Site icon Sanchika

వాసిలి పరిణత సాహితీ వ్యక్తిత్వం

[dropcap]ఒ[/dropcap]క నదికి రిజర్వాయర్ నిర్మించడం యొక్క ప్రయోజనం నీటిని నిలువ చేసి ఆ నీటిని అలాగే ఉంచేయడం కాదు. దానిని కాలువల ద్వారా పంటపొలాలకు అందించి ఉత్పత్తిని పెంచడం.. సంపదను పంచడం. అలాగే విద్యను సాధించడం యొక్క ఆంతర్యం సాధిత విజ్ఞానాన్ని జీవన కార్యక్రమాలలో వినియోగించడం. Aldous Leonard Huxley అనే writer ఒక చక్కని మాటంటారు.. The Great end of Life is not knowledge but action.. Knowledge లేదా జ్ఞానం అంటే కన్పించే దాని చాటున దాగి ఉన్న వాస్తవాన్ని గుర్తించడం.. అలాగే వాసిలి వారి లాంటివారు, వ్యాసులు భారతంలో చెప్పినట్లుగా “యత్తద్వ్యక్తస్థ మవ్యక్తం విచింతంతి మహర్షయః..” అన్నట్లుగా వ్యక్తమయ్యే దానిలో దాగి ఉన్న అవ్యక్తమును గూర్చి చింతన చేస్తారు. అలాగని వ్యక్తమును విస్మరించరు. రెంటి మధ్య ఉండే బంధాన్ని సమన్వయం చేసుకుంటారు.

ఒక సాధారణ వ్యక్తి వ్యక్తిత్వం రాగద్వేషాల మధ్య బంధింపబడి ఉంటుంది.. అదే ఒక తాత్వికుని వ్యక్తిత్వం పరిణతి చెంది సమాజాన్ని “ఉన్నది ఉన్నట్లుగా” చూడడం, పరిశీలించడం నేర్చుకుంటుంది. ఆత్మవత్సర్వభూతాని అనే సమభావనతో పునీతమౌతుంది. క్రాంత దర్శకుడైన వాసిలి గారు కూడా తాను దర్శించిన ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని పదుగురితో పంచుకుంటూ, పెంచుకుంటూ.. సాహితీ ప్రపంచంలో సమున్నత స్థానాన్ని సాధించారు.. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు.

పాలకుర్తి-వాసిలి

వాసిలిగారి సాహితీ ప్రస్థానం రెండు పట్టాలపై నడిచే రైలుబండితో పోల్చవచ్చేమో. ఒకటి భౌతిక జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో తెలిపే సాహిత్యం.. కాగా రెండవది ఆధ్యాత్మక జీవన విధానానికి మార్గం చూపే సాహిత్యం. రైలు బండి సరిగా గమ్యాన్ని చేరాలి అంటే ఎలాగైతే రెండు పట్టాలను సమన్వయ పరచి సాగాలో అలాగే వ్యక్తి జీవితమూ గమ్యాన్ని చేరాలి అంటే జీవన పార్శ్వాలు రెంటి మధ్య సమన్వయం సాధించాలి.

ఎక్కువమంది వారు చదివినవి, విన్నవి అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఒక దృక్పథాన్ని ఏర్పరుచుకుంటారు.. కుటుంబ నేపథ్యం కూడా దానిని పెంచి పోషించేందుకు సహకరిస్తుంది. మరి కొంతమంది.. స్వతంత్ర ఆలోచనలతో అన్వేషణ కొనసాగించి సత్యాన్ని గురించి ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకుంటారు. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు.. అందులో వాసిలి వారు కూడా ఉన్నట్లు వారి సాహితీ ప్రస్థానం నిరూపిస్తున్నది.

నిజానికి వ్యక్తిత్వం పరిమళించాలి అంటే.. మన వ్యక్తిత్వంలో సమకాలీన చూపు, సమకాలీన మాటతీరు, సమకాలీన ఆలోచన, సమకాలీన ప్రయత్నం, సమకాలీన నిర్ణయం, సమకాలీన ప్రణాళిక అనేవి ఉండాలి.. అవి కూడా మన స్వభావానికి అనుగుణంగా ఉండాలి. సంకల్పమే కాదు స్పందన సైతం సమకాలీనమైనదైతేనే విజయం సాధించగలుగుతాము, అంటారు వాసిలి గారు. ఇది భౌతిక జగత్తులో సాధించాల్సిన విజయానికి ప్రాతిపదికగా కనిపిస్తుంది.

అంతే కాదు.. దార్శనికులైన వాసిలిగారు, సమకాలీన సమాజంలో విజయాన్ని గూర్చి ఎంత బలంగా చెప్పారో సార్వకాలిక జీవనగతిని గూర్చి కూడా అంతే బలంగా చెప్పారు. “నా ఆత్మ నా ఈ శరీరానికి స్వమ్తం కాదు… ఈ ప్రపంచానికే పరిమితం కాదు. ఈ శరీరం, ఈ ప్రపంచం భౌతికం.. పైగా అశాశ్వతం. అయితే ఆత్మ శాశ్వతం.. అనశ్వరం.. దివ్యత్వ పరిపుర్ణం. విశ్వంలో స్వేఛ్చా వర్తనం చేసే ఆత్మ భౌతిక జగత్తులోకి.. మానవ ఆవరణలోకి ఒక విహార యాత్రకు వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోతుంది. మానవ శరీరమైనా, మరో శరీరమైనా ఆత్మకు అది ఒక పర్యాటక క్షేత్రమే తప్ప శాశ్వత ఆవాసం కాదు”. ఇలా చెప్పాలి అంటే అక్షర జ్ఞానం మాత్రమే సరిపోదు. దివ్యదృష్టి కావాలి.

ఆచార్య రాణి సదాశివమూర్తి గారితో వాసిలి

గెలవాలి గెలిపించాలి అనే పుస్తకంలో వారు.. కవితాత్మకంగా చక్కని మాటను చెప్పారు.. బింబం సమస్య అయితే నీడ పరిష్కారం.. నీడ బింబం వెంటే ఉంటుంది. కాకపోతే అక్కడ కాంతి ప్రసరణ జరగాలి.. లేదా నీవా నీడను గుర్తించగలగాలి. నీడ ఉన్నదని తెలుసు కాని కాంతి ప్రసరణ లేకపోతే బింబమూ స్పష్టంగా ఉండదు.. నీడనూ గుర్తించలేము. అయితే కాంతి అనేది ఆలోచన, ప్రణాళిక, పట్టుదల, పరిణత వ్యక్తిత్వం, ఎదగాలనే బలమైన కోరిక, నిరంతర ప్రయత్నం.. వాసిలిగారు ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిస్తున్నవారు. ధ్యానం వారి జీవన విధానం. నిజానికి ఏ వ్యక్తియైనా ఏదైనా సాధించాలి అంటే.. ఏకాగ్రత అవసరం. కాని ఏకాగ్రతకు అస్థిత్వం లేదు.

అది ధ్యానంలో అయాచితంగా మనకు లభించే ఉప ఉత్పత్తి, స్థిరత్వంలేని చంచలమైన మనస్సు వ్యతిరేకభావనలను సృజిస్తుంది. ఆ భావనలు సంఘర్షణలకు మార్గంవేస్తాయి. ప్రశాంతమైన మనస్సులో నిశ్శబ్దం పల్లవిస్తుంది.. ఆ నిశ్శబ్ద స్థితియే జీవిత విభావరిని దాటేందుకు అవసరమైన తాళపుచెవిగా భావించవచ్చు. అందుకే అంటారు.. Life must be measured in depth not in length.

విశ్వరి వాసిలి వసంత కుమార్ గారు ఒక యోగ సాధకుడు.. యోగానుభవంలో అనంత చైతన్యంలో అనంతలోకాలను దర్శించి వచ్చిన దార్శనికుడు. అందుకే కాలాతీత విశ్వచైతన్య పరిణామ ప్రకారాన్ని, ప్రకాశాన్ని తానాస్వాదించి ప్రకటించిన యోగి. ఆతని యెదలో భాసించిన అక్షర చైతన్యమే స్వరూపాన్ని పొంది ఆతని సాహితీ వ్యక్తిత్వంగా రూపుదిద్దుకున్నది.

“హిత కాంక్షతోనే ఆత్మ జాగృతి” అంటారు వారు. “మానవ సంక్షేమాన్ని కాంక్షించే ఆత్మ సులభంగా దివ్య ప్రపూర్ణం కాగలదు. హిత స్వభావమే ఆత్మ పరిణతికి పరిణామ హేతువు అవుతుంది. ఎంతటి విశ్వాత్మ అయినా సామాజికంగా తొలుత సహజీవన సౌభాగ్యాన్ని అనుభవించాల్సిందే. హిత కాంక్షతోనే ఆత్మ జాగృతి జరుగుతుంది”. దార్శనికత లేని వ్యక్తిత్వం ఆ మాటలను చెప్పేందుకు సాహసించదు. ఎందుకంటే.. భౌతిక జీవితాన్ని ప్రేమించే వారు లేదా ఆ జీవితమే అంతిమమని తలచేవారు ఆధ్యాత్మిక జీవన విభూతిని ఆస్వాదించలేరు. అలాగే ఆధ్యాత్మిక భూతి మాత్రమే చివరిది అనుకునే వారు భౌతిక జీవిత మధురిమను చవిచూడలేరు. నిజానికి వ్యక్తి ఈ రెంటినీ సమభాగాలుగా స్వీకరించాలి. సమత్వాన్ని సాధించాలి. అది ధ్యానంలో విశ్వాత్మను దర్శించినవారు, ఆ ఆత్మ ప్రయాణాన్ని అనుభూతిగా పొందిన వారు మాత్రమే చెప్పగలరు.

మండలి బుద్ధప్రసాద్ గారితో వాసిలి

వారి సాహిత్యం అంతా ఒక ఎత్తు కాగా వారు ఈ మధ్య వెలువరించిన “నేను” యౌగిక కావ్యం ఒక ఎత్తు. ఈ కావ్యం విశ్వ క్రియా చాలనలో మమేకమైన ఎన్నో సజీవ అనుభవాల సమాహారం. వియన్మండల నక్షత్ర కాంతులు, కాలయాన విధులు, కాంతి వేగ విన్యాసాలు, కణ విస్ఫోటన ద్వనులు, అంతర్మథనలు, ఆవేదనలు, చైతన్య విభూతులు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో.. కావ్యం నిండా తమ ఆధ్యాత్మిక ప్రయాణ అనుభూతులు.. యోగ సాధనలో, తాత్విక దర్శనలో కలిగిన సాఫల్యాలు, వైఫల్యాలు.. అనుభవములు.

ప్రపంచంలో మనుషులందరికీ భగవంతుడు అనుగ్రహించినది ఒక్కటే జీవితం. దీనికి స్టెఫినీ ఉండదు. ప్రయాణము చేసినంత సమయమూ చాలా జాగ్రత్తగా ఈ బండిని నడపాలి.. గమ్యస్థానాన్ని చేరే ప్రయత్నం చేయాలి.

అనాదిగా మానవునిలో తన మూలాలు తెలుసుకోవాలనే ఆరాటం, తపన, జిజ్ఞాస, అన్వేషణ. అదే సృష్టి తత్వాన్ని గ్రహించేందుకు మార్గం చూపింది.

కింకారణం బ్రహ్మ కుతఃస్మ జాతా, జీవేమ కేన క్వచ సంప్రతిష్ఠాః

అధిష్ఠితాః కేన సుఖేతరేషు, వర్షామహే బ్రహ్మ విదో వ్యవస్థామ్!

తాను ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, ఎక్కడికి వెళతాడో తెలియదు.. ఎందుకు జీవించాలో తెలియదు.. ఇక్కడి రాకకు కారణం ఏమిటి తెలియదు? ఈ సృష్టిని నియమించిన వారెవరైనా ఉన్నారా? ఉంటే ఎవరతను? తెలియదు. (శ్వేతాశ్వతరోపనిషత్తు).. ఈ తపన తపస్సుగా మారడం వల్ల కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగలిగాడు..

ప్రాచీన ఋషులు, యోగులు, మునులు తాము దర్శించిన దర్శనాలను అక్షరబద్ధం చేసారు. ఆ అక్షరాలను చదవడం వల్ల “అక్షర” జ్ఞానం వస్తుందేమో కాని అనుభవ జ్ఞానం రాదు. పంచభక్ష్య పరమాన్నాలను విస్తరిలో వడ్డించి ఫోటో తీసి మన ముందుంచితే మన ఆకలి తీరదు. అలాగే నిరంతరం తెలుసుకున్న దానిని అభ్యసించడం ఆచరణాత్మకంగా మలుచుకోవడం వల్ల మాత్రమే ఆ సత్యాన్ని శోధించ గలుగుతాము.. ఆనందాన్ని అనుభవించ గలుగుతాము. జీవితమూ సాఫల్యమౌతుంది. ఆ సాఫల్యతా సిద్ధికై వాసిలి గారు తపించారు…

భౌతిక స్థాయిలో ఆకృతిని చూస్తాము. మానసిక స్థాయిలో భావోద్వేగాలను అవగాహన చేసుకుంటాము. ఆలోచనల స్థాయిలో బుద్ధి వికసిస్తుంది, పరిణతి చెందుతుంది. చైతన్యస్థాయిలో సత్యదర్శనం కలుగుతుంది. దానికి ముందుగా కావలసిన ప్రాతిపదిక శాంతిని పొందడం.

శాంతిని పొందాలనే తపన ప్రతి వ్యక్తికీ సహజమే.. శాంతి ఎక్కడ.. ఎలా? మనసు యొక్క సమస్థితి శాంతి. మనసు యొక్క సమదృష్టి శాంతి, మనసు యొక్క నిశ్చల స్థితి శాంతి, మనసు యొక్క నిశ్శబ్ద స్థితి శాంతి. శాంతి పొందిన మనసు సాక్షీభూతంగా నిలుస్తుంది. ఇప్పుడు ఎలా అనేది మరొక ప్రశ్న. యోగం అనేదే జవాబు. ఒత్తిడి నుండి ఒత్తిడిని జయించే విధానం యోగం యొక్క లక్షణం.. లక్ష్యం కూడా. ఆ మనస్సు అప్పుడు మూలాలను అర్థం చేసుకోగలుగుతుంది.

వాసిలి గారు ధ్యానంలో సత్యాన్ని ప్రత్యక్షానుభవం లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేసారు. సఫలీకృతులయ్యారనే చెప్పాలి. అలాగే వారి దర్శనానుభవాన్ని కవితా రూపంలో అందించారు. ఆ దర్శనాల ఫలితమే “నేను” యౌగిక కావ్యం వెలుగు చూసింది.

వీరి తండ్రి శ్రీ “శార్వరి” గారు యోగ సాధనలో తమ జీవితాన్ని తరింప చేసుకున్నవారు. పలు గ్రంథాలను రచించి జిజ్ఞాసువుల సందేహాలను తీర్చిన వారు. వారసత్వంగా తమకు అందిన ఆ యోగ సంపదను తామనుభవిస్తూ.. ఇతరులతో పంచుకున్నారు శ్రీ విశ్వర్షి గారు..

అతని వ్యక్తిత్వం పరిణతి చెందడం వల్ల బిందువయింది, సింధువయింది, విశ్వవ్యాప్తమయింది.. దానికి కేంద్రమూ అయింది. తొలి శ్వాస, తుది శ్వాసలు మన చేతిలో లేనివే. మధ్య దేనిని కోరుతున్నాము. ఇంద్రియ భోగాలనా… ఇంద్రియాతీత భోగాలనా? ఇది సామాన్యుల ప్రశ్న.. ఏదో ఒకటి కోరేదీ సామాన్యులే.. కాని ఈ రెంటికీ భేదం లేదనే సత్యాన్ని గుర్తించింది, వాసిలి గారి వ్యక్తిత్వం. అదే ఆయన ఊపిరిగా మారింది.. సాహిత్యంగా రూపుదాల్చింది. జిజ్ఞాసువులకు దిక్సూచిగా మారింది. అందుకే ఆయన వ్యక్తిత్వం, ఆయన సాహిత్యంలో ప్రతిబింబించింది. అదే త్రికాలాలకు, త్రిసంధ్యలకు, పంచభూతాలకు అతీతమైన మహా ప్రస్థానమయింది. విశ్వవేదిక పైన కాలవేదిక అయింది. సృష్టి వేదికకు మూలమయింది.

ఆయన వ్యక్తిత్వంలో ఉదయించిన వివేకం చూడామణిగా సౌందర్యలహరియై, నిశ్చలానంద విభూతిలో ఆనందలహరియై, అంతటా తానైన చైతన్యలహరియై ప్రభవించింది, ప్రసరించింది, ప్రశమించింది, ప్రభావమయింది, ప్రభూతమయింది.. మహత్తును దర్శించి, స్పృశించి, రసావిర్భూతిలో మమేకమై, రాసక్రీడలో శివమై, మంగళమై, కుండలి నుండి సహస్రారం వరకు గమించే జాగృత సర్పమై, స్వక్షేత్ర సుక్షేత్రాన్ని స్వాత్మ క్షేత్రంగా మలుచుకున్న నిశ్శబ్దంలో శబ్దమై భాసించింది వారి సాహిత్యం. కృతజ్ఞతలతో.. శుభాకాంక్షలతో..

Exit mobile version