Site icon Sanchika

స్ఫూర్తిదాయక సేవా ‘రత్నం’

[dropcap]వి[/dropcap]విధ రంగాలలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఎందరో ఉంటారు. అయితే నిస్వార్థంగా.. సేవే పరమార్థంగా.. జీవితమంతటినీ ప్రజాసేవకే వినియోగించి తొమ్మిది పదులు దాటిన వయసులో కూడా నిత్య చైతన్య శీలిగా ఉన్న వాసిరెడ్డి కాశీరత్నం వంటి వారు అరుదుగా ఉంటారు. సేవకు పర్యాయ పదమైన వాసిరెడ్డి కాశీరత్నం గారి జీవిత చరిత్రను, సవివరంగా.. అదే సమయంలో క్లుప్తంగా.. సందర్భోచిత ఛాయా చిత్రాలతో, ప్రముఖల, కుటుంబ సభ్యుల అభిప్రాయాలతో ఓ విలువైన పుస్తకాన్ని వెలువరించిన డా. షేక్. హసీన అభినందనీయురాలు.

కాశీరత్నం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.. హిందీ పండిట్, కవయిత్రి, గాయని, రచయిత్రి, రాజకీయ నాయకురాలు, సామాజిక పరిశోధకురాలు, జర్నలిస్ట్, సంఘ సేవకురాలు.

ఇందులో పొందుపరిచిన కాశీరత్నం గారి కవిత.. (వీరుడైన తన ప్రేమికుడు సాయుధ పోరాటానికి వెళ్లగా ప్రేమిక మనో భావన..)

నీ హృదయ రక్తమే
నా కాళ్ల పారాణి
నీ ఇనుప బేడీలే
నా కాలి అందియలు
నీ చేతి సంకెళ్లే
నా చేతి కంకణాలు..

తెలంగాణ సాయుధ పోరాట కాలంలోని పరిస్థితికి, మనోవేదనలకు అద్దం పట్టే చక్కని కవితను పాఠకులకు పరిచయం చేశారు.

కాశీరత్నం గారి బాల్యం.. స్వాతంత్ర్య సమర విశేషాలు, ఆమెపై దాని ప్రభావం ఆసక్తికరంగా ఉన్నాయి. పదిహేనేళ్ల వయసులో స్వాతంత్రోద్యమంలో పాల్గొని, వారం రోజులు జైల్లో ఉన్న అనుభవం, పాటలు పాడటం పాఠకులకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. సినీనటి సావిత్రితో కలిసి మద్రాస్ రేడియోలో పాటలు పాడడం వంటి ఆసక్తికర అనుభవాలు జోడించడం బాగుంది. ఎన్టీఆర్ హయాంలో పార్టీ మహిళా విభాగానికి కార్యదర్శిగా మూడేళ్ల పాటు సమర్థవంతంగా పని చేయడం.. నాటి పరిస్థితులు.. వివిధ సంఘటనలు చదివించేలా ఉన్నాయి. నంది ఉమెన్స్ అసోసియేషన్ స్థాపించి మహిళల్లో చైతన్యం నింపడం, ఎన్నోరకాల వృత్తి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, హెల్త్ క్యాంపులు, పోలియో క్యాంపులు, ఐ క్యాంపులు నిర్వహించడం, అంగన్ వాడీ స్కూల్ ఏర్పాటు.. ఇలా కాశీ రత్నం గారి సేవా కార్యక్రమాల వివరణ ప్రేరణనిచ్చేదిగా ఉంది.

కాశ్మీరు సందర్శనం, అమెరికా పర్యటన, ఫోటోలు.. కాశీరత్నం గారు ఆయా సందర్భాల్లో రాసుకున్న కవితలు, అనుభవాలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ద్వారక చరిత్ర గురించి కాశీరత్నం గారు చెప్పిన అంశాలు తప్పక చదవ వలసినవిగా ఉన్నాయి. ఎన్నో వ్యాసాలు, కథలు, నవలలు రాసి, ఎన్నో అవార్డులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుని, జీవించి ఉన్నంత వరకు చైతన్యంతో ముందుకు సాగుతూ, సేవాపథంలో జీవితాన్ని సార్థకం చేసుకోవాలని అభిలషించే కాశీరత్నం గారి జీవితం ఎంతైనా ఆదర్శనీయం.. అనుసరణీయం. ఉన్నతమైన.. ఉత్తమమైన కాశీరత్నం గారి జీవన యానాన్ని అక్షరబద్ధం చేసి, చక్కని పుస్తకంగా అందించిన డా. షేక్. హసీన కృషి ప్రశంసనీయం.

***

వాసిరెడ్డి కాశీరత్నం
రచన: షేక్. హసీన
పుటలు: 120,
వెల: ₹ 99 రూ.
ప్రతులకు: అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు.
ఫోన్: 040-23513056, 8790255232

Exit mobile version