా శారదా.. అసలు డబ్బుబాగా సంపాదించినప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ప్రాణం పోయ్యగాలవా!” అంది నిత్య.

ఇంతలో “అమ్మా నిత్యా.. భోజనాల టైం అయింది.. కాస్త వడ్డించు” అంటున్న అత్తగారి గొంతు విని వడ్డించడానికి సిద్దమవుతూ “మీ మామయ్యగారిని భోజనానికి తీసుకురా శారదా” అంటూ పురమాయిస్తూ వండిన వంటకాలు లాంటివి టేబుల్ మీదకి తెచ్చి పెట్టే పనిలో ఉండిపోయింది నిత్య.

అత్తామామలకు ప్రేమగా వడ్డిస్తూ.. పక్కనే ఉన్న తన మామయ్యగారికి ఏమి కావాలో కొసిరి కోసిరి వడ్డిస్తున్న నిత్యని అలా చూస్తూ ఉండిపోయింది శారద.

“రా శారదా, వాళ్ళ భోజనాలు పూర్తయ్యాయి. ఏ లోకంలో ఉన్నావ్” అంటూ నిత్య పిలుస్తోంది

శారదలో అంతర్మథనంతో పాటు ఒక సంఘర్షణ మొదలైంది.

“ఏమమ్మా శారదా.. కాస్తా బెండకాయ పెరుగు పచ్చడి వెయ్యనా!” అంది నిత్య అత్తగారు.

“వద్దండి.. మీరు కూర్చోండి. మేము తింటాం లెండి” అంది శారద.

“మా నిత్య కమ్మగా వండుతుంది.. వాళ్ళ మామయ్య గారికి నా వంట కంటే నిత్య వంట అంటేనే ఇష్టం”  మురిపెంగా కోడలి వైపు చూస్తూ అంది సావిత్రమ్మ.

ఒకింత సిగ్గుతో.. “అదే తింటున్నాను కదా ఆంటీ, అన్నీ బాగానే చేసింది లెండి” అంది శారద.

శారద మనసులో ఏదో సంఘర్షణ జరుగుతుందని నిత్యకి అర్థం అయింది. భోజనాలు పూర్తయ్యాక మళ్ళీ గదుల్లోకి వెళ్ళిపోయారు.

“రండి సూర్యనారాయణ గారు.. మీరు తెలుగు మాస్టారట కదా! కాస్తా తెలుగు ఛలోక్తులు విసురుదురు, మనసు కాస్తా ప్రశాంతంగా ఉంటుంది” అంటూ గెస్ట్ రూమ్ లోకి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నారు జగన్నాథం గారు.

“ఆ.. ఆ పదవీవిరమణ చేసిన తెలుగు మస్టార్నే.. కాని పెదవీ విరమణ చెయ్యలేదు లెండి. రండి కూర్చోండి” అన్నారు సూర్యనారాయణరావు గారు.

“పద ప్రయోగం బాగుంది మాస్టారు. ‘పెదవీ విరమణ’. అందుకే తెలుగు మాస్టారు అన్నారు మిమ్మల్ని” అంటూ ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు కాసేపు. మాటల్లో పుస్తకాలు చదవటం వాళ్ళ ‘హాబీ’ అని ఒకరి కొకరు తెలుసుకున్నారు.

“సాయంత్రం దగ్గరలో ఉన్న లైబ్రరీకి పోదామా మాస్టారూ” అన్నారు జగన్నాథం గారు.

“లైబ్రరీకి వెళ్ళాలంటే నాకు కూడా ఇష్టం.. కాని కోడలు పిల్ల ఆసుపత్రికి వెళ్దాం అంటుందేమో! చూడాలి” అంటున్న సూర్యనారాయణ రావు గారితో అప్పుడే అక్కడకు వస్తున్న నిత్య.. “లేదు లేదు.. డాక్టర్ దగ్గరకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది మీరు వెళ్లి రండి” అని భరోసా ఇవ్వడంతో ఇద్దరు లైబ్రరీకి వెళ్లి కాలక్షేపం చెయ్యడానికి సన్నద్ధం అయ్యారు.

(సశేషం)

Exit mobile version