[రంజిత్ వర్మ రచించిన ‘బసంత్ కే హత్యారే’ అనే హిందీ కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Ranjeet Verma’s Hindi poem ‘Basant Ke Hatyaare’ by Mrs. Geetanjali.]
~
[dropcap]త[/dropcap]మిళ కవయిత్రి సుకీర్ణధరణి..
అదానీ ఇవ్వ చూపిన
దేవీ పురస్కారాన్ని తిరస్కరించి
మంచి పనే చేసింది.
లేకపోతే అతను ఆమెను కూడా
తన ఆస్తి అనే అనుకునేవాడు.
తనను గురుంచి.. కవిత రాయమనే వాడు..
ఎంత సేపూ.. తన నాయకత్వాన్ని పొగడమనేవాడు!
నేను అతిగా మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తుండొచ్చు.
కానీ..మీకు వాడి గురుంచి అంతగా తెలీదు!
ఒక్కసారి వెళ్లి పార్లమెంటులో వినండి.. అతగాడి ఉపన్యాసాన్ని!
ఒక సిలిండర్ ఇచ్చి వాడు
మనల్ని కొనుక్కున్న బానిసల్లా చూస్తున్నాడు.
నిజాన్ని నిజంగా.. అబద్దాన్ని అబద్ధంగా చెప్పలేని
నిర్లజ్జా పూరితమైన మనుషులుగా చూస్తున్నాడు.
మేము వాడి చెంచాగిరీలుగా మాత్రమే అనుకుంటున్నాడు.
మేం వాడికి ఏ మాత్రమూ పౌరులనబడే ప్రజలం కాదు!.
వాడికి అమ్ముడుపోయిన అబధ్ధపు సాక్షులం!
వసంతాన్ని హత్య చేసిన వాళ్ళు
తమ దుర్మార్గమైన బుద్ధితో
ఫిబ్రవరి నెలనంతటిని నాశనం చేశారు.
ఫిబ్రవరి నెలలో.. ప్రేమని రక్షించుకోవడానికి..
ఒక్క పధ్నాలుగో తారీఖే కాదు..
మొత్తం ఇరవై ఎనిమిది రోజులున్నాయి అని తెలియదు ఆ మూర్ఖులకి!
ఒక పని చేయి.. మా ఇళ్ల మూలల్లో వృథాగా
బోర్లా పడి ఉన్న సిలిండర్‌ని తీసుకెళ్లిపో..
ఇక ఎప్పుడూ నీళ్లే రాని
నీ నల్లా కూడా మాకవసరం లేదు… అదీ తీసుకెళ్లిపో !
ఇక మేం ఉంటున్న ఇళ్ల గురుంచి ఏం చెప్ప మంటావు..
గోడలుంటే పైకప్పు లేదు.. తలుపులుంటే కిటికీలు లేవు.
అసలు ఆ ఇళ్లల్లో ఉండాల్సిన ఒక్క వస్తువూ లేదు.
ఒక విషయం చెబుతా జాగ్రత్తగా విను!
నా శరీరమే.. నా ఇల్లు!
నా ఆత్మలోనే నాకు రావాల్సిన
నిత్యం ఊరే జల లాంటి నీళ్లున్నాయి!
అసలు విషయం ఏమిటంటే..
నీ దగ్గర నువ్వు ఉందనుకుంటున్న జ్వాల
ఏదైతే ఉందో అది నువ్వు నా నుంచి దొంగలించిందే!
అసలు మా మనసుల్లో రగులుతున్న నిజాన్ని
నిజాయితీగా.. నిర్భయంగా చెప్పమంటావా…
విను మరి.. చాలా కాలం క్రితమే..
నిన్ను ఈ దేశపు సరిహద్దుల కావల గెంటేయాల్సింది.
ఆ తప్పు చేయకపోవడం కూడా మా తప్పే..
ఎందుకంటే.. నువ్వో వసంత కాలపు హంతకుడివి మరి!
~
మూలం: రంజిత్ వర్మ
అనుసృజన: గీతాంజలి
హిందీలో అన్ని ప్రసిద్ధమైన పత్రికలలో రంజిత్ వర్మ గారి కవితలు, లేఖలు ప్రచురించ బడ్డాయి.
రంజిత్ వర్మ సంపాదకత్వం వహించిన పత్రికలు–1978-పల్లవి, 1985-87 లో నయీ సంస్కృతి, 2012 -భోర్.
ప్రస్తుతం వికల్ప అనే పత్రిక సలహామండలి సభ్యులు.
2014 లో కవిత్వంలో బనారసి ప్రసాద్ ‘భోజపురి’ సమ్మానం.
అనువాదాలు – పంజాబీ, మరాఠీ, ఒరియా, నేపాలీ, బంగ్లా, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో కవిత్వం అనువాదం చేశారు./ఆయన కవిత్వం అనువాదం అయ్యింది.
రంజిత్ వర్మ రచనలు:
కవితా సంపుటిలు-పీఛె న చోడ్ నిశాన్,(2002), ఎక్ చుప్ కే సాత్(2010), లకీర్ కహీ ఎక్ ఖీన్చనీ హోగి ఆప్కో(2015), యహ్ రక్త్ శే భరా సమయ్ హై(2023)
ప్రతి రోధ్ కా పక్ష, ప్రతిరోధ్ మే కవితా, బలాత్కార ఔర్ కానూన్ అనే కవితా సంకలనాలకి సంపాదకత్వం వహించారు.
ప్రస్తుతం పాట్నాలో ఉంటున్నారు.