వయసు చిన్నది మనసు పెద్దది

0
3

[box type=’note’ fontsize=’16’] “పిల్లల్లో లాభనష్టాల బేరీజు ఉండదు. తాము చేస్తున్నది మంచి అని నమ్మితే, చేసేస్తారు” అంటూ మంచి పనులు చేస్తున్న కొందరు పిల్లల గురించి చెబుతున్నారు కొల్లూరి సోమ శంకర్. [/box]

[dropcap]ఏ[/dropcap]దో వ్యాసం టైప్ చేసుకుంటున్నాను. నా సెల్ మోగింది. అశోక్.

“ఇంట్లోనే ఉన్నావా? వస్తాను” అన్నాడు.

“ఉన్నాను రా…” చెప్పాను.

“ఓ పావుగంటలో వస్తాను” అని చెప్పి కాల్ కట్ చేశాడు.

నేను నా పని పూర్తి చేసి, మిత్రుడు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మావాడికి బ్లాక్ కాఫీ ఇష్టం. అందుకని ఫ్రెష్‌గా ఫిల్టర్‍లో కాఫీ పొడి వేసి, వేన్నీళ్ళు పోసి ఉంచాను, వాడొచ్చాకా తాగుదామని!

కాసేపటికి వచ్చాడు.

ఇంట్లో నేనొక్కడినే ఉండడం చూసి, “సిస్టర్ లేదా?” అన్నాడు.

“బయటకెళ్ళింది. ఓ గంట పడ్తుంది రావడానికి” చెప్పాను.

“డికాషన్ ఉందా?”

“ఇప్పుడే వేశాను. ఇంకో ఐదు నిముషాలకి రెడీ అవుతుంది.”

టీపాయ్ మీదున్న దినపత్రికని అటూ ఇటూ తిరగేసి, పక్కన పడేశాడు.

“ఎక్కడ చూసినా ఈ వార్తలే….” అన్నాడు.

ఎన్నికల గురించి అంటున్నాడేమోననుకొని, “ఎన్నికలైపోయాయిగా, ఇంకొన్నాళ్ళు మంత్రిపదవుల గురించే ఉంటాయి వార్తలు” అన్నాను.

“అది కాదు, ఈ పెళ్ళి….”

“ఓ.. ముకేష్ అంబానీ కూతురు పెళ్ళి గురించిన వార్తలా…” అన్నాను.

“అవును… వాళ్ళకి డబ్బుంటే ఉంది, కాని మరీ ఇంత ఖర్చా….” అన్నాడు.

“దాదాపు 700 కోట్లు ఖర్చు చేశారని పత్రికలు, వెబ్‌సైట్లు అంటున్నాయి…” అన్నాడు.

“ఎప్పుడో 1981లో ప్రిన్స్ ఛార్లెస్, డయానాల వివాహానికి 110 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని, ముకేష్ అంబానీ తన కూతురు పెళ్ళికి 115 మిలియన్ డాలర్లు వ్యయం చేశాడని చెప్పుకుంటున్నారు…”

“2004లో లక్ష్మీమిట్టల్ తన కూతురు పెళ్ళికి 350 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడట!”

“ఇదే లక్ష్మీమిట్టల్ మేనకోడలు పెళ్ళికి 500 కోట్లు ఖర్చయ్యాయిట. వంటవాళ్లని, బట్లర్లనీ, హెల్పర్స్‌ని దేశం నలుమూలల నుంచి విమానంలో బార్సెలోనాకి తీసుకెళ్లారట…”

“2004లోనే సహారా గ్రూప్ యజమాని సుబ్రతారాయ్ తన ఇద్దరి కొడుకుల వివాహాలకు 552 కోట్లు ఖర్చుచేశాడని చదివాను..”

“ఇప్పుడు అంబానీ కూతురు పెళ్ళి వీటన్నింటిని దాటిపోయి రికార్డు సృష్టించింది…”

“పెళ్ళికూతురి గౌనే 90 కోట్లట…”

“ఎంత దుబారా కదా….” అన్నాడు.

“ఇంకో వాదన కూడా ఉంది. అంత డబ్బును వాళ్ళు వృథా చేసినట్టు కాదట… ఈ వేడుక సందర్బంగా అనేకమందికి ఉపాధి లభించి, మనీ బాగా రొటేట్ అయ్యిందట!”

“ఏమోరా… ఇంత ఆడంబరం, ధన ప్రదర్శన గురించి చదవాలంటే ఇబ్బందిగా ఉంది…”

“టివీ చూస్తుంటే ఈ వార్త వస్తే, ఛానెల్ మార్చేయ్… పేపర్లో ఈ పెళ్ళికి సంబంధించిన వార్త కనబడితే పేజీ తిప్పేయ్…” అన్నాను.

“అయినా…” అని ఏదో అనబోయాడు.

“సర్లే… టాపిక్ మార్చు… ఉండు బ్లాక్ కాఫీ తెస్తాను…” అంటూ లేచి కిచెన్ లోకి వెళ్ళి డికాషన్‍ని కొద్దిగా వెచ్చజేసి, రెండు కప్పులో పోసి తెచ్చాను.

ఒకటి వాడికిచ్చి, రెండో కప్పు లోంచి నేను ఒక గుక్క సిప్ చేశాను..

“నువ్వు అన్నింటినీ చాలా తేలిగ్గా తీసుకుంటావ్… వార్తల్ని పట్టించుకోవు…” అన్నాడు.

“ఎందుకు పట్టించుకోను… నా చూపు వేరే వార్తలపై ఉంటుంది…” అన్నాను.

“అవున్లే… మనసు వికలం చేసే వార్తలను చదవనని నువ్వు ఎప్పుడో చెప్పావు…”

“అలా కాదు, మనలో నెగటివ్ భావాల్ని మిగిల్చేవో లేదా మనల్ని గందరగోళానికి గురిచేసే వార్తలు/ఘటనలని నేను పెద్దగా గుర్తుంచుకోను. సమాజానికి కొంతైనా ఉపయోగపడతాయనుకునే వార్తల్ని, అటువంటి వార్తలకు కారకులయిన వారిని బాగా గుర్తుంచుకుంటాను…” చెప్పాను.

“ఈమధ్య కాలంలో అలాంటి వాళ్లెవరూ నాకు తగల్లేదే…” అన్నాడు అశోక్.

నేను లేచి వెళ్ళి ఓ ఫైల్ తీసుకొచ్చాను.

“అలాంటి న్యూస్‌మేకర్స్ చాలామందే ఉన్నారు. వాళ్ళ వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి చూడు. కొన్ని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, కొన్ని నెట్ ఆర్టికల్స్ ప్రింటవుట్లు ఉన్నాయి. చదువు” అన్నాను ఫైల్ మావాడికి అందిస్తూ.

“ఇప్పుడు నాకు చదివే మూడ్ లేదు. ముఖ్యమైనవి, నీ దృష్టికి ఆస్తకిగా అనిపించినవి చెప్పు చాలు” అన్నాడు.

“సరే” అంటూ ఫైల్ చేతిలోకి తీసుకున్నాను. రాండమ్‌గా చేతికొచ్చిన పేపర్ క్లిప్పింగ్‌ని తీసాను.

“ఈ వార్త పాతదే… అయినా స్ఫూర్తిమంతం!” చెప్పాను.

మావాడు కొంచెం ముందుకు వంగి శ్రద్ధగా వినసాగాడు.

“2010లో హైతీలో పెను భూకంపం సంభవించింది గుర్తుందా?” అడిగాను.

“ప్రకృతి విపత్తులు ఎన్నో దేశాలలో తరచూ ఏర్పడుతూనే ఉంటాయి కదా…” అన్నాడు.

“నిజమే. కాని సింప్సన్ లాంటి వాళ్ళు మాత్రం అరుదు.”

“ఎవరీ సింప్సన్?”

“లండన్‌లో ఉండే ఏడేళ్ళ పిల్లాడు. హైతీ భూకంపం సృష్టించిన వినాశనం గురించి తెలుసుకుని కలత చెంది, 240,000 డాలర్లు పోగుచేసి యునిసెఫ్‌కి విరాళంగా అందజేశాడు…”

“ఏంటీ… రెండు లక్షల నలబై వేల డాలర్లా…” అంటూ మావాడు నోరెళ్లబెట్టాడు.

“అవును. అక్షరాలా. ఓ ఫండ్ రైజింగ్ వెబ్ పేజ్ తెరిచి అందులో రిక్వెస్ట్ పెట్టాడు. నిధుల కోసం స్థానిక పార్కులో ఎనిమిది కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. అది చూసిన చాలామంది అతని చొరవకు మెచ్చుకుని విరాళాలు పంపారు. తాను ఐదువందల పౌండ్లు పోగు చేయగలనా అని అనుకున్న ఆ కుర్రాడి ఆశయం మంచిది కావడంతో వెల్లువలా వచ్చాయి విరాళాలు. యునిసెఫ్ యుకె డైరక్టర్ కూడా ఆ పిల్లాడి సహృదయతని కొనియాడాడు.”

“నిజమే! నువ్వు చెప్తుంటే నాకూ అలానే అనిపిస్తోంది” అన్నాడు అశోక్.

“ఇలాంటి పిల్లలు ప్రపంచమంతటా ఉన్నారు. కొంతమంది అజ్ఞాతంగా ఉండిపోతారు. కొందరు పిల్లలు నిధులు సేకరించి, గుప్తదానాలు చేశారు.”

“గ్రేట్ కదా…” అన్నాడు అశోక్.

“నిస్సందేహంగా!”

“మన దేశంలో ఎవరూ లేరా?”

“ఎందుకు లేరు, ఉన్నారు…”

“ఒకరిద్దరి గురించి చెప్పు…”

“ప్రకృతి వైపరీత్యాలప్పుడు కాకుండా వేరే విధంగా సమాజానికి ఉపయోగపడేలా డబ్బు ఖర్చు చేసిన పిల్లల గురించి చెబుతాను.”

“చెప్పు…” అన్నాడు అశోక్ బ్లాక్ కాఫీ తాగుతూ.

“భోపాల్‌కి చెందిన 14 ఏళ్ళ బాలుడు ఆయుష్ కిషోర్ తెలివైనవాడు. బాగా చదువుతాడు. అనేక పోటీలలో పాల్గొని, స్కాలర్‌షిప్పులు/ నగదు బహుమతులు పొందాడు. గత ఆగస్టు నెలలో అతని బ్యాంకు ఖాతాలో 86,000 రూపాయలకి పైగా ఉన్నాయి. ఈ డబ్బుని కిషోర్ – తమ శిక్షాకాలం పూర్తయినా కూడా జరిమానాలు చెల్లించలేక, ఇంకా జైల్లోనే ఉండే ఖైదీలను విడుదల చేయించటానికి ఖర్చు చేశాడు.”

“అబ్బా.. గొప్పోడు…”

“ఈ పిల్లాడు గత రెండేళ్ళుగా ఇలా చేస్తున్నాడు. ఈ ఆగస్టు 15వ తేదిన ఇండోర్ జైల్లో ఉన్న 12 మందికి, భోపాల్ జైల్లో ఉన్న ఇద్దరికి డబ్బుకట్టి వారిని విడుదల చేయించాడు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున అతను నలుగురు ఖైదీలను విడుదల చేయించాడు, వారి కుటుంబాలు పొందిన ఆనందం తనకు చాలని భావించాడు.”

“నిజంగా గొప్ప మనసు ఆ అబ్బాయిది” చెప్పాడు అశోక్.

“ముంబయిలోని ‘అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబే’లో 9వ తరగతి చదువుతున్న వీర్ అగ్రవాల్ వయసు 14 ఏళ్ళు. కొన్నేళ్ళ క్రితం చిన్న యాక్సిడెంట్ జరిగి మంచానికే పరిమితమైన వీర్… ఆర్థికంగా వెనుకబడినవారికి, శారీరక వైకల్యం కలవారికి ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఓ వెబ్ సైట్‌లో క్రౌడ్ ఫండింగ్‌కి విన్నపం పెట్టాడు. అలా శారీరక వైకల్యం కలిగిన రోగులకు కృత్రిమ అవయవాలకై 14 లక్షల రూపాయల నిధులను సేకరించాడీ పిల్లాడు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 23 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన ‘జైపూర్ ఫుట్’ శిబిరంలో 300 మందికి కృత్రిమ అవయవాలు అందించడంలో తోడ్పడ్డాడు” చెప్పాను.

“పై రెండు కేసులలో ఆ పిల్లలు మిడిల్ క్లాస్ వాళ్ళే… ఇప్పుడు చెప్పబోయే పిల్లాడి ఆర్థికంగా బాగా వెనుకబడినవాడు. అయినా తనకి తోచిన విధంగా తన డబ్బుని అందరి మేలు కోసం వ్యయం చేశాడు…”

“ఇంటరెస్టింగ్.. చెప్పు…” అన్నాడు అశోక్.

“పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిద్నేపూర్ జిల్లాలోని కొంటాయిలోని బాదల్పూర్ గ్రామంలో చెందిన నవోనీల్‌దాస్ వయసు 16 ఏళ్ళు. 10వ తరగతి చదివే ఈ పిల్లాడు తనకు స్కాలర్‌షిప్‌గా లభించిన మొత్తం డబ్బు 24,000 రూపాయలను పాఠశాల గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చేశాడు. ఎందుకంటే తనలాంటి పేద కుటుంబాల పిల్లలు పుస్తకాలు కోసం ఇతరులను వేడుకోనక్కరలేదని.”

“ఓహ్…” అన్నాడు అశోక్.

“చిత్రమేంటంటే… పేదవాడు, ప్రతిభావంతుడైన ఈ విద్యార్థి తన స్కాలర్‌షిప్ డబ్బుని విరాళంగా ఇచ్చేస్తాడని స్కూల్ యాజమాన్యం అస్సలు ఊహించలేదట. కారణం అడిగితే, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని తన తాత చెప్పిన మాటలతో స్ఫూర్తిపొందానని ఆ పిల్లాడు చెప్పాడు… ఓ పాత జిరాక్స్ మెషీన్‌తో వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించే అతని తండ్రి కూడా తన కొడుకు చర్యని సమర్థించాడు…”

“నిజమే… ఇలాంటి పిల్లల గురించి వింటుంటే ముచ్చటేస్తోంది” అన్నాడు అశోక్.

“అందుకే ఇలాంటివాళ్ళ గురించిన వార్తలు సేకరించి దాస్తాను…” చెప్పాను.

“కానీ ఈ పిల్లల్లో ఎలా ఇంత మంచితనం…?”

“పిల్లల హృదయాలు ఎప్పుడూ స్వచ్ఛమైనవే అశోక్… పెద్దయ్యే కొద్దీ అవి కలుషితమవుతాయి…”

“ఈ పిల్లలు పెద్దయినా ఈ లక్షణాన్ని నిలుపుకుంటే బావుండు…” అన్నాడు అశోక్.

“తప్పకుండా నిలుపుకుంటారు అశోక్. వాళ్ళు టీనేజ్ నుంచి ఎదుగుతున్నారు. భావాలు పరిపక్వమయ్యే దశలో ఉన్నారు. వెంటాడే వ్యామోహాలు, ప్రలోభాలకు లోనుకాకుండా చూసుకోగలిగితే… వీళ్ళు సమాజానికి మరింతగా ఉపయోగపడతారు…”

“మనమేం చేయగలం?” అడిగాడు అశోక్.

“వాళ్ళు చేసినంత స్వచ్ఛంగా మనమిప్పుడు చేయలేం అశోక్. మనం దేనికైనా విరాళమిచ్చినా, టాక్స్ ఎగ్జెంప్షన్ ఉందా లేదా అని చూసుకుని ఇస్తాం… పిల్లల్లో లాభనష్టాల బేరీజు ఉండదు. తాము చేస్తున్నది మంచి అని నమ్మితే, చేసేస్తారు. అంతే!” అన్నాను.

“అంతేనా….”

“అంతే. కాకపోతే ఓ పని చెయ్యచ్చు.. ఎవరైనా పిల్లలు ఓ మంచి పని కోసం విరాళం అడిగితే… తప్పకుండా ఇవ్వాలి. మనం ఖర్చు పెట్టే దాంట్లో వాళ్ళకిచ్చేది ఎంత చెప్పు… ఆ రకంగా పిల్లల్లో సాటి మనుషుల పట్ల ప్రేమనీ, బాధ్యతని పెంపొంచినవాళ్ళం అవుతాం…” అన్నాను.

“తప్పకుండా చేద్దాం. నా మనసుకిప్పుడు చాలా తేలికగా ఉంది. ఇలాంటి పిల్లల వార్తలు ఏవైనా వస్తే నాకూ పంపుతూ ఉండు…” అని చెప్పి వెళ్ళడానికి లేచాడు అశోక్.

నేను నవ్వుతూ తలూపాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here